లలన లీల

Reading Time: 2 minutes

149

ఒకప్పుడు రామకృష్ణ పరమహంస ఈశ్వరచంద్ర విద్యాసాగరుణ్ణి కలిసాడు. ఆ అద్భుత సమావేశాన్ని ‘రామకృష్ణ కథామృతం’ లో కళ్ళకు కట్టినట్టు రాస్తాడు మహేంద్రనాథ గుప్త.

విద్యాసాగరుణ్ణి చూస్తూనే పరమహంస అన్నాడట: ‘ఇన్నాళ్ళూ కాలవలూ, కయ్యలూ, మహా అయితే ఒక నదిని మాత్రమే చూసాను. కాని ఇదిగో ఇప్పుడే సాగరం ఎదట నిలబడ్డాను’ అని.

దానికి విద్యాసాగరుడు ప్రతిస్పందించిన తీరు ఎంత మనోహరంగా ఉంది! ఆయనన్నాడట:

‘అయితే మీరు కొద్దిగా ఉప్పునీరు చవిచూడవలసి ఉంటుంది’అని.

ఎన్నో విషయాల మీద మాట్లాడుకున్నారు వాళ్ళు. రెండు మహాసముద్రాలు ఒకదానితో ఒకటి సంభాషించుకున్నట్టు. ఆ మాటల మధ్యలో పరమహంస ‘భగవంతుణ్ణి తర్కం ద్వారా చేరుకోలేం’ అంటూనే దివ్యావేశభరితుడై పాడటం మొదలుపెట్టారట.

కాళీమాతని అర్థం చేసుకోగలిగేదెవ్వరు?
షడ్దర్శనాలూ కూడా ఆమెని చూడజాలవు.
ఆమె యోగీశ్వరుడి అంతరంగమంటాయి శాస్త్రాలు
అతడికి తన హృదయంలోనే సమస్తసంతోషమూ.
ఆమె తన ఇష్టంకొద్దీ ప్రతిప్రాణిలోనూ వసిస్తున్నది

పిండాండ బ్రహ్మాండాలు ఆమె గర్భంలోనే ఉన్నవి
ఎంత విశాలమో ఆమె ఊహించావా, యోగి
ఆమెని మూలాధారంలో ధ్యానిస్తాడు, సహస్రారంలో
శివుడు ఆమెను దర్శిస్తాడు. ఆ పద్మాటవిలోకదా
ఆమె తన హంసతో క్రీడించేది.

ఆమెను తెలుసుకోవాలని ఎవరేనా ప్రయత్నిస్తే
రాం ప్రసాద్ నవ్వుకుంటాడు. సముద్రాన్ని
ఈదడం ఎంత దుస్సాధ్యమో ఆమెని అర్థం
చేసుకోవడమూ అంతేనని అతడికి తెలుసు.
నా మనసుకి అర్థమవుతోంది, కాని అయ్యో
నా హృదయం, మరుగుజ్జులాంటిది, ఐనా
చంద్రుణ్ణందుకోవాలని చేతులు చాపుతున్నది.

పాడుతూనే మధ్యలో పరమహంస అడిగారు ‘చూసారా!’

‘పిండాండ బ్రహ్మాండాలు ఆమె గర్భంలోనే ఉన్నవి
ఎంత విశాలమో ఆమె ఊహించావా,’

మళ్ళీ కవినే అంటున్నాడు

‘షడ్దర్శనాలూ కూడా ఆమెని చూడజాలవు.’

‘ఆమె వట్టి పాండిత్యానికి దర్శనమిచ్చేది కాదు.. భగవంతుణ్ణి భక్తితో మాత్రమే చూడగలం, ప్రేమపారవశ్యంతో మాత్రమే పట్టుకోగలం…’

రామకృష్ణ కథామృతం చదివినవాళ్ళకి రామ ప్రసాద్ ఎవరో తెలుసుకోవాలనీ, అతడి కీర్తనల్ని వినాలనీ గొప్ప కుతూహలం కలుగుతుంది. ఆ కుతూహలం వల్లనే గత వందేళ్ళుగా ఎందరో పండితులు, పరిశోధకులు అతడి భక్తిగీతాల్ని ఇంగ్లీషులో, ఫ్రెంచిలో అనువదిస్తూనే ఉన్నారు.

ఆ అనువాదాల కోవలో మరొక మేలిమి పుస్తకం Singing to the Goddess: Poems to Kali and Uma from Bengal (ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీ ప్రెస్, 2001).

రాచెల్ ఫెల్ మెక్ డెర్మోట్ అనే విదుషి ఈ పుస్తకంలో కేవలం రాం ప్రసాద్ కవితలు మాత్రమే కాదు, బెంగాలీ శాక్తపదకారుల్లో 37 మందిని ఎంపిక చేసి వారి గీతాలు 164 దాకా అనువదించి సంకలనం చేసింది. సుమారు రెండున్నరశతాబ్దాల పైబడి సాగుతున్న బెంగాలీ శాక్తభక్తి సంప్రదాయానికి చెందిన కవిత్వాన్ని మనకి పరిచయం చేయడమే కాక, చక్కటి ఉపోద్ఘాతం కూడా పొందుపరిచింది.

ఇందులో బెంగాలీ శాక్తకవుల్లో అగ్రేసరులుగా చెప్పదగ్గ రామప్రసాద్ సేన్ (1718-1775) , కమలకాంత్ భట్టాచార్య (1769-1821) లతో పాటు ఇరవయ్యవ శతాబ్ది కవులదాకా ఉన్నారు. వారిలో, శాక్తభక్తికవిత్వం రాసిన ఏకైక ముస్లిం కవి, బెంగాల్ అగ్నిశిఖ, నజ్రుల్ ఇస్లాం ఉండటం కూడా ఒక విశేషం.

ఆరవశతాబ్దానికి చెందిన మార్కండేయ పురాణంలోని దేవీమాహాత్మ్యం స్ఫూర్తిగా మొదలైన శాక్తభక్తి, పద్ధెనిమిది, పందొమ్మిది శతాబ్దాల కలోనియల్ పరిపాలనలో ఎటువంటి కొత్త శక్తిగా రూపొందిందో, సంకలనకర్త వివరించింది. ఆ ప్రయాణంలో, శాక్తపదకారులు గ్రామీణ బెంగాల్ జీవితాన్ని, శాక్తేయాన్నీ ఎట్లా మేళవించారో, రైతులూ, వాళ్ళ అప్పులూ, ఎస్టేట్ మానేజర్ల ఆర్థికలావాదేవీలు, వర్తకులూ, వాళ్ళ పెట్టుబడీ, లాయర్లూ, కోర్టు యుద్ధాలు, పడవలు నడిపేవాళ్ళూ, వాళ్ళ విరిగిన పడవలూ, బీదవాళ్ళూ, పేదరికమూ, కరువు కాటకాలూ- వీటి మధ్య వారు దేవిని ఎట్లా దర్శించారో చదువుతుంటే, భారతీయ సాహిత్యంలో ఒక విశిష్ఠ అధ్యాయం మనముందు తెరుచుకుంటుంది.

బెంగాలీ శాక్తభక్తిలో దసరా మూడురోజులూ పార్వతి తన శివుడితో కలిసి తన పుట్టింటికి వచ్చే రోజులు. ఆ రాకని తలుచుకుంటూ ‘ఆగమని’ గీతాలు పాడుతారు. అట్లానే మహిషాసుర విజయాన్ని ప్రస్తుతిస్తూ ‘విజయ’ గీతాలు కూడా పాడుతారు.

ఆ శుభసందర్భంలో రెండు గీతాల అనువాదం మీ కోసం. మొదటిది, రామ ప్రసాద్ సేన్ రచన, రెండవది నజ్రుల్ ఇస్లాం రచన.

లలన లీల

చూడు, ఇదంతా ఒక లలన లీల
రహస్యం
ఆమె సంకల్పాలేమిటో ఆమెకే తెలియాలి
సగుణ,నిర్గుణ వాదాలమధ్య
ఆమె ఒక మట్టిబెడ్డని
మరొక మట్టిబెడ్డతో పగలగొడుతుంది
ఇట్లాంటి విషయాల్లో సాయం చేయడానికి
ఆమె ఎప్పుడూ ముందుంటుంది
నీకు నిజంగా అవసరమైనప్పుడు తప్ప.

అందుకే ప్రసాద్ అంటాడు, సరిగ్గా కూచో
భవసాగరం మీద కొయ్యముక్కలాగా తేలిపో
కెరటమొకటి నెడుతున్నదా, ముందుకు పో
అలలు నెమ్మదించాయా, కిందకు కొట్టుకు పో.

శివుణ్ణి మేల్కొలుపు

శ్యామా, మేలుకో, శ్యామా, మేలుకో.
రాక్షసంహార చండీరూపంలో మరొకసారి
సాక్షాత్కరించు.
నువ్వు మేలుకోకపోతే, తల్లీ,
నీ పిల్లలు కూడా మేలుకోరు.

అన్నపూర్ణా, నీ కొడుకులూ,కూతుళ్ళూ
ఆకలికి నకనకలాడుతున్నారు
అటూ ఇటూ దిమ్మరుతున్నారు,
బతికి ఉన్నట్టులేరు, మృతుల్లాగా కనిపిస్తున్నారు
ఈ దృశ్యం నీ హృదయాన్ని గాయపరచడం లేదూ?

నువ్వెంతో ఇష్టపడే స్మశాన స్థలాలు
ఇప్పుడు భరతభూమి.
రా, ఈ మరుభూమిలో, నాట్యం చెయ్యి
ఈ కంకాళాలకి ఊపిరిలూదు.

అమ్మా, నేను కోరుకుంటున్నదొక స్వేచ్ఛాపవనం
శక్తి కావాలి నాకు, దీర్ఘాయుష్షు కావాలి నాకు.
నీ చుట్టూనేమో కళేబరాలు,
నీ మోహనిద్ర విదిలించు,
అమ్మా, శివుణ్ణి
మేల్కొలుపు

11-10-2016

Leave a Reply

%d bloggers like this: