చంపారన్ సత్యాగ్రహం

Reading Time: 2 minutes

173

‘1917 ఏప్రిల్ 18 చంపారన్ చరిత్రలోనే కాదు, మొత్తం భారతదేశ చరిత్రలోనే శాశ్వతంగా గుర్తుండిపోయే రోజు ‘.

రాజెన్ బాబు తన ‘చంపారన్ సత్యాగ్రహం’ లో ఇంకా ఇలారాస్తున్నాడు:

‘ఆ రోజు సమస్త భారతదేశం సత్యాగ్రహంలోనూ, సత్యాగ్రహాన్ని ఆధునిక కాలంలో ఎట్ఖా వుపయోగించాలో తన మొదటిపాఠం నేర్చుకున్నది, ఆ ఉదాహరణ ఆమె నేత్రాలముందు కొత్తకాంతినీ, దర్శనాన్నీ వరదలాగా ముంచెత్తిన రోజు.’

ఆ రోజు చంపారన్ జిల్లాలో మోతీహారి కోర్టులో గాంధీని ప్రవేశపెట్టినప్పుడు, ఆయన తన వాజ్మూలం వినిపించినప్పుడు, ఆ దృశ్యాన్ని ఎవరైతే కళ్ళారా చూసారో వాళ్ళు నిజంగా భాగ్యవంతులు. చరిత్ర చాలా అరుదుగా మనుషులకి అట్లాంటి భాగ్యాన్ని కల్పిస్తూంటుంది.

గాంధీజీ చంపారన్ లో సత్యాగ్రహం ప్రారంభించి ఒక శతాబ్దం పూర్తి కావస్తున్న సందర్భంగా ‘భారతీయ సాహిత్యంలో సత్యాగ్రహం’ అనే పేరిట సాహిత్య అకాడెమీ నిన్న డిల్లీలో ఏర్పాటు చేసిన జాతీయ గోష్ఠిలో పాలుపంచుకోవడం కూడా నాకు అట్లాంటి భాగ్యమే అనిపించింది.

‘తెలుగు సాహిత్యంలో సత్యాగ్రహం’ గురించి మాట్లాడటానికి ముందు నేనా మాటే చెప్పాను. వందేళ్ళ కిందటిదాకా, భారతదేశానికి అటువంటి మాట తెలియదు. 600 పై చిలుకు భారతీయ భాషల్లో అటువంటి మాట అప్పటిదాకా పుట్టలేదు. కాని ఒకసారి ఆ మాట పుట్టిన తరువాత, భారతదేశంలో ఏ భాషావాజ్మయం, ఏ రచయితా, ఏ కవీ కూడా ఆ మాట ప్రభావం పడకుండా తప్పించుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యం.

కాని, నిన్నటి గోష్టి ప్రారంభిస్తూ ప్రసంగించిన సిద్ధేశ్వర ప్రసాద్, ముఖ్య అతిథిగా మాట్లాడిన ప్రసిద్ధ గుజరాతీ రచయిత, జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త రఘువీర్ చౌధురీ, అధ్యక్ష ఉపన్యాసం చేసిన సాహిత్య అకాడెమీ అధ్యక్షుడూ, ప్రసిద్ధ హిందీ రచయిత విశ్వనాథ ప్రసాద్ తివారి, కీలకోపన్యాసం చేసిన మధుకర్ ఉపాధ్యాయ ల్ని వింటూ ఉంటే హిందీ భాషా ప్రాంతాల్లో గాంధీజీ ఇంకా సజీవుడిగా ఉన్నాడనే అనిపించింది. మనం, ముఖ్యంగా నేను, గాంధీజీనుంచి ఎంత దూరం జరిగిపోయామా అనికూడా అనిపించింది.

అయితే, ఆచార్య రఘురామరాజు పుణ్యమా అని, ఎమెస్కో సంస్థ వారి ‘పొరుగునుంచి తెలుగులోకి’ సిరీస్ కింద గాంధీజి కి సంబంధించిన మూడు పుస్తకాలు ఈ మధ్య కాలంలో నేను అనువదించి ఉండటం నాకు గొప్ప ఊరట. ఆ పుస్తకాలు అనువదించిన పరిజ్ఞానం వల్ల ఆ సభలో కూచుని వాళ్ళేమి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోగలిగే యోగ్యత లభించింది.

1917 లో రెండు గొప్ప సంఘటనలు సంభవించేయి.ఒకటి బోల్షివిక్ విప్లవం, రెండోది చంపారన్ సత్యాగ్రహం. నిన్న మాట్లాడిన కొందరు వక్తలు ఆ రెండింటినీ పోల్చకుండా ఉండలేకపోయారు. బహుశా ఆ రెండింటినీ పోల్చకూడదేమో. కాని, వందేళ్ళ తరువాత, చంపారన్ సత్యాగ్రహం గురించి అంతమంది మాట్లాడుతుండగా వింటున్నప్పుడు, ఇప్పటి ప్రపంచానికి దారిచూపించే స్ఫూర్తి ఆ ఉద్యమస్మృతిలో ఇంకా సజీవంగానూ, బలంగానూ ఉందనే అనిపించింది.

27-4-2017

Leave a Reply

%d bloggers like this: