పన్నెండుమంది ఆళ్వారుల్లో ఒకరైన ఆండాళ్ (క్రీ.శ.9 వశతాబ్ది) రచించిన తిరుప్పావై భారతీయసాహిత్యంలోని అత్యంతవిలువైన కృతుల్లో ఒకటి. తదనంతరసాహిత్యాన్ని అపారంగా ప్రభావితం చేసిన రచన. అక్కమహాదేవి, మీరా, లల్ల, మొల్ల వంటి ప్రాచీనకవయిత్రులతో పాటు సరోజినీనాయుడు, తోరూదత్, మహాదేవీవర్మవంటి ఆధునిక కవయిత్రులదాకా ఎందరో భావుకులకూ, రసపిపాసులకూ, జీవితప్రేమికులకూ ఆండాళ్ దే ఒరవడి. ఆమెకు పూర్వం అంతగా ప్రసిద్ధిచెందని కొందరు సంగంకాలంనాటి కవయిత్రులూ, ప్రాకృత కవయిత్రులూ, థేరీగాథలపేరిట కొంత కవిత్వం చెప్పిన బౌద్ధ సన్యాసినులూ లేకపోలేదుగాని, మధురకవిత్వాన్ని ఒక సంప్రదాయంగా మార్చగల్గిన తొలికవయిత్రి ఆండాళ్ అనే అనాలి. ప్రపంచసాహిత్యంలో కూడా ఆమెకన్న ముందు ఒక శాఫో, ఒక రబియా, అంతే, అంతకన్నా ఎక్కువపేర్లు కనిపించవు.
కవిగా ఆండాళ్ యశస్సు తిరుప్పావై, నాచ్చియార్ తిరుమొళి అనే రెండు చిన్న కావ్యాలమీద ఆధారపడిఉంది. రెండూ అత్యంత శక్తిమంతమైన రచనలు. ముఖ్యంగా తిరుప్పావై బాహ్యప్రపంచానికీ, మనోమయప్రపంచానికీ, భక్తికీ, ప్రేమకీ, నిద్రకీ, మెలకువకీ, స్థానికతకీ, వైశ్వికతకీ, ఐహికానికీ, ఆముష్మికానికీ మధ్య హద్దులు చెరిపేసిన రచన.
భక్తి గురించి వివరించేటప్పుడు భాగవతం అయిదు విధాల భక్తిని పేర్కొంది. అవి దాస్య, సఖ్య, వాత్సల్య, శాంత, మధురభక్తిమార్గాలు. భారతీయభాషల్లో భక్తికవిత్వం చెప్పిన ప్రతిభాషలోనూ ప్రతి కవీ ఈ అయిదుమార్గాల్లో నాలుగురకాలమార్గాల్లో ఏదో ఒక పద్ధతిలో కవిత్వం చెప్పినవాడే. కాని మధురభక్తిలో కవిత్వం చెప్పగలిగే అదృష్టానికి నోచుకున్నది ఒక ఆండాళ్, ఒక మీరా మాత్రమే.
ఆళ్వారులముందు తమిళదేశంలో శైవభక్తికవిత్వం చెప్పిన అప్పర్ దాస్యభక్తికీ, సంబంధర్ వాత్స్యల్యభక్తికీ, సుందరమూర్తి సఖ్యభక్తికీ అక్షరరూపమిస్తే, తిరువాచకాన్ని గానం చేసిన మాణిక్యవాచకర్ మధురభక్తి అంచులదాకా పోగలిగారు. తిరువాచకంలోని తిరువెంబావై అనే అధ్యాయం తిరుప్పావై కి ప్రేరణ అనవచ్చు. శైవభక్తిని ఒక ఉద్యమంగా ప్రచారం చేసిన నాయన్మారులబాటలోనే ఆళ్వారులు పన్నెండుమందీ వైష్ణవభక్తిని ప్రచారం చేసారు. వారిలో పెరియాళ్వారుది వాత్స్యల్య భక్తి, తిరుమంగై ఆళ్వారుది దాస్యభక్తి. ఆళ్వారుల్లో, స్వయంగా దేవుడే ‘నా ఆళ్వారు’ అని చెప్పుకున్న నమ్మాళ్వారుది సఖ్యభక్తి. కాని మహిమాన్వితమైన భక్తి పారవశ్యంలో కూడా ఆయనమధురభక్తి అంచులదాకా పోగలిగాడే తప్ప అందులో మునిగిపోలేకపోయాడు. ఆళ్వారు అంటే మునిగిపోయినవాడని అర్థమైనప్పటికీ, నిజంగా మధురభక్తిలో మునిగిపోగలిగింది అండాళ్ మాత్రమే.
తిరుప్పావై అంటే శ్రీవ్రతమని చెప్పవచ్చు. ఆ కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు దాన్ని ‘సిరినోము’ అన్నారు. తిరుప్పావై పైకి ఒక సాధారణమైన నోముపాటలాగా కనిపిస్తున్నప్పటికీ అందులో ఉపనిషత్తుల రహస్యాన్వేషణా, ప్రాచీన సంగం కవిత్వంలోని కవిసమయాలూ విడదీయలేనంతగా కలిసిపోయాయి. ఒక పాశ్చాత్య భావుకుడు చెప్పినట్టుగా పైకి సరళంగా కనిపించే అత్యంత సంక్లిష్టమైన కావ్యమది. అందులో ఎన్నో సంప్రదాయాలూ,సంవేదనలూ పొరలుపొరలుగా పేరుకుపోయాయి. ఒక్కొక్క పాశురాన్నీ, ఒక్కొక్క పదప్రయోగాన్నీ వివరించుకుంటూ, విశోధించుకుంటూ పోయేకొద్దీ ఉత్తర, దక్షిణభారతదేశాల అత్యున్నతవివేచనంతా అందులో కనవస్తుంది. అందులో వేదాంతముంది, రసపిపాస ఉంది, గోకులముంది, తమిళదేశముంది. ఏది శ్రీవిల్లిపుత్తూరో, ఏది రేపల్లెనో విడదీసిచూపలేనంతగా అల్లిన జమిలినేత అది.
ఇంతకీ తిరుప్పావై దేనిగురించి? ప్రాచీన తమిళదేశంలో మార్గశిరమాసంలో కన్యలు పెళ్ళికోసం పట్టే నోము అది. దాన్ని భాగవతం కాత్యాయనీవ్రతంగా పేర్కొంది. తిరుప్పావైలో ఆ నోము ఏదో ఒక దేవతను కొలిచే నోముగాకాక,ఒక మంగళవాద్యంకోసం కోరుకున్న మొక్కుగా కనిపిస్తుంది. ఒక కన్య మంగళవాద్యంకోసం నోమునోచడమన్న ఊహలోనే అనిర్వచనీయమైన రసస్ఫూర్తి ఉంది.మంగళవాద్యమంటే ఏమిటి? అది జీవితాన్నికల్యాణప్రదం చేసే శబ్దానికి,వాక్కుకీ, తూర్యధ్వనికీ దేనికైనా ప్రతీక కావచ్చు.
ఆ నోముపట్టి మార్గశిరమాసం ముఫ్ఫైరోజులూ పాడుకునే పాటల్లాగా తిరుప్పావై ని ఆండాళ్ నిర్మించింది. ఒక్కొక్క రోజూ ఒక్కొక్క పాశురం చొప్పున ముఫ్ఫై పాశురాల సంపుటి. పాశురమంటే ఎనిమిదిపంక్తుల గీతం. అచ్చతమిళం, సెందమిళంలో చెప్పిన కవిత్వమది.దానికొక నిర్మాణ క్రమముంది. మొదటి అయిదు పాశురాలూ నోమునోచడానికి చెప్పుకున్న సంకల్పం. పాటించవలసిన నియమనిబంధనలు. తిరుప్పావైకి వ్యాఖ్యానాలు చెప్పిన ఆధ్యాత్మికవేత్తలు ఆ అయిదు పాశురాల్నీ అధికారం, యోగ్యత, అర్హత గురించి ప్రస్తావనగా వివరించారు. 6వ పాశురంనుంచి 15 వ పాశురందాకా కన్యలు ఒకర్నినొకరు పిలుచుకోవడం, ఇంటింటికీ తిరగడం, ఒకరినొకరు మేల్కొల్పుకోవడం, మిత్రురాళ్ళు చేరువకావడం.
16 వ పాశురంనుంచీ 29 వ పాశురందాకా కావ్యంలోని సారాంశమంతా ఉంది. అక్కడ కన్యలు శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీకృష్ణదేవుని దేవాలయం ముందు చేరి దేవుణ్ణి మేల్కొల్పే కవిత్వం. కాని అక్కడ ఆండాళ్ శ్రీవిల్లిపుత్తూరుకీ రేపల్లెకీ మధ్య హద్దులు చెరిపేసింది. ఆమె తన ఊళ్ళో తన కులం మధ్య గుళ్ళో ఉన్న విగ్రహానికి మేలుకొలుపు పాడుతున్నట్టుగా కాక, రేపల్లెలో గోకులం మధ్య నిద్రిస్తున్న శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పుతున్నట్టుగా పాటలు పాడింది. ఒకవైపు అది బాహ్యప్రపంచానికి చెందిన పాటగా,ఆడపిల్లలు పాడుకునే నోముపాటగా వినిపిస్తూనే మరోవైపు కవయిత్రి మనోమయలోకాన్ని పట్టిచ్చే కవిత్వంగా మారిపోయింది. అంతేకాదు, అది భగవంతుణ్ణే మేల్కొల్పే కవిత్వంగా మారిపోయింది. అందుకనే తిరుప్పావైకి సుదీర్ఘమైన గొప్పవ్యాఖ్యానం రాసిన పెరియవచనపిళ్ళై, ‘తక్కిన ఆళ్వారుల్ని భగవంతుడు మేల్కొల్పాడు, కాని ఆండాళ్ తానే స్వయంగా భగవంతుణ్ణి మేల్కొల్పింది’ అన్నాడు.
26 వ పాశురంలో మంగళవాద్యం కోసం మొక్కుకున్న కవయిత్రి 27 వ పాశురానికి వచ్చేటప్పటికి తిరుప్పావై వ్రతప్రయోజనమేమిటో ఆశ్చర్యకరంగా చెప్తుంది. కృష్ణశాస్త్రి అనుసృజనలో ఆ పాశురం:
ఇంతకన్న శుభవేళ ఏదీ
ఇంతకన్న ఆనందమేదీ
బంతులుగా నీతోడగూడి
ఇంతులమెల్లరము
నేయివెన్న మీగడలు
తీయతీయని పాయసము
చేయిమునుగగా ఆరగింపగా
చేయవా చిత్తగింపవా
ఇదొక మహిమాన్వితమైన వాక్యం. భగవంతుడితో కలిసి జీవించే క్షణాలు సంభవించినప్పుడు ఆ ఆనందాన్ని ఆండాళ్ అత్యంత లౌకిమైన పరిభాషలో వ్యక్తం చెయ్యడం. తిరుప్పావైలోని 3వ పాశురంతో దీన్ని కలిపి చదివిచూడండి. అందులో ఆమె వ్యక్తం చేసిన ఆకాంక్ష:
ఎనలేని సిరులతో నిండును, ఈ సీమ
ఈతిబాధలు కలుగకుండును..
నెలనెలామూడువానలు కురియును
బలిసి ఏపుగ పైరులెదుగును
అలపైరుసందులను మీలెగురును
కలువల ఎలతేంట్లు కనుమూయును
కడిగి కూర్చుండి పొంకంపు చన్నులను
ఒడిసి పిదుకగ పట్టి రెండుచేతులను
ఎడము లేకుండ పెనుజడుల ధారలను
కడవల ఉదార గోక్షీరములు కురియును
‘పాడిపంటలు పొంగిపొర్లే దారిలో నువు పాటుపడవోయ్’ అని గురజాడ కోరుకున్న కోరికకీ, ఈ కోరికకీ ఎంత సారూప్యత! ఈ వాక్యాలు చూసినప్పుడు తిరుప్పావై ని ఒక మతగీతంగా భావించలేమనిపిస్తుంది. అత్యంత సుఖప్రదమైన, శుభప్రదమైన లౌకిక జీవితాన్ని కోరుకున్న శుభాకాంక్షగా భావించాలనిపిస్తుంది. 28, 29 పాశురాలకు వచ్చేటప్పటికి ఆమె మరింత ముందుకు అడుగేసి మంగళవాద్యం కోసం మొక్కుకోవడం కేవలం ఒక సాకుమాత్రమేననీ, భగవంతుడి సాన్నిహిత్యంకోసం పట్టిన ఒక నెపం మాత్రమేననీ చెప్తుంది. 29 వ పాశురంలో ‘ఈ బంధము నిలుపుము ఏడేడు జన్మములకైన’ అంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి విరహజనితమధురభక్తి దాస్య,సఖ్యభక్తిగా మారి, భక్తిలో స్థిరత్వాన్నికోరుకుంటున్నందువల్ల శాంతభక్తిగా కూడా మారిపోతున్నది. ఆ రకంగా కూడా అయిదువిధాలభక్తిమార్గాలమధ్యా ఉండే సున్నితమైన సరిహద్దుల్ని చెరిపేస్తున్నది. 30 వపాశురం ఫలశ్రుతిగా కావ్యం పరిసమాప్తి చెందుతుంది.
ప్రాచీనసంగంకవిత్వంలోని ప్రణయావస్థలూ, గ్రామసీమలూ, ఉపనిషత్తుల్లోని వేదాంతరహస్యాలూ తిరుప్పావైలో అల్లుకుపోయాయి. ఆండాళ్ దేవుడికోసం పడ్డ విరహంలో దేశం సుభిక్షంగా ఉండాలన్న ఆవేదన ఉంది. భగవంతుణ్ని చేరుకోవడం ఎవరికివారు విడివిడిగా చేసేపనికాదనీ,అదొక బృందగానం కావాలన్న మెలకువ ఉంది. లోకానికి మేలుచేకూరాలన్న శుభకామనకన్నా గొప్పమంగళవాద్యమేముంటుంది? ఇంతకీ నువ్వూ నేనూ చిన్నప్పుడేదో ఒక తిరణాలకి వెళ్ళే ఉంటాం. ఆ సంతోషం, ఆ సంరంభం చూసినప్పుడు మనకేమనిపించిఉంటుంది? మనమొక బూరా కొనుక్కుని నోరారా ఊదిఉంటాం. మనమున్నామనీ, జీవించిఉన్నామనీ, పట్టలేనంత ఆనందంగా ఉన్నామనీ మనకి మనం చెప్పుకోవడానికి మనం చేసిందల్లా నోరారా బూరా ఊదాడమే. అట్లాంటి మంగళమయసంగీతం కోసమొక మహనీయురాలు నోరారాపాడిన గీతం తిరుప్పావై
2
మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తిరుప్పావై మీద నా వ్యాసం మీద మీ ప్రతిస్పందనలకి నా నమస్సులు. ఎందరో పండితులు, ముఖ్యంగా జె.కె.మోహనరావుగారి వంటివారు తిరుప్పావై మీద రాస్తున్నదాని ముందు నా వ్యాసం నా అల్పజ్ఞత్వాన్ని చాటుకోవడమే. అయినా కొన్నేళ్ళుగా ప్రతి ధనుర్మాసంలోనూ ఏదో విధంగా ఆండాళ్ తల్లిని స్మరించుకునే భాగ్యం దొరుకుతూఉంది. ఈ ధనుర్మాసం కూడా అనుకోకుండా ఖదీర్ బాబు వల్ల మరోమారు తిరుప్పావై గురించి మాట్లాడే అదృష్టానికి నోచుకున్నాను.
కొన్ని ప్రతిస్పందనలు,ముఖ్యంగా రామారావు కన్నెగంటి వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని ఎంతో విలువైనవిగా భావిస్తున్నాను. రామారావు నాకెప్పటికీ ఒక అద్భుతంగా కనిపిస్తాడు. ప్రపంచపథికుడు, ప్రపంచ పౌరుడు. తెలుగువాళ్ళు గర్వించదగ్గ వ్యక్తి.
రామారావు, నేను రాసిన వాటిమీద నీ ప్రతిస్పందన వచ్చిన ప్రతి రోజూ నాకెంతో విలువైనది. తిరుప్పావై గురించిన నీ సంవేదనలన్నీ నాకెంతో నచ్చాయి. అయితే, ఒక్కదానిమీద మాత్రం మరికొంత రాయాలనిపిస్తున్నది.
తిరుపావైలో ఉపనిషత్తుల ఆలోచన గురించి ఒక మాట. ఆండాళ్ వ్యక్తం చేసిన అనుభూతికీ, ఉపనిషద్వాక్యాలకీ పోలిక తేవడం సులభమైన పనే. తిరుప్పావై మీద వచ్చిన ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు చేసేదదే. కాని నన్ను చాలా విభ్రాంతి పరిచిన పోలిక ఆత్మ సంబంధమైనది కాదు. అన్నసంబంధమైనది. దైవాన్ని మేల్కొల్పుతూ ఆండాళ్ ఆ నెపం మీద దేశాన్ని మేల్కొల్పుతున్నది. దేవుడు ప్రత్యక్షమైన తరువాత
నేయివెన్న మీగడలు
తీయతీయని పాయసము
చేయిమునుగగా ఆరగింపగా
చేయవా చిత్తగింపవా
అనికోరుకుంటున్నప్పుడు తైత్తిరీయోపనిషత్తు కూడా ఇటువంటి భావాన్నే వ్యక్తం చేసిందని గుర్తురాకుండా ఉండదు. ఆ ఉపనిషత్తు ఆనందాన్ని రెండురకాలుగా పేర్కొంది. మానుషానందం, దివ్యానందమని. మానుషానందమంటే ఆరోగ్యవంతుడూ, సంపన్నుడూ అయిన ఒక యువకుడు లౌకిక జీవితంనుంచి పొందగల ఆనందం. దివ్యానందం దానికన్నా ఎన్నో రెట్లు అధికమంటుంది తైత్తిరీయం. అటువంటి ఆనందాన్ని బ్రహ్మన్ గా తెలుసుకుని ఉపాసించమని చెప్తుంది. అయితే అటువంటీ అనందావస్థకు చేరుకున్న తరువాత ‘అన్నం న నింద్యాత్’ (అన్నాన్ని నిందించకు) అంటుంది. ‘అన్నం బహు కుర్వీత’ (అన్నాన్ని అధికం చెయ్యి) అంటుంది.
తదనంతర యుగాల్లో ఆత్మానందం గురించి మాట్లాడిన కవులు, ఆచార్యులు, అన్నం గురించి మాట్లాడలేదు. ఉపవాసక్లేశంతో ఆత్మసాక్షాత్కారం పొందలేమని గట్టిగా చెప్పినవాడు,మనకు తెలిసి, వివేకానందుడు. భగవద్గీత ద్వారా కన్నా ఫుట్ బాల్ కోర్టుద్వారా భగవంతుణ్ణి తొందరగా చేరుకోగలమన్నాడాయన. ‘తిండి కలిగితె కండ కలదోయ్/ కండ కలవాడేను మనిషోయ్’ అనే గురజాడ వాక్యాలు మొదటిసారి చదివినప్పుడు నాకెంతో కొత్తగానూ, ఊరటగానూ అనిపించాయి.
ఇప్పటిమాటల్లో చెప్పాలంటే, తిరుప్పావై , religious కవిత కాదు, చాలా secular కవిత. పాడిపంటలు, కలిసి జీవించడం, ఉమ్మడిప్రయత్నం, సరళజీవనంవంటి విలువల మీద ఆధారపడ్డ దర్శనం అది. పల్లెలు ఎటువంటి సుభిక్షంతో,సంతోషంతో ఉండాలని గాంధీ కోరుకున్నాడో అటువంటి స్వరాజ్యం అందులో ఉంది. కాని గాంధీ కోరుకున్న స్వరాజ్యంలో లేని రసానుభూతిని తిరుప్పావై చూడగలిగింది. సత్యమూ, సౌందర్యమూ సమన్వయం చెందిన ఈ సంతులితానుభవం మనకు మధ్యయుగాల భక్తికవుల్లో బహుశా తులసీదాస్ లో, ఆధునిక కాలంలో బహుశా టాగోర్ లో మాత్రమే కనవస్తుంది. కాని తులసీ తనకాలంనాటి నమ్మకాల్ని చాలామేరకు వదిలిపెట్టలేకపోయాడు. టాగోర్ దర్శనంలో ‘నేను’ కనబడ్డంతగా ‘మనం’ కనబడదు. రసానుభూతిలో మీరా ఆండాళ్ వంటిదే గాని, దైవంగురించిన ధ్యాసలో మీరా దేహాన్నీ, దేశాన్నీ కూడా మర్చిపోయింది. బహుశా ఆండాళ్ కు సన్నిహితంగా రాగలిగిన కవి తుకారాం. కాని ఆయన కూడా నమ్మాళ్వారులాగా మధురభక్తి అంచులదాకా పోగలిగినవాడేతప్ప మునిగిపోయినవాడు కాడు.
తిరుప్పావై కేవలం శ్రీవైష్ణవానికి మాత్రమే సంబంధించిన కవిత కాదు. ఆ కవిత మొత్తం భారతదేశానికి చెందుతుందనే నేనా కావ్యాన్ని ఇష్టపడుతున్నది.
12-2-2014 & 14-4-2014