మహాశివరాత్రి. శివుడూ, శివరాత్రీ నాలో జన్మాంతర జ్ఞాపకాలతో పాటు, ఇంతదాకా బతికిన బతుకులో కూడా అత్యంత విలువైన క్షణాల్ని మేల్కొల్పుతాయి.
మా ఊళ్ళో మాకొక చిన్న నారింజతోట ఉండేది. అందులో నిమ్మ, నారింజ, టేకు మొక్కల్తో పాటు రెండు మూడు మారేడుమొక్కలు కూడా ఉండేవి. మారేడుమొక్కల్ని చూడగానే మా నాన్నగారెంతో పరవశించిపోయేవారు. ఆయన పేరు విశ్వేశ్వర వెంకట చలపతి. మా తాతగారు కాలినడకన మూడుసార్లు కాశీరామేశ్వర యాత్ర చేసిన లోకసంచారి. పిల్లలకి పెట్టుకున్న పేర్లన్నీ శివసంబంధాలే. మా నాన్నగారిని అంతా విశ్వనాథం అనే పిలిచేవారు. ‘శంభో శంకర సాంబసదాశివ శాంతానంద మహేశ శివ/ఢంఢం ఢమరుక ధరణీ నిశ్చల డుంఠి వినాయక సేవ్య శివ’ అని చప్పట్లు చరుస్తూ ఇల్లంతా తిరుగుతూ ఆయన పాడే ఆ కీర్తనతో నా బాల్యమంతా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆ పాటని మా తాతగారు మధురై నుంచి మోసుకొచ్చారు. ఆయన మధురై వెళ్ళినప్పుడు అక్కడి మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఎవరో భక్తసమూహం కోలాటమాడుతూ ఆ పాటపాడారుట. వాళ్ళెవరో, నేనెవరో? ఏ జన్మాంతర బంధం వాళ్ళనీ, నా పితృపితామహుల్నీ, నన్నూ ఇట్లా ఒక శివచరణంతో ఎందుకు ముడివేసిందో?
పెద్దవాణ్ణయ్యాక, శివకవులూ, శివభక్తులూ, శివక్షేత్రాలూ నా జీవితాన్ని మరింతమరింతగా పెనవేచుకోవడం మొదలయ్యాక, బహుశా, ఈ జీవితంలో నిజమైన ప్రశాంతిని అనుభవించినక్షణాలంటూ ఉంటే శివస్మరణకు నోచుకున్న క్షణాలేనని తెలుస్తూ ఉంది.
యజుర్వేదాంతర్గత రుద్రాధ్యాయం, ఋగ్వేదంలోని రుద్రసూక్తాలు, కుమారసంభవం, శివపురాణం వంటి సంస్కృత వాజ్మయంతో పాటు, ప్రాచీన తమిళసాహిత్యంలోని తిరుమురుగర్రుపాడై, తిరుమూలార్ రచించిన తిరుమంతిరం, అరవైముగ్గురు నాయన్మారుల శివసంకీర్తనాసర్వస్వం, సిద్ధకవుల భక్తిగీతాలు, నాథకవులు, పెరియపురాణం, కన్నడవచన కవులు, పాల్కురికి సోమన్న, శ్రీనాథుడు, ధూర్జటి, కాశ్మీరు శివాద్వైత కవులు, అభినవగుప్తుడి పరమార్థసారం, లల్ల వచనాలు, శివ, శక్తి తంత్రవాజ్మయం, రామలింగస్వామి, సుబ్రహ్మణ్య భారతి, రమణమహర్షి- మహిమాన్వితమైన శివభక్తిభాండారానికి అంతంలేదు.
జీవీతజ్వరం తీవ్రమైనప్పుడల్లా ఏ ఒక్క శివకవి వచనం తీసుకున్నా, అందులో ఒక్క వాక్యం, పదం, పదప్రయోగం చాలు, అంతకన్నా సిద్ధౌషధం లేదు.
అయినా అందరికన్నా నన్ను గాఢంగా హృదయానికి హత్తుకునే శివకవిత్వం మాణిక్యవాచకర్ తో కలిపి నలువురుగా చెప్పబడే అప్పర్, జ్ఞానసంబంధర్, సుందరర్ ల కవిత్వం. తేవారంగా ప్రసిద్ధి చెందిన వారి కవిత్వాన్నీ, మాణిక్యవాచకర్ రాసిన తిరువాచకాన్నీ చదవడానికేనా తమిళం నేర్చుకోవాలనిపిస్తుంది.
భక్తిప్రకటన తొమ్మిది విధాలు, కాని స్వభావరీత్యా భక్తి అయిదు రకాలు. దాస్య, వాత్సల్య, సఖ్య, శాంత, మధుర పద్ద్ధతులు భారతీయ భాషల్లో శివ, శక్తి, రామ, కృష్ణ, భక్తిసాహిత్యాలన్నిటిలోనూ కనిపిస్తాయి. నాకు తెలిసి ఈ ధోరణులు విస్పష్టంగా కనబడటం మొదలయ్యింది నాయన్మారులతోనే.
నాయనారుల్లో అప్పర్ ది దాస్యభక్తి, సంబంధర్ ది వాత్సల్య భక్తి, సుందరర్ ది సఖ్యభక్తి, మాణిక్యవాచకర్ ది మధురభక్తి అంచులదాకా పోగలిగిన శాంతభక్తి. ఆళ్వారుల్లో తిరుమంగై ఆళ్వారుది దాస్యభక్తి, పెరియాళ్వారుది వాత్సల్యభక్తి, నమ్మళ్వారుది మధురభక్తి అంచులదాకా పోగలిగిన సఖ్యభక్తి. ఆండాళ్ ది పరిపూర్ణమైన మధురభక్తి. కన్నడ వచనకవుల్లో అల్లమప్రభునిది శాంతభక్తి, బెజ్జమహాదేవిది వాత్సల్యభక్తి, బసవన్నది మధురభక్తి అంచులదాక పోగలిగిన సఖ్యభక్తి, అక్కమహాదేవిది గాఢానుగాఢమైన మధురభక్తి, తక్కిన వచనకవులందరిదీ దాస్యభక్తి. మహారాష్ట్ర భక్తికవుల్లో జ్ఞానేశ్వర్ ది మధురభక్తి, తుకారాముడిది సఖ్యభక్తి. హిందీభక్తికవుల్లో సూర్ దాస్ ది వాత్సల్యభక్తి, తులసీదాస్ ది శాంతభక్తి, మీరా ది మధురభక్తి.
అప్పర్, సంబంధర్, సుందరమూర్తి కవితలచుట్టూ అల్లుకున్న రమణీయ,స్మరణీయ గాథలన్నిటితో పెరియపురాణం నాకొక తేనెతుట్టెలాగా కనిపిస్తుంది. నాకున్నకలల్లో ఒక అందమైన కల ఇలా ఉంటుంది: నేను శ్రీకాళహస్తినుంచి ఒక యాత్ర మొదలుపెడతాను. పాండ్యనాడు పొడుగునా అప్పర్ స్తుతించిన శివాలయాల్నీ, కావేరీనదికి ఉత్తరదక్షిణాల్లో విస్తరించిన చోళనాడులో సంబంధులు గానం చేసిన ప్రాచీన తమిళగ్రామసీమల్నీ, తొండైనాడులో సుందరమూర్తి ప్రణయంకోసం దేవుడు మధ్యవర్తిత్వం చేసిన దేవాలయాల్నీ, అక్కడి పొగడచెట్లనీ, పున్నాగచెట్లనీ చూస్తూ యాత్ర చేస్తాను. శీర్కాళి, తిరువారూర్, తిరువయ్యారు, చిదంబరం, పుగలూరు, తిరువీళిమిళాలై, మధురై, కంచి, తిరువొట్ట్టియూర్,తిరువాటికై వీరట్టాణం- ప్రతి దేవాలయంలోనూ, ఆ దేవాలయముండే గ్రామంలోనూ ఆగి వాటిని వర్ణిస్తూ తేవారంలో ఏ పదికాలున్నాయో పోల్చుకుని చదువుకుంటాను. నాతో పాటు కొన్ని స్కెచ్ బుక్కులు కూడా ఉంటాయి.అందులో చార్ కోల్ తోనో పెన్సిల్ తోనో ఆ దేవాలయ దృశ్యాల్నీ, ఆ తమిళగ్రామాల్నీ,ఆ చెరువుల్నీ, ఆ కలువల్నీ, ఆ వరిచేలనీ, ఆ కొబ్బరితోటల్నీ బొమ్మలు గీసుకుంటాను… నిజంగా, ఈ జన్మలోనే ఈ కల నిజమైతే!
నలుగురు నాయన్మార్లవీ నాలుగుకవితలు మీకోసం:
అప్పర్
1
ఏమాశ్చ్యర్యం,నిలిచిఉన్నాడాయనొక స్థిరజ్వాలగా
శిలగా, శైలంగా, అడవిగా , నదిగా, వాగుగా, వంకగా
సాగరతీరసుందరవనంగా
సస్యక్షేత్రంగా, తృణలతాగుల్మాలుగా, ఓషధిగా
పురంగా, పురాంతకుడిగా
శబ్దంగా, శబ్దగర్భంలో అర్థంగా
కదిలేదిగా, కదిలించేదిగా
తిందిగింజలుగా, తిండిగింజలు పండే నేలగా
జీవప్రదాతగా, జీవనధారగా
జేగీయమానజ్వాలగా
ఏమాశ్చర్యం, నిలిచిఉన్నాడాయనొక స్థిరజ్వాలగా
2
మణి, మధువు, క్షీరధార, చెరుకుగడ
చక్కెరపానకం, వజ్రం, వేణుగానం
మృదంగధ్వానం, తాళం, తూర్యరావం
మరకతం, పగడం, బంగారం, ముత్యం
పరుప్పత పర్వతశిఖరం
పాపాలు కడిగేసే పరుసవేది
తిరువారూరులో నా తండ్రి.
నేనొక కుక్కని, ఒకప్పుడాయన్ని
చూసి కూడా పోల్చుకోలేకపోయాను
3
కంచిలో ఏకామ్రేశ్వరా,
సకల సద్గ్రంథాల సాక్షిగా
నన్ను పండితుణ్ణి చేసావు
అప్పుడు జైనులకి దగ్గరచేసావు
నన్ను హతమార్చాలనే తలపు
వాళ్ళకిపుట్టించిందీ నువ్వే
నన్ను వ్యాథి చుట్టబెట్టినప్పుడు
మందు తినిపించావు
నిద్రపోతున్న నన్నుమేల్కొల్పడానికి
దగ్గరకొచ్చావు
ఇంక ఇప్పుడు కూడా
నిన్ను సరిగ్గా సేవించుకోకపోతే
చింతబరికెతో నా వీపు చిట్లగొట్టు.
సంబంధర్
1
ఆయనుండేదేకొండపైన అడిగావనుకో
నేనిట్లా చెప్తాను:
ఎవరి జటాజూటంలో నెలవంక తళుకులీనుతుందో
ఎవరి జ్వాలాధనువుతో త్రిపురాలు దగ్ధం చేసాడో
ఆయన తిరిగేది కాళహస్తి కొండలమీద.
దట్టమైన అడవులమధ్య
వెదురుపొదల్లో ఎగిసిపడే వెలుతురు తునకలెక్కడివి?
ప్రాచీన వరాహాలు భూమిని పెళ్ళగించినప్పుడు
బయటపడ్డమణిమయ కాంతుల
కాళహస్తి కొండలమీదనే
ఆయన తిరుగాడేది
2
మా స్వామిఉండే ఊరు తిరువయ్యారు.
పంచేంద్రియాలూ పంజరం నుంచి బయటపడి
బుద్ధిమాంద్యంకమ్మి,భయం ఆవహించినప్పుడు
జీవితభయం నుంచి విడుదలచేస్తాడాయన
నర్తకీమణులు దేవాలయప్రదక్షిణం చేసేటప్పుడు
మృదంగధ్వనిని వింటూ
ఉరుముచప్పుడు విన్నట్టు
వానమబ్బులకోసం ఆడకోతులు వెతుక్కునే
తిరువయ్యారు.
స్వర్గానికి అడ్డుపడ్డ మూడుపురాల్ని
ఒకేఒక్క బాణంతో తగలబెట్టే
విలుకాడుండే చోటు తిరువయ్యారు.
అక్కడ కొండమీద కోకిల పాడుతుంది
తరగని తేనెవాకల పూలతోటల
తీపిగాలులు మృదువుగా ముద్దాడే
చెరుకుతోటల ఊరు తిరువయ్యారు.
కైలాసశిఖరాన్ని కదిలించాలనుకున్న
దశకంఠుడి పదితలల్నీ అణగదొక్కి
అప్పుడనుగ్రహించాడే ఆ
స్వామి కోవెల తిరువయ్యారు.
వరిచేను గట్టుమీద చిన్నకొబ్బరిచెట్టు,
కిందపడుతున్న కొబ్బరిబొండానికి
బెదిరి పొలాలకు అడ్డం పరుగెడుతున్న గేదె.
చెదిరిన వరికంకుల, కలువపూల
పంటపొలాల ఊరు తిరువయ్యారు.
3
ఓ కపర్దీ అని పిలుస్తుందామె.
నా జీవితాధారమా అని అరుస్తుంది
ఎద్దునెక్కి తిరుగుతున్నావంటూ అరుస్తుంది.
నీలికలువలు విరబూసిన
మరుకల్ గ్రామదైవమా
ఆమెనట్లా ప్రేమరోగగ్రస్తని చెయ్యడం
న్యాయమా?
నీ ఆలోచనలు భరించలేనంటుంది
చల్లనివాడా, చిరకాలంనుంచీ తెలిసినవాడా,
అందరికన్నా మొనగాడా అంటూ పిలుస్తుంది
నీలికలువలు గుత్తులు గుత్తులు
వికసించిన మరుకల్ సీమ దైవమా
ఆమెనట్ల విరహాగ్నికర్పించండం
న్యాయమా?
సుందరమూర్తి
1
వెణ్ణైనల్లూరులో నన్ను దఖలుపర్చుకున్న
ఆ కవీంద్రుడి సొంతవూరు నావలూరు
చక్కని ఒక్క బాణంతో
శత్రువు మూడు పురాలకూ నిప్పుపెట్టాడు
బ్రహ్మా,విష్ణువూ కూడా
అతడిముందు మూగపోతారు
అంతంలేని దయంతో నన్ను స్వంతం
చేసుకున్న నా చక్కనిస్వామి
సొంత ఊరు నావలూరు.
సభామంటపంలో అందరిముందూ
నిందించేను.అందుకు బహుమానం
నాకొక బిరుదు తుంటరి భక్తుడని.
నేను తిట్లు వర్షించేను
ఆయన సంపద కురిపించేడు.
2
కుటిలాతికుటిలుడైన మనుషుణ్ణి
నీచుణ్ణి, పాపిని, దుష్టుణ్ణి, నేరస్థుణ్ణి
ఒకణ్ణి మీరు సజ్జనుడని పిలవండి
ప్రశంసించండి
అయినా వాడొక పైసా కూడా విదల్చడు
కవులారా, ఎవరి జటాజూట రక్తిమ
మేలిమి బంగారంగా మెరుస్తుందో
ఆ పుగలూరు దేవుణ్ణి పొగిడిచూడండి
ప్రపంచదుఃఖం నుంచి మరుక్షణమే
బయటపడతారు.
3
నా ప్రభువు నాకోసమొక
మదపుటేనుగ పంపించాడు
ఇంద్రుణ్నీ, విష్ణువునీ
బ్రహ్మతో సహా దేవతలందర్నీ
నాకు స్వాగతమిమ్మన్నాడు
సప్తర్షులా దృశ్యం చూసి
ఎవరీమానవుడని అడిగితే
నొట్టిట్టాణమలై సర్వేశ్వరన్నాడు కదా
‘వీడు సుందరమూర్తి, నా చెలికాడు’
మాణిక్యవాచకర్
1
నన్ను పొదివిపట్టుకున్నాడు
లేకపోతే జారిపోయిఉందును
నిప్పుముందు మైనంలాగా
మనసు కరిగింది, తనువు వణికింది
మోకరిల్లాను, విలపించాను
నర్తించాను, రోదించాను
పాటలు పాడేను, ప్రశంసించేను
స్త్రీ పరిష్వంగంలాంటిది
ఏనుగు తొండంలాంటిది
ప్రేమ. పట్టుకుంటే, వదలదు.
నన్నొక పచ్చనిచెట్టులో
మేకులాగా దిగ్గొట్టింది
కడలిలాగా ఉప్పోంగేను
ఎదమెత్తనై సొదగుందేను
నన్ను లోకం దెయ్యమంది
పరిహసించింది
సిగ్గు ఎప్పుడో వదిలేసాను
ఊళ్ళోవాళ్ళ వెక్కిరింతలు
నగలుగా తొడుక్కున్నాను.
ఆ సంతోషసంభ్రమం అలాంటిది
అక్కడ ఇంగితజ్ఞానానికి చోటులేదు.
26-2-2014