ఆరు గంటల రైలు ప్రయాణం, గంట కాబ్ ప్రయాణం తర్వాత ఇంటికొచ్చేటప్పటికి గడియారంలో తేదీ మారుతోంది. ఇంట్లో అడుగుపెట్టగానే బల్లమీద కొరియర్ పాకెట్. అందులో The Page and The Fire (ఆర్క్ పబ్లికేషన్స్, 2007) ఉందని నాకు తెలుసు. విప్పి చూద్దును కదా, నా అలసట అంతా ఎగిరిపోయింది.
రష్యన్ కవులు రష్యన్ కవుల మీద రాసిన, రాసుకున్న కవితల అనువాద సంకలనమది. అటువంటి తరహా సంకలనం అదేనేమో. కవులు కవుల మీద రాసుకున్న కవితల సంపుటి.
కాని ఆ కవులకీ, వాళ్ళు కవితలు రాసుకున్న కాలానికీ కూడా ప్రపంచ సాహిత్యంలో మరొక పోలిక లేదు. అటువంటి తరహా కవులు వాళ్ళు మాత్రమే.
రష్యన్ కవిత్వంలో రజతయుగంగా పిలుచుకునే కాలానికి (1890-1925)చెందిన కవులు వాళ్ళు. 19 వ శతాబ్ది రష్యన్ కవిత్వంలో స్వర్ణ యుగంగా గుర్తింపు పొందింది. పందొమ్మిదవ శతాబ్ది చివరనుండి ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో రష్యన్ సమాజం రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఊహించలేనంత ఒడిదుడుకులకి లోనయ్యింది. 1914 లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యాక, రష్యన్ ముఖచిత్రమే మారిపోయింది. అందుకనే అన్నా అఖ్మతోవా అన్నట్టు, కాలండర్ ప్రకారం 20 వ శతాబ్దం ఎప్పుడైనా మొదలై ఉండవచ్చుగాక, రష్యన్ జీవితానికి మాత్రం 1914 లోనే మొదలయ్యింది. 1917 అక్టోబర్ విప్లవంతో రష్యా సోవియెట్ రష్యాగా కొత్త జీవితం మొదలుపెట్టింది. ఆ యుగసంధిలో రష్యాలో వికసించిన కవిత్వాన్ని Silver Age కవిత్వంగా పేర్కొంటున్నారు.
ఒక బ్లాగిస్టు వర్ణించినట్టుగా సిల్వర్ ఏజ్ కవులు ‘బరువుగా ఊగుతూన్న మహాద్వారాల ముందు ద్వారపాలకులుగా, వైతాళికులుగా, తలుపులు మూసేవాళ్ళుగా, తెరిచేవాళ్ళుగా’ కొనసాగారు. కూలిపోతున్న పాతయుగాలు, ప్రభవిస్తున్న కొత్త సమాజం, రేకెత్తిస్తున్న ఆశలు, కలిగిస్తున్న నిరాశలు-వాటన్నిటినీ స్వేచ్ఛగా గానం చెయ్యడానికి వీల్లేకుండా రాజ్యం అణచివేత, ప్రవాసం, దేశబహిష్కారం, మతిభ్రమణం, ఆత్మహత్య- రష్యన్ రజతయుగ కవిత్వంలో సంతోషంకన్నా విషాదమే ఎక్కువ.
రజతయుగం ఎప్పుడు మొదలైందనే దానిమీద చాలానే అభిప్రాయాలున్నప్పటికీ, అందరూ అంగీకరించేది,ఆ యుగకర్త అలెగ్జాండర్ బ్లాక్ అనే. ఫ్రెంచి సింబలిస్టుల ప్రభావంతో బ్లాక్ ఇంద్రియగోచర ప్రపంచానికీ, ఇంద్రియాతీత రహస్యాలకూ మధ్య రంగుల్తో, రాగాల్తో సేతువు కట్టాడు. రెండవ పుష్కిన్ లాంటి బ్లాక్ ని చదువుతూ, అభిమానిస్తూ, ఆరాధిస్తూనే ఎందరో యువతీయువకులు రానున్న కాలంలో రష్యన్ మహాకవులుగా వికసించారు. సోవియెట్ రష్యా ఏర్పడ్డాక బ్లాక్ మీద నిర్బంధం మొదలయింది. ఆయన వైద్యం కోసం విదేశాలకు వెళ్ళడానికి ప్రభుత్వం అనుమతించలేదు. స్వయంగా గోర్కీ కలగచేసుకుని లూనాషార్కీకి ఉత్తరం రాసాడు. కాని ప్రభుత్వం అనుమతించేటప్పటికే బ్లాక్ 1921 లో మరణించాడు. సిల్వర్ యుగం పతాకదశ, పతనదశ కూడా అప్పుడే.
గుమిల్యోవ్ ఒక యువకుడిగా బ్లాక్ ని ఆరాధిస్తూనే ఆయనతో విభేదిస్తూ కొత్త పుంత తొక్కాడు. బ్లాక్ సింబాలిజం అగోచరానికి పెద్దపీట వేస్తోందనీ, అట్లా కాక, కవులు తాము చూస్తున్నదాన్నే నిర్దుష్టంగా, స్పష్టంగా చెప్పాలనీ acmeism అనే కొత్తధోరణి తీసుకువచ్చాడు. అతణ్ణి ప్రేమించి పెళ్ళిచేసుకున్న అన్నా అఖ్మతోవా తో పాటు ఒసిప్ మెండల్ స్టామ్ లు కూడా ఆయన్ని అనుసరించారు. కాని, బ్లాక్ మరణించిన కొన్ని రోజులకే గుమిల్యొవ్ రాజ్యవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడని సోవియెట్ ప్రభుత్వం కాల్చి చంపేసింది. కాని అన్నా దేశం విడిచిపోలేదు. ఆమె తన దేశంలోనే ఎటువంటి కష్టనష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడింది. అట్లానే ఎదుర్కుంది కూడా. ఆమె కుమారుణ్ణి ప్రభుత్వం అరెష్టు చేసి ఏళ్ళతరబడి నిర్బంధించింది. ఆ తల్లి ఒక్కర్తే అణచివేత మధ్య, గుండెకోత మధ్య జీవితకాలం పాటు కవిత్వం చెప్తూనే ఉంది.
మరొక కవి, ఓసిప్ మెండెల్ స్టామ్ చాలా మంది దృష్టిలో 20 వ శతాబ్దపు రష్యన్ కవుల్లో అగ్రగణ్యుడు. పాల్ సెలాన్ దృష్టిలో ప్రపంచ కవుల్లోనే అగ్రగణ్యుడు. ఒక రోజు తన మిత్రబృందం మధ్య స్టాలిన్ ని విమర్శిస్తూ ఒక కవిత చెప్పినందుకు అతణ్ణి ఊరల్ పర్వతప్రాంతానికి ప్రవాసం పంపించారు. 1934 లో అక్కడ లేబర్ కాంపులో అతడు మరణించాడు. అతడి కవిత్వం కూడా అతడి భార్య కంఠతా పట్టి గుర్తుపెట్టుకున్నందువల్లే వెలుగు చూసింది.
బ్లాక్ ని ఆరాధిస్తూనే అతడితో విభేదించిన వెలిమీర్ ఖ్లెబ్నికొవ్ futurism అనే కొత్తధోరణిలో కవిత్వం రాసాడు. అది సంప్రదాయం మీద పూర్తి తిరుగుబాటు, విప్లవానికి వేకువపిలుపు. కాని 36 ఏళ్ళు తిరక్కుండానే మరణించాడు. అతడి దారిలో కవిత్వం చెప్పిన మయకోవస్కీ ప్రపంచవిఖ్యాతి చెందినవాడు. విప్లవాన్ని స్వాగతించినవాడు. కాని కొన్నేళ్ళు కూడా తిరక్కుండానే మారిన పరిస్థితులకి తట్టుకోలేకపోయాడు. 1930 లో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ రెండు ధోరణులకూ చెందకుండా బ్లాక్ ప్రభావంలో కవిత్వం చెప్పిన కవులు మరికొందరున్నారు. ఒకరు సెర్గెయ్ యెసెనిన్ అనే గ్రామీణ గీతకవి. 30 ఏళ్ళు తిరక్కుండానే ఒకరోజు పీటర్స్ బర్గ్ లో ఒక హోటల్లో తన రక్తంతో చివరి కవిత రాసి ఉరేసుకు చనిపోయాడు.
మరొక కవి, మరీనా స్వెతేవా కథ మరింత దుర్భరం.ఆమె విప్లవకాలంలో ప్రవాసిగా జర్మనీలో,ఫ్రాన్సులో గడిపింది. 1939 లో తన భర్త, కుమార్తె తో రష్యా తిరిగివచ్చింది. కాని వెంటనే ఆమె భర్తను అరెస్టు చేసారు. కూతుర్ని పోషించుకోవడానికి ఆమె అష్టకష్టాలు పడింది. చివరికి దొంగతనాలు కూడా చేసింది. కాని ఆకలిబాధ తాళలేక కూతురు చనిపోయింది. ఆమెను కూడా ప్రవాసం పంపించేసారు. చివరికి 1941 లో ఆమె ఉరేసుకుని చనిపోయింది.
ఇక సిల్వర్ ఏజ్ కి చెందిన కవులందరిలో ప్రపంచప్రఖ్యాతి చెందిన వాడు బోరిస్ పాస్టర్ నాక్. అతడికి 1958 లో నోబెల్ బహుమతి వచ్చింది. కానీ అతడు దాన్ని స్వీకరించడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. అతడు దేశం విడిచివెళ్తే అతడి భార్యని అరెష్టు చేస్తామంది. అణచివేత మధ్య, నిర్బంధం మధ్యనే అతడు మరణించాడు.
ఈ తొలితరం రజత యుగ మహాకవుల కవిత్వం గురించి చాలాకాలం రహస్యంగానూ, ఇప్పుడు విస్తృతంగానూ ప్రపంచానికి పరిచయం చేస్తున్న వ్లదిమీర్ నబకొవ్, యెవెగ్ని యెవుతుషెంకొ, బెలా అఖ్మదులినా, జోసెఫ్ బ్రాడ్స్కీ, యెవ్గ్నీ రెయిన్, ఆంద్రే వోజ్ఞె సెంస్కీ వంటివారున్నారు. వీరిలో బ్రాడ్స్కీ, ఆంద్రే వోజ్ఞె సెంస్కీతప్ప తక్కినవారంతా జీవించే ఉన్నారు.
అటువంటి కవులు, ఒకరిమీద ఒకరు ప్రేమతో, ఆరాధనతో చెప్పుకున్న కవిత్వం. ఏ వ్యవస్థలోనైనా సత్యాన్వేషులెప్పుడూ అల్పసంఖ్యాకకవర్గమే. కనుకనే ఆ కొద్దిమందీ ఒకరినొకరు మానసికంగా విడవకుండా, ఆత్మికంగా చేరువగా ఉండాలని కోరుకుంటూ రాసుకున్న కవితలు. మరీనా సెతేవా రాసినట్టుగా:
Dis-located; separated
by miles, dis-jointed, dis-seminated
so each stay quietly in his place
at either end of the planet’s face
ఆ కవితల్లో ఒక యుగాంతముంది, ఒక నవయుగారంభమూ ఉంది. కాని అది 19 వ శతాబ్ది అంతమూ, 20 వ శతాబ్ది ప్రారంభమూ కాదు. అణచివేతల యుగాంతం. స్వేచ్ఛాగానపు నవోదయం. కాని ఆ నవోదయం ఎక్కడైనా, ఎప్పుడైనా నిజంగా సిద్ధిస్తుందా?
మీకోసం రెండు కవితలు. మొదటిది, డెలీరియం లాంటి స్థితిలో అన్నా అఖ్మతోవా రాసిన కవిత. రెండవది, అలెగ్జాండర్ బ్లాక్ మీద యెవెగ్నీ యెవుత్షెంకో బ్లాక్ తరహాలోనే రాసిన కవిత.
*
మేము నలుగురమూ
“ఈ బక్కచిక్కిన జిప్సీ మహిళ బహుశా
డాంటే చిత్రించిన నరకహింసలన్నీ పడకతప్పదేమో ..” (ఓసిప్ మెండల్ స్టామ్)
“నేను నీ చూపుల్నీ, నీ వదనాన్నీ చూస్తానట్లా.. “(బోరిస్ పాస్టర్ నాక్)
“కవితా ఓ కవితా…” (మరీనా స్వెతేవా)
*
నేనిక్కడికి వస్తూనే సమస్తం వదిలిపెట్టేసాను
పుడమి మనకందించే మహద్భాగ్యాలన్నీ.
నా ఆత్మ, తన స్వక్షేత్ర సంరక్షకురాలు
ఇప్పుడు అడవిలో మొద్దులాగ పడిఉంది.
మనమంతా ఈ జీవితానికి అతిథుల్లాంటివాళ్ళం.
బతకడం అలవాటుగా మారిపోయింది,అంతే.
కాని గాల్లో ఏదో ప్రకంపిస్తున్నట్టనిపిస్తోంది-
రెండు స్వరాలు ముందుకీ వెనక్కీ పిలుస్తున్నాయి.
రెండేనా?- కాదు, చూడు, ఆ తూర్పుగోడ
పక్కగాఉసిరికొమ్మల మధ్యనుంచి తాజాగా,
బలంగాముందుకు పొడుచుకొస్తున్న సన్నని
పెద్ద కొమ్మ, మరీనా నుంచి ఒక పలకరింపు.
బ్లాక్ గుర్తొస్తున్నప్పుడు
బ్లాక్ నా మదిలో ఎప్పుడు మెదిలినా
నేనతడికోసం ఎప్పుడు అర్రులు చాచినా
నాకు గుర్తొచ్చేది అతడి వాక్యం కాదు,
ఒక వంతెన, నది, ఒక గుర్రబ్బండీను.
రాత్రి చీకటిస్వరాలసాలెగూటిమధ్య
ఒక ఆశ్వికుడి రూపం గోచరిస్తుంది
మెరుస్తున్న నిరాశామయ దృక్కులతో
నల్లని ఫ్రాకుకోటు లీలగా గోచరిస్తుంది.
వెలుగునీడలు అతడికి ఎదురేగుతాయి,
తారలు రాలి వీథంతా పరుచుకుంటాయి.
వాళ్ళ కలయికలో విషాదాన్ని మించిందేదో
ఉందని ఆ తెల్లటివేళ్ళు సంజ్ఞచేస్తుంటాయి.
ఇక అప్పుడు, ఒక విచిత్రనాందీప్రస్తావనలా
స్ఫుటంగా, కానీఅస్పష్టంగా, కీచుమంటున్న
బండిచుట్టూ మంచు కమ్మేస్తుంది, మేఘాలు
బ్లాక్, రాళ్ళదారి-కనుమరుగై పోతాయి..
18-9-2016