పదేళ్ళ తరువాత మళ్ళా విజయవాడ పుస్తక ప్రదర్శనకి. ఈసారి చాగంటి సోమయాజులు ( చాసో) శతజయంతి సందర్భంగా జరిగిన సమావేశానికి అధ్యక్షత. చాసోగారిమూడో అమ్మాయి డా.చాగంటి కృష్ణకుమారి చాసోకథల గురించి మాట్లాడారు. ఆమె సాహిత్య అకాదెమీ కోసం చాసో మీద ఒక మోనోగ్రాఫు కూడా రాసారు. నేను కూడా కొంత మాట్లాడేను. ఒక రకంగా ఇది నాకు బాకీ ప్రసంగం. రెండుమూడేళ్ళుగా విజయనగరంలో చాసో మీద నా ప్రసంగమొకటి ఏర్పాటు చెయ్యాలని తులసిగారు కోరుకుంటూ ఉన్నారు. కాని అది ఎప్పటికీ అయ్యే అవకాశం కనిపించకపోవడంతో ఈ సమావేశంలోనైనా నాతో మాట్లాడించాలని ఆమె కోరిక. ముఖ్యంగా గురజాడ వారసత్వాన్ని చాసో ఎట్లా అందుకున్నాడో నా మాటల్లో వినాలని ఆమె ఆకాంక్ష.
నిన్న సాయంకాలంతో నా బాకీ తీర్చేసుకున్నాను. 87-90 మధ్యకాలంలో నేను విజయనగరం జిల్లాలో పనిచేసినప్పుడు, ముఖ్యంగా 87 లో విజయనగరంలో ట్రైనింగులో మిత్రుడు రామసూరి దగ్గర ఉన్నప్పుడు చాసో రొజూ దర్శనమిచ్చేవారు. రామసూరితోనూ, డా.ఉపాధ్యాయుల అప్పలనరసింహమూర్తితోనూ గురజాడ, రోణంకి,నారాయణబాబు, చాసోల గురించి మాట్లాడటం, ముఖ్యంగా వాళ్ళు మాట్లాడితే వినడం గొప్ప అనుభవం. అది రాజమండ్రిలో వీరేశలింగం గురించీ, శ్రీపాదసుబ్రహ్మణ్య శాస్త్రి గురించీ మాట్లాడుకోవడం లాంటిది. నేనా రెండు భాగ్యాలకీ నోచుకున్నాను.
చాసో కథలు నేను 81-82 ప్రాంతంలో చదివాను. రాజమండ్రిలో సాహితీవేదికలో ఒకసారి చాసో మీద చర్చ జరిగినప్పుడు సుదర్శనంగారు ఆ కథలగురించి చాలా వివరంగా చేసిన విశ్లేషణ కూడా నాకు గుర్తుంది. తర్వాత చాలాకాలానికి నేను సంకలనం చేసిన ‘వందేళ్ళ తెలుగు కథ’ (2001) లో చాసో కథ ‘మాతృధర్మం’ (1946) పొందుపరిచాను.
చాలాకాలంగా అందుబాటులో లేని చాసో కథలు ఈ మధ్యనే విశాలాంధ్రవారు ఏడవ ముద్రణ తీసుకొచ్చారు. నిన్న సమావేశం కోసం దాదాపు ముఫ్ఫై ఏళ్ళ తరువాత ఆ కథలు మళ్ళా చదువుతుంటే చాలా కథలు కొత్తగానూ, హృదయాన్ని ఆకట్టుకునేవిగానూ ఉండటమే కాకుండా, చాసో గురించి మళ్ళా కొత్త ఆలోచనలు రేకెత్తించాయి కూడా.
చాసో మొత్తం మీద 51 కథలు రాసారు. ఇప్పుడు పుస్తకరూపంలో 40 కథలు మాత్రమే లభ్యమవుతున్నాయి. అందులో మొదటి ముద్రణలో (26) కథలుమాత్రమే ఉన్నాయి. తరువాతి ముద్రణల్లో 70ల్లో రాసిన మరొక 14 కథలు అదనంగా చేర్చారు. కాని అవి మొదటి కథల స్థాయిలొ చెందిన కథలు కావనిపిస్తుంది.
చాసో ని అభ్యుదయరచయితగానూ, తొలితరం సామ్యవాద చింతకుడిగానూ, పీడిత ప్రజల పక్షపాతిగానూ ప్రతిపాదించే కథలు ‘కర్మసిద్ధాంతం’ (42), ‘కుంకుడాకు’ (43), ‘భల్లూకస్వప్నం'(43),’బొండుమల్లెలు’ (43), ‘బూర్జువాకుక్క’ (45), ‘ఎంపు’ (45), ‘పరబ్రహ్మం’ (48), ‘వాయులీనం’ (52), ‘కుక్కుటేశ్వరం’ (52), ‘బండపాటు’ (68), ‘ఆహాహా’ (69), ‘కొండగెడ్డ’. ఈ కథల్లో చాసో వాస్తవికవాదిగానూ, విమర్శకనాత్మక వాస్తవికవాదిగానూ (critical realist) గా కనిపిస్తాడు. ఇది గురజాడనుంచి నేరుగా సంక్రమించిన వారసత్వం.
చాసో కథల్ని కొంత వివాదాస్పదం చేసిన కథలు, ఆయన ఒక ‘న్యూ మొరాలిటీ’ ని ప్రతిపాదిస్తున్నాడా అనిపించే కథలు ‘ఏలూరెళ్ళాలి’ (43), ‘లేడీ కరుణాకరం'(45), ‘ఊహా ఊర్వశి’ (45), ‘చెప్పకు చెప్పకు’ (78). ఈ కథల్ని విశ్లేషిస్తూ వెల్చేరు నారాయణరావు రాసిన వ్యాసం ఒకటి పుస్తకప్రదర్శన వారి సావనీర్లో కనబడింది. ఈ కథల్ని నేనంతగా ఇష్టపడలేకపోయాను. వీటిమీద మళ్ళా ఒక చర్చ జరగవలసిఉందనుకుంటున్నాను.
కాని ఈరోజు మళ్ళా చదివినప్పుడు చాసోని అద్వితీయకథాశిల్పిగానే కాకుండా అద్వితీయమానవుడిగానూ, ఆత్మీయుడిగానూ తోపింపచేసే కథలు బాల్యంగురించి, బాల్యకాలస్మృతులగురించీ రాసిన కథలు : ‘చిన్నాజీ’ (42), ‘రథయాత్ర’ (43), ‘బబ్బబ్బా’ (43), ఎందుకుపారేస్తాను నాన్నా’ (44), ‘బొమ్మలపెళ్ళి’ (54). ఈ చాసో ఎన్నటికీ పసివాడే. ‘ఎందుకుపారేస్తాను నాన్నా’ బాల్యం గురించే కాక చదువు గురించి, ఇంగ్లీషు చదువు గురించి కూడా మాట్లాడిన కథ. 20 వశతాబ్ది తెలుగు సాహిత్యంలో చదువు గురించి మాట్లాడిన రచనల్లో కుటుంబరావు ‘చదువు’ నవలకి ఎంత ప్రాసంగికత ఉందో ఈ కథకీ అంతే ప్రాముఖ్యత ఉంది. శిల్పరీత్యా, స్వభావచిత్రణ రీత్యా ఈ కథని ప్రపంచకథానికల్లో మొదటి 20 కథల్లో ఒకటిగా చెప్పడానికి నాకు సంకోచం లేదు. ఇన్నాళ్ళ తరువాత కూడా ఆ కథ పూర్తిచేసేటప్పటికి గుండె గద్గదం కాకుండా నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను.
కాని ఈ అభ్యుదయ రచయిత రాసిన కథల్లో ఈ పసితనపు కథలే నాకెందుకు ఉత్తమోత్తమమైన కథలుగా కనిపిస్తున్నాయి? ఈ మధ్య పెంగ్విన్ సంస్థ ప్రచురించిన లూసన్ కథల సంపుటానికి పరిచయం రాస్తూ యియున్ లీ అనే చీనా భావుకురాలు లూసున్ కథలన్నిటిలోనూ’విలేజి ఓపెరా’ కథనే తనకెంతో ఇష్టమైనకథగా పేర్కొంది. తక్కిన కథల్లో లూసున్ పాత్రలు అతడు చెప్పినట్టు వింటాయనీ, కాని ఒక చిన్ననాటి జ్ఞాపకాన్ని ప్రస్తావించిన విలేజి ఓపెరా కథలో పాత్రలే తమకి తాము నచ్చినట్టు నడుస్తాయనీ రాసింది. ఇంతకీ ఆ కథలో పాత్ర స్వయంగా లూసనే.
‘రథయాత్ర’, ‘బబ్బబ్బా’ లాంటి కథల్లో కనబడే చాసో అభ్యుదయవాది, ‘న్యూ మొరాలిటీ’ ప్రతిపాదించే చాసో కాదు. ఒక మామూలు మనిషి. తన నిష్కపటమైన బాల్యం నుంచి బయటపడలేని అశక్తుడు. సరిగ్గా నాలాంటివాడే. ఇక్కడ ఆయన హృదయంతో తాదాత్మ్యం చెందడానికి నాకెటువంటి సంకోచమూ లేదు.’బొమ్మల పెళ్ళి’ కథ చూడండి. ఎట్లాంటి కథ! బాల్యాన్ని భుజాలమీద కెత్తుకుని ఊరేగించడానికి సిద్ధమైనవాడు మాత్రమే అట్లాంటి కథ రాయగలడు.
ఇక గురజాడకీ, చాసో కీ మరో సామ్యం ఇద్దరూ కవులు. చాసో కథలు రాసాడన్నమాటే కాని, కృష్ణశాస్త్రి కవితలు చెక్కినట్టు ఆయన కథల్ని చెక్కాడు. ఆ పనివాడితనమే పట్టుమని నలభై కథలతో చాసోని తెలుగు సాహిత్యంలో శాశ్వతస్థానంలో నిలబెట్టింది. కవిగా చాసో సాధించిన అద్భుతమైన పరిణతి ‘మాతృధర్మం’ కథలో కనిపిస్తుంది. చలంగారి ‘ఓ పువ్వు పూసింది’ రొమాంటిసిస్టు సంప్రదాయంలోంచీ, ‘మాతృధర్మం’ రియలిస్టు సంప్రదాయంలోంచి వికసించినా రెండూ కూడా ఒక్కస్థాయినే అందుకున్న కథలు. ఆ కథలతో తెలుగుకథ శిఖరాగ్రాన్ని చేరుకుంది.
3-1-2015