ఆ వెలుగునీడలు తెలియాలి

146

‘మీరు పుంఖానుపుంఖంగా కథలూ, నవలలూ రాయాలని మేం కోరుకుంటున్నాం’ అన్నాడు ఆదిత్య.

ఆ మాటలు వినగానే దాదాపు చాలా ఏళ్ళ కింద భమిడిపాటి జగన్నాథ రావు గారు నాతో అన్న మాటలు గుర్తొచ్చాయి.

‘యు షుడ్ ప్రొడ్యూస్ లైక్ ఎ మిల్’ అన్నారాయన.

1981 లో ఒక సాయంకాలం కాకినాడలో.

నేను రాసిన ‘ట్రాఫిక్’ కథని ఆయన ‘జ్యోతి’ యాజమాన్యానికి చెప్పి బయటికి తీయించి ప్రచురింపచేసిన సందర్భంలో.

మూడు దశాబ్దాలు పైనే గడిచాయి ఆయన అట్లా చెప్పి. ఇన్నేళ్ళల్లో పాతిక కథలు కూడా రాయలేకపోయాను.

‘మీరు కథలు కూడా రాస్తారా!’ అని ఆశ్చర్యపోయారు గోవిందరాజు సీతాదేవి ‘రాముడు కట్టిన వంతెన’ కథ చదివి.

ఎందుకు రాయలేకపోయాను ఒక మిల్లులాగా?

నాకు కన్ ఫ్యూసియస్ మాటలు గుర్తొస్తున్నాయి.

ఆయనన్నాడు: ‘శ్రేష్ఠ మానవుడు తనని తాను మెప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, అల్పమానవుడు ఇతరులని మెప్పించడానికి ప్రయత్నిస్తాడు’ అని.

నేను రచనలు చేయడం మొదలుపెట్టడంలో నన్ను నిలవనివ్వని ఆర్తితో పాటు ఎదటివాళ్ళని మెప్పించాలనే ఆకాంక్ష కూడా బలంగా పనిచేసిందని ఒప్పుకోవాలి.

చిన్నప్పుడు తరగతి గదిలో ఉపాధ్యాయుల్ని, యువకుడిగా ఉన్నప్పుడు యువతుల్ని, ఉద్యోగంలో చేరాక, పై అధికారుల్ని, ప్రజల్ని, మాట్లాడవలసి వచ్చినప్పుడు పండితుల్ని, జీవితం పొడుగునా ఎవరో ఒకరిని మెప్పించడం కోసమే చాలా పనులు చేసానని ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది.

కాని ఎక్కడో ఏ మలుపులోనో, నన్ను నేను మెప్పించుకోవలసిన అవసరం నాకు గ్రహింపుకి వచ్చిందనుకుంటాను.

ఆ గ్రహింపు వచ్చినప్పుడల్లా ఒక పొర వదిలిపోయినట్టే ఉంటుంది. నేను డిగ్రీ చదువుతుండగానే, నన్ను నేను మెప్పించుకోవడానికి ఆ చదువు పనికి రాదని గ్రహించేను, వెంటనే చదువు మానేసాను.

అట్లానే, నా కథారచన కూడా అనుకుంటాను.

ఇతరులని మెప్పించే కథలు రాయడం చాలా సులభం. కాని నన్ను నేను మెప్పించుకునేలా కథలు రాయడం చాలా కష్టమని నాకు నెమ్మది మీద బోధపడింది.

అరేడేళ్ళ కిందట, మ- గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడొక మహిళ ప్రసవసమయంలో చనిపోయిన విషయం తెలిసింది. అప్పుడు నాతో పాటు ఒక మిత్రుడు,మెడికల్ ఆఫీసరు కూడా ఉన్నాడు. మేము ఆ ఇంటికి వెళ్ళి ఒక verbal autopsy చేసాం. దాన్ని ప్రభుత్వ పరిభాషలో death audit అంటారు. ఆమె మరణానికి కారణం ఏమిటి అనే విచారణ. ఆ పరిశీలన నన్ను నిలువెల్లా విభ్రాంత పరిచింది. అది కథగా చెప్పాలి. కాని ఆ కథ ఆ గ్రామంలోనే జరిగింది కాదు, అక్కడ ముగిసేదీ కాదు. ఆ నిర్భాగ్యస్త్రీ మరణం వెనక, అక్కడ పి.ఎచ్.సి లో పనిచేస్తున్న (పనిచేయని) మెడికల్ ఆఫీసరు ఉంది.ఆమె హైదరాబాదులో ఉంటుంది. నెలకొకసారి కూడా మ- గ్రామానికి వెళ్ళేదికాదు. ఆమె హైదరాబాదులో ఉండి ప్రజా ఉద్యమాల నిర్మాణానికి సహకరిస్తూ ఉంటుంది. కాని ఆమె ఏ ప్రజల కోసం పనిచెయ్యాలనుకుంటుందో, ఆ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కనపెట్టి, విధులు నిర్లక్ష్యం చేసి, మరొకవైపు ప్రజలకోసం మాట్లాడుతూంటుంది.

ఇదంతా ఒట్టి కథ కాదు, సమకాలీన జీవనపురాణం. ఈ మైథాలజీని నన్ను మెప్పించుకునేటంతగాఎలా రాయాలో నాకు తెలియడం లేదు. అందుకే ఇన్నాళ్ళు వేచి ఉన్నాను, బహుశా ఇంకెంతకాలం వేచి ఉండాలో తెలియదు.

నాకు తెలిసిన ఒక కొత్త జంట. కొన్నేళ్ళ కిందట, ఆ జంటలో నవవధువు పెళ్ళై మూడునాలుగేళ్ళు కూడా తిరక్కుండానే ఆత్మహత్య చేసుకుంది. ఆమె పేరు ‘ప్రేమ’ అనుకుందాం. ఆమెది ఆత్మహత్యనే. కాని అది హత్య కూడా. ఆమెని హత్యచేసింది సమాజం, సినిమాలు, టెలివిజన్ సీరియల్సు. అదంతా వివరించాలంటే ఒక రూపకంగా రాయవలసి ఉంటుంది. ‘ప్రేమని ఎవరు చంపారు?’ అనే ఒక రూపకం రాయాలి. కాని ఆ రూపకాన్ని ఎట్లా రాస్తే నేను సంతృప్తిచెందుతానో నాకు తెలీకుండా ఉంది. కాబట్టి మరికొన్నాళ్ళో, కొన్నేళ్ళో ఆగవలసి ఉంటుంది.

కథ రాయాలంటే నాకు ఆ సన్నివేశం పూర్తి వివరాలు తెలియాలి. ఒకప్పుడు కొడవటిగంటి కూడా ఈ మాటన్నాడు. తాను కథ రాయాలంటే ఏ పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో తనకి ముందే స్పష్టంగా తెలిసి ఉండాలన్నాడు. నాకు కావలసింది ఆ స్పష్టత కాదు. బహుశా కథ మొదలయిన తర్వాత, పాత్రలు నా మాట వినకపోవచ్చు. నేనే ఒక ప్రేక్షకుడిలాగా ఆ పాత్రల గమనాన్ని నిశ్చేష్టుణ్ణై చూస్తూండవచ్చు. కాని నాకు తెలియవలసింది, ఆ స్థలం, ఆ కాలం, ఆ వెలుగునీడలు.

చెకోవ్ ‘వార్డ్ నంబరు.6’ అనే కథ రాసాడు. ఆయనకి మపాసా స్ఫూర్తి. మపాసా ‘బెడ్ నంబరు 29’ అనే కథ రాసాడు. అట్లాంటి కథ రాయగలనా అనుకున్నాడు చెకోవ్. కాని అంతకన్నా అద్భుతంగా రాసాడు.

ఆ రెండు కథలు ఇచ్చిన స్ఫూర్తితో నేనూ ఒక కథ రాయాలని పదేళ్ళుగా ఆలోచిస్తూనే ఉన్నాను. ఒక పోలీసు ఆఫీసరు కథ. కాని నాకు చాలా వివరాలు కావాలి. ఎవరైనా పోలీసు అధికారిని అడిగితే తెలిసేవే. కాని, అవి చాలవు. ఏ వివరాలు తెలిస్తే ఆ కథ మొదలవుతుందో నాకు తెలియదు.

నన్ను నేను మెప్పించుకోవడం చాలా కష్టమని తెలిసేది ఇట్లాంటప్పుడే.

28-10-2016

arrow

Painting: Lithograph by Tonny Kristians

 

Leave a Reply

%d bloggers like this: