గాంధీ కర్మజీవితం

162

నేను ఒంగోలు వెళ్ళినప్పుడు సి.ఏ.ప్రసాద్ గారు ‘బహురూపి గాంధీ’ (2004)అనే పుస్తకం ఇచ్చారు. అను బందోపాధ్యాయ ఇంగ్లీషులో రాసిన ఈ పుస్తకాన్ని ‘మంచిపుస్తకం’ వారు తెలుగులో ప్రచురించారు.

గాంధీ గురించి నేనింతదాకా చదివిన సాహిత్యమంతా ఒక ఎత్తు, 148 పేజీల ఈ చిన్న పుస్తకం ఒక ఎత్తు. దీన్ని కౌమారదశలోని బాలబాలికలకోసం రాసానని రచయిత చెప్పుకున్నప్పటికీ ఆ పుస్తకం అందరూ ముఖ్యంగా అన్ని అవస్థల్లోనూ ఉన్నవాళ్ళూ,అన్ని వయసులకు చెందిన వాళ్ళూ కూడా చదవవలసిందే. మరీ ముఖ్యంగా జీవితం పట్ల ఆశ కోల్పోయినవాళ్ళూ, లేదంటే ఎందుకు బతకాలో, జీవితానికి అర్థమేముందో తెలియనివాళ్ళూ తప్పకుండా చదవవలసిన పుస్తకం. నాకైతే, ఈ పుస్తకం చదవగానే నా గడిచిన యాభై ఏళ్ళ జీవితం మరొకసారి తొలినుంచీ జీవించాలనిపించింది.

నా ఇరవయ్యేళ్ళప్పుడు నేను గాంధీని క్షుణ్ణంగా చదవడం మొదలుపెట్టాను.కానీ అప్పుడీ పుస్తకం దొరికి ఉంటే నాకెంతో స్పష్టత ఒనగూడి ఉండేది, అందువల్ల నా జీవితాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకోగలిగి ఉండేవాణ్ణి.

ఇందులో గాంధీ కర్మజీవితాన్ని 27 రకాలుగా రచయిత వివరించడానికి చేసిన ప్రయత్నముంది. అందులో మనకు బాగా తెలిసిన పార్శ్వాలు- బారిష్టరు, నేతపనివాడు, గ్రంథ రచయిత, పాత్రికేయుడు, ముద్రాపకుడు-ప్రచురణ కర్త వంటి వృత్తులతో పాటు మనకు అంతగా వివరాలు తెలియని కార్మిక జీవిత పార్శ్వాలు- బట్టలుకుట్టేవాడు, బట్టలు ఉతికేవాడు, క్షవరం చేసేవాడు, చెప్పులు కుట్టేవాడు, వంటవాడు, వైద్యుడు, నర్సు, రైతు వంటి వాటి చిత్రణ కూడా ఉంది.

ఇక మనం ఊహించను కూడా ఊహించలేని మరికొన్ని పార్శ్వాలు-వ్యాపారి, బందిపోటు, యాచకుడు, వేలం పాడేవాడు, పాములవాడు, పురోహితుడు వంటి పార్శ్వాలు కూడా ఉన్నాయి.

అందులోంచి ప్రతి ఒక్క పార్శ్వానికీ చెందిన వివరణలల్లోంచి కొన్ని వాక్యాల్ని మీకోసం ఇక్కడ ఎత్తిరాయాలని ఉంది. కానీ మచ్చుకి, నాలుగైదు.

బందిపోటు

ఒకసారి వీథులూడ్చేపనివాళ్ళ సమావేశంలో ఒక మహిళ తన చేతికి ఉన్న రెండు బంగారుగాజులూ గాంధీకి ఇచ్చి, ‘ఈ రోజుల్లో భర్తలు భార్యలకోసం చాలా తక్కువ సొమ్ము కేటాయిస్తున్నారు. అందుకే నేను తమకు ఇంతకంటే ఇంకేమీ ఇచ్చుకోలేకపోతున్నాను. ఇవే నా వద్ద మిగిలిన ఆఖరి ఆభరణాలు. వీటిని హరిజనుల సేవకు వినియోగించండి’ అంది.’నేను అనేకమంది వైద్యులనూ, న్యాయవాదులనూ, వర్తకులనూ బిచ్చగాళ్ళుగా చేశాను. ఇందుకు నేనేమీ పశ్చాత్తాప పడటం లేదు. ఒక పైసా సంపాదన కోసం మనుషులు మైళ్ళకొద్దీ వెళ్ళాల్సి వస్తున్న భారతదేశంలో ఖరీదైన ఆభరణాలు ధరించడం ఎవరికైనా శోభనివ్వదు’ అన్నాడు గాంధీ.

యాచకుడు

‘ధనికులనుంచి వేలాది రూపాయలకు స్వాగతం. కానీ పేదలనుంచి సేకరించిన చిల్లరపైసలు,విడిరూపాయలు ఎంతో విలువైనవి. మన పనికి అవి ఆశీర్వాదాలు. విలువ తెలిసి ఇచ్చిన ప్రతి పైసా దాతకు ఉన్న స్వరాజ్యకాంక్షకు పట్టుదలకూ ప్రతీక’ అని ఆయన తరచుగా అనేవాడు. విరాళమివ్వడం కోసం వేచిఉండి, వణుకుతున్న చేతులతో కొంగున కట్టుకున్న ముడులను విప్పే వృద్ధులను తానేప్పటికీ మరిచిపోలేనని ఆయన చెబుతూండేవాడు..

వ్యాపారి

ఒకసారి ‘జాతీయతావాదానికి జాతివిద్వేషం అవసరమా’ అనే ఆయన ఉపన్యాసం వినడానికి టికెటు పెట్టారు. అలా వసూలు చేసిన సొమ్మును దేశబంధు మెమోరియల్ నిధికి సమర్పించారు..ఆయనకు డబ్బు పొదుపు చెయ్యడమే కాదు, సంపాదించడమూ వచ్చు. ప్రభుత్వం ఆయన పుస్తకాలను నిషేధించినప్పుడు ఆయన వాటిని బహిరంగంగా అమ్మాడు. హింద్ స్వరాజ్ ప్రతులను ఆయనే అయిదు, పది, యాభై రూపాయలకు అమ్మాడు. దాని ముఖవిలువ నాలుగు అణాలు మాత్రమే. దండి సత్యాగ్రహం సమయంలో ఆయన తయారు చేసిన అరతులం ఉప్పును ఆయన అభిమాని 525 రూపాయలకు కొన్నాడు. అప్పుడు అరతులం బంగారం ఖరీదు 40 రూపాయలు ఉండేది. ప్రపంచంలో ఏ వ్యాపారీ కూడా ఉప్పును అంత అద్భుతమైన ధరకు అమ్మి ఉండడు.

శుభ్రం చేసేవాడు

ఒకసారి ఒక విదేశీయుడు గాంధీని అడిగాడు. ‘మిమ్మల్ని ఒక రోజుపాటు భారతదేశానికి వైస్రాయిని చేస్తే ఏం చేస్తారు?’
‘వైస్రాయి భవనంలో ఎన్నో ఏళ్ళుగా నిర్లక్ష్యానికి గురౌతూ అపరిశుభ్రంగా ఉన్న పారిసుధ్యపనివారి నివాసాలను శుభ్రం చేస్తాను.’
‘మీ పదవీ కాలాన్ని మరోరోజు పొడిగిస్తే?’
‘మర్నాడు కూడా అదేపని చేస్తాను.’

పురోహితుడు

ఆయన మూడో కొడుకు వివాహ సందర్భంగా గాంధీ కొత్త జంటకు ఒక భగవద్గీత,ఆశ్రమ భజనవాళి, ఒక జపమాల, ఒక తకిలీ బహుమతిగా ఇచ్చాడు. కొడుకుతో ‘నీ భార్య గౌరవాన్ని సంరక్షిస్తూ నిజమైన సేవకుడిలా నువ్వుండాలి. మీ ఇద్దరి జీవితాలు మాతృభూమి సేవకు అంకితం చేయండి. చమటోడ్చి శారీరక శ్రమతో మీ ఆహారాన్ని సంపాదించుకోండి’ అని చెప్పాడు. పెళ్ళి కూతురి తల్లి పెళ్ళి కొడుక్కి ఒక చరఖా బహుమతిగా ఇచ్చింది. వివాహానికి ముందు వధూవరులిద్దరూ ఉపవాసం చేసారు. ఆవులపాకను, నూతిపళ్ళాన్ని శుభ్రం చేసారు. మొక్కలకు నీళ్ళుపోసారు. నూలు వడికారు, భగవద్గీత చదివారు. గాంధీ ఈ పనులన్నింటినీ వివాహసమయంలో భారతీయ సంప్రదాయంగా ఉన్న సప్తపదికి ఆధునిక ఆదర్శ రూపంగా భావించాడు.

ఫాషన్ స్థాపకుడు

మొత్తం పరిపాలనా వ్యవస్థనే మార్చెయ్యాలని గాంధీ అనుకునేవాడు. ‘ప్రజాస్వామ్యంలో ఒక రైతు పరిపాలకుడు కావాలి. ఒక రైతు ప్రధాని తాను నివశించడానికి భవనం కావాలని కోరుకోడు. ఆయన గుడిసెలో నివసిస్తూ ఆరుబయట పడుకుంటాడు. ఖాళీ దొరికినప్పుడల్లా పొలంలో పనిచేస్తాడు’ అనేవాడు.

పాత్రికేయుడు

ఎంతో పని భారం ఉన్నా కూడా ఆయన చాలా రాయాల్సి వచ్చేది. ఆయన తరచుగా నడుస్తున్న రైల్లో కూడా రాసేవాడు. ఆయన ప్రసిద్ధ సంపాదక వ్యాసాలు కొన్నిటికింద ‘రైల్లోంచి’ అని ఉంటుంది. కుడిచెయ్యి నొప్పి పుట్టినప్పుడు ఆయన ఎడమ చేత్తో రాసేవాడు. ఆయన ఎడమ చేతిరాతే చదవడానికి ఎక్కువ అనుకూలంగా ఉండేది.

వంటవాడు

ఒకసారి గాంధీ ఒక ఆదర్శ గురుకుల పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ వంటశాలలో ఏర్పాట్లు, పద్ధతులు ఆయనకు నచ్చలేదు. ‘పిల్లలకు పుస్తకాల్లో ఉన్న చదువు చెప్పడంతో పాటు వారిని మంచి వంటవారిగా, పారిశుద్ధ్యపనివారుగా చేసినపుడే మీరు వారికి ఆదర్శవంతమైన విద్యను అందించినట్లవుతుంది’ అని ఆయన ఉపాధ్యాయులతో చెప్పాడు.

గ్రంథరచయిత

ఆయన రచనలలోని చాలా పేరాలు ఆయన అక్షరాలతో ఎంత సజీవమైన చిత్రాలను సృష్టించగలడో నిరూపిస్తాయి. ‘నేను మైసూరులో రాతితో తొలిచిన ఒక ప్రాచీన దేవాలయంలో నాతో మాట్లాడుతోందా అనిపించేంత సహజంగా ఉన్న ఒక చిన్న విగ్రహాన్ని చూసాను. అది తన దుస్తులను సర్దుకుంటూ ఉన్న ఒక అర్థ నగ్న స్త్రీ ప్రతిమ. తేలు రూపంలో పాదాల వద్ద పడి ఉన్న మన్మథుని బాణాలనుంచి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. ఆమెలో ఉన్న వేదనను, తేలు కుట్టిన బాధను నేను చూడగలిగాను’. ఇది గాంధీ రాసిన ఒక పేరా.

24-3-2016

Leave a Reply

%d bloggers like this: