కవిత్వాన్ని తులనాత్మకంగా పరిశీలించడం ఎందుకు, ఎట్లా? తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడి ముప్పై ఏళ్ళయిన సందర్భంగా తులనాత్మకసాహిత్యకేంద్రం వారొక సదస్సు నిర్వహించారు. అందులో కవిత్వ తులనాత్మక పరిశీలన గురించి మాట్లాడమని మిత్రుడు శిఖామణి నన్నాహ్వానించాడు.
తులనాత్మకత మీద సిద్ధాంత పరంగా ప్రపంచమంతా నేడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. కాని ఆ సిద్ధాంతాలన్నిటినీ అక్కడ ఏకరువు పెట్టడం కన్నా, కవిత్వాన్ని ఎట్లా పోల్చి చూడవచ్చునో, ఒక ఎక్సర్ సైజ్ చేస్తే బాగుణ్ణనిపించింది.
సుప్రసిద్ధమైన కవితల్ని పోల్చి చూడటంలో ఒక కొత్తదనముంటుంది. వాటిని మళ్ళా ఫ్రెష్ గా చదివినట్టుంటుంది. అందుకని శ్రీ శ్రీ ‘భిక్షువర్షీయసి’ (1934) కవిత తీసుకున్నాను.
దారిపక్క చెట్టుకింద ఆరిన కుంపటివిధాన
కూర్చున్నది ముసిల్దొకతె మూలుగుతూ
ముసరుతున్న ఈగలతో వేగలేక.
ముగ్గుబుట్టవంటి తలా, ముడుతలు తేరిన దేహం
కాంతిలేని గాజుకళ్ళు, తన కన్నా శవం నయం.
పడిపోయెను జబ్బు చేసి, అడుక్కునే శక్తిలేదు,
రానున్నది చలికాలం, దిక్కులేని దీనురాలు.
ఏళ్ళు ముదిరి కీళ్ళు కదిలి, బతుకంటే కోర్కె సడలి
పక్కనున్న బండరారి పగిదిగనే పడి ఉన్నది.
‘ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరి’ దని
వెర్రిగారి ప్రశ్నిస్తూ వెళిపోయింది!
ఎముక ముక్క కొరుక్కుంటు ఏమీ అనలేదు కుక్క;
ఒక ఈగను పడవేసుకు దూరంగా తొలగె తొండ!
కమ్మె చిమ్మ చీకట్లూ, దుమ్ము రేగె నంతలోన,
‘ఇది నా పాపం కాదనె ‘ఎగిరివచ్చి ఎంగిలాకు!
తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన ఈ కవితలో మూడు ప్రధానాంశాలున్నాయి. మొదటిది, అంతదాకా జీవితసౌందర్యాన్ని మాత్రమే చిత్రిస్తూ వచ్చిన భావకవుల స్థానంలో జీవిత వికృతస్వరూపాన్ని కావ్యవస్తువు చెయ్యడం. ఆ వికృతి ఒక వ్యక్తి విషాదంకాదనీ, ఒక సాంఘిక విషాదమనీ, కానీ ఎవరూ ఆ విషాదానికి బాధ్యత వహించడం లేదనీ చెప్పడం. మూడవది,ఆ చెప్పే పద్ధతిలో, ఛందస్సులో, పదప్రతీకల్లో కొత్తపోకడ పోవడం.
ఇందులో ఛందస్సుకి శ్రీశ్రీ గురజాడకి ఋణపడ్డానని చెప్పుకున్నాడు. సంస్కృత వృత్తాలు రథాల్లాంటివనీ,వాటి స్థానంలో ముత్యాలసరాలు ప్రవేశపేట్టి గురజాడ కవిత్వాన్ని నేలమీద నడిపించాడనీ శ్రీ శ్రీ చాలాసార్లు చెప్పాడు. ప్రతి పంక్తిలోనూ 12 మాత్రలుండేలా చూసుకున్న ఈ గేయం 3+4, 3+4 తరహా ముత్యాలసరాన్ని 14 మాత్రలకు బదులు 12 మాత్రలకు కుదించిన సరళమైన నడక.
సుందరప్రకృతికి బదులు సామాజిక వికృతి కవితావస్తువుగా మారడానికి ఈ కవి వెనక హంగ్రీ థర్టీస్ ఉన్నాయని చెప్పుకున్నా, ఆ థర్టీస్ కి ఒక గొంతు ఇవ్వడానికి అతడిముందేదైనా ఒక నమూనా ఉందా?
ఉందనే అనిపిస్తుంది.
అది బోదిలేర్ రాసిన The Carcass (1857) అనే కవిత. ‘ఒక సుందరి మృతికన్నా గొప్ప కవితావస్తువేదీ ఉండబోదని’ ఎడ్గార్ అలన్ పో తన The Philosophy of Composition లో రాసాడు. ఆ మాటల వెనక, మరణించిన పో ప్రియురాలు ఉంది. ఆ మాటల స్ఫూర్తితో బోదిలేర్ రాసిన కవిత అది.
ఆ కవితలో కవి తన ప్రియురాలికి తామొక అందమైన వేసవి ఉదయాన, దారిపక్కన చూసిన ఒక మృతకలేబరాన్ని గుర్తు చేస్తాడు. ఆ శవం కాళ్ళు కామోద్రిక్త వేశ్యలాగా పరుచుకుని ఉన్నాయనీ, పూర్తిగా పూసిన పువ్వులాంటి ఆ అద్భుత మాంసఖండం మీద ఆకాశం ఒక కన్నేసి ఉంచిందనీ, ఆ పేగులమీద రొదపెడుతో ఈగలు ముసురు తున్నాయనీ, ఆ భయానక దృశ్యం పక్కనే గలగలపారే సెలయేరులాగా, మందపవనంలాగా, కుప్పపోసిన కళ్ళంలో లయాత్మకంగా తూర్పారబడుతున్న ధాన్యంలాగా ప్రపంచమొక సంగీతం వినిపిస్తోందనీ అంటాడు. ఆ మృతకళేబరం చేతుల్లోంచి జారవిడుచుకున్న కబళాన్ని కబళించడానికి పక్కనే ఒక కుక్క పొంచి ఉందంటాడు.
చూడటానికీ, వినడానికీ కూడా దుర్భరంగా ఉన్న ఈ వర్ణన అంతా పూర్తి చేసి కవి చివరికి ఇలా అంటాడు:
నువ్వు, నువ్వు కూడా ఒకనాటికిట్లానే కుళ్ళిపోతావు
ఘోరం, దారుణం, అమానుషం, ఓ నా జీవన ప్రకాశమా,
నా నేత్రాలతారకా, నా మోహోద్రేకమా, నా దేవతా.
నిజమే, నీ తనూవిలాసం, అంత్యకర్మలు పూర్తయ్యాక
వికసిస్తున్న పచ్చిక కింద, పూలకింద మృతలోకాన్ని చేరినప్పుడు
నీ ఎముకలూ ఇట్లానే మూలుగుతాయి.
ఓ నా సౌందర్యాధిదేవతా, అపుడు నీ దేహాన్ని ముద్దులాడే
పురుగులకి వివరించు
అందమైన నీ దేహాకృతినీ, దివ్యహృదయాన్నీ నేను నాదగ్గరే అట్టేపెట్టేసుకున్నానని.
సౌందర్యారాధనతో మొదలైన రొమాంటిసిజం సౌందర్యవినాశదర్శనంతో డార్క్ రొమాంటిసిజంగా మారింది. పో, బోదిలేర్ డార్క్ రొమాంటిసిస్టు కవులు. శ్రీ శ్రీ కూడా రొమాంటిసిస్టుగానే కవిత్వప్రయాణం మొదలుపెట్టాడు. కాని ‘ప్రభవ’ కవితల్లోనే అతడిలోని డార్క్ రొమాంటిసిజం మనకి కనిపిస్తుంది:
‘అవి ధరాగర్భమున మానవాస్థికా పరపంపరలు
సుప్తనిశ్శబ్ద సంపుటములు
అటనొకే దీర్ఘయామిని, ఆ నిశాస్మశాన శయ్యకు
ప్రాత: ప్రసక్తి లేదు…’
కాని ‘భిక్షు వర్షీయసి’ కవితలో ఆయన దృశ్యం దగ్గరే బోదిలేర్ ని అనుసరించాడు. ఆ దారిపక్క కళేబరం, ముసురుతున్న ఈగలు, తాకిపోతున్న మందపవనం, పొంచి చూస్తున్న ఆడకుక్క.
కాని బోదిలేర్ లాగా అతడు వినాశాన్ని దాటి ప్రేమ నిలబడుతుందనే నమ్మకాన్ని ప్రకటించలేకపోయాడు. అంతకన్నా కూడా ఆ వినాశానికి ఎవరూ బాధ్యత పడని, పడటానికి ఇష్టపడని మరింత విషాదకరదృశ్యాన్ని చూపించాడు.
శిల్పరీత్యా ఈ కవితలోని అత్యంత శక్తిమంతమైన విషయమిదే. దీనికతడిముందేదైనా నమూనా ఉందా?
ఉందనే అనాలి.
అతడి తొలిరోజుల్లో అతడి కవిత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కృష్ణశాస్త్రి ‘కృష్ణపక్షము’ లో –
నా విరులతోట పెంచుకున్నాడనొక్క
పవడపు గులాబి మొక్క నా ప్రణయజీవ
నమ్మువర్షమ్ముగా ననయమ్ము కురిసి.
కొన్నినాళ్ళాయె, సుకుమార కుసుమమొకటి
నవ్వె కిలకిలమని నా వనమ్ములోన.
అంతదానినె, నా జీవితాశయమ్ము
పూవుగా వింతగా మారిపోయినటులు
వలచికొన్నాడ, నా ప్రసూనమ్ము నేను
నన్ను మనసార నా ప్రసూనమ్ము కనులు
విచ్చి కాంచుచు కాలము పుచ్చినాము
ఎదల నిశ్శబ్దమౌగ పలకరించుకొనుచు
ఎట్టులది దాపురించెనో యెమొ యంత
నాకుసందుల త్రోవల నల్లదిగియె
నొక్క క్రూరార్క కిరణమ్ము ఉర్వి వాలి
నా గులాబి సోలి తూలి నన్ను వీడె.
అపుడు నా వైపు చూచి నా యలరు లేని
శూన్యమౌ మ్రోడు మ్రాకును జూచి యొక్క
కోకిలమ్ము కో యని యేడ్చె గొంతు నెత్తి!
మా కొరకు దారిబోయెడు మందపవను
డొకడు జాలిగ నిట్టూర్పు విసరె!
పువ్వు నేలరావడం సౌందర్యవినాశనం. Paradise lost. కాని ఆ వినాశనాన్నీ, విధ్వంసాన్నీ చూసి తట్టుకోవడానికి మరొకమనిషెవరూ తోడుగా లేరు కవికి. ఉన్నదల్లా ఒక కోకిల, ఒక మందపవనమూ మాత్రమే. కవి తో పాటు విలపించిన ప్రకృతి.
ఇప్పుడు ముసలిబిచ్చగత్తె సంగతి చూద్దాం. ఆమె బాగా జీవించిన రోజుల్లో సుందరి అయిఉంటుంది, సమాజం ఆకలి తీర్చి ఉంటుంది. కాని ఇప్పుడామె చరమావస్థ. దాదాపుగా బోదిలేర్ వర్ణించిన carcass వంటిదే. కాని అంతకన్నా విషాదభరితం. అందుకనే ‘తనకన్నా శవం నయం’ అంటున్నాడు.
పువ్వు రాలిపోయినప్పుడు కవికి కోకిలా, మందపవనమూ తోడుగా ఉన్నాయి. కాని అది వ్యక్తిగత విషాదం. ఇక్కడో, ఇది సామాజిక విషాదం. అందుకనే, బోదిలేర్ చూసిన breeze, కృష్ణశాస్త్రి గమనించిన ‘మందపవనం’ ఇక్కడికొచ్చేటప్పటికి ‘వెర్రిగాలి’ గా మారిపోయింది. బోదిలేర్ చూసిన pitiful bitch ఇక్కడికొచ్చేటప్పటికి ‘ఎముకముక్క కొరుక్కుంటున్న కుక్క’ గా మారిపోయింది. ఈగలూ, పురుగులూ అక్కడా, ఇక్కడా ఉన్నాయి. కోకిల కాస్తా ‘ఒక ఈగను పడవేసుకు దూరంగా తొలగిన తొండ’ గా మారిపోయింది.
సుందరి మృతి కన్న గొప్ప కావ్య వస్తువు లేదన్నాడు పో. కాని, ఆ మృతికన్నా విస్మృత జీవన్మృతి, ఎవరికీ పట్టని మృతి, చివరికి ప్రకృతికి కూడా పట్టని మృతి కావడం మరింత ఘోరమంటున్నాడు శ్రీ శ్రీ.
నా ప్రసంగమయ్యాక ఒక యువకుడు నా దగ్గరకొచ్చి నిజంగానే ఒకరిమీద ఒకరి ప్రభావం ఉందంటారా అన్నాడు.
కవిత్వాన్ని పోల్చిచూడటం ఒక ఊహాగానం. అందమైన hypotheses. కవిత్వాన్ని పోల్చి చదవడమెందుకంటే, ఒక కవిలో ప్రపంచకవిత్వాన్నీ, ప్రపంచకవిత్వంలో మన కవిత్వాన్నీ పట్టుకోవడానికి. మొదటిసారి రాయలబాలాజీ అట్లాస్ చూసినప్పుడు నేను చేసిందిదే, ప్రపంచ పటంలో మా ఊరెక్కడుందా అని వెతుక్కోవడం.
27-11-2015