కాలం నుంచే తపస్సు

150

ఇవాళ గంట వెంకటరెడ్డిగారు పుట్టినరోజు. ఎక్కడో కువైట్ నుంచి ఆయన నాతో హృదయబంధం పేనుకున్నారు. ఈ శుభవేళ ఆయనకు శుభాకాంక్షలు ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తుంటే, అధర్వవేదంలోని ఈ ‘పూర్ణకుంభ’ సూక్తం (19:53) గుర్తొచ్చింది.

ఋగ్వేదంలో కాలం ప్రస్తావన దాదాపుగా లేనేలేదంటాడు రైముండో పణిక్కర్ తన ‘మంత్రమంజరి’ ( The Vedic Experience ) లో. ఋగ్వేద ఋషులకి గతం గురించిన తలపూ, భవిష్యత్తు గురించి చింతా లేవు. వాళ్ళ క్రియాపదాలన్నీ eternal present continuous. నూరేళ్ళ పాటు జీవించాలనీ, కర్మలు చేస్తూ ఉండాలనీ, సంతోషంతో గడపాలనే వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళకి కాలం అనంతం. దానికి ఆద్యంతాల్లేవు. సృష్టిలో ఉన్న ఒక లయ, దాన్నే ‘ఋతం’ అన్నారు, సూర్యాస్తమయాలు, దివారాత్రాలు, ఋతువులు, సంవత్సరాలు, ఆ లయానుగుణంగా జీవించడమే వాళ్ళు కోరుకున్నది. అలా జీవించిందే ఋతం, అది కానిదంతా ‘అనృతం’.

ఆ దారిలోనే అధర్వవేదం కాలాన్ని ఈ సూక్తంలో ఉపాసిస్తున్నది. ఇందులో అద్భుతమైన వాక్యం ‘పూర్ణః కుంభోధి కాల ఆహితస్తమ్’. ‘పూర్ణకుంభమొకటి కాలం పైన నిలిచి ఉన్నది’. అది పూర్ణం, దానికి తరుగులేదు. ఆ మాటని ఏ విధంగా స్ఫురిస్తే ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. యజుర్వేదం కూడా ‘పూర్ణమదః పూర్ణమిదమ్’ అనడం మనకు ఈ క్షణాన గుర్తురాకుండా ఉండదు.

వేదకాలమానవుడు timeless గా ఉండాలనుకోలేదు, time full గా ఉండాలనుకున్నాడు అంటాడు పణిక్కర్.

వెంకటరెడ్డిగారూ, మీకు నా శుభాభినందనలు.

పూర్ణకుంభం

ఏడు పగ్గాల కాలాశ్వం, వేయి
కన్నులు, అజరం, భూరిరేతం.
చక్రాలు సప్తభువనాలు. కవులు
విద్వాంసులై దాన్నధిరోహించారు.

ఏడు చక్రాలు, ఏడు నేములు,
అమృతం ఇరుసు, ఈ విశ్వ
భువనాలన్నిటికీ అగ్రగామి,
దేవతల్లో కాలమే మొదటిదేవత.

కాలంపైన నిలిచిన పూర్ణకుంభం,
దానిలో వివిధ సత్పురుషులు.
భువనాలన్నిటి ప్రత్యంగం, దాన్నే
పరమవ్యోమంలో నిలిచి ఉందంటారు.

భువనాలన్నిటినీ దగ్గరచేర్చింది,
భువనాల్ని దాటి సాగిపోతుంది.
వాటికి తండ్రిగా పుత్రుడయ్యింది,
అంత గొప్ప వెలుగుమరొకటి లేదు.

కాలమే ఈ దివాన్ని సృష్టించింది,
ఈ పృథ్వినీ కాలమే సృష్టించింది.
ఏది గతించినదో, ఏది కానున్నదో,
ప్రతి ఒక్కటీ కాలమే నిర్ణయిస్తుంది.

కాలమే జీవికని సృష్టించింది,
సూర్యుడు తపిస్తున్నదీ కాలంలోనే.
కాలంలోనే ప్రాణికోటి మనుగడ,
కాలంవల్లనే కన్ను చూస్తున్నది.

కాలంలోనే మనస్సు, ఊపిరి,
కాలంలోనే నామం సమాహితం.
కాలం చేతికందగానే ఈ ప్రజలు
గొప్ప ఆనందానికి లోనవుతారు.

కాలంలోనే తపస్సు, జ్యేష్టత,
కాలంలోనే బ్రహ్మం సమాహితం.
కాలమే సర్వస్వానికీ ప్రభువు,
కాలమే ప్రజాపతికి తండ్రికూడా.

దానివల్ల వచ్చినది, పుట్టినది,
దానిలోనే అది ప్రతిష్టితమైనది.
కాలం పరమసత్యం కాగానే
పరమేష్టిని ధరించగలుతున్నది.

కాలమే ప్రజల్నిసృష్టిస్తున్నది,
కాలమే మొదటి ప్రజాపతి, కాలం
నుంచి స్వయంగా పుట్టిన ద్రష్ట,
కాలం నుంచే తపస్సు కూడా.

7-10-2016

Leave a Reply

%d bloggers like this: