యాభై ఏళ్ళకు పైగా జీవితం గడిపిన తరువాత, వెనక్కి తిరిగి చూసుకుంటే, జీవితమంటే ఏమిటి అని ఒక్క ఆశ్వాసనంలో పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, కాళిదాసు మేఘం గురించి చెప్పినట్టే, ‘కొంత పొగ, కొంత నీరు, కొంత ఆవిరి’ అని అనుకోవలసి ఉంటుంది.
గడిచిన కాలమంతా, గడిపిన కాలమంతా శరీరానికి, సామాజిక అస్తిత్వానికీ సంబంధించిన అనుభవాలే కాదు, మనసుకి సంబంధించినవీ, ఊహించుకున్నవీ, నిజంగా జరగనివీ, కానీ, నిజంగా జరిగినవాటికన్నా మనల్ని గాఢంగా ప్రభావితం చేసినవీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కంటికి కనబడని ఇళ్ళు, మనుషులు, చూడాలనుకున్నా చూడలేని, పోదామనుకున్నా పోలేని ఊళ్ళు-అవన్నీ ఈ జీవితమే.
ఇప్పుడు నన్నెవరన్నా పలకరిస్తే, ప్రేమిస్తే, గాయపరిస్తే, స్పందించే నాలో ఉన్నది ఇప్పటి నేను మాత్రమే కాదు, ఆ గడిచిన కాలమంతా, అప్పటి అనుభవాలు, స్మృతులు, ఆశలు, ఆశాభంగాలూ అన్నీ కలిసిన నేనుగానే ప్రతిస్పందిస్తాను.
అందుకనే పదకొండో శతాబ్దానికి చెందిన జపనీయ రచన ‘సరసిన నిక్కి’ (సరసిన దినచర్య ) చదివినప్పుడు నాకు నాలాంటి మనిషినే కలుసుకున్న విస్మయం, ఒకింత విచారం కూడా కలిగాయి.
జపాన్ చరిత్రలో హీయిక యుగంగా గుర్తించే కాలంలో ఒక అజ్ఞాత రచయిత్రి తన జీవితప్రయాణం గురించి రాసిపెట్టుకున్న కొన్ని జ్ఞాపకాల అల్లిక అది. ఆ రచనకి 1935 లోనే ఒక ఇంగ్లీషు అనువాదం వచ్చినప్పటికీ, అది సంతృప్తికరంగా లేదని, ఇవాన్ మోరిస్ అనే ఆయన As I Crossed A Bridge of Dreams (పెంగ్విన్, 1971) అనే పేరిట మళ్ళా ఇంగ్లీషులోకి అనువదించాడు. జపనీయ సాహిత్యానికి ఇంగ్లీషులో వచ్చిన అనువాదాల గురించి సమగ్ర సమాచారాన్ని, నిష్పాక్షిక మూల్యాంకనాన్ని ఇచ్చే A Reader’s Guide to Japanese Literature ఈ అనువాదమే మేలయిందిగా పరిచయం చేసింది.
కొంత వచనం, కొంత కవిత్వం, కొంత యథార్థం, కొంత కల్పన, కొంత కాంక్ష, కొంత స్మృతి, కొంత నగరం, కొంత పల్లెపట్టు, కొంత కల, కొంత వాస్తవం-భావుకుడైన ప్రతి మనిషి జీవితాన్నీ కుదిస్తే ఇంతే కదా.
సరసిన దినచర్య రాసిన మహిళ కులీన కుటుంబాలకు చెందిన మహిళ. సాహిత్యాస్వాదన, సౌందర్యోపాసన, కళాభిరుచి, అపారమైన జీవితేచ్ఛ లు మేళవించిన మనిషి. అన్నిటికన్నా ముఖ్యం, చిన్నప్పణ్ణుంచీ కథల్నీ, కథలప్రపంచాన్నీ ప్రేమించి, ఆ ప్రపంచంలోకి దూకాలని తపించిన మనిషి. ఆ ప్రయాణంలో ఆమె చేసిన ప్రయాణాలూ, కన్న కలలూ, ఎదుర్కొన్న ఆశాభంగాలూ, రుచిచూసిన వియోగాలూ, భరించిన విషాదాలూ కలగలిసిపోయాయి. చివరకి పుస్తకం ముగించేటప్పటికి, ఆమె రాసుకున్నట్టే మనం కూడా ఒక కలలవంతెనని దాటి వచ్చామనుకుంటాం.
ఇంగ్లీషులో డెభ్భై పేజీలకన్నా మించని ఈ రచనని స్వయంగా చదివితేనే ఆ స్వారస్యం అనుభవానికొస్తుంది. అయినా, ఆ శైలి ఎట్లాందిదో చూపడానికి ఒకటి రెండు తునకలు, మీ కోసం:
చెప్పలేని వ్యాకులత
1
తూర్పు ప్రాంతానికి పొయ్యే రహదారికి ఆవల చాలా మారుమూల ప్రాంతానికి చెందిన గ్రామసీమల్లో నేను పెరిగాను. ఆ రోజుల్లో నేనెంత పల్లెటూరి బైతులాగా ఉండేదాన్నని! అయినా అంత మారుమూల ప్రాంతంలో లోకానికి దూరంగా బతుకుతున్నా కూడా ఈ ప్రపంచమంలో కథలనేవి ఉంటాయని ఎట్లానో నా చెవిన పడింది. ఆ కథలన్నీ నాకై నేనుగా చదువుకోవాలనే గొప్ప కోరిక ఆ క్షణమే చెలరేగింది. ఆ ఊళ్ళో కాలం పొద్దుపుచ్చడానికి మా అక్క, మా పిన్నీ, ఇంకా ఇళ్ళల్లో ఉండే తక్కినవాళ్ళంతా ఆ కథల్లోంచి రకరకాల సంఘటనలు చెప్తుండేవారు. ముఖ్యంగా గెంజిగాథలోని గెంజి రాకుమారుడి గురించి వింటూండేదాన్ని. కాని వాళ్ళు వాళ్ళకేది గుర్తుందో అదే చెప్తూన్నందువల్ల , ఆ కథలు మొత్తం చెప్పలేకపోతున్నందువల్ల ఆ కథలన్నీ నేనే స్వయంగా చదువుకోవాలని నాకెంతలా అనిపించేదో. అప్పట్లో మా ఇంట్లో నా అంత ఎత్తుండే బుద్ధప్రతిమ ఉండేది. నేను కాళ్ళూ చేతులూ కడుక్కుని, ఎవరూ చూడకుండా,ఆ పూజాగృహంలోకి పోయి ఆ బుద్ధ ప్రతిమ ముందు సాష్టాంగపడి ‘ దేవా, నేనెట్లాగైనా రాజధానికి పోయెటట్టు చూడు, ఆ కథలన్నీ నాకై నేను పూర్తిగా చదువుకునేలాగా అనుగ్రహించు’ అని ప్రార్థిస్తూండేదాన్ని.
3
..చాలా నిరుత్సాహంగా గడుస్తున్న ఆ రోజుల్లో నేనొకసారి మా దూరపుబంధువుని ఒకామెని కలుసుకున్నాను. ఆమె అప్పుడే గ్రామసీమనుంచి వచ్చింది. నన్ను చూడగానే ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ‘అప్పుడే ఎంతపెద్దదానివయిపోయావే ‘అంది. కాసేపు కూచుని వచ్చేస్తూండగా ఆమె ‘నీకేదైనా కావాలా? నీ దృష్టి ఈ ప్రాపంచిక విషయాలమీద లేదని తెలుస్తోంది, నీకో మంచి బహుమతి ఇస్తాను, నువ్విష్టపడే బహుమతి’ అంది.
అప్పుడామె నాకు యాభైకన్నా ఎక్కువ సంపుటాలుండే గెంజిగాథ మొత్తం కానుకచేసింది. దాంతో పాటే, మరెన్నో తక్కిన కథాసంపుటాలు కూడా. ఆ పుస్తకాలసంచీ ఇంటికి తెచ్చుకున్నప్పుడు నా ఆనందానికి హద్దుల్లేకపోయింది. గతంలో నేను గెంజిగాథ అక్కడక్కడా కొన్ని పేజీలు మాత్రమే చూడగలిగాను. తక్కిందంతా నాకెప్పటికీ దొరికేదికాదనే అనిపించేది. కాని ఇప్పుడు ఆ మొత్తం కథ నా ముందు పరుచుకుని, చుట్టూ తెరలు దింపుకుని, అందరినుంచీ దూరంగా ఆ పుస్తకాలొక్కక్కటే చదువుతూ ఉంటే నా హృదయం ఆనందంతో నిండిపోయింది… దీపం సెమ్మె దగ్గరే రోజంతా బాగా పొద్దుపోయేదాకా చదువుతూనే ఉండేదాన్ని. తొందరలోనే ఆ కథల్లో పాత్రలన్నీ నాకు పేరుపేరునా పరిచయమైపోయాయి. వాళ్ళెట్లా ఉంటారో నేను నా మనోనేత్రంతో ఊహించుకునేదాన్ని. నాకెంతో గొప్ప తృప్తిగా ఉండేది. ..అప్పట్లో నేనేమంత ఆకర్షణీయంగా ఉండేదాని కాదు, కాని నేను పెద్దయ్యాక ఆ కథల రాకుమారిలాగా ఎత్తైన కబరీభరంతో గొప్ప సౌందర్యరాశిగా నడయాడుతాననీ, నన్నొక రాకుమారుడు ప్రేమిస్తాడనీ, అతణ్ణి మరొక వన్నెలాడి చేజిక్కించుకోడానికి చూస్తుందనీ.. ఒకటే కలలు కనేదాన్ని..
9
బాగా వెన్నెల కాస్తున్న ఒక రాత్రి, నేను ప్రయాణమధ్యంలో వెదురుపొదలమధ్యనుండే ఒక ఇంట్లో బసచేసాను. ఆ రాత్రి గాలికి కదలాడుతున్న వెదురుకొమ్మల ఆకుల గుసగుసకి మెలకువ వచ్చేసింది. మళ్ళా నిద్రపట్టలేదు. అప్పుడీ కవిత రాసాను:
రాత్రి వెనక రాత్రి
నిద్రలేకుండా గడుపుతున్నాను
వెదురుపొదల గుసగుసలు
ఎదనిండ ఏదో
చెప్పలేని వ్యాకులత.
శరత్కాలం ముగుస్తూనే నేనక్కణ్ణుంచి మరో ఇంటికి మారినప్పుడు నన్నంతదాకా ఆదరించిన ఆ ఇంటివాళ్ళకి ఈ కవిత కానుకచేసాను:
నన్ను ప్రతిచోటా
ప్రేమగా చేరదీసుకుంటున్న
హేమంత తుషారం.
అయినా నా తలపులింకా
ఆ రెల్లుదుబ్బులదగ్గరే ఆగిపొయ్యాయి.
33
కార్తికమాసంలో ఒక రాత్రి. చంద్రుడు ప్రకాశభరితంగా ఉన్నాడు. నాకు దుఃఖం ఆగలేదు. ఆ చంద్రుణ్ణట్లానే చూస్తూ, ఈ కవిత రాసాను:
నా నేత్రాల్లో
ఎప్పటికీ కన్నీటి పొగమంచు
అయినా వెన్నెల
ఎంత ప్రకాశభరితం.
13-5-2016