ఋగ్వేదానికే ప్లేటో ఒక ఫుట్ నోట్

144

ఇంటికొచ్చేటప్పటికి కొరియర్ పాకెట్ బల్ల మీద ఎదురుచూస్తూ ఉంది. ఆ అర్థరాత్రే దాన్ని ఆతృతతో విప్పి చూసాను. ఆంటోనియో డి నికలస్ రాసిన Meditations through Rigveda: Four Dimensional Man (2003). 1976 లో మొదటిసారిగా వెలువడ్డ రచనకి కొత్త ఎడిషన్.

ఆ పుస్తకాన్నట్లానే చేతుల్తో ఆప్యాయంగా తడిమి చూసుకున్నాను. అట్టవెయ్యకుండా కొత్త పుస్తకంలోకి మనసుపెట్టలేను గానీ, ఆ రాత్రే, ఆ మొదటి క్షణాల్లోనే, ఆ పుస్తకంలో రెండు పేజీల ముందు మాట చదవకుండా ఉండలేకపోయాను.

ఆ ముందుమాట రాసిన పాట్రిక్ ఐడాన్ హీలన్ (1926-2015) ఒక ఐరిష్-అమెరికన్ జెసూట్, భౌతికశాస్త్రవేత్త, సైన్సు ఫిలాసఫరు. క్వాంటం మెకానిక్స్ లో, హెర్మెన్యూటిక్ ఫిలాసఫీ ఆఫ్ సైన్సులో జీవితకాలం కృషి చేసినవాడు, సుప్రసిద్ధ భౌతికశాస్త్రవేత్త హైసన్ బర్గ్ కి మిత్రుడు కూడా. ఆయన రాసిన ఆ రెండు పేజీల ముందుమాటనీ యథాతథంగా మీతో పంచుకోవాలనిపించింది.

ఆయనిట్లా రాసాడు:

“మానవ భాష, ఆలోచన, భావవ్యక్తీకరణల గురించిన ఈ అసాధారణమైన రచన చదవగానే, మనకి దివ్య ‘సోమ’రసపానంతో మత్తెక్కినట్టనిపిస్తుంది. ఈ రచన మన దృక్పథంలో తీసుకువచ్చే మార్పు ఒక వైపు కలతపరిచేదిగానూ, మరొకవైపు ఉద్రేకించేదిగానూ కూడా ఉంటుంది. ఎందుకంటే, ఇంతదాకా పరీక్షకు నిలవకుండా కొనసాగుతున్న నీరసతథ్యాల్ని మోసుకొస్తున్న భావచట్రాల్ని( frameworks) ఈ రచన సవాలు చేస్తున్నది, మరొకవైపు ఆ చట్రాలకు ఆధారమైన ప్రాతీపదికల్నీ, వాటి తర్కాల్నీ, వాటి మధ్య ఉండే పారస్పరిక సంబంధాల్నీ(mutual relations) కూడా ప్రశ్నిస్తున్నది.

భాష గురించీ, ఆలోచన గురించీ అన్వేషించడం ప్రమాదంతో కూడుకుని ఉన్న పని. ఎందుకంటే, మనం ఆ క్రమంలో, భాష అంటేనూ, ఆలోచన అంటేనూ, పాశ్చాత్య సంస్కృతి దేన్ని భాషగా, ఆలోచనగా అర్థం చేసుకుంటున్నదో, అదే భాష, ఆలోచన అనే భ్రమకు లోనవుతాము కనుక. పాశ్చాత్య చింతన మూలాల్ని అన్వేషిస్తూ, మౌలికంగా చింతన మూలాల్నే అన్వేషిస్తున్నామని పియాగెట్ లానే మనం కూడా భావించే ప్రమాదముంది.

కాని ఋగ్వేదం ప్లేటో కన్నా ఎంతో ప్రాచీనమైనదే కాకుండా, చింతనకి ప్లేటో దేన్ని మూలధారంగా ప్రతిపాదించాడో, ఆ ప్రతిపాదనలకి అత్యంత ప్రాచీన ఆధారం కూడా. కానీ అది మూలాధారమనే విషయం విస్మృతిలో పడిపోయింది. ప్లేటోనుంచి పాశ్చాత్యచింతన వారసత్వంగా గ్రహించిన రేఖీయచింతన (linearity) కన్నా, డి నికొలస్ చెప్తున్న ఋగ్వేదీయ బహుళపార్శ్వ చింతన(multi dimensionality) పూర్తిగా బిన్నమైనది.

వైవిధ్యం (variety), పారస్పరికత (interrelation), విడివిడిగా మనగలుగుతున్న(mutual exclusivity) తార్కిక ఆలోచనావ్యవస్థలకు సంబంధించిన అత్యంత క్లిష్టమైన సమకాలీన తాత్త్వికప్రశ్నల్ని పరిశోధిస్తున్న తీరువల్ల ఈ ఉత్తేజశీలమైన రచన పాశ్చాత్య తత్త్వవేత్తలకు ఆవశ్యకమవుతున్నది. సైన్సు చరిత్రను అధ్యయనం చేసే వాళ్ళనీ, భాష గురించి పరిశోధిస్తున్న మానవశాస్త్రవేత్తల్నీ, మతాల్నీ, పురాణగాథల్నీ అధ్యయనం చేస్తున్న విద్యార్థుల్నీ ఈ ప్రశ్నలు వేధిస్తుండటమే కాక, పాశ్చాత్యచింతనలోని పరిమితులు అటువంటి అధ్యయనాలకు అడ్డుపడుతున్నవి కూడా. పాశ్చాత్య ప్రపంచంలో, సైంటిఫిక్ పరిశోధన మొదణ్ణుంచీ ఒకే గాటన కొనసాగుతూండటమే కాక (essentially linear), చాలాసార్లు సైన్సుకి సంబంధించిన చారిత్రిక సంప్రదాయం సందర్భంతో నిమిత్తం లేకుండా (non contextual historical tradition) ఊహాగానాలు చేస్తూంటుంది.

అటువంటి సంప్రదాయం నుంచి మనం అంతకన్నా సమూలంగా విరుద్ధమైన మరొక సంస్కృతిలోకి (radically different culture) దూకినప్పుడు, ఉదాహరణకి, ఋగ్వేదాన్నే తీసుకోండి, అందులో కనవచ్చే ఆలోచనాధోరణులకీ, మనకీ మధ్య ఉన్న అగాధం ఎంత పెద్దదంటే, దాన్ని అర్థం చేసుకోవడానికి పాశ్చాత్య హేతుశీలత్వానికున్న సాధనసంపత్తి ఎంతమాత్రం చాలదనిపిస్తుంది. ఆ రచనలో అంతర్భాగంగా దానికే సంబంధించిన హేతుసూత్రాల్ని, ‘దాని context లో ఒదిగి ఉన్న text’ అర్థం చేసుకోవడానికి ధ్యానంతో ప్రయత్నించవలసి ఉంటుంది. ఇటువంటి పద్ధతి, డి నికొలస్ చెప్తున్నట్లుగా, అంతిమంగా, non-linear లేదా contextual గా పరిణమిస్తుంది.

క్వాంటమ్ మెకానిక్స్ ఈ విధంగానే రూపొందిందని అతడు మనకు గుర్తుచేస్తున్నాడు. అక్కడ, కొలమానానికి సంబంధించిన వివిధ ప్రాథమికవ్యవస్థలు (complementary frameworks) ఒకదానికొకటి సంబంధం లేనివి (కాబట్టి non-linear) ఒక అల్లికలాగా ఒకదానికొకటి పొదుగుతూ క్వాంటం మెకానిక్స్ రూపొందిందని మనకు తెలుసు.కాబట్టి ఆ వ్యవస్థలని పూరకవ్యవస్థలంటున్నాం.

ఏదైన ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకునే ఒక జ్ఞాతలో అంతర్గతంగా ఉండే ఆత్మాశ్రయత్వం( embodied subjectivity of a knower) లో మార్పులు వచ్చినప్పుడల్లా, అతడు తెలుసుకోదలచుకున్న వస్తుగత సత్యాల్లోనూ, దృశ్యదిగంతాల్లోనూ కూడా తప్పని మార్పుల్ని బట్టే ఆ పూరకవ్యవస్థలు రూపొందుతాయి.

వేదగానంలోనూ, వేదక్రతువుల్లోనూ కనవచ్చే ఆత్మాశ్రయత (subjectivity embodied in chant and ritual) ప్రపంచంలో కనవచ్చే బహుముఖీనతనీ, వివిధత్వాన్నీ వెల్లడి చేస్తుంది. అయితే, ఒక రేఖీయ క్రమంలోనో, లేదా ఒకదానికొకటి కూడితే వచ్చే వివిధత్వం ద్వారానో కాదు, ఒక ‘పూర్ణాహుతి’ (sacrifice) ద్వారా మాత్రమే సాధ్యమవుతుందది.

అక్కడ ప్రతి ఒక్కరూ తమ తమ ఆత్మాశ్రయిత్వంలో కుదురుకున్న ఉమ్మడిభూమికకీ, తామంతా కలిసి పంచుకుంటున్న ‘దర్శనాని’ కీ సాపేక్షంగా అనుసంధానమై (relativized) ఉంటారు. అట్లాంటి ఉమ్మడి భూమిక కేవలం ఒకరికొకరిని కూడుకుంటూ పోతే కలిగేది కాదు.

భాష్యపూర్వకమైన, వ్యాఖ్యానరూపకమైన ఈ రచనను చదివి తీరాలని సిపార్సు చేస్తున్నాను. వైట్ హెడ్ ని నమ్ముతూ, తత్త్వశాస్త్రమంతా ఫ్లేటో కి ఫుట్ నోట్ మాత్రమేనని భావించేవాళ్ళు మరీ తప్పకుండా చదవాలి. ఎందుకంటే, ఆ మాట బహుశా పాశ్చాత్యతత్త్వశాస్త్రం విషయంలో నిజంకావచ్చునేమోగాని, మొత్తం తత్త్వశాస్త్రానికి మాత్రం కానేకాదు.

ప్లేటో వెనక, ప్లేటో కి నేపథ్యాన్ని సమకూరుస్తూ ఋగ్వేదమున్నది. బహుశా డి నికొలస్ చెప్పే మాటలు నిజమే అనుకుంటే, అనేక పార్శ్వాలకు- లేదా నాలుగు పార్శ్వాలకు -సంబంధించిన దర్శనాన్ని ప్రతిపాదిస్తున్న ఋగ్వేదానికే ప్లేటో, పాశ్చాత్యతత్త్వశాస్త్రమూ కూడా ఫుట్ నోట్స్ గా కొనసాగుతున్నారని చెప్పవలసిఉంటుంది.’

6-11-2016

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading