ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా వేమన గురించి మరి నాలుగు మాటలు.
మొన్న వేమన గురించి రాసింది చదివి రావి మోహనరావుగారు ‘వేమన తాత్వికత’ (2016) అనే పుస్తకం మెయిలు చేసారు. యలవర్తి భానుభవాని అనే ఆమె రాసిన పుస్తకం అది. అందులో ఆమె, తన తండ్రి తనకు చివరిమాటగా ‘నీ విద్యార్థులకు శతకాలు బోధించు,ఎలా బతకాలో నేర్చుకుంటారు’ అన్నారనీ, ఆ స్ఫూర్తితో ఆ పుస్తకం రాసాననీ చెప్పుకున్నారు.
ఆ పుస్తకం చదివినప్పుడు,నాకు అనుమాండ్ల భూమయ్య రాసిన ‘వేమన అనుభవసారం’ (2012) అనే పుస్తకం గుర్తొచ్చింది.
నాలుగేళ్ళ కిందట ఆ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ వేమన ప్రతి శతాబ్దానికీ కొత్తగా కనిపిస్తున్నాడని చెప్పాను.
వేమన ఎప్పుడు పుట్టాడో, ఏ కాలం వాడో ఇతమిత్థంగా తేల్చి చెప్పలేకపోయినా, పండితులూ, పరిశోధకులూ ఎక్కువమంది ఆయన్ను, సంవత్సరాలు అటూ, ఇటూగా, పదిహేడవ శతాబ్ది కవిగానూ, కడపజిల్లావాసిగానూ చెప్తున్నారు. తన సమకాలిక సమాజం ఎలా ఉండేదో వేమన ఎంతో విస్పష్టంగా చెప్పాడుగాని, తనని తన సమకాలిక సమాజం ఎట్లా చూసిందో ఆయనెక్కడా చెప్పుకోలేదు.
ఆయన గురించి మొదటిసారిగా ప్రపంచానికి తెలియచెప్పిన ఫ్రెంచి కాథలిక్ మిషనరి జె.అ.దుబే తన ‘Hindu Customs, Manners and Ceremonies’ (రచన, 1807, పరిష్కృత ప్రచురణ, 1897)లో వేమన గురించి ప్రస్తావిస్తూ ఆయన్ను ఆధునిక తత్త్వవేత్త అని అభివర్ణిస్తూ, తిరువళ్ళువర్ తో సమానంగా పేర్కొన్నాడు. దాన్ని మనం వేమన గురించి పద్ధెమినిమిదవ శతాబ్ది అంచనాగా భావించవచ్చు.
ఆ పుస్తకంద్వారా వేమన గురించి తెలుసుకున్న బ్రౌన్ తాను సేకరించిన వేమన పద్యాలకు రాసుకున్న ముందుమాట (1824) లోనూ, తిరిగి 1829 లో రాసిన ముందుమాట లోనూ, 1840లోనూ, 1866లోనూ చేసిన ప్రస్తావనల్లోనూ వేమన గురించి పందొమ్మిదో శతాబ్దం ఏర్పరరుకున్న అభిప్రాయం మనకు కనిపిస్తుంది.
వేమన పద్యాల్ని మూడు విధాలుగా, moral, satirical and mystic అని వర్గీకరిస్తూ, బ్రౌన్, వాటిలో మిస్టిక్ పద్యాల పట్ల కొంత ఆరాధనను కనపరిచాడు. ‘సంస్కారరహితమైన అంధకారంలో మసకపడ్డ సత్యజ్యోతిని అన్వేషిస్తున్న ఒక శక్తిమంతమైన మనస్కుడి’ పద్యాలుగా ఆయన వాటిని పేర్కొన్నాడు.
1824 లో ఆయన వేమన యోగమార్గ పద్యాల్ని ప్రస్తుతించినప్పటికీ, 1866 లో రాసుకున్న తన సాహిత్యప్రయాణప్రస్తావనల్లో వేమనను ‘నీతిసూత్రకారుడైన ఒక గ్రామీణుడు’ గా పేర్కొన్నాడు. పందొమ్మిదో శతాబ్దం ముగిసేటప్పటికి వేమనను నీతికవిగా, భర్తృహరి, తిరువళ్ళువర్, సుమతీశతకకారుడు వంటి కవులతో సమానంగా చూస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు.
కాని ఇరవయ్యవశతాబ్దం వేమనను సరికొత్తగా ఆవిష్కరించింది.
డా.కట్టమంచితో మొదలైన ఈ కొత్త మూల్యాంకనం వేమనను social protest కవిగా ముందుకు తీసుకొచ్చింది. 1908 లో ఒక సాహిత్య ప్రసంగంలో కట్టమంచి వేమనను సంఘసంస్కర్తగా అభివర్ణించాడు. శ్రీశ్రీ అతడికి తిక్కనతో సమానమైన సాహిత్యప్రతిపత్తి కల్పిస్తూ, తిక్కన-వేమన-గురజాడలను తన కవిత్రయంగా పేర్కొన్నాడు. సమాజంలోని కాపట్యాన్నీ, ద్వంద్వనీతినీ, ఆత్మవంచననీ ఎత్తిచూపిన వాడిగా వేమనను ప్రస్తుతిస్తూ, చలంగారిని ఇరవయ్యవశతాబ్దపు వేమనయోగి గా పిలవడం ద్వారా వేమన గురించిన ఇరవయ్యవశతాబ్ది మూల్యాంకనాన్ని శ్రీశ్రీ పరిపూర్ణం చేసాడు.
ఇరవయ్యవశతాబ్దంలో వేమన గురించి ఎన్ని పుస్తకాలు వచ్చినా,ఎంత పరిశోధన జరిగినా, ఎంత వాదవివాదాలు నడిచినా, ఆయన్ను ప్రధానంగా సంఘవిమర్శ చేపట్టిన కవిగానే, ఒక ధిక్కారస్వరంగానే చూసారని ఒప్పుకోకతప్పదు.
ఇప్పుడు ఇరవయి ఒకటవ శతాబ్దంలో వేమన మనకు ఎట్లా సాక్షాత్కరించ బోతున్నాడు? నాలుగేళ్ళ కిందట అనుమాండ్ల భూమయ్య రచన చదివినప్పుడు నేనూహించిందీ, ఇప్పుడు యలవర్తి భానుభవాని పుస్తకం చూసినతరువాత బలపడిందీ, ఇప్పటి సమాజం వేమనను ఒక విద్యావేత్తగా, మార్గదర్శిగా చూడబోతున్నారన్నదే.
విద్యావేత్త అంటే కొన్ని నీతిసూత్రాలు చెప్పిన వాడని కాదు, ఏది మనుషుల్ని మనుషులుగా మారుస్తుందో అట్లాంటి విద్య గురించి మాట్లాడినవాడని. బహుశా ఇందుకు వేమన యోగమార్గ పద్యాలే ఆధారం కావచ్చు. కాని 21 వ యుగోదయ సందర్భంలో ఈ పద్యాలే మనకు కొత్తగా అర్థమవుతున్నాయి.
20 వ శతాబ్దందాకా ప్రపంచం విద్యని అర్థం చేసుకున్న తీరు వేరు, ఈ శతాబ్దంలో విద్యని సమీపిస్తున్న తీరు వేరు. ముఖ్యంగా, రినైజాన్సు తరువాత, మళ్ళా పాశ్చాత్యప్రపంచం విద్యకి సంబంధించి ఒక నూతన పరివర్తనకు లోనవుతున్నది. మన విద్యావిధానం కూడా పాశ్చాత్యవిద్యనే అనుసరిస్తున్నదికాబట్టి, ఆ ఆలోచన ఇక్కడ కూడా ప్రతిధ్వనిస్తున్నది.
పారిశ్రామిక విప్లవం మొదలైనప్పణ్ణుంచీ 18-20 శతాబ్దాలదాకా పాశ్చాత్య ప్రపంచం విద్యని factory model మీదనే అర్థం చేసుకుంది. అంటే, విద్య ఒక వస్తువు, దాన్ని తయారు చేయవచ్చు, గోదాముల్లో నిలవచేయవచ్చు, ఆ తయారీ పద్ధతి విస్తృతంగా నేర్పవచ్చు, అట్లా తయారు చేసిన సరుకును ప్రపంచమంతా అమ్ముకోవచ్చు అని నమ్మడం. మన పాఠ్యపుస్తకాలు, మన కరికులం, మన పరీక్షలు, మన విద్యాలయాలు అన్నీ అదే పారిశ్రామిక తరహాలో రూపొందించబడ్డాయి.
కాని సమాచార విప్లవం మొదలయ్యాక ఈ పద్ధతి మొదటిసారి వీగిపోతున్నది. ఇప్పుడు మనం విద్యనింకెంత మాత్రం ఒక సరుకుగా భావించలేకపోతున్నాం. అది తయారు చేస్తే రూపొందేది కాదు, దాన్ని సృష్టించుకోవాలి, ఒక విత్తు అంకురంగా మొలకెత్తి అనుక్షణ ప్రవర్ధమానమైనట్టుగా, విద్య అత్యంత సృజనశీలం. దాన్ని మనం పాకేజి చేసి రిఫ్రిజిరేటర్లలో నిలవబెట్టలేం. మనుషులకీ మనుషులకీ మధ్య, మనుషులకీ, ప్రకృతికీ మధ్య పరస్పర ఆదానప్రదానాలతో వికసించి ప్రసరించవలసిన జీవధార అది.
ఇంతకు ముందులాగా విద్యకి ఇప్పుడు మూడు R లు ఉంటే సరిపోదు. దానికిప్పుడు మూడు C లు కావాలి.అవి creativity, communication and collaboration. 21 వ శతాబ్దపు విద్యానైపుణ్యాలు ఎలా ఉండాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు ఒక అమెరికన్ విద్యావేత్త చెప్పిన సమాధానమది. ఆ మూడు C లకు మనం నాలుగవ Cని కూడా జోడించాలి. అది compassion.
ఇది పుస్తకాలు చదివినందువల్లా, సంచయంవల్ల రాదు. అసలు విద్య అంటే accumulation అనే భావనలోనే దాన్నొక సరుకుగా చూసే లక్షణముంది. నిజమైన విద్య, క్రియేటివ్ కావాలన్నా, కమ్యూనికేట్ చెయ్యాలన్నా, కొలాబరేట్ చేసుకోవాలన్నా కూడా ముందు నీలోపలకి చూసుకోవాలి. తోటిమనిషిని సమాదరించగలగాలి. మీరిద్దరూ కలిసి ఒక మానవీయ సంఘంగా రూపొందాలి. అది పుట్టుకతో వచ్చేది కాదు,కొనుక్కుంటే దొరికేది కాదు. నిరంతర ప్రయత్నంవల్లా, నిర్విరామ సాధనవల్లా , చిత్తశుద్ధివల్లా మాత్రమే రూపొందుతుందది.
సరిగ్గా వేమన ఈ విద్య గురించే మాట్లాడుతున్నట్టుగా ఆ పద్యాలు, మన చిన్నప్పుడు మనకేమీ తెలియకుండానే వల్లెవేసిన పద్యాలు, మనకిప్పుడు వినబడుతున్నాయి:
అనగననగ రాగమతిశయిల్లుచునుండు
తినగతినగ వేము తియ్యనగును
సాధనమున పనులు సమకూరు ధరలోన
ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల
భాండశుద్ధిలేని పాకమేల
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా
ప్రతి యుగంలోనూ కూడా విద్య టెక్నాలజీగా మారిపోతూంటుంది. ఆ టెక్నాలజీ చేతిలో ఉన్నవాడే ప్రభావశీలుడిగా, పాలకుడిగా మారిపోతుంటాడు. కాని కొద్ది రోజులకే ఆ టెక్నాలజీ పాతబడుతుంది, ఆ ప్రభుత్వం కూలిపోతుంది. అందుకనే నిజమైన విద్యార్థి, విద్యనెప్పటికీ, విద్యనుంచి, కాపాడుకుంటూనే ఉండాలి.
అసలు టెక్నాలజీలన్నింటికీ ఆధారమైన సత్యాన్వేషణనే నిజమైన విద్య అనీ,మనుషులు కోరుకోవలసిందీ, అభ్యసించవలసిందీ అదేననీ యుగాలుగా విద్యావేత్తలంతా చెప్తూవస్తున్నారు.
వేమన కూడా ఆ మాటే అంటున్నాడు:
వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి
భ్రమలబెట్టి తేటపడగనీవు
గుప్తవిద్య ఒకటె కులకాంత వంటిది
మర్మమెరుగలేక మతములు కల్పించి
ఉర్విజనులు దుఃఖమొందు చుంద్రు
గాజుటింట కుక్క కళవళ పడురీతి
పెక్కు చదువులేల పెక్కు వాదములేల
ఒక్క మనసుతోను ఊరకున్న
సర్వసిద్ధుడగును, సర్వంబు తానగును
అది తెలినవాళ్ళు మాత్రమే విద్యావంతులు. తక్కినవాళ్ళంతా
నేరుపగలవారు, నెరతనము గలవారు
విద్యచేత విర్రవీగువారు
పసిడికలుగువాని బానిస కొడుకులు.
20-3-2016