నాటకరంగం: నాలుగు ఆలోచనలు

4

గత నాలుగు రోజులుగా రవీంద్రభారతిలో జరుగుతున్న జాతీయస్థాయి బహుభాషా నాటకోత్సవాల ముగింపు వేడుకలకి నన్ను ముఖ్య అతిథిగా రమ్మని ‘అభినయ’ శ్రీనివాస్ ఆహ్వానించాడు. 2006 నుంచి ప్రతి ఏటా హైదరాబాదులోనూ, తిరుపతిలోనూ ఒంటిచేతి మీద ఆయన నిర్వహిస్తున్న ఈ వేడుకలు నాటకరరంగానికి గొప్ప ఉపాదానం.

ఆ నాటకోత్సవాల ముగింపువేడుకలకి ముఖ్య అతిథిగా హాజరుకావడం నాకు లభించిన గౌరవంగానూ, నేను చిరకాలం గుర్తుంచుకునే జ్ఞాపకంగానూ భావిస్తానని చెప్పాను. అందుకు కారణం నన్ను నేనొక నాటకరంగ విద్యార్థిగా భావించుకోవడమే. నా జీవితం నేననుకున్నట్టే సాగివుంటే బహుశా నేనొక నాటకప్రయోక్తగా జీవించడానికే ఎక్కువ మొగ్గు చూపిఉండేవాణ్ణని చెప్పాను. ఇరవయ్యేళ్ళ వయసులోనే నాకు జనరంజక ప్రయోక్త టి.జె.రామనాథంలో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. గురజాడ కళాసమితి కోసం నేను ‘స్వాతంత్రోద్యమ శంఖారావం’ రూపకం రాయడం, ఆ రూపకం రిహార్సల్సుకోసం నెలరోజులపాటు రోజూ రాత్రి ధవిళేశ్వరంలో రామనాథంగారితో గడపడం నాకు లభించిన గొప్ప అవకాశాలు.

తెలుగులో నాటకరంగాన్ని పునరుద్ధరించాలనేది అట్లాంటి వేదికలమీద ప్రతి ఒక్కరూ మాట్లాడే మాట. అట్లాంటి వేదికలమీద మామూలుగా వినిపించినట్టే నిన్న కూడా, నాటకరంగానికి ప్రభుత్వం ప్రోత్సాహమివ్వాలనీ, ఏడాది పొడుగునా కేవలం నాటకప్రదర్శనలకు మాత్రమే ఉపయోగించుకునే ఒక రంగస్థలాన్ని నిర్మించాలనీ, అటువంటివే మరికొన్ని అభ్యర్థనలు కూడా వినిపించాయి.

కాని నా ఆలోచనలు వేరేలా ఉన్నాయి. వాటినే అక్కడ హాజరైన నాటకాభిమానులతో పంచుకునే ప్రయత్నం చేసాను. నాటకరంగం వికసించాలంటే, వర్థిల్లాలంటే ప్రభుత్వాలు చెయ్యగలిగేది చాలా తక్కువనీ, ప్రభుత్వ ప్రోత్సాహంతో నాటకరంగం నిలబడుతుందనుకోవడం సరైన ఆలోచన కానేకాదనీ నా నమ్మకం. నా దృష్టిలో:

1

నాటకరంగానికి కావలసింది ప్రజల వైఖరిలో మార్పు. తెలుగునేల మీద తక్కిన సాంస్కృతిక రూపాలన్నీ అదృశ్యమవుతూ నిన్నటిదాకా సినిమా, ఇప్పుడు టివి ప్రధాన సాంస్కృతిక మాధ్యమాలుగా మారిపోయాయి. కాని అభివృద్ధిచెందిన దేశాల్లో పరిస్థ్తితి ఇందుకు భిన్నం. నేను కొన్నేళ్ళ కిందట ఇంగ్లాండు వెళ్ళినప్పుడు అక్కడ ఒకరోజు ఇంగ్లీషు పేషెంటు సినిమా విడుదలైంది. ఎనిమిది ఆస్కారు అవార్డులు పొందిన సినిమా అది. బెన్ హర్ తరువాత మళ్ళా ఎన్నో ఏళ్ళకు గానీ బ్రిటిష్ సినిమాకి ఆ గౌరవం దక్కలేదు. అయినా కూడా సినిమా విడుదలైన మొదటిరోజున థియేటర్ లో పట్టుమని పదిమంది కూడా ప్రేక్షకులు లేరు. అదే రెండుమూడు రోజుల తరువాత ఒక రూపక ప్రదర్శనకు వెళ్తే ఆ హాలు మొత్తం కిక్కిరిసిపోయి కనిపించింది. రూపకప్రదర్శనలు చూడటానికి విరగబడటమనేది ఒక జాతి అత్యున్నత సౌందర్యసంస్కారాన్ని సాధించిందనడానికి గుర్తని అర్థమయ్యింది నాకు. తెలుగు జాతి ఇంకా శైశవదశలోనూ, ప్రాథమిక స్థాయిలోనూ మాత్రమే ఉందనడానికి మన సినిమాహాళ్ళే నిదర్శనం. ఈ సంగతి ప్రజలకి చెప్పాలి. తమ అభిరుచి ఇంకా పరిణతి చెందలేదని ప్రజలకి తెలియవలసిఉంది.

2

అలా అని నేను సినిమా మాధ్యమాన్ని తక్కువచేస్తున్నానని కాదు. కాని తెరమీద చూపించే ప్రదర్శనకీ, రంగస్థలం మీద చూపించే ప్రదర్శనకీ ప్రాయికంగా ఒక ముఖ్యమైన తేడా ఉంది. తెరమీద ప్రదర్శన చూస్తున్నప్పుడు ప్రేక్షకుడిది చాలా passive involvement. కాని రంగస్థలం మీద ప్రదర్శన జరుగుతున్నప్పుడు ప్రేక్షకుడు ఆ ప్రదర్శనతో active గా involve కావడమే కాకుండా దాంతో ఎక్కువ తాదాత్మ్యం చెందగలుగుతాడు.సినిమా కూడా రసోత్పత్తి చెయ్యగలదుగాని, నాటకానికి సహజంగానే ఒక క్రతుస్వభావముంది. అసలు, భారతడేశంలోగానీ, ప్రాచీన గ్రీసులోగాని రూపకం పుట్టిందే మతపరమైన క్రతువుల్లోంచి. దీన్నే రామనాథంగారు క్లుప్తంగా ‘సినిమా దర్శకుడికి చప్పట్లు వినబడవు. ఆ అదృష్టం నాటకదర్శకుడి మాత్రమే’ అనేవాడు.

3

ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది నాటకాల్ని ఆదరించింది ప్రజలు తప్ప ప్రభుత్వాలు కాదనేది. కాని ప్రజలు నేరుగా టిక్కెట్లు కొనుక్కుని సినిమాలకు వెళ్ళినట్టు నాటకాలకు ఎందుకురారనేది పెద్ద ప్రశ్న. ఇందుకు కారణం మనం నాటకరంగ చరిత్రలో వెదకాలి. సినిమాలాగా నాటకం ఒక థియేటర్ చుట్టూ పెరిగింది కాదు. అది ప్రజల జీవితంతోనూ, వాళ్ళ దైనందిన కాలెండరు తోనూ ముడిపడి పెరిగింది. బెంగాలో లో జాత్రా, గుజరాత్ లో భవాయీ, మరాఠీలో తమాషా, కేరళలో కొడియెట్టం, తెలుగునాట భామాకలాపం ప్రజలవల్ల ప్రజలకోసం వికసించిన కళారూపాలు. అవి ప్రజల వృత్తిజీవితంతోనూ, తీరికసమయంతోనూ పెనవైచుకున్న ప్రక్రియలు. ఇప్పటికీ గ్రామాల్లో సంక్రాంతి మొదలుకుని తొలకరి వచ్చేదాకా ఆరునెలలపాటు రకరకాల కళా రూపాలు ప్రదర్శనలు సాగుతూనే ఉంటాయి. Low cost లేదా no cost రంగస్థలంతో, ఒకటి రెండు రోజుల ముందస్తు ప్రకటనతో వందమంది ప్రేక్షకులు దొరికినా కూడా రూపకాల్ని ప్రదర్శించి నగదు రూపంగానో, వస్తురూపంగానో ప్రతిఫలం స్వీకరించి కుటుంబాలకు కుటుంబాలు వృత్తికళాకారులుగా బతకడం మనం కళ్ళారా చూసాం. రూపకాన్ని ప్రజల దైనందిన జీవితం నుంచి విడదీసి సినిమాలాగా ఒక థియేటర్ కు పరిమితం చేసి అక్కడికే ప్రేక్షకులు రావాలని కోరుకోవాలంటే, అది శ్రీ శ్రీ చెప్పినట్టు మెట్రొపోలిటన్ సంస్కృతి పూర్తిగా వృద్ధిచెందితే తప్ప సాధ్యం కాదు. కాని మన దేశంలో నాలుగైదు మహానగరాలు తప్ప తక్కినవన్నీ అటు గ్రామాలూ కాదు, ఇటు నగరాలుగానూ మారలేదని మనం గుర్తుపెట్టుకోవాలి.

4

ప్రజలు నాటకాన్ని స్వంతం చేసుకోవాలంటే అది వాళ్ళ జీవితానికీ, వాళ్ళ సుఖదు:ఖాలకీ చెందినదై ఉండాలని వేరేచెప్పనక్కర్లేదు. కాని మన నాటకాల్లో అటువంటి నాచురలిజంగాని, రియలిజంగానీ చాలా తక్కువ. అందుకు కారణం సిద్ధహస్తులైన నాటకరచయితలు కొరవడటమే. ఈ మాట చాలామంది నాటకరచయితలకి కోపం తెప్పిస్తుందని నాకు తెలుసు. కాని ప్రపంచనాటకం పట్ల నాకున్న కొద్దిపాటి అవగాహనతోనూ నేనీ మాటలు చెప్పడానికి సాహసిస్తున్నాను. పందొమ్మిదో శతాబ్దిలో యూరోప్ లో పారిశ్రామికీకరణను ప్రశ్నిస్తూ గెర్టార్ట్ హౌప్ట్ మన్ ‘ద వీవర్స్’ నాటకం రాసాడు. అది ఒక్క జర్మనీనే కాదు, మొత్తం యూరోప్ నే కుదిపేసింది. సిరిసిల్లలో చేనేతకారుల ఆత్మహత్యలమీద మనకి అటువంటి రూపకమింతదాకా ఎందుకు రాలేదు? రెండున్నరవేల ఏళ్ళకిందట రాజధర్మానికీ, భ్రాతృధర్మానికీమధ్య సంఘర్షణని చిత్రిస్తూ సోఫోకిల్స్ ‘యాంటిగని’ రాసాడు. ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లవకారుల శవాల్ని తమకి అప్పగించమని కొన్నేళ్ళ కిందట తెలుగునాట పెద్ద పోరాటమే జరిగింది. కాని ఆ సమస్యనుంచి మనకొక యాంటిగని లాంటి రూపకమెందుకు రాలేదు? ఔత్సాహిక నాటక రచయితలూ, ప్రయోక్తలూ కూడా ప్రయోగాత్మకంగా రూపకాన్ని ప్రదర్శించడం మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప నాటకశిల్పాన్ని పట్టించుకోవడం లేదు. సాంప్రదాయిక నాటకశిల్పం మీద తిరుగుబాటుచేసి Epic Theatre పేరిట ప్రయోగాలు చేసిన బ్రెహ్ట్ కూడా తన నాటకరచనలో శిల్పం మీద ఎంతో శ్రద్ధ కనపరిచినందువల్లనే ‘గెలీలియో’, ‘మదర్ కరేజి’ వంటి నాటకాలు రచనలుగా ఇవ్వాళ్టికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.

నాటకోత్సవాల ముగింపువేడుకల్లో భాగంగా మణిపూర్ నుంచి వచ్చిన బనియన్ రెపర్టరీ థియేటర్ వారు Oppressed People అనే రూపకాన్ని ప్రదర్శించారు. 50 నిమిషాల వ్యవథిగల ఈ రూపకానికి ఎం.సి.తోయిబా దర్శకత్వం వహించారు. నలభయ్యేళ్ళకిందట (1974) లో మణిపూర్ జిల్లాలో ఒక మారుమూల గిరిజన గ్రామం మీద సైన్యం దాడి చేసినప్పుడు ఒక గిరిజన యువతిని మానభంగం చేసి చంపేసిన ఇతివృత్తాన్ని నేటి మణిపూర్ సమాజానికి గుర్తు చెయ్యడం కోసం రాసిన నాటకం. కాని అది ఇప్పటి మణిపూర్ పరిస్థితుల్ని కూడా తక్కిన భారతదేశానికి కళ్ళకు కట్టే విధంగా చూపిస్తోందనవచ్చు. నాటకం మణిపురిలోనే మాట్లాడినా నాటకసందేశం అర్థం చేసుకోవడానికి భాష ప్రతిబంధకం కాలేదు. నాటకాన్ని చూస్తున్నంతసేపూ అదిలాబాద్ జిల్లాలోనో, భద్రగిరి అడవుల్లోనో సంచరిస్తున్నట్టే ఉంది. నాటకంలో మరో విశేషం పాత్రలతో పాటు నాలుగు లేళ్ళు కూడా రంగస్థలం మీద ఉంటాయి. అంతరించిపోతున్న ‘సంగాయి’ అనే వన్యమృగాల్ని ఆ గిరిజన జీవితాలకు ప్రతీకగా దర్శకుడు రంగస్థలం మీద సమాంతరంగా చూపిస్తూ వచ్చాడు.

Leave a Reply

%d bloggers like this: