కొకింషు

Reading Time: 3 minutes

172

వసంతం వేసవిగా ఎప్పుడు మారిపోతుంది? ఉష్ణమండల దేశాల్లో ఆ ఘడియ పట్టుకోవడం కష్టమనుకుంటాను. కాని మొదటి చిగురు విప్పారినప్పుడు వసంతమనీ, మొదటి పువ్వు రాలినప్పుడు వేసవి అనీ అనుకోవచ్చేమో.

ఎడతెగకుండా రాలుతున్న పూలు.

ఆ పూలని చూస్తే మనసంతా ఏదోలా అయిపోతుంది. బహుశా వసంతం వెళ్ళిపోతుందని అవి మనకి స్ఫురణకి తెస్తాయా.

జపాన్ సాహిత్యపు పూర్వకవితాసంకలనం కొకింషులో ఒక సంపుటమంతా రాలుతున్న పూల గురించే అంటేనే మనం ఊహించుకోవచ్చు, రాలుతున్న పూలరేకలు సహృదయుల చిత్తాన్ని ఎంతవ్యాకులపరుస్తాయో.

జపాన్ సాహిత్యపు తొలి కవితాసంకలనం ‘మన్యోషూ’. అంటే పదివేల పత్రాలని. అది మన గాథాసప్తశతిలాంటి కవితాసంపుటి. ఆ తర్వాత కూడా కవులు కవిత్వం రాస్తూనే ఉన్నారు. అందుకని ఒక రాజకుటుంబం మన్యోషూ తర్వాత వచ్చిన కవితల్ని కూడా సంకలనం చెయ్యాలని నిర్ణయించింది. అట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఇరవై సంకలనాలు తీసుకొచ్చారు. అందులో మన్యోషూ తర్వాత అంత ప్రసిద్ధి చెందిన సంకలనం కొకింషు.

పదవశతాబ్దపు (క్రీ.శ.920) ఆ సంకలనానికి సంపాదకుడుగా వ్యవహరించిన కి- నొ -త్సురయుకి (872-945) ఆ సంపుటానికి చాలా ఆసక్తికరమైన ముందుమాట కూడా రాసాడు. ఆ ముందుమాట తరువాతి రోజుల్లో జపనీయ కవిత్వానికి లక్షణశాస్త్రంగా మారిపోయింది.

కొకింషులో ఉన్న కవితల్ని వకా అంటారు. తరువాతి రోజుల్లో అది తంకా గా కూడా ప్రసిద్ధి పొందింది. తంకా అంటే చిన్న కవిత అని. మన్యోషూ లో ఉన్న చోకై అనే పెద్దకవితలనుంచి వేరుచెయ్యడంకోసం ఆ మాట వాడడం మొదలుపెట్టారు. 5-7-5-7-7 మాత్రలతో మొత్తం 31 మాత్రలుండే తంకా రాయడం చాలా కష్టం. కవి తన అనుభవాన్ని ఎంతో పిండి వడగట్టుకుంటే తప్ప సాధ్యం కాని విద్య అది. ఆ తర్వాత రోజుల్లో, ఆ అయిదు పాదాల్లో మొదటి మూడు పాదాల్నీ మాత్రమే పట్టుకుని 5-7-5 మాత్రలతో 17 మాత్రల హైకూ రాయడం మొదలుపెట్టాక జపాన్ కవుల రసజ్ఞత ప్రపంచమంతా ప్రకటితమయిందని మనకు తెలుసు.

హైకూ చదవగానే మనకు కలిగేది స్ఫురణ మాత్రమే. కాని తంకా ద్వారా రససిద్ధి సాధ్యం కాగలదు. హైకూ ధ్వని అనుకుంటే, తంకా ద్వారా మనకు తోచేదాన్ని రసధ్వని అనవచ్చనుకుంటాను.

కొకింషు సంకలనానికి కి- నో- త్సురయుకి రాసిన ముందుమాట అంతా తెనిగించాలని ఉంది. మరీ ముఖ్యంగా మీకు వినిపించకుండా ఉండలేని ఈ వాక్యాలు.

తన ముందుమాట అతడిట్లా మొదలుపెట్టాడు:

‘మన కవిత్వానికి మానవహృదయమే బీజం. అసంఖ్యాకమైన శాఖోపశాఖలుగా మన భాష వికసించింది. ఈ ప్రపంచంలో మనుషుల జీవనవ్యవహారాలు బహుముఖాలు. వాళ్ళమనసులేమి ఆలోచిస్తున్నాయో, వాళ్ళ చెవులేమి వింటున్నాయో వెల్లడించడానికి వాళ్ళకి మాటలు కావాలి. వసంత పుష్పసంచయం మధ్య కోకిల పాడుతున్న పాట వింటున్నప్పుడూ, శరత్కాల సరోవరాల చిత్తడిలో కప్పలు బెకబెకలాడుతున్నప్పుడూ, ప్రకృతి సంగీతంలో ప్రతి ఒక్కగొంతుకీ ఒక చోటుందని మనకి తెలుస్తుంది.’

‘మన కవిత్వం ద్యావాపృథ్వుల్ని సునాయాసంగా కదిలించగలదు. దేవతల్నీ, రాక్షసుల్నీ కూడా హృదయం కరిగించగలదు. స్త్రీపురుషుల మనసుల్ని మెత్తబరచగలదు, వీరుల చిత్తాల్ని ధీరపరచగలదు..పూల అందాల్ని చూసినప్పుడు కలిగే సంతోషాన్ని, పక్షుల కూజితాలు వింటున్నప్పుడు కలిగే ఆశ్చర్యాన్ని,వసంతకాలపు మంచుని స్వాగతించే మార్దవాన్ని, ప్రత్యూషాల పొగమంచు కరిగిపోతున్నప్పుడు కలిగే చెప్పలేని దిగులుని మాటల్లో పెట్టడానికి ఎన్నో రకాల భావాభివ్యక్తికోసం మానవహృదయం వెతుకుతూనే ఉంటుంది…’

కవిత్వప్రాదుర్భావం గురించిన ఈ మాటలు చెప్పాక, పూర్వకవుల్ని స్తుతించాక, అతడిట్లా రాసాడు:

‘ఈ రోజుల్లో మనుషులు తమ ఇంద్రియలోలత్వంలో కూరుకుపోయారు. ఇప్పుడు వాళ్ళ దృష్టి ఎంతసేపూ అలంకారాలమీదనే. అందుకని ఈ రోజుల్లో కవిత్వం నిరర్థకంగానూ, ఏమంత విలువలేనిదిగానూ కనిపిస్తున్నది. సుఖంగాను, సౌకర్యంగానూ మాత్రమే బతకడానికి అలవాటుపడ్డ వర్గాల్లో కవిత్వం మన్నులో కప్పబడ్డ పూలకొమ్మలాగా వాళ్ళ దృష్టికి ఆనడం లేదు. కొంత కులీన వర్గాల్లో కవిత్వం గురించి తెలియకపోదుగాని, అది ఏటిఒడ్డున రెల్లుదుబ్బులాగా పూలయితే పూస్తుందిగాని, ఒక్క గింజ కూడా తలెత్తనంత నిష్ఫలం…’

అట్లాంటి సమయంలో మంచి కవిత్వాన్ని ఎంచి సంకలనం చెయ్యమని రాజాజ్ఞ అయినందువల్ల తాము ఈ సంకలనాన్ని కూర్చామని చెప్తూ ఇట్లా రాసాడు:

‘సుమారు ఇరవై సంపుటాల్లో వెయ్యికి పైగా కవితలు మేము సంకలితం చేసాం. వీటికి ‘కొకింషు వకా’- అంటే ‘జపాన్ కవితలు: పాతవీ, కొత్తవీ’ అని పేరు పెట్టాం. ఈ కవితల ఇతివృత్తాలు బహువిధాలు. తొలివసంతకాలంలో ఏరుకున్న పూలు, వేసవికాలపు కోకిలపాట, హేమంతకాలపు ఫలసేకరణ, శీతాకాలపు మంచురాలుతుండే దృశ్యం, కొంగలూ, తాబేళ్ళూ, వేసవివనమూలికలమీద వాలే గోరింకలు, ప్రణయసంకేతాలు, యాత్రీకులు ప్రార్థనలు చేసే పర్వతప్రాంత దేవాలయాలు, ఇక నాలుగు ఋతువులకీ చెందని మరెన్నో సన్నివేశాలు, ఇవన్నీ కవితావస్తువులే.’

ఇక ముందుమాట ముగిస్తూ అతడు రాసిన మాటలు చూడండి:

‘ఇక చివరగా, ఈ సంకలనంలో మా శైలి గురించి. అది వసంత ఋతుపుష్పసుగంధంలాంటిది, చూస్తూండగానే చెరిగిపోతుందని మాకు తెలుసు. శరత్కాలపు రాత్రిలాగా అది సుదీర్ఘకాలంపాటు కొనసాగుతుందని మేము చెప్పుకుంటే అంతకన్నా అవివేకం మరొకటుండదని మాకు తెలుసు. ఈ కవిత్వంలో సారం మేము మరీ గర్వించదగ్గది కాదని కూడా మాకు తెలుసు. కానీ, ఒక మేఘంలాగ కదలాడిపోతామో, లేదా నిశ్చలంగా నిలుస్తామో, మూలిగే ఒక జింకపిల్లలాగా నిలబడతామో, పడిపోతామో మాకు తెలియదుగానీ, ఇటువంటి మహత్తరమైన బాధ్యత రాజకుటుంబం మాకు అప్పగించిన కాలంలో మేం పుట్టినందుకు మేము అపారంగా సంతోషిస్తున్నాం.’

‘మన ఆదికవి హితొమారో గతించాడు. కాని కవిత్వం ఆగిపోయిందా? కాలానుగుణంగా ఎన్నో మారుతున్నాయి. సుఖదు:ఖాలు వస్తున్నాయి, పోతున్నాయి. అలాగని ఈ కవితల్ని భద్రపరుచుకోవలసిన అవసరం లేదా? తీగల్లాంటి కొమ్మలతో విల్లోలు చిగురిస్తూనే ఉంటాయి, సూదుల్లాంటి కొమ్మలతో పైన్ చెట్లు వర్ధిల్లుతూనే ఉంటాయి. విస్తారమైన మైదానాలమీద నులితీగలు చాపుతూ లతలు అల్లుకుంటూనే ఉంటాయి. సాగరసైకతతీరాలమీద కొంగలు తమ అడుగుజాడలు ముద్రిస్తూనే ఉంటాయి. తమ మహిమాన్వితమైన శోభతో ప్రాచీన కవిత్వం ఆకాశంలో చంద్రుడిలాగా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ కవిత్వాన్ని గౌరవించండి, ఈ సంకలనం ప్రభవించినందుకు ఈ కాలాన్నికూడా స్తుతించండి.’

కి-నొ-త్సురయుకి కాలంలో రాలినట్టే, ఇప్పుడు కూడా నా చుట్టూ రాలుతున్న పూలు, తరలిపోతున్న వసంతం. నేను చెయ్యగలిగిందల్లా కొకింషునీ, త్సురయుకి నీ ప్రేమగా హృదయానికి హత్తుకోవడమే.

కొకింషు-కొన్ని తంకాలు

1
ఎట్లా రాలుతున్నాయి
ఈ చెర్రీ సుమాలు:
మనం మటుకే
మనుషులు విసుక్కునేదాకా
ప్రపంచాన్ని పట్టుకు వేలాడతాం.

2
వసంతకాలపు వానజల్లు
కురుస్తున్నది కన్నీళ్ళా?
చెదిరిపడ్డ చెర్రీసుమాలు:
వాటికోసం శోకించేవాళ్ళు లేరు
అంత రాతిగుండె ఎక్కడా చూడం.

3
ఈ మైదానాల్లో
నా హృదయమిట్లా ఎన్నాళ్ళు
పరిభ్రమిస్తుంది?-
పూలురాలుతుండకపోతే
బహుశా, వెయ్యేళ్ళు.

4
ఇన్నాళ్ళూ ఈ పూలని
తనపాటతో ఆపాలనుకుంది
ఇప్పుడవి రాలిపోతున్నాక
ఆ పిట్ట దిగుల్లో
కూరుకుపోయింది

5
ఇంత కోమలాలు కాబట్టే
వీటిని చెర్రీపూలంటారేమో-
ఏడాదికి ఒక్కసారే
కనిపిస్తాయి,
అతడిలాగే.

కి-నొ-త్సురయుకి: అయిదు తంకాలు

1
మనుషుల మనసు గురించి
చెప్పలేనుగాని-
మా ఊళ్ళో ఆ ఇంటిదగ్గర
ప్రాచీన పూలసుగంధం
మటుకు తావి చెదరదు.

2
కలలదారుల్లో కూడా
మంచు రాలుతున్నట్టుంది-
రాత్రంతా ఒకటే తిరిగానేమో
నా అంగీ తడిసిపోయింది
ఇంకా ఆరలేదు.

3
వియోగాలకు
రంగులేదు-
అయినా ఈ దు:ఖం
మన హృదయాలమీద
వదిలిన డాగు చెరగదు.

4
దీన్ని దారంలాగా
తిప్పి చుట్టలేం
అయినా ఇదేమిటి
ఈ వియోగదుఃఖం
హృదయంలో మెలిపడుతున్నది.

5
ఈ కన్నీటి నది
మనిషి బతికినంతకాలం
ప్రవహిస్తూనే ఉంటుంది-
శీతాకాలంలోనూ
గడ్డకట్టదు.

23-4-2017

Leave a Reply

%d bloggers like this: