ద సీగల్

41

ఆదివారం ఒక సెకండ్ హాండ్ బుక్ స్టాల్లో Seeds of Modern Drama ( Dell, 1963) దొరికితే తెచ్చుకుని అందులో చెకోవ్ ‘ద సీగల్ ‘ చదివాను. దాదాపు పాతికేళ్ళ తర్వాత మళ్ళా చదివానన్న మాట. మొదటిసారి చదివినప్పుడు బహుశా కథకోసం చదివిఉంటాను. ఇతివృత్తమేమిటో అర్థం చేసుకోవాలని ప్రయత్నించిఉంటాను. కాని ఇప్పుడు?

ఇందులో ఇతివృత్తమేమిటి? ఒకడొక సరోవరతీరానికి వెళ్ళి అందమైన సరస్తీరపక్షినొకదాన్ని చూస్తాడు. మరేం చెయ్యాలో తెలీక దాన్ని వేటాడి వెళ్ళిపోతాడు. అంతేనా?

పందొమ్మిదో శతాబ్ది చివరిలో (1895) రాసిన ఈ నాటకాన్ని కొందరు నాచురలిజానికి చెందిన రచనగా భావిస్తే కొందరు రియలిజానికి చెందిన రచనగా భావించారు. కాని చెకోవ్ ప్రధానంగా ఇంప్రెషనిష్టు కథాశిల్పి. ఫ్రెంచి సింబలిస్టుల తరహాలో వాస్తవాన్నీ,కవిత్వాన్నీ మేళవించి ఒక అపురూప భావుకత్వాన్ని, తనకు మాత్రమే సాధ్యమయిన రీతిలో ప్రకటిస్తాడు. చెకోవ్ కథలు చదివినా, నాటకాలు చదివినా, చివరికి ఉత్తరాలు చదివినా, ఒక ప్రగాఢ భావన మనసుని ఆవహిస్తుంది. పుష్టిగా వన్నెతిరిగిన ఒక ఆపిల్ పండుని చేత్తో పట్టుకుని తడిమినట్టుగా జీవితాన్ని తడుముకోవాలని పిస్తుంది. ఏదన్నా రాయాలనిపిస్తుంది,చదవాలనిపిస్తుంది. ఏదో ఒక నాటకబృందంతో కలిసి ఒక రూపకాన్ని ప్రదర్శించడానికి రిహార్సల్ చెయ్యాలనిపిస్తుంది. ఈ సారి ఈ నాటకం చదువుతూంటే, ఎప్పుడూ లేనిది, ఒక కెమేరా పట్టుకుని సినిమా తియ్యాలని కూడా అనిపించింది.

చెకోవ్ రొమాంటిసిస్టు కాడు, నిస్సందేహంగా రియలిస్టు. కాని గొగోల్ తరహా రియలిస్టు కూడా కాడు. టాల్ స్టాయిలాగా ఐతిహాసిక రచయిత కూడా కాడు. అతడి దృష్టిలో ఆరోగ్యప్రదమైందీ, సరళమైందీ, కానీ, ప్రగాఢమైందీ ఏదో ఉంది.

ఆయన కథల్లోలాగా కాకుండా ఈ నాటకం కళాకారుల చుట్టూ తిరిగే కథ. నలుగురు స్త్రీ పురుషులు, నలుగురూ కళాకారులే, ఇద్దరు రచయితలు, ఇద్దరు నటీమణులు. ఒకరి పట్ల మరొకరు తీవ్రంగా ఆకర్షణకు గురవుతారు. ఆ ఆకర్షణ వాళ్ళ జీవితాల్ని ఎట్లా కుదిపేసిందో ఆ నాటకం చూపిస్తుంది.

కాని విమర్శకులు ఇప్పటికే ఎంతో వివరంగా చెప్పినట్టుగా, ఈ నాటకం action centered కాదు. ఈ కథలో సంభవించిన ముఖ్యసంఘటనలన్నీ నాటకానికి బయట, తెరవెనక జరుగుతాయి. ఆ సంఘటనల నేపథ్యంలో, ఆ తుపానులో ఆ మనుషులు మాట్లాడుకోకుండా ఉండలేని మాటలే నాటకమంతా. ఆ మాటల్ని తీసేస్తే నాటకమేమీ లేదు. అరిస్టాటిల్ చెప్పినట్టు నాటకమంటే ప్రవర్తనని అనుకరించడమనుకుంటే ఇందులో నాటకీయమైన సన్నివేశాలేమీ లేవు, ఒక్క పతాకసన్నివేశం, మూడో అంకం చివర్లో కథానాయిక నీనా రచయిత ట్రిగొరిన్ వక్షం మీద తన తల ఆనీంస్చిన దృశ్యం తప్ప. కాని అది కూడా చాలా యాథాలాపంగా జరిగినట్టే చూపిస్తాడు రచయిత.

నాటకంలో మనం చూసే యాక్షనంతా రోజువారీ కదలికలు, సామాన్యమైన ఇంటరాక్షన్- మంచినీళ్ళు కావాలనడం, పేకాడుకోవడం, వస్తువులు సర్దుకోవడం,గాయానికి పట్టీవేసుకోవడం లాంటివి మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే,నాటకంలో కథంతా బయట సంభవిస్తూ ఉంటుంది. దాని నీడల్ని మాత్రమే మనం రంగస్థలం మీద చూస్తూంటాం. ఆ నీడలమధ్య ఆ మనుషులు ఏం మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకోలేదు, ఆ చిన్ని చిన్ని నిట్టూర్పులు, నిశ్శబ్దాలతో సహా, అదంతా మనకి కనిపిస్తుంది. బహుశా భారతీయ ఆలంకారికుల్ని అడిగితే దీన్ని ధ్వని ప్రధానమైన శ్రవ్యకావ్యంగా పరిగణిస్తారనుకుంటాను.

తనకాలం నాటి నాటకాల పట్ల చెకోవ్ కి చాలా అసంతృప్తి ఉందనుకుంటాను. ఆ నాటకాల్లోని వాగాడంబరాన్ని పరిశుద్ధం చేయ్యాలన్న తపనతోనే ఆయన నాటకరచన చేసాడనుకుంటాను. ఈ నాటకంలో కూడా కథానాయకుడు ట్రెప్లెవ్ తో ఇలా అనిపిస్తాడు:

‘నేను నాటకరంగాన్ని ఏవగించుకుంటున్నానని ఆమెకి తెలుసు. ఆమె నాటకరంగాన్ని ప్రేమిస్తుంది. అలా చెయ్యడం ద్వారా మానవసేవచేస్తున్నానుకుంటుంది. కాని నా దృష్టిలో మన నాటకరంగం చాలా దయనీయ పరిస్థితిలో కూరుకుపోయిఉంది. పడికట్టుపదాలూ, పాతకాలపు హావభావాలూ తప్ప మరేమీలేవక్కడ. ఆ మూడు గోడల ‘గదుల ‘ మీంచి తెరలేవగానే మన ప్రసిద్ధ నటులు, ప్రతిభావంతులైన కళాకారులు, ఆ పవిత్రకళావేదిక పూజారులు ప్రేక్షకులముందు చేసిచూపించేదంతా మనుషులు ఎట్లా తింటారో, తాగుతారో, ప్రేమించుకుంటారో, పరిభ్రమిస్తారో అదే. పాతచింతకాయపచ్చడివాసనగొట్టే పడికట్టుపదాలనుంచీ, మామూలు లోకాభిరామాయణం నుంచీ వాళ్ళేదన్నా ఒక జీవితసత్యాన్ని పిండాలని చూస్తుంటారు, ప్రతి వాడూ అప్పటికే ఎన్నోసార్లు విన్న పడికట్టుమాటలే మళ్ళా గొప్పగా చెప్తుంటారు, అదే మాట, అదే చేష్ట, ఇప్పటికి వెయ్యిసార్లు చేసిచూపించిందే మళ్ళా మళ్ళా చేసిచూపిస్తుంటే నాకక్కణ్ణుంచి పారిపోవాలనిపిస్తుంది. మొదటి సారి ఐఫిల్ టవర్ని చూసినప్పుడు అందులోని సౌందర్యరాహిత్యం తనని ధ్వంసం చేస్తుందేమోనని భయపడి అక్కణ్ణుంచి మపాసా పారిపోయినట్టుగా నాకు కూడా మన రంగస్థలం నుంచి దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది.’

చెకోవ్ మీద మపాసా ప్రభావాన్ని నేను చాలా ఆలస్యంగా పసిగట్టగలిగాను. దాదాపుగా మపాసా గొప్ప కథలన్నిటికీ చెకోవ్ ప్రతిస్పందించినట్టుగా కథలు రాసాడని ఈ మధ్యే గ్రహించాను. ఐఫిల్ టవర్లో సౌందర్యం లేకపోవడం అలాఉంచి, మనుషుల్ని ధ్వంసం చెయ్యగల సౌందర్యరాహిత్యాన్ని మపాసా చూశాడని చెకోవ్ చెప్తున్న మాటలు చాలా కీలకం.

మనుషులు సౌందర్యాన్ని కోరుకుంటారు గాని, భరించలేరు. సుందరమైందీ, నిష్కల్మషమైందీ తారసిల్లినప్పుడు మనుషులు మరేం చెయ్యాలో తెలీక ఆ సౌందర్యాన్ని చెరిచి పాడుచేస్తారు. ఇదే సీగల్ కథ. దీన్ని వాగాడంబరంతో కాకుండా మామూలు మాటల్లో చెప్పాలనే చెకోవ్ ప్రయత్నించాడు. తాను శ్రేష్టమైన నాటకరచయితనేనా అన్న సందేహంతోనే చెకోవ్ మరణించాడు. కాని ఒక శతాబ్దకాలం తర్వాత, పాఠకులూ, ప్రేక్షకులూ కూడా చెకోవ్ సందేహాన్ని అంగీకరించలేకపోవడం లోనే అద్వితీయసంతోషాన్ని అనుభవిస్తున్నారు.

4-3-2015

Leave a Reply

%d bloggers like this: