‘వసంతం వచ్చిందంటే ఒక వాన కూడా కావాలి ..’
ఈ వాక్యం పదే పదే మనసులో మెదుల్తూంది.ఎప్పటివో వసంతవానలు, జీవితంలోవీ, చీనా జపాన్ కవిత్వాల్లోవీ, నా మనసులో ముసురుకుని, రొదపెడుతున్నాయి కాబోలు, కాని,ఈ ఒక్క వాక్యమూకవిత కాదే.
పూర్వకాలపు సంస్కృతకవులు చెప్పుకుంటూ వచ్చిన కథలో లాగా ఇది ‘భోజనం దేహి రాజేంద్ర’ లాంటి వాక్యం మాత్రమేనే.
కాని, ఆధునిక కాలం వచ్చేటప్పటికి, ఆకలికలికాలంలో, కవిత్వమంతా కూడా ‘భోజనం దేహి రాజేంద్ర’ గానే మారిపోయింది కదా.
‘కీలుగుర్రం మీద బాలీసు కానుకొని
ప్రాణాలు లేనట్టి భగవంతుడొచ్చాడు
కూలిమాటడగండిరా, అన్నాలు
చాలవని చెప్పండిరా ‘
ఇది ‘భోజనం దేహి రాజేంద్ర’ అనడం కాదా.
పాదరసం 40 డిగ్రీలనుంచి 44 డిగ్రీలదాకా సరసర ప్రవహిస్తున్నప్పుడు ‘ఒక వాన కూడా రావాలి’ అనడంకన్నా గొప్ప కవితావాక్యమేముంటుంది!
కాని నేను కవిని కాను.
‘నేను కవిని కాలేకపోయిన విప్లవకారుణ్ణి’ అని చేగువేరా అన్నాడట. నేను కవినీ కాలేకపోయాను, విప్లవకారుణ్ణీ కాలేకపోయాను. కాని నేనొక తేటిని, తుమ్మెదని,’పరాగం నుంచి పరాగానికీ’, ‘సరాగం నుంచి సరాగానికీ’ ప్రయాణం చేసే సీతాకోక చిలుకని.
ఎవరో ఒక పూర్వకవి వసంతవాన గురించి తపించి ఉండడా అని కవిత్వంకోసం వెతకబోతే ‘సోషలిస్టు సూఫీ ఫైజ్ అహ్మద్ ఫైజ్’ (2014) కనబడింది. అబ్దుల్ వాహెద్ అందించిన నజరానా.
సామల సదాశివ అనే పెద్ద గులాబీతోట అదృశ్యమైపోయిందే అనుకుంటున్న నాకు అబ్దుల్ వాహెద్, పరేష్ దోశి వంటి గులాబీ రైతులు గొప్ప ఊరట.
పుస్తకం తెరుస్తూనే, ఈ వాక్యం కనబడింది:
‘ఆయె కుఛ్ అబ్ర్ కుఛ్ షరాబ్ ఆయే
ఉస్కే బాద్ ఆయే జో అజాబ్ ఆయే ‘
ఆ వాక్యాలు వాహెద్ తెలుగు మాటల్లో
‘ఇప్పుడు కాస్త మబ్బు, కాస్త మద్యం రావాలి
ఆ తర్వాత రానీ ఏ కష్టం వచ్చినా.’
ఇది కదా కవిత్వం అంటే.
‘ఆయె కుఛ్ అబ్ర్’
ఇప్పుడొక మబ్బు రావాలి.
ఈ మబ్బు తొలకరి మబ్బేమో అని ఒకింత సందేహించాను. కాని రెండవ షేర్ మొదలుపెడుతూనే మద్యపాత్ర కిటికీ నుంచి చంద్రుడు దిగిరావాలి అంటున్నాడు. నిశ్చయమయింది. ఈ చంద్రుడు వసంత చంద్రుడే, ఆ మబ్బు వసంతమేఘమే.
‘చైత్రములోన చినుకు పడాలని కోరేవు’ అన్నాడు తెలుగు కవి. అదెలాంటిదంటే ‘మార్గశిరాన మండుటెండకై మురిసేవు ‘అని కూడా గుర్తు చేస్తాడు.
‘ఇప్పుడొక మబ్బు రావాలి’ అన్న వాక్యంతో ఫైజ్ ని మహాకవిగా లెక్కించేసాను. తొలితరం సోషలిస్టు కవులంతా రొమాంటిసిస్టు కవులే, శ్రీ శ్రీ లాగా. నజీం హిక్మత్, పాబ్లో నెరుడా, పాల్ ఎలార్డ్- వాళ్ళు సామాజిక శ్రేయస్సుని ఒక ప్రేయసిని ప్రేమించినట్టు ప్రేమించారు. అందుకనే ఈ కవితలోనే ఇలా కూడా అంటున్నాడు ఫైజ్:
కర్ రహా థా, గమె జహాన్ కా హిసాబ్
ఆజ్ తుం యాద్ బే హిసాబ్ ఆయే
‘ప్రపంచ బాధను లెక్కిస్తున్నాను
నేడు నువ్వు మరీ మరీ జ్ఞాపకం రావాలి (అను:వాహెద్)
ఇది చిత్రమైన ఊహ. సోషలిస్టు కవులకు మాత్రమే ఇట్లాంటి ఊహలొస్తాయి.
అందుకనే ప్రపంచం బాధ శ్రీ శ్రీ బాధ అన్నాడు చలం.
ప్రపంచబాధను లెక్కిస్తున్నప్పుడు ఆమె మరీ మరీ ఎందుకు జ్ఞాపకం రావాలి?
ఎందుకంటే, మరొక నజ్మ్ లో ఇలా అన్నాడు కాబట్టి:
‘తేరీ సూరత్ సే హై ఆలం మేఁ బహారో కే సబాత్’
(నీ సౌందర్యమే ప్రతి వసంతానికీ శోభ చేకూర్చాలి )
లేదా మరో గజల్ లో అన్నట్టు
‘తుం క్యా గయే కే రుఠ్ గయే దిన్ బహార్ కే’
ఆమె వెళ్ళిపోతే వసంతానికే దూరమైపోయినట్టు.
ఆమె ఉంది కాబట్టి వాళ్ళకి ప్రపంచం ప్రీతిపాత్రమైంది. ఆమె కోసం వాళ్ళు ప్రపంచాన్ని ప్రేమిస్తారు. ఆ ప్రపంచంలో దుఃఖం ఉన్నందుకు తామూ దుఃఖిస్తారు, ఆ దుఃఖాన్ని దూరం చెయ్యాలని తపిస్తారు, ఏదో ఒకటి చేస్తారు, అవసరమైతే జైలుకి కూడా వెళ్తారు.
ఎందుకంటే,
‘మకామ్ ఫైజ్ కోయీ రాహ్ మే జచా హీ నహీఁ
జో కూ-ఏ-యార్ సే నికలే తో సూ-ఏ-దార్ చలే.’
(ఫైజ్, మార్గమంతా గాలించాను, ఎక్కడా ఒకింత నీడ లేదు
ఆమె ఉంటున్న వీథి కాకపోయాక ఉరికంబం వినా మరోదారిలేదు)
కాని వసంతంతో ఫైజ్ సల్లాపం చేసిన అద్భుతమైన గజల్ ఒకటి, వాహెద్ ఎంచనిది, శివ్ కె కుమార్ ‘The Best of Faiz ‘ (2013) లో కనిపించింది.
ఫిర్ హరీఫ్-ఏ-బహార్ హో బైఠే
జానే కిస్ కిస్ కో ఆజ్ రో బైఠే
( Again, I am a rival of spring-
such is my sorrow today over friends lost.)
‘హరీఫే బహార్’ ఈ ప్రయోగం నన్ను కట్టిపడేసింది. హరీఫ్ అంటే అర్థమేమిటా అని చూసాను. విరోధి అని సామాన్యార్థం. ‘వసంత విరోధి’ ఏమిటి? అర్థం లేదు. ఇలాంటప్పుడే కదా, సామల సదాశివ లాంటి వాళ్ళు లేని లోటు ఒక ఆఘాతంలాగా మనసుని తాకేది!
హరీఫ్ అనే పదం ఆరబిక్ పదమట. ఆరబిక్ ధాతుమూలం ఏమై ఉంటుందా అని చాలాసేపే వెతుకులాడేను. ఇంతకీ అర్థమయిందేమంటే, హరీఫ్ అంటే, విరోధి కాదు, ప్రతిద్వంది. ఎవరికి ప్రతిద్వంది? వసంతానికి. అంటే నువ్వొక అమ్మాయిని ప్రేమిస్తున్నావనుకో, ఆమెను మరొకడు కూడా ప్రేమిస్తున్నాడనుకో. వాడికి నువ్వు ప్రతిద్వందివి. అంటే, ఇక్కడ, వసంతమూ తానూ కూడా మరెవర్నో ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమవల్ల తాను వసంతానికి ప్రతిద్వంది అయిపోయాడు. వారెవరు?
ఆ రెండవ వాక్యంలో తలుచుకున్నవాళ్ళు. తానెవరికోసం దుఃఖిస్తూ కూచున్నాడో వాళ్ళన్నమాట. ఈ అర్థం స్ఫురించగానే నా మనసంతా చెప్పలేని దిగులు కమ్మేసింది. నేను పోగొట్టుకున్న స్నేహితులు (ఈ లోకాన్ని విడిచిపెట్టినవాళ్ళూ, ఈ లోకంలోనే ఉంటూ నన్ను విడిచిపెట్టినవాళ్ళూ కూడా) గుర్తొచ్చారు.
ఈ వసంతం- వాన రానీ, రాకపోనీ, ఒక్కసారిగా దుస్సహంగానూ, దుస్తరంగానూ తోచింది. కానీ నేను చెయ్యగలిగేదేముంది? తన గజల్ ముగిస్తూ ఫైజ్ కూడా ఈ మాటే అనుకున్నాడు:
ఫైజ్ హోతా రహే జో హోనా హై
శేర్ లిఖతే రహా కరో బైఠే.
(O Faiz, let things take their own course-
you’d better keep spinning out your verses)
జరిగేదేదో ఎట్లానూ జరుగుతూనే ఉంటుంది, నువ్వు చెయ్యగలిగేదల్లా కవితలు రాసుకుంటూ కూచోడమే.
చాలా ఊరటనిచ్చే మాట. కాని ఇటు కవిత కూడా పలకడం లేదే!
ఈ బాధ కూడా ఫైజ్ కి తెలుసు. ఆయనే అన్నాడొక చోట, విసిగిపోయి:
వో లోగ్ బహుత్ ఖుష్ కిస్మత్ థే
జో ఇష్క్ కో కామ్ సమఝత్ థే
యా కామ్ సే ఆషికీ కరతే థే
హమ్ జీతే హీ మసరూఫ్ కరతే థే
కుఛ్ ఇష్క్ కియా, కుఛ్ కామ్ కియా
కామ్ ఇష్క్ కే ఆడే ఆతా రహా
ఔర్ ఇష్క్ సే కామ్ ఉలఝతా రహా
ఫిర్ ఆఖిర్ తంగ్ ఆకర్ హమ్ నే
దోనోమ్ కో అధూరా చోడ్ దియా ‘
(ప్రేమ వ్యవహారమో లేదా తామే వ్యవహారం చేపడితే దాన్నే ప్రేమించేవాళ్ళో గొప్ప అదృష్టవంతులు. నేనో! కొంత సేపు ప్రేమ, కొంతసేపు పని-ఇట్లానే బతుకంతా గడిపేసాను. పని ప్రేమకి అడ్డొచ్చేది, ప్రేమ పనికి అడ్డమయ్యేది. చివరికి విసిగిపోయి, ప్రేమనీ, పనినీ, రెండింటినీ సగంసగంలోనే, వదిలేసాను.)
18-4-2017