ఊర్ణనాభి

148

నాకు తెలిసి విశ్వనాథ సత్యనారాయణ ఇంగ్లీషులోంచి తెలుగులోకి చేసిన అనువాదాలు రెండు.

ఒకటి, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ రచన Kalki or the Future of Civilization ని నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం ‘కల్కి లేదా నాగరిక భవిష్యత్తు’ పేరిట చేసిన అనువాదం. ఆ అనువాదాన్ని నా చిన్నప్పుడు తాడికొండ స్కూలు లైబ్రరీలో చదివాను. మళ్ళా ఎక్కడా దొరకలేదు.

రెండవది, స్వామి వివేకానంద రాసిన The Song of Sannyasin కి ‘యతిగీతము’ పేరిట చేసిన అనువాదం. ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్న ఈ అనువాదాన్ని జె.వెంకటేశ్వరరావుగారు ఆదివారం నా చేతులకందించారు.

The Song of Sannyasin పదమూడు పద్యాల సమాహారం. 1895 లో వివేకానందులు అమెరికాలో ఉంటూండగా తన శిష్యులకోరికమేరకు రాసిన గీతమాలిక. ఆ తర్వాత యాభయ్యేళ్ళకు విశ్వనాథ దాన్ని తెలుగు చేసారు. ఆ సందర్భమే చాలా గమ్మత్తైంది.

జువ్వాడి గౌతమరావుగారి మాటల్లో చెప్పాలంటే:

‘ఒకసారి మదరాసు రేడియో స్టేషనులో రామకృష్ణ మిషన్ కి చెందిన శ్రీ నిర్వికల్పానందస్వామి శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారికి తారసపడిరట. నిర్వికల్పానందులు పూర్వాశ్రమంలో విశ్వనాథ వారి విద్యార్థి యని చెప్పుదురు. కుశలప్రశ్నానంతరము మాటలో మాటగా స్వామి వివేకానంద వారి The Song of Sannyasin అను రచనను మీరు తెలుగు చేసినచో బాగుగానుండునని సూచించిరట. అది మీవద్ద నున్నదా యని విశ్వనాథ వారడుగుటయు, సమయానికది స్వామివారివద్దనుండుటయు, వారిద్దరు రేడియో స్టేషను ఆవరణలో నొక చెట్టుక్రింద కూర్చుండి విశ్వనాథ వారు తెలుగుపద్యములు చెప్పుటయు, నిర్వికల్పానందస్వామివారు వ్రాసికొనుటయు జరిగినది. అదే యతిగీతం’

చెట్టుకింద ఆశువుగా చేసిన ఈ అనుసృజన మూలానికే వన్నెదిద్దేదిగా ఉంది. వివేకానందుల ఇంగ్లీషుని విశ్వనాథ వైదిక, ఔపనిషదిక సంస్కృతంలోకి తర్జుమా చేసుకుని, తిరిగి దాన్ని తెలుగు చేసారన్నంత గంభీరంగా, హృదయంగమంగా ఉంది.

ఒక ఉదాహరణ.

ఏడవ పద్యం ఇంగ్లీషులో ఇలా ఉంది:

Where seekest thou? That freedom, friend, this world
Nor that can give. In books and temples vain
Thy search. Thine only is the hand that holds
The rope that drags thee on; then cease lament;
Let go thy hold, Sannayasin bold, Say- “Om tat sat Om”.

దీన్ని యథాతథంగా అనువదిస్తే ఇలా ఉంటుంది:

‘ధీరవంతుడవైన సన్న్యాసి, ఎక్కడని వెతుకుతావు? ఆ స్వాతంత్ర్యం ఈ లోకమూ ఇవ్వగలిగేదికాదు, పరలోకమూ కాదు. గ్రంథాల్లోనూ, దేవాలయాల్లోనూ నీ అన్వేషణ నిష్ఫలం. నిన్నీడ్చుకుపోతున్న రజ్జువుని పట్టుకున్నది నీ హస్తమే. కాబట్టి విలపించడం మాను, ఆ పట్టు వదిలిపెట్టు, ఓం తత్ సత్ అని ఎలుగెత్తి ఆలపించు.’

దీన్ని విశ్వనాథ ఇలా అనువదించారు.

ఓ యూర్ణనాభవదుద్గతాత్మద్రవ
రజ్జుసంతాన ధారానిబద్ధ!
ఓయి! స్వేచ్ఛా కాముకా! యెచ్చటెచ్చోట
వెదకెదవోయి నీ స్వేచ్ఛకొరకు
ఇహలోకమందైన నెండమావులువోని
సుఖవాంఛలెంతయు సుడియజేయు
బరలోకమందైన బరిభుక్తమగు స్వల్ప
పుణ్యాంతవేళ నిన్ భూమిద్రోయు

నెచటనోయి స్వేచ్ఛాభావ మెచటనీకు
నీవ నిర్మించుకోందువు నిన్ను గట్టు
ద్రాళ్ళ వానిని కర్మసూత్రముల ద్రెంపు
ధీరదండి! ఓం తత్సధీనవదన!

అనువాదం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి, మూలాన్ని యథాతథంగా అనువదించడం. రెండవది, మూలంలో లేనిదాన్ని అనువదించడం. మూడవది, మూలానికి విధేయంగా ఉంటూనే మరింత మెరుగుపెట్టడం. కవిత్రయం, పోతన భారతభాగవతాలను అనువదిస్తున్నప్పుడు అనుసరించింది మూడవపద్ధతినే. అక్కడ వారి అనువాదం కేవలం యాంత్రికంగా తాత్పర్యాన్నివ్వడం కాక, ఆ మూలానికొక interpretation ని కూడా సమకూరుస్తుంది. అందుకనే అటువంటి అనువాదాల్ని అనుసృజన అంటాం.

వివేకానందుల పద్యాన్ని విశ్వనాథ అనుసృజించిన తీరు ఆసక్తిదాయకంగా ఉంది. వివేకానంద సన్న్యాసిని ఉద్దేశించి చెప్తున్న మాట ‘నిన్నీడ్చుకుపోతున్న రజ్జువు నీ చేతుల్లోనే ఉంది’ అన్నది విశ్వనాథలో చాలా సంచలనం కలిగించి ఉందని అనువాదం సాక్ష్యమిస్తోంది. వివేకానందులు మాట్లాడిన రజ్జువు కర్మబంధం. మనిషి తన కర్మకు తానే బాధ్యుడు. దాన్ని వదిలిపెడితే తప్ప అతడు వెతుక్కుంటున్నది అతడి చేతికి చిక్కదు. నిజానికి, కర్మబంధం వదిలిపెట్టాక, అన్వేషిస్తున్నది చేతికి చిక్కుతుందని కూడా కవి అనడం లేదు. వేదాంతం దృష్టిలో వదిలిపెట్టడమే పొందడం. కానీ వదలడానికి ధైర్యం కావాలి. కేవలం ధీరసన్న్యాసి మాత్రమే వదులుకోగలడు.

విశ్వనాథ ఈ అర్థాన్ని మరింత వివరంగా ‘నీవ నిర్మించుకొందువు నిన్ను కట్టు త్రాళ్ళ వానిని కర్మసూత్రములన్ తెంపు’ అన్నాడు. ‘నీవ’ అనే మాట గమనించదగ్గది. నీవ అంటే ‘నువ్వు మాత్రమే’ అని.

కాని కట్టుత్రాళ్ళు అనే మాట ఆయనకు సాలీడుని గుర్తుతెచ్చింది. సాలీడు కూడా అట్లానే తనలోంచి ప్రసవించే ద్రవంతో నిర్మించుకున్న పోగులో తాను బందీగా ఉండిపోతుంది. తన తంతువులతొ తానొక గూడు కట్టుకుని దాన్నే తన లోకంగా భావించుకుంటూ బతుకుతుంటుంది. అయితే, సాలీడుకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. అది తలుచుకుంటే తన తాళ్ళని వెనక్కిలాక్కోగలదు. దాన్నుంచి బయటపడగలదు.

వేల ఏళ్ళ కిందట, ఒక ఋషి అట్లాంటి ఒక సాలీడుని చూసాడు. ఆయన ఒక ఉపనిషత్తుని ప్రవచించాడు. అందులో (ముండక ఉపనిషత్తు, 1:7) ఒకచోట ఇలా అన్నాడు:

యథోర్ణనాభి: సృజతే, ఘృహ్ణతే చ యథా పృథివ్యామోషధయ: సంభవన్తి
యథా: సత పురుషాత్కేశలోమాని తథాక్షరాసంభవతీహ విశ్వమ్.

ఊర్ణనాభి అంటే సాలీడు. ఊర్ణనాభి ఊర్ణ, నాభి అనే పదాల రెండు కలయిక. ఊర్ణ అనే పదం వృ అనే ధాతువునుంచి పుట్టింది. ‘వ’ అంటే కప్పివేసేది అని అర్థం. ఇక్కడ ఉన్ని లేదా రోమరాశి అని అర్థం. ఊర్ణనాభి అంటే రోమరాశితో కప్పివేయబడ్డ బొడ్డు కలది అని. వ్యావహారికార్థంలో సాలీడు అని అర్థం. ఏ విధంగా అయితే సాలీడు తనలోంచి దారాల్ని పుట్టిస్తుందో, వెనకిలాక్కుంటుందో, ఏ విధంగా భూమినుంచి ఓషధులు ప్రభవిస్తున్నాయో, ఏ విధంగానైతే మనిషినుంచి కేశరోమాలు పుట్టుకొస్తున్నాయో, అలాగే అక్షరుడినుంచి ఈ విశ్వం జనిస్తున్నదని ఉపనిషత్తు చెప్తున్నది.

సాధారణంగా ఈ ఉపనిషత్తుని వ్యాఖ్యానించేవాళ్ళు, ఊర్ణనాభి అంటే సాలీడు అని మాత్రమే చెప్తారు. కాని ‘ఊర్ణనాభి’ అనే పదానికి ఋగ్వేద మూలాలు ఉన్నాయి. ఋగ్వేదం యజ్ఞవేదికని చాలసార్లు సాలీడు గూటితో పోలుస్తుంది. యజ్ఞవేదికలోని అగ్ని యజ్ఞతంతువు. యజ్ఞం రెండు విరుద్ధ ప్రకృతుల మధ్య మనిషి నిరంతరం సాగించే తపస్సు. ఒకటి వృత్ర ప్రకృతి. వృత్రుడనే పదం కూడా ‘వ’ అనే ధాతువునుంచే వచ్చింది. ‘కప్పిపుచ్చేవాడు’ అని దానికి అర్థం. వృత్రస్వభావం ఎంతసేపూ తనలో తాను ముడుచుకుపోవడానికే మొగ్గుచూపుతుంది. మరొకటి ఇంద్ర ప్రకృతి. అది తనలోని ఆత్మశక్తిని బయటకు ప్రసరింపచేయడానికి ఇష్టపడతుంది. తనలోని ఆత్మశక్తి కొంతదూరం ప్రసరించాక, మళ్ళా వృత్ర ప్రకృతి అక్కడే ఆగిపోవాలనుకుంటుంది, సాలీడు తన గూటిలో బందీగా ఉండిపోయినట్టు. అప్పుడు మళ్ళా ఇంద్ర ప్రకృతి చెయ్యవలసింది, ఆ inert web ని వదిలిపెట్టడం. ఇట్లా మనిషి ఒక మారు వృత్రుడిగా,  మరొకమారు ఇంద్రుడిగా, మళ్ళా వృత్రుడిగా, మళ్ళా ఇంద్రుడిగా సృష్టి, సంహారాలు చేస్తూ ఉంటాడు.

ఈ వైదిక, ఔపనిషదిక భావజాలమంతా వివేకానందుల కవితలో ప్రస్ఫుటంగా లేదు. ఆయన కేవలం the rope అనే మాట మాత్రమే వాడాడు. కాని విశ్వనాథ తన పద్యం మొదలుపెట్టడమే ‘ఓ యూర్ణనాభవదుద్గతాత్మద్రవ రజ్జుసంతాన ధారా నిబద్ధ’ అంటూ మొదలుపెట్టాడు. ‘సాలీడులోపలనించు స్రవించిన ద్రవంతో నిర్మించబడ్డ పోగులకు కట్టుబడ్డవాడా’ అని దానర్థం. ఇది మూలంలో లేని వాక్యం. కాని మూలకవి మనసులో ఉన్న వాక్యం. ఈ వాక్యాన్ని ఇట్లా తేటతెల్లం చేయకపోతే, ‘నీవ నిర్మించుకుందువు నిన్నుకట్టు త్రాళ్ళ’ అనే చివరివాక్యం అర్థం కాదు.

పూర్వమహాకవుల వారసుడిగా విశ్వనాథ తెలుగు పద్యం రచించాడని మనకు తెలుసు. అనువాదంలో కూడా ఆయన పూర్వమహాకవుల వారసుడిగా ప్రవర్తించాడనడానికి ఈ పద్యమొక్కటి చాలు.

25-10-2016

arrow

Photo: Jayati Lohitakshan

Leave a Reply

%d bloggers like this: