తెలుగుని ప్రేమించేదారుల్లో

106

జోళదరాశి బళ్ళారి తాలూకాలో ఒక గ్రామం. గుంతకల్ నుంచి నలభై నిముషాల ప్రయాణం. ఆ ఊళ్ళో ఒకప్పుడు ఇద్దరు మహనీయులుండేవారు. ఒకరు, బళ్ళారి రాఘవ మిత్రులు, ‘శూన్య సంపాదనము’ రచయిత జోళదరాశి దొడ్డనగౌడ. మరొకరు, తెలుగు భాషాభిమాని గుత్తి నారాయణరెడ్డి. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలుగు వాళ్ళు పోగొట్టుకున్న ప్రాంతాల్లో బళ్ళారి ఒకటి. ఇప్పుడు ఆ ప్రాంతం దాదాపుగా కన్నడ ప్రాంతంగా మారిపోయింది. అక్కడి పాఠశాలల్లో తెలుగు చెప్పేవాళ్ళే లేరు. అయినా ఇంకా జోళదరాశిలో తెలుగు పట్ల ప్రేమ ఇంకిపోలేదు. మంచి తెలుగు వినాలనీ, తెలుగు సాహిత్యం గురించి ఎవరైనా మాట్లాడితే చెవులప్పగించాలనీ ఆ గ్రామస్థులకింకా ఒక ఆరాటం. అందుకని, ప్రతి ఏటా, ప్రసిద్ధ సాహితీవేత్త, అనువాదకుడు జోళదరాశి చంద్రశేఖరరెడ్డిగారు తన తండ్రి నారాయణరెడ్డిని స్మరిస్తూ వసంతకాలంలో అక్కడొక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. తెలుగు భాషలో, సాహిత్యంలో కృషి చేసినవాళ్ళకి తన తండ్రి పేరిట పురస్కారం అందిస్తూ ఉన్నారు. ఈ సారి ఆ పురస్కారం అందుకోవడం నా వంతైంది. అందుకని 23 వ తేదీ జోళదరాశి వెళ్ళాను.

గుత్తి నారాయణ రెడ్డిగారు రైతుగా జీవించాడు. తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు భాషోద్యమ చరిత్రలోనూ ఆయన పేరు ఎక్కడా వినబడదు. కాని అటువంటి వ్యక్తులే లేకపోతే తెలుగు ఈ స్థితికి ఎన్నడూ వచ్చిఉండేదికాదు. నన్నయచేత తెలుగు భారతం రాయించిన నారాయణభట్టు అట్లాంటి భాషోద్యమకారుడు. ముఖ్యంగా తన చుట్టూ ఉన్న మనుషులు, కుటుంబాలు, సమూహాలూ అంతా కూడా తమ బళ్ళారి కన్నడ ప్రాంతంలో కలవాలని కోరుకుంటున్నప్పుడు తానొక్కడే తెలుగుకోసం ప్రాణం పెట్టడమేమంత మామూలు విషయం కాదు.

ఒకరోజు నారాయణ రెడ్డి పొలంలో సేద్యం చేసుకుంటూ ఉన్నారట. దూరంగా కొందరు కోలాహలంగా పోతున్నారు. ఏమిటని ఆరాతీస్తే ఆంధ్రనాయకుడొకరు రైల్లో అనంతపురం నుంచి బళ్ళారి వెళ్తున్నాడనీ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి ఆ బృందమంతా రైల్వే స్టేషన్ కి పోతున్నారనీ తెలిసింది. ఒక తెలుగు నాయకుడికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమా? అది తెలుగు భాషకే అవమానం. నారాయణరెడ్డి కి ఏం చేయాలో తెలియలేదు. ఆయన పొలంలో పంచె, బనీనుతో ఉన్నాడు. మట్టికొట్టుకుని చెమట కారుతున్న దేహం. అయితేనేం, పొలాలకు అడ్డం పడి రైల్వే స్టేషన్ కి పరుగెత్తాడు. ఆ గుంపు అక్కడకు చేరుకునేలోపే స్టేషన్ మాష్టర్ ని కలిసి ఫలానా నాయకుడు ఏ రైల్లో ఏ పెట్టెలో వస్తున్నాడని అడిగాడు. స్టేషన్ మాష్టరు ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అంతమందికి వ్యతిరేకంగా నువ్వొక్కడివీ ఇక్కడెలా నిలబడగలవు, వాళ్ళు నీమీద దాడి చేస్తే ఏం చెయ్యగలవని అడిగాడు. కాని నారాయణ రెడ్డి భాషాభిమానం ఆ స్టేషన్ మాష్టరు హృదయాన్ని కరిగించింది. అతడు ఆ నాయకుడు ఏ పెట్టెలో వస్తున్నాడో చెప్పి, నారాయణరెడ్డి చేతిలో అర్థరూపాయి పెట్టి నువ్వు ఆ నాయకుడికోసం తెలుగు భాష కోసం నినాదాలు చేసి ఆ రైలెక్కేసెయ్యి, ముందు స్టేషన్లో దిగి మరో రైల్లో వెనక్కి రా అన్నాడు. రైలు వచ్చింది. ఆ నాయకుడికి వ్యతిరేకంగా నినాదాలు చెయ్యాలనుకున్నవాళ్ళు స్టేషన్ మాష్టరు దగ్గరికి వచ్చి ఆ నాయకుడుండేది ఏ పెట్టెలో అనడిగారు. అతడు వాళ్ళకి వెనక పెట్టెలు చూపించాడు. ఈ లోగా నారాయణరెడ్డి ముందు పెట్టె దగ్గరికి పరుగెత్తి ఆ నాయకుణ్ణీ, తెలుగు భాషనీ కీర్తిస్తూ నినాదాలు చేసాడు. అతడి వ్యతిరేక వర్గం ఆ విషయం తెలుసుకునేలోపలే రైలు కదిలింది. వాళ్ళు బిత్తరపోయి చూస్తూండగానే నారాయణరెడ్డి కూడా ఆ పెట్టె ఎక్కేసాడు.

అటువంటి మహనీయుడి పేరుమీద నాకు పురస్కారం లభించినందుకు నాకెంతో గర్వంగానూ, సంతోషంగానూ అనిపించింది. ఆ రోజు ఆ సమావేశం జోళదరాశి గ్రామంలో రామేశాంజనేయస్వామి దేవాలయం ముందు వేపచెట్టు నీడన. స్థానికంగా యోగివేమన పేరుమీద నడుస్తున్న వేమనమఠాధిపతి వేమనానంద స్వామి సన్నిధిలో పురస్కార ప్రదానం జరిగింది. నాతో పాటు ప్రసిద్ధ మరాఠీఇ రచయిత, నటుడు, అనువాదకుడు, సాహిత్య అకాడెమీ కార్యవర్గ సభ్యుడు బొల్లి లక్ష్మీనారాయణ, ప్రసిద్ధ కన్నడ కథకుడు, మన్రో జీవితచరిత్రకారుడు, సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన కుం.వీరభద్రప్ప కూడా వేదిక మీద ఉన్నారు.

పొద్దుణ్ణుంచీ వేడెక్కించిన ఎండతీవ్రత చల్లారి, వేసవి సాయంకాలపు గాలులు అల్లుకోవడం మొదలయ్యింది. చూస్తూండగానే పిల్లా పాపల్తో మొత్తం జోళదరాశి గ్రామంతా అక్కడ హాజరయ్యింది. ముప్పై ఏళ్ళకిందట విజయనగరం జిల్లాలో ఒరిస్సా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న పాచిపెంట గ్రామం లో నేను చేసిన సాహిత్య ప్రసంగం గుర్తొచ్చింది. ఆ ఊరులానే ఇది కూడా ఒక సరిహద్దు గ్రామం. ఆ గిరిజన గ్రామంలానే ఇది కూడా ఒక అమాయిక రైతుగ్రామం. నగరాల్లో, పట్టణాల్లో భాషమీదా, సాహిత్యం మీదా ఇట్లాంటి ప్రేమా, ఔత్సుక్యం కనిపించవు. పట్టణాల్లో , నగరాల్లో మనుషులు వెర్రి పడుతున్న విషయాలు వేరే ఉన్నాయి. నేడు రాష్ట్రంగా రెండుగా విడిపోతున్న కాలంలొ 23 జిల్లాకేంద్రాల్లోగాని, హైదరాబాదులోగాని తెలుగు భాషలో మాట్లాడే ఒక వక్తను వినడానికి ఇంతగా జనం చేరతారనుకోను. బహుశా ఒక సినీమా హీరో, లేదా కమెడియన్ లేదా కొత్తగా ఏదన్నా వస్త్రవిక్రయశాలను ప్రారంభించడానికి విచ్చేసిన కొత్త హీరోయిన్ ని చూడటానికి మాత్రమే ఆంధ్ర, తెలంగాణా సరిహద్దులకు అతీతంగా మనుషులు పోగుపడతారక్కడ.

ఆ మనుషుల్నీ, ఆ గ్రామాన్నీ, ఉద్దండపండితులైన నా సహవక్తల్నీ చూడగానే నా గుండె తడిసింది.నేనేదో మాట్లాడానుగానీ, ఆ విషయం కన్నా ముందు ఆ భాషకే వాళ్ళెంతో ముగ్ధులైపోయారు. ఇంతకీ నేను మాట్లాడిన తెలుగు ఏమి తెలుగని? కనీసం ఒక్క పోతన్న పద్యమో, శ్రీశ్రీ గేయమో చదవనేలేదే, అయినా ఆ తెలుగు విని వాళ్ళు మురిసిపోయారంటే వాళ్ళు తెలుగుకోసం మొహం వాచిపోయారనుకోవాలి. నావంటి అల్పజ్ఞుడి తెలుగుకే వాళ్ళంత సమ్మోహితులయ్యారంటే వాళ్ళకోసం నాకు తెలిసిన ప్రతి ఒక్క రచయితనీ, కవినీ అక్కడకు తీసుకువెళ్ళి ఆ దేవాలయం ముంగిట ఏడాది పొడుగునా మాట్లాడిస్తూ ఉందాలనిపించింది.

నా ప్రసంగం ముగించగానే మరాఠీ సాహిత్యవేత్త బొల్లి లక్ష్మీనారాయణగారు లేచి నిలబడ్డాడేగాని, తాను మాటలు మర్చిపోయానన్నాడు. ఎందుకంటే ఆయన పూర్వీకులది కరీం నగర్. అక్కణ్ణుంచి షోలాపూర్ తరలిపోయి చేనేతకారులుగా స్థిరపడ్డ కుటుంబాల నుంచి వచ్చినవాడాయన. జ్ఞానదేవ్, తుకారాం లను ఎంత ప్రేమిస్తాడో,పాల్కురికి సోమన, వీరబ్రహ్మం, వేమన లను కూడా అంతే ఇష్టంతో, ఆ మాటకొస్తే అంతకన్నా ఎక్కువ ఇష్టంతో తలుచుకుంటాడాయన. నా తెలుగు వినగానే ఆయన హృదయం ద్రవించిపోయింది. తాను కూడా ఈ భాషకి చెందినవాణ్ణేననీ, అసలు మరాఠీలో మొదటి కవి పుట్టకముందే పాల్కురికి సోమన పండితారాధ్యచరిత్రలో, పర్వత ప్రకరణంలో ఒక సర్గ మొత్తం మరాఠీలో రాసాడనీ, అసలు సోమన్న నే మొదటి మరాఠీ కవి అనవచ్చనీ కూడా అన్నాడు.

లక్ష్మీనారాయణగారి తర్వాత ప్రసంగించిన కుం.వీరభద్రప్ప మొత్తం ఉద్యోగ జీవితంతా అనంతపురం జిల్లాలో గడిచింది. అక్కడే ఆయన థామస్ మన్రో మీద పుస్తకం రాసాడు. ఆయన కథలకు కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. గిరీష్ కాసరవెల్లి దర్శకత్వం వహించిన ఒక చిత్రానికి ఆయన సమకూర్చిన కథకి జాతీయ ఉత్తమకథా పురస్కారం లభించింది. నా ప్రసంగం విన్న సంతోషం నేత్రాల్నుంచి పొంగిపొర్లిపోతున్న ఉద్వేగంతో వీరభద్రప్ప ప్రసంగం సాగింది. స్వోత్కర్షలాగా అనిపిస్తున్నా ఈ మాటలు ఎందుకు రాస్తున్నానంటే తెలుగు భాష పట్ల సోదర భాషావేత్తల ఆరాధన ఎలా ఉండో నా కళ్ళతో చూసానుకాబట్టి. ఇంత చక్కని భాషకు నువ్వు వారసుడివయ్యావా అన్న ఈర్ష్య కూడా కనిపించింది వీరభద్రప్ప నేత్రాల్లో. ఆ మాట ఆయన దాచుకోలేకపోయాడు. ‘ తెలుగు మాట్లాడటానికి అందమైన భాష. కన్నడం రాయడానికి అందమైన భాష. కాబట్టి నా ముందు మాట్లాడిన తెలుగువక్తలాగా నేను మాట్లాడలేను, కాని నేను కన్నడంలో చాలా అందంగా రాస్తాను’ అని చెప్పుకోకుండా ఉండలేకపోయాడాయన చిన్నపిల్లవాడిలా నిండుసభలో.

సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన వేమనానందస్వామి యువకుడు, ఎం టెక్ పట్టభద్రుడు. సర్వసంగ పరిత్యాగిగా వేమన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయన కూడా తెలుగుభాష పట్ల తన మమకారాన్ని తెంచుకోలేకపోయాడు. తన ప్రసంగంలో పదేపదే నా మాటల్ని తలుస్తూ ఉన్నాడు. ఒక మనిషిని మనిషిగా మార్చడంలో భాష,సాహిత్యం,కవిత్వం నిర్వహించగల పాత్ర గురించే మాట్లాడుతూ ఉన్నాడాయన.

2.

ఆ రాత్రి మాకు జోళదరాశి దొడ్డనగౌడ గారి ఇంట్లోనే బస. ఒక చారిత్రక స్థలంలాంటి గృహమది. ఒక వైపు తంబురా మీటుకుంటూ మరొకవైపు శూన్య సంపాదనం చేసిన మహనీయుడి జీవనవిభూతి అక్కడ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఏ జన్మలో బంధమో. ఒకప్పుడు జోళదరాశి చంద్రశేఖరరెడ్డిగారు దొడ్డనగౌడ గారి మీద సంకలనం చేసిన ‘శరణుడు-బసవడు’ (2011 పుస్తకానికి నాతో ముందుమాట రాయించారు. ఇప్పుడు ఆ దొడ్డనగౌడ నివసించిన ఇంట్లోనే ఒక రాత్రి బసచేసే అవకాశం లభించింది. పూర్వకాలపు భూస్వాముల ఇల్లది. లోపల గోడలమీద ఆయన నాటకాల ఫొటోలు. ఆయన ప్రసంగాల కేసెట్లు. తంబురా.

ఆ రాత్రి చుక్కలవెలుతుర్లో ఆరుబయట మేడమీద పడుకుని ఆలోచిస్తూ ఉన్నాను. ఇట్లాంటి జీవితం నుంచీ, జీవితాదర్శాలనుంచీ ఎంత దూరం వచ్చేసాం. అలాగని ఈ ఇంట్లో ఉంటున్నవాళ్ళందరూ దొడ్డనగౌడలాగా జీవించారని చెప్పలేం. చంద్రశేఖరరెడ్డిగారు చెప్పిన దాన్ని బట్టి ఆ మొత్తం వంశంలో ఇప్పటిదాకా దొడ్డనగౌడగారిలాంటి సాహిత్య విద్యార్థి, శరణుడూ, కళాకారుడూ ఆయనొక్కడే. కాని చుట్టూ నల్లరేగడిపొలాలమధ్య వర్షాన్ని నమ్ముకుని బతుకుతున్న ఆ రైతు జీవితంలో, ఆ ఇంట్లో ఏదో ఉన్నది. మన పత్రికలు, మన సాహిత్యం, మన ప్రసారసాధనాలు మాట్లాడుతున్న వాటిల్లో మనకెక్కడా వినిపించని మహత్వమేదో ఆ ఇంటి ముంగిట్లో నేను అనుభూతి చెందగలిగాను.

3

మర్నాడు హంపీకి. చంద్రశేఖరరెడ్డిగారు శ్రీక్ఖృష్ణదేవరాయల వీరాభిమాని. హైదరాబాదులో ఆయన ఇంటిముందు నిలువెత్తు కృష్ణరాయల విగ్రహం ప్రతిష్టించుకున్నారు. అసలు ఆయన్నీ, నన్నూ ఆత్మియతాబంధంతో పెనవైచిందికూడా కృష్ణరాయలమీద నేను చేసిన ఒక ప్రసంగమే. అటువంటిది ఆయనతో కలిసి హంపీ విజయనగరం చూడటమే గొప్ప అనుభవం కాగలదనిపించింది. పొద్దున్నే చంద్రశేఖరరెడ్డిగారితో కలిసి నేనూ, గంగారెడ్డీ, మా ప్రమోద్ హంపీకి బయలుదేరాం.

మేం హంపిలో అడుగుపెట్టేటప్పటికే పన్నెండు దాటిపోయింది. ఆ ఎర్రని ఎండలోనే విరూపాక్షాలయానికి వెళ్ళాం. సంగమవంశకాలంలో నిర్మించిన ఆ ఆలయాన్ని మళ్ళా కృష్ణదేవరాయలు పునరుద్ధరించాడు. సంగమవంశరాజులు శైవులు. తుళువ వంశానికి వచ్చేటప్పటికి వైష్ణవులుగా మారినా తన రాజముద్రికమీద కృష్ణరాయలు ‘శ్రీ విరూపాక్ష ‘అనే ముద్రించేవాడట. అక్కడ మళ్ళా లక్ష్మీనారాయణ గారి కుటుంబం తారసపడ్డారు. ఆయన శ్రీమతి ప్రముఖ రంగస్థల నటి,కూతురు కథక్ నర్తకి, వారి కాబోయే అల్లుడు ముంబై జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో రెండవ సంవత్సరం విద్యార్థి. ఆ పిల్లవాడు పర్యాటక, చారిత్రిక స్థలాల్లో లొకేషన్లలోనే నీటిరంగుల చిత్రాలు చిత్రిస్తున్నాడు. తనున్నచోటే నీటిరంగుల చిత్రాన్ని ఎలా చిత్రిస్తాడో నాకోసమొక డిమాన్ స్ట్రేషన్ చెయ్యమని అడిగాను. హంపిలో బొమ్మలు వెయ్యడాంకి నెలరోజులముందే పర్మిషన్ తీసుకోవాలనీ, తనకి ప్రస్తుతం అనుమతిలేదనీ అన్నాడు.

కాని మళ్ళా నా కోరిక కాదనలేక విరూపాక్ష ఆలయం పక్కనే ఒక మూల కూచుని మా ముందున్న ఒక పాడుపడ్డ రాతిమంటపాన్ని రంగుల్తో చిత్రించి చూపించాడు. ఆర్చిస్ 300 జి ఎస్ ఎం రఫ్ పేపర్ మీద కేమెల్ రంగుల్తో చిత్రించిన బొమ్మ. అతని దగ్గర నాకు మూడు విషయాలు బోధపడ్డాయి. మొదటిది, నీటిరంగుల చిత్రం బాగా రావడానికి ఫ్రాగొనార్డ్, విన్సర్ అండ్ న్యూటన్ రంగులే వాడనక్కర్లేదు. కేమెల్ ఆర్టిస్ట్ కలర్స్ కూడా సరిపోతాయి. రెండవది, ప్రతి సారీ కాగితాన్ని స్ట్రెచ్ చేయనక్కర్లేదు. ఇక అన్నిటికన్నా ముఖ్యం, అతడు బొమ్మ వేయడంలో చూపించిన boldness. నీటిరంగులు పిరికివాళ్ళకోసం కాదు. మనం ఏ మాత్రం timid గా ఉన్నా నీటిరంగులు మన ముందు విప్పారవు. ప్రేమలోలానే నీటిరంగుల చిత్రలేఖనంలో కూడా సాహసం కావాలి. ‘సాహసి కాని వాడు జీవన సమరానికీ, స్వర్గానికీ పనికిరానట్టే’ నీటిరంగుల చిత్రలేఖనానికి కూడా పనికిరాడు.

మేంగో ట్రీ అనే రెస్టారెంట్లో బోజనం. అప్పుడు మళ్ళా విఠలాలయానికి బయల్దేరాం. విఠల ఆలయం, రాతిరథం, సప్తస్వరాలు పలికే స్తంభాలు- ఇరవయ్యేళ్ళకిందట చూసిన హంపీకి ఈ హంపీకి పోలికే లేదు. ఇప్పుడది old heritage site. ఇప్పుడక్కడికి కృష్ణరాయలు వచ్చినా కూడా పోల్చుకోలేడు. నేను మొదటిసారి వచ్చినప్పటికన్నా ఇప్పుడు ఆ స్థలాన్ని మరింత నిశితంగా పరిశీలించాను. శిల్పపరంగా చూస్తే అక్కడ చెప్పుకోదగ్గదేమీ గోచరించలేదు. అక్కడ తిరుగుతున్నంతసేపూ, ఆ నిర్మాణాల కన్నా దొడ్డంగౌడగారి గృహమే మరింత విలువైనదనిపిస్తున్నది నాకు. పైగా శివరామకారంత దృష్టిలో అది శిల్పకళ పతనావస్థకు చేరుకున్న చోటని చంద్రశేఖరరెడ్డి అన్నారు. కాని నిర్మాణపరంగా, వాస్తుపరంగా అక్కడేదో గంభీరమయిందీ, అద్భుతావహంగా గోచరిస్తున్నది.

శిల్పపరంగా హొయసల రాజ్యనిర్మాణాలు గ్రీకు శిల్పం లాంటివైతే, విజయనగర నిర్మాణాలు రోం తరహా అర్కిటెక్చర్ అనుకోవలసి ఉంటుంది. ఆ ఆర్కిటెక్చరల్ డిజైన్ లో, ఆ లే ఔట్ లో, ఆ స్థల నిర్వహణలో గొప్ప ప్రావీణ్యమున్నది. కాని కృష్ణరాయలకు తెలుసు, ఈ నిర్మాణాలు శాశ్వతంగా నిలిచేవి కావని, అందుకనే కాలం తాకిడికి కూలిపోని నిర్మాణాల కోసం ఆయన శిల్పులమీద కాక ప్రబంధ కవులమీద ఆధారపడ్డాడు.

పొద్దువాలిపోతున్నది. కాని భువనవిజయం చూడాలన్న తలపు మమ్మల్ని మళ్ళా వెనక్కి తిప్పింది. కాని అక్కడెవరికీ భువనవిజయమనే పేరే తెలియదు. కృష్ణరాయల సభాప్రాంగణమంటే కూడా ఎవరికీ తెలియదు. కాని రాణీగారి స్నానగృహమంటే మాత్రం గుర్తులు చెప్పగలిగారు. సూర్యాస్తమయ వేళకి భువనవిజయసభామంటపం మీద నిలబడ్డాం. అక్కడే కదా, కృష్ణరాయల కోసం పెద్దన ఆశువుగా ఉత్పలమాలిక చెప్పింది. అక్కడే కదా సాహితీసమరాంగణసార్వభౌముడు ఆంధ్రకవితా పితామహుడి కాలికి గండపెండేరం తొడిగింది. మరోదేశంలో, మరో సంస్కృతిలో ఆ స్థలానికి ఎట్లాంటి గుర్తింపు దొరికి ఉండేది! దాన్ని ప్రపంచమంతా చూడవలసిన దర్శనీయస్థలంగా మార్చేసి ఉండేవాళ్ళు.

నా చిన్నతనంలో నేను విజయనగర చరిత్రకు వీరారాధకుణ్ణి. శ్రీనివాససోదరులు రాసిన విజయనగర వైభవం పదహారు సంపుటాలు ఏకబిగిన చదివినవాణ్ణి. ఇప్పటికీ ఆ మత్తు నాకింకా దిగలేదు. ఆముక్తమాల్యద కావ్యం పూర్తి చేసాక కృష్ణరాయల మనఃస్థితి ఎలా ఉండిఉంటున్నందన్న ఆలోచన మీద ఒక నవల రాయాలన్న కోరిక నాకింకా బలంగా ఉంది.

హంపి యాత్ర పొడుగుతా, విజయనగర చరిత్రతో పాటు, చంద్రశేఖరరెడ్డిగారు వీరశైవ చరిత్ర, కన్నడ సాహిత్య చరిత్ర కూడా చెప్తూ ఉన్నారు. హంపీ పర్యటన ఒక ఎత్తూ, ఆ చరిత్రలు ఆయన్నుంచి వినడం మరో ఎత్తూ అన్నాడు గంగారెడ్డి.

30-4-2014

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading