ఆరాధించదగిన ప్రేమ యేది?

126

గౌరునాయుడూ, ఈ పూట మీరూ, మన మిత్రులంతా గురజాడ అప్పారావుగారిని తలుచుకోడానికి పార్వతీపురంలో కలుసుకుంటున్నారు. నన్ను కూడా పిలిచారు, ఎంతో ప్రేమతో. కాని రాలేకపోయాను, ‘అయినా చదివి వినిపించుకుంటాం, నాలుగు మాటలు రాసి పంపండి’ అన్నారు. నా హృదయం అక్కడే ఉందనుకునే ఈ నాలుగు మాటలూ రాస్తున్నాను, లేదు, మీ మధ్య కూచుని మీతో చెప్పుకుంటున్నాను.

గురజాడ అప్పారావుగారు ఈ లోకాన్ని వదిలిపెట్టి సరిగ్గా ఒక శతాబ్దకాలం గడిచింది. ఆయన మహారచయిత, మహాకవి, మహానుభావుడు అని మనం నూరేళ్ళ తరువాత కొత్తగా చెప్పుకోవడంలో ఏ విశేషమూ లేదు. ఆ సంగతి ఆయన సమకాలీనులు అప్పటికే గ్రహించిన విషయం. గురజాడ మరణవార్త చెవినపడగానే, 1915 డిసెంబరు 5 న రామదాసుకు ఉత్తరం రాస్తూ గిడుగు రామ్మూర్తి ఇట్లా రాసారు:

‘ఎంత విషాదకరం! అతను గతించినాడు! ప్రియమైన ఆత్మ! నీవలెనే, నాకూ దు:ఖం పొంగుకువస్తున్నది. నీ విచారములో సంగోరు భాగమును పంచుకుంటున్నాను. నా అత్యంత ప్రియమిత్రుడు పరమపదించినాడు!’

ఆయన ఇంకా ఇలా రాసాడు:

‘ అతని మరణంతో వొక గొప్ప వ్యక్తిని, వొక పరోపకారపారాయణుని, మహాపండితుని మన దేశం పోగొట్టుకున్నది.. తెలుగు ప్రజల స్మృతిపథంలో అప్పారావు సదా జీవిస్తాడు. చనిపొయినప్పటికీ అతను జీవిస్తున్నాడు. అతన్ని తలచుకోవడమంటే మన జీవితంలోని ఆనందమయ సంఘటనలను మన స్మరణకు తెచ్చుకోవడమే.’

నూరేళ్ళ తరువాత కూడా అప్పారావుగారి గురించి తలుచుకోడానికీ, చెప్పడానికీ ఇంతకన్నా యోగ్యమైన, ఇంతకన్నా ప్రశస్తమైన వాక్యాలు నాకు తోచడం లేదు.

ఒకప్పుడు శ్రీ శ్రీ కన్యాశుల్కం గురించి రాయడానికి పూనుకుంటూ మళ్ళా కొత్తగా ఏం చెప్పగలననుకున్నానుగాని, కన్యాశుల్కాన్ని తలుచుకునేటప్పటికి ఎన్నో కొత్త విషయాలు వరదలాగా మనసులో ఉప్పొంగుతున్నాయని రాసాడు. ఆ మాట అప్పారావు గారికి కూడా వర్తిస్తుంది. ఎప్పటి కాలానికి అప్పటి అవసరాలకు, సామాజిక సామస్యలకు తగ్గట్టుగా ఆయన దారిదీపంలాగా దారిచూపిస్తూనే ఉంటాడు.

ఇప్పటికి సరిగ్గా ముప్పై ఏళ్ళ కిందట, రామసూరి విజయనగరంలో గురజాడ మీద నాతో మాటాడించేడు. ఆరోజు ఆ వేదిక మీద కాళీపట్నం రామారావుగారితో కలిసి కూచునే భాగ్యం లభించింది. ఆ రోజే మొదటిసారి డా. ఉపాధ్యాయుల అప్పలనరసింహమూర్తిగారి పరిచయం లభించింది. ఈ ముఫ్ఫై ఏళ్ళల్లోనూ మళ్ళీమళ్ళీ చదివినప్పుడల్లా గురజాడ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూనే ఉన్నాడు. ఆ కవిత్వం, ఆ నాటకం మనకి మొత్తం కంఠోపాఠం అనుకున్నా కూడా, హఠాత్తుగా ఒక్కొక్క వాక్యం మనమింతదాకా చూడనేలేదే అన్నట్టుగా కొత్త అర్థంతో మనముందు ఆవిష్కృతమవుతూ మనల్ని నిశ్చేష్టుల్ని చేస్తూ ఉంటుంది.

కన్యాశుల్కం సంగతే చూడండి. ఆ నాటకాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నానుకున్నాక, అదిగో, అప్పుడు, కిందటేడాది, రవీంద్రభారతిలో, ఎనిమిది గంటల పాటు పూర్తి నిడివి నాటకం చూసాను. ఆ నాటకమంతా దృశ్యంగా చూసాక, చూస్తూ ప్రతి ఒక్క సంభాషణా మళ్ళా మనసులో చదువుకుంటూ పోయేక, ఆ నాటకాన్నిప్పటిదాకా నిజంగా అర్థం చేసుకున్నానా అనిపించింది. అందులో చర్చించబడ్డ, కన్యాశుల్కం, వితంతు పునర్వివాహం, వేశ్యాసమస్య వంటి సామాజిక అనాచారాలు చారిత్రిక విషయాలైపోయాయనీ, అయినా ఆ నాటకం తన సజీవ భాష వల్లా, సజీవ పాత్రలవల్లా బతుకుతోందనీ, ఇదే కదా, మనమంతా పదే పదే చెప్పుకుంటూ ఉన్నది. కానీ, నిజమేనా? ఆ నాటకవస్తువుకి సామకాలిక ప్రాసంగికత లేదా?

నాటకంలో చివరి అంకంలో సౌజన్యారావు పంతులు ఇంట్లో సౌజన్యారావుకీ, గిరీశానికీ మధ్య జరిగిన సంభాషణ అంతా దేని గురించి?

ఈ మాటలు చూడండి:

“సౌజ: నిజమైన సాక్ష్యం! యేం సత్యకాలం! నిజవాడే వాడు సాక్ష్యానికి రాడు, సాక్ష్యానికొచ్చినవాడు నిజవాళ్ళేడు.
…..

గిరీ: అయితే యెందుకండీ ఈ కోర్ట్లు?

సౌ: నేను అదే చాలా కాలవాయి ఆలోచిస్తూ వుంటిని, పెద్ద పెద్ద వకీళ్ళు కూడా సిగ్గుమాలి బరిపెట్టి దొంగసాక్ష్యాలు చెబుతారు. కొందరు తిరగేసి కొట్టమంటారు. నా వంటి చాదస్తులం ఇంకొక కొందరం అట్టి పాపానికి వొడిగట్టుకోం గాని, మా పార్టీల తరపు సాక్షులు కూడా అబద్దం చెబుతున్నారని ఎరిగిన్నీ వూరుకుంటాం. ఈ లాంటి అసత్యానికి అంగీకరించవలసి వస్తుందనే నేను ప్రాక్టీసు చాలా తగ్గించుకున్నాను. క్రమంగా ఈవృత్తే మానుకోవడపు సంకల్పం కూడా వుంది.”

ఈ సన్నివేశం మొదటి కన్యాశుల్కంలో ఇంత విస్తృతంగా లేదు. ఈ చర్చ కూడా లేదు. ఈ చర్చ గురజాడ ఎందుకు లేవనెత్తాడు?

సాంప్రదాయిక భారతీయ సమాజంలో వృత్తి కులవృత్తి. ఆధునిక విద్య ప్రవేశించిన తరువాత, కులవృత్తులు నశించి, కొత్త సమాజం ఏర్పడుతుందనే గురజాడ కూడా మొదట్లో భావించిఉంటాడు. ఆ రోజుల్లో ఆధునిక విద్య అంటే ఇంగ్లీషు విద్య. దాని పట్ల మొగ్గు చూపే వాళ్ళని ఆంగ్లిసిస్టులనేవారు. అట్లా కాక భారతీయ సాంప్రదాయిక విద్యని నిలబెట్టాలనేవాళ్ళని ఓరియెంటలిస్టులనీ అనేవాళ్ళు. పందొమ్మిదో శతాబ్ది చివరిలోనూ, ఇరవయ్యవ శతాబ్ది మొదట్లోనూ, ఈ ఆంగ్లిసిస్టు-ఓరియెంటలిస్టు చర్చలతో విద్యావ్యవస్థ ఉడికిపోతూ ఉండేది.

కాని ఈ రెండు పక్షాల్లోనూ గురజాడ ఏ పక్షాన్నీ విశ్వసించలేకపోయాడు. సాంప్రదాయిక విద్యలో పుట్టి పెరిగిన హిందూ సమాజం ఎంత భ్రష్టంగా ఉన్నదో కన్యాశుల్కంలో అడుగడుగునా చూపిస్తూనే వచ్చాడు. కాని ఆధునిక విద్య కూడా అపురూపమైన మానవుల్ని నిర్మించగలదని కూడా ఆయన నమ్మలేకపోయాడు. ఆయన ఉత్తరాల్లోనూ, డైరీల్లోనూ ఎన్నో చోట్ల ఆంగ్లవిద్య మీద తన అసంతృప్తిని ఆయన స్పష్టంగా ప్రకటిస్తోనే వచ్చాడు.

జాతీయత పేరు మీద మాట్లాడినా, విదేశీయవిద్య గురించి మాట్లాడినా, తన కాలం నాటి సమాజం దృష్టి నిజంగా విద్య మీద లేనే లేదని గురజాడకి తెలుసు. అందుకనే, మధురవాణి ‘విద్య వంటి వస్తువు లేదు, నిజమే-ఒక్కటి తప్ప, అదేమిటి? విత్తం-డబ్బు తేని విద్య దారిద్ర్య హేతువు’ (3వ అంకం, 2వ స్థలం) అంటుంది. ఈ వాక్యం స్పష్టంగా 2015 నాటి భారతదేశ మనస్థితికి అద్దంపట్టడం లేదూ!

కన్యాశుల్కంలోని అత్యంత విషాదాత్మకమైన ఘట్టాల్లో ఒకటి రెండవ అంకంలో రెండవస్థలంలో కరటక శాస్త్రి శిష్యుడు మాట్లాడిన మాటలు. ‘నాలుగంకెలు బేరీజు వెయ్యడం, వొడ్డీ వాశికట్టడం కాళిదాసు కేం తెలుసును? తెల్లవాడిదా మహిమ!.. ఈ చదువిక్కడితో చాలించి గిరీశం గారి దగ్గర నాలుగింగ్లీషు ముక్కలు నేర్చుకుంటాను’ అనుకుంటాడు.

కాని అట్లా తన కులవృత్తి వదిలి గిరీశం దగ్గర అతడు ఆధునిక విద్య నేర్చుకుంటే అతడి జీవితంలో మార్పు వస్తుందా? అతడు మరొక గిరీశం కాకుండా, సౌజన్యారావుపంతులే అయ్యాడనుకుందాం. అయితే ఏమిటి? సౌజన్యారావు పంతులు వంటివాడే తన వకీలు వృత్తి మానుకోవడం గురించి ఆలోచిస్తున్నాడే. గత ముప్పై ఏళ్ళుగా నేను కూడా అనుక్షణం నా ప్రభుత్వోద్యోగాన్ని వదులుకుందామని అనుకుంటూనే బతుకు తెరువుకు మరోదారిలేక బండి ఈడుస్తూ ఉన్నానే.

సరిగ్గా, ఇక్కడే, గురజాడ నిజమైన విద్య అంటే ఏమిటో తాను దర్శించి మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడనిపిస్తుంది. విద్యకీ, వృత్తికీ సంబంధం లేదనేది ఆయన చెప్పదలచుకున్న మొదటి మాట. అందుకని వృత్తులన్నిటిలోకీ హీనంగా భావించబడే వేశ్యావృత్తికి సంబంధించిన మనిషిని తన కథానాయికను చేసాడు. ఆమెకీ, న్యాయకోవిదుడికీ మధ్య చర్చ పెట్టాడు. నిజమైన విద్య దేశీయ సంస్కృతిలోనూ లేదు, విదేశీ సంస్కృతిలోను లేదు, అది నిజమైన మనిషి నడవడికలో ఉంటుందని తీర్మానించేడు.

మీరంతా గురువులు,నాకు తెలుసు, మీరంతా ముందు మంచి మనుషులుగా జీవించడంకోసమే యుద్ధం చేస్తూ ఉన్నారు. అందుకనే మీరు మంచి గురువులు కాగలిగారు. చూడండి. కన్యాశుల్కం, కన్యాశుల్కమనే దురాచారానికి సంబంధించిన రచన గా ఏనాడో మరణించింది. అది నిజమైన విద్యాన్వేషణా గ్రంథంగా నేడు మనముందు నిల్చున్నది.

మీరు ఈరోజు దేశంలో పెల్లుబుకుతున్న అసహనం గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యారు. ఈ అసహనం ‘చదువుకున్నవాళ్ళు’ పెంచి పోషిస్తున్న అసహనం. ఈదేశంలో యుయుగాలుగా, రైతులు, స్త్రీలూ, కాయకష్టం చేసుకునేవాళ్ళూ, చేతిపనివాళ్ళూ ఎట్లాంటి అసహనానికీ తావివ్వకుండానే బతుకుతూ వచ్చారు. వాళ్ళ విషయంలో మతములెప్పుడో మాసిపోయాయి. కాని ‘చదువుకున్నవాళ్ళు’ వాటిని బతికిస్తున్నారు. ఆ వంకనే అసహనాన్నీ పెంచిపోషిస్తున్నారు.

ఆ ‘చదువు’ వద్దన్నాడు గురజాడ. దాని స్థానంలో ‘ప్రేమ విద్య’ కావాలన్నాడు. అయితే అది ‘ఇంటను నేర్పే కళ’ కాదు, దానికి ‘ఒజ్జలెవ్వరూ లేరు’. శాస్త్రాలు కూడా ‘దాని గురించి మౌనం’ దాల్చాయి. అట్లాంటి పరిస్థితుల్లో దాన్ని తాను ‘భాగ్యవశమున కవుల కృపగొని’ నేర్చుకున్నానన్నాడు.

ఆ కవులెవరు? కబీర్, నానక్, రైదాసు వంటి కవులని నేనర్థం చేసుకుంటున్నాను.

ఈ విద్య గురించి గురజాడ చాలాచోట్లా చాలా చక్కటి మాటలు చెప్పాడు. కొన్ని మాటలు మళ్ళీ గుర్తుచేస్తున్నాను:

‘నాగరికతతో పాటు ప్రేమ భావము పెంపొందుతూ ఉంటుంది..ప్రేమ అనే ధర్మమునకు కట్టుబడిన సమాజం మాత్రమే ఆనందమును ప్రసాదించగలుగుతుంది.’

‘మనిషిని ప్రేమించాలి, ఇది నిజమైన తాత్త్విక దృష్టి, లోకంలో ఉన్న అన్ని తత్త్వాలు దీనిని బోధిస్తున్నాయి. ప్రేమ వ్యక్తి స్వార్థాన్ని పోగొడుతుంది. ప్రేమకన్న పెన్నిధి ఇంకేముంటుంది?’

‘ప్రేమ హృదయమున పుష్పించిన ఒక కోమల పుష్పం. అది అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి ఆత్మను తేజోవంతము చేస్తుంది.’

‘సానిపిల్లలో ఉండే మానవత్వాన్ని మర్చిపోకు. ఆమె సైతం ఒక మానవవ్యక్తి అనే మాటను విస్మరించకు. ఆమె విచారం, కన్నీళ్ళూ, సంతోషం, ఆనందబాష్పాలూ, నీ నా సుఖదు:ఖాలవంటివే. మన అనుభూతులకు వలె అవీ గుణుతింపదగినవే, గంభీరమైనవే.’

చివరగా ఈ మాటలు:

‘మనం మూర్తీభవింపచేయవలసిన ప్రేమ విశ్వమానవప్రేమ. తోటిమానవుణ్ణి హృదయమిచ్చి ప్రేమించు. నిజమైన, ఆరాధించదగిన ప్రేమ యేది? తన యుగంలోవున్న అవధులలోనే పోనీ, క్రీస్తు యేది బోధించాడనుకుంటున్నామో, దేన్ని కళావిలాసమని, కవితా సత్యమని షెల్లీ ప్రవచించాడో ఇదీ ఉత్తమమైన రాజమార్గమని దేనిని బుద్ధుడు మనకు ఉపదేశించాడో అదే నిజమైన ఉన్నతమైన ప్రేమ! మానవజాతిపై మనకు ఉండవలసిన ప్రేమ!’

29-11-2015

Leave a Reply

%d