అనుభవామృతం

120

త్ర్యంబకం పర్యటన మీద రాసిన యాత్రావర్ణనలో (నేను తిరిగిన దారులు, 2011) సంత్ జ్ఞానేశ్వర్ గురించీ ఆయన అనుభవామృతం గురించీ నేను రాసినదానికీ, అక్కడ చేసిన రెండుమూడు అనువాదాలకీ గంగారెడ్డి సంత్ జ్ఞానేశ్వర్ కి ఒక జీవితకాల ఆరాధకుడిగామారిపోయాడు. ఆ తర్వాత ఆ మధ్య ఒక రోజు జ్ఞానేశ్వరి చదువుతున్నానని చెప్పాడు.

సోమయ్యగారి ఇంటిముందు చెట్ల కింద ఆదిత్య, నేనూ, గంగారెడ్డి మాట్లాడుకుంటూండగా మళ్ళా ‘అనుభవామృతం’ ప్రస్తావన వచ్చింది. ఆ పుస్తకం మీరెట్లాగైనా తెలుగు చెయ్యాలన్నాడు. సాధ్యమా?

ప్రసిద్ధ మరాఠీ సాహిత్యవేత్త, అనుభవామృతాన్ని ఇంగ్లీషులోకి అనువదించడమే తన జీవితకాల ప్రయోజనంగా భావించిన దిలీప్ చిత్రే వంటివాడికే అది సాధ్యం కాలేదు. నేనెంత? ‘ఆ రచనని అనువదించడమంటే, మరాఠీని ఇంగ్లీషులోకో, ఇంగ్లీషుని తెలుగులోకో మార్చడం కాదు. ఆ మనఃస్థితికి, ఆ తపోభూమికకి, ఆ యోగవేదికమీదకు చేరకుండా అందులోంచి ఒక్క వాక్యం కూడా మనం బోధపర్చుకోలేం’ అన్నాను. ‘ముందెవరైనా మరాఠీ పండితుడి దగ్గరకు పోయి కూచుని ఆ పుస్తకం ఆమూలాగ్రం ఒక్కసారి మరాఠీలో వినిపించుకోవాలి’ అని కూడా అన్నాను.

కానీ గంగారెడ్డి తృష్ణకి అంతం లేదు. నెట్ లో ఎట్లా పట్టాడో, స్వామి అభయానంద అనువాదాన్ని పట్టుకుని నాకు పంపించాడు. ఆ అనువాదం దిలీప్ చిత్రే ( అనుభవామృత్, సాహిత్య అకాడెమీ,1996), కన్హయ్యా జోషి ( ద అల్టిమేట్ సతోరి,1996) కన్నా సరళంగా ఉంది.

సంత్ జ్ఞానేశ్వర్ (1275-1296) కేవలం మహారాష్ట్రి ప్రాకృత సాహిత్యంలోనే కాదు, భారతీయ సాహిత్య, దార్శనిక చరిత్రలోనే అత్యంత విశిష్టమైన మలుపు. ఇదంతా నేను నా త్ర్యంబకం యాత్రావర్ణనలో వివరంగా రాసాను. ఇప్పుడు కొత్తగా తెలుస్తున్నదేమిటంటే, ఆయన తన సమకాలికులైన క్రైస్తవ సాధువు మీస్టర్ ఎక్కార్ట్ (1260-1327), మహ్మదీయ దార్శనికుడు ఇబన్ అల్ అరాబి (1165-1240) తో సమానంగా ప్రపంచం చర్చించవలసిన యోగమూర్తి.

మానవుడు పొందవలసిన తురీయస్థాయి అద్వైతానుభవం ఎలాఉంటుందో ఆయన అనుభవానికి తెచ్చుకున్నాడు. కాని ఆ అనుభవం తరువాత అతడు ప్రపంచాన్ని, అంటే, దృశ్యమాన, ఇంద్రియగ్రాహ్య ప్రపంచాన్ని వదిలిపెట్టలేదు. దాన్ని అద్వైతుల్లాగా కేవలం మాయగా, ఆభాసగా భావించకుండా, శక్తివిలసనంగా దర్శించాడు. మార్పు చెందని సత్యం, మార్పు చెందే దృశ్యం ఈ రెండూ కూడా ఆయన దృష్టిలో ఒక్కటే. నిజానికి రెండులేవు, ఉన్నదొక్కటే.

దీన్నే స్వామి అభయానంద ఇలా రాస్తున్నారు:

‘ మనం అనుభవామృతాన్ని ఒక తాత్త్వికరచనగా పేర్కోవడం కేవలం మన సౌలభ్యం కోసం మాత్రమే. నిజానికి జ్ఞానేశ్వరులు మనం భావించే అర్థంలో తత్త్వవేత్త కానే కాదు. ఆయన ఈ ప్రపంచం గురించి ఎట్లాంటి వాదాలూ, ప్రతిపాదనలూ చెయ్యనే లేదు. ఆయన చేసిందల్లా తనకు ప్రత్యక్షంగా లభించిన అద్వైతానుభవ రహస్యాన్ని మనకు వివరించడానికి ప్రయ్త్నించడమే. ఆ అనుభవంలో ఈ మొత్తం విశ్వమే ఏ విశ్వచైతన్యంలోంచి ప్రభవించిందో ఆ విశ్వచైతన్యంతో వ్యక్తి చైతన్యం ఏకమవుతుంది…అది నిస్సందేహంగా ఒక ఏకత్వం. ఎలాగైతే మనిషి మనసూ, దాన్లోంచి పుట్టే అలోచనలూ ఒకే విషయమో అలానే. అయితే దానికి రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి అనంత నిత్య చైతన్యం. మరొకటి ఆ భావనాప్రతిబింబంగా గోచరించే దృశ్య ప్రపంచం. పాశ్చాత్య ఈశ్వరీయ చింతనలో ఆ రెంటినీ ఈశ్వరుడు (Theos) అనీ, ఆయన వాక్కు (Logos) అనీ అంటారు. భారతదేశంలో ఆ రెంటినీ బ్రహ్మన్ అనీ, మాయ అనీ, పురుషుడు, ప్రకృతి అనీ, శివుడు, శక్తి అనీ ఎవరి ప్రాధాన్యతా క్రమం బట్టి వాళ్ళు పిలుస్తారు…జ్ఞానేశ్వర్ అమృతానుభవం విషయానికి వచ్చేటప్పటికి, తన అద్వైతానుభవంలో తాను గ్రహించినదాన్ని శైవసంప్రదాయం ప్రకారం శివ/శక్తి పదాలతో వివరించడానికి ప్రయత్నించాడు.’

అమృతానుభవం పది అధ్యాయాల కావ్యం. దాన్ని కావ్యం అనడం కూడా మరొక పేరు దొరక్క వాడుతున్న పదమే. జ్ఞానేశ్వర్ సమకాలికుడూ, సుప్రసిద్ధ ఇటాలియన్ మహాకవీ డాంటే అలిఘరి (1265-1321) తన అత్మానుభవాన్ని ‘డివైన్ కామెడి’ గా రాసాడు. ఐరోపీయ ఆత్మకు అద్దం పట్టే ముగ్గురు కవుల్ని పేర్కోమంటే, ప్రాచీన కాలానికి లుక్రీషియస్ నీ, మధ్యయుగాలకి డాంటే నీ, ఆధునిక యుగానికి గొథే నీ ఎంపిక చేస్తానని స్పెంగ్లర్ ఒక చోట అన్నాడు.

డాంటే డివైన్ కామెడీ ద్వారా ఏది వివరించడానికి ప్రయత్నించాడో, జ్ఞానేశ్వర్ అమృతానుభవం ద్వారా అదే చేసాడు. అయితే డివైన్ కామేడీలో చారిత్రక, సామాజిక ఇటలీ మొత్తం కనిపిస్తుంది. దృశ్యప్రపంచాన్ని వదలకుండానే దైవాన్ని పొందాలనుకునే పాశ్చాత్యధోరణి అది. అక్కడ మానవుణ్ణి దైవపుత్రుడిగా దర్శించే సంప్రదాయముంది. జ్ఞానేశ్వర్ కావ్యంలో చరిత్రలేదు, సమాజం లేదు. మనిషిలేడు, దైవం లేడు. ఉన్నదల్లా రెండు పదాలు, శివుడు, శక్తి. అవి కూడా కరిగిపోయే ఒక అద్వైతానుభవం.

అమృతానుభవంలో మొదటి అధ్యాయం విశ్వసాహిత్యంలోని అత్యున్నత వాక్యాలసరసన నిలవగల దర్శనం. మన పట్ల ఎంతో అపారమైన ప్రేమ ఉంటేగాని, అటువంటి అమూల్యానుభవాన్ని ఆయన మనకోసం అంత ఉదారంగా, అంత సరళంగా పంచుకోవడం సాధ్యం కాదు.

గంగారెడ్డి, విఫలమవుతున్నానని తెలిసి కూడా, నువ్వడిగావని, నీకోసం నాలుగు వాక్యాలిట్లా తెలుగులో:

1
తన ప్రియతమురాలికోసం
పట్టలేనంత ప్రేమతో
ప్రియుడు ప్రేమికురాలిగా మారాడు
ఇద్దరూ ఒకటే, తినేదొకటే.

2
ఒకరిపట్ల ఒకరు
నిలవలేనంత ప్రేమతో ఒక్కటవుతారు
మళ్ళా, ఇద్దరుగా ఉండే
సంతోషంకోసం విడివడతారు

3
వాళ్ళిద్దరూ ఒక్కటే అనలేం
ఒక్కరే కాదనీ అనలేం
నిజంగా వాళ్ళిద్దరూ
ఏమిటో నిశ్చయంగా చెప్పలేం.

4
ఒకరినొకరు అనుభవించడమే
వాళ్ళిద్దరి ఏకైక కామన
అయినా ఊరికే సరదాకి కూడా
వాళ్ళిద్దరి ఐక్యం చెక్కుచెదరదు.

5
వాళ్ళిద్దరూ ఒకే నేలమీద
కూచుంటారు, ఇద్దరూ ఒకటే
కాంతివస్త్రం కప్పుకుంటారు
అతీతకాలంనుంచీ వాళ్ల ఆనందమదే.

6
ఆయన కోసమే ఆమె
ఆమె లేకపోతే ఆయన కూడా లేడు
వాళ్ళున్నదే
ఒకరివల్ల మరొకరు.

7
వాళ్ళు ఒకరు మరొకరిని
తనుగా భావిస్తారు
ఒకరు లేకుండా మరొకరు
ఒక గడ్డిపోచకూడా కదపలేరు.

8
ప్రపంచమనే ఈ ఇంట్లో
ఉండేది ఈ ఇద్దరే
ఆయన నిద్రపోతున్నప్పుడు
ఆమె మెలకువగా ఉంటుంది.
ఇద్దరి పనులూ తనొక్కతే
చక్కబెడుతుంది.
ఇక ఆయన నిద్రలేచాడా
ఈ ఇల్లే అదృశ్యమైపోతుంది
మరింకేమీ మిగలదు.

9
రెండు వేణువులు: ఒకటే స్వరం
రెండు పుష్పాలు: ఒకటే పరిమళం
రెండు దీపాలు: ఒకటే వెలుగు
రెండు పెదాలు: ఒకటే వాక్కు
రెండు నేత్రాలు: ఒకటే దృశ్యం
వారిద్దరు: ఒకటే విశ్వం.

10
జ్వాలకనిపిస్తోందా
అగ్ని రగులుతున్నట్టే.
శక్తిని దర్శించామా
శివుడు చేజిక్కినట్టే.

21-10-2013

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading