టాల్ స్టాయి జాబితా

Reading Time: 3 minutes

1

మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకం ఏది? ఈ ప్రశ్న మనల్ని ఎవరో ఒకరు అడిగే ఉంటారు. కొంతమంది తాము చదివిన పుస్తకాల్లో ఫలానా పుస్తకం చదవడం వల్లనే తమ జీవితం గొప్ప మలుపు తిరిగిందని చెప్పగలుగుతారు. బుచ్చిబాబు రస్సెల్ పుస్తకాన్ని పేర్కొన్నట్టు. కాని చాలామంది, నాతో సహా, ఆ ప్రశ్న తలెత్తగానే ముందొక అయోమయానికి లోనవుతారు. ఏ పుస్తకమని చెప్పడం, ఒకటా, రెండా చాలా ఉన్నాయంటారు.

కాని, 1891 లో ఒక రష్యన్ ప్రచురణకర్త ఈ ప్రశ్న 2000 మందిని అడిగాడు. వాళ్ళల్లో పండితులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, పౌరసమాజ ప్రముఖులతో పాటు టాల్ స్టాయి కూడా ఉన్నాడు.అప్పుడాయనకి 63 ఏళ్ళు. ఆ వయసులో ఆయన ఏమి చెప్పినా ఆ ప్రచురణ కర్త రాసుకునే ఉండేవాడు, ఇప్పటి భాషలో చెప్పాలంటే బాక్సు కట్టి మరీ వేసుకునేవాడు.

కాని టాల్ స్టాయి ఆ ప్రశ్నని చాలా సీరియస్ గా తీసుకున్నాడు. బహుశా చాలా తీవ్రంగా కూడా ఆలోచించి ఉండవచ్చు. అట్లా మథన పడ్డాక, 46 మంది రచయితల్ని, వాళ్ళ పుస్తకాల్ని ఎంపిక చేసాడు. అందులో ఆశ్చర్యం లేదు. మన కాలంలో బోర్హెస్ కూడా తనని ఆకట్టుకున్న రచనలతో ఒక canon తయారు చేసాడు. ఓషో తాను ప్రేమించిన పుస్తకాలంటూ వందకు పైగా పుస్తకాల గురించి కొన్ని సాయంకాలాలపాటు శిష్యులకు చెప్పుకొచ్చాడు.

కాని టాల్ స్టాయి తయారు చేసిన జాబితా చాలా ప్రత్యేకమైంది. బహుశా ఇప్పటిదాకా ఎవరూ అట్లాంటి జాబితా తయారు చేసి/చేసుకుని ఉండరు.

ఆయన తనని ప్రభావితం చేసిన పుస్తకాలు అన్నప్పుడు, తన మొత్తం జీవితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, తన జీవితావస్థల్ని, అయిదు దశలుగా విభజించుకున్నాడు. 14 ఏళ్ళ వయసు వచ్చేదాకా మొదటిదశ. 14 నుంచి 20 ఏళ్ళదాకా రెండవ దశ. 20నుంచి 35 దాకా మూడవ దశ. 35 నుంచి 50 దాకా నాల్గవ దశ. 50 నుంచి 63 దాకా అయిదవ దశ. ఈ అయిదు దశల్లోనూ తనని ప్రభావితం చేసిన పుస్తకాల్ని ఏ దశకి ఆ దశకి విడివిడిగా పేర్కొన్నాడు.

గొప్ప ఆలోచన కదూ. కానీ ఇక్కడితో ఆగిపోతే టాల్ స్టాయి ఎందుకవుతాడు?

ప్రతి దశలోనూ తనని ప్రభావితం చేసిన పుస్తకాల్ని మళ్ళా మూడు రకాలుగా అంచనా కట్టాడు. అ) తన మీద అపారంగా ప్రభావం చూపించినవి, ఆ) చాలా గొప్పగా ప్రభావితం చేసినవి, ఉ) గొప్పగా ప్రభావితం చేసినవీ అంటో.

ఆ జాబితా చూడాలనుకున్నవాళ్ళు ఈ గొలుసు లాగొచ్చు

https://www.brainpickings.org/2014/09/30/leo-tolstoy-reading-list/

అయితే, ఆ జాబితా ని కొంత నిశితంగా చూస్తే మనకి కొన్ని ఆసక్తి కరమైన సంగతులు కనిపిస్తాయి.

• మొత్తం రచయితల్లో, పుస్తకాల్లో తనని అపారంగా ప్రభావితం చేసినవారిగా 14 మంది రచయితల్ని, చాలా గొప్పగా ప్రభావితం చేసిన రచనలు 17, గొప్పగా ప్రభావితం చేసినవి 15 అని లెక్కగట్టాడు. అపారంగా ప్రభావం చూపించిన వాళ్ళల్లో నలుగురు సువార్తీకులు, పాత నిబంధనలో జోసెఫ్ కథ, రూసో ఎమిలీ, కన్ఫ్యూషియస్, లావోత్సే, బుద్ధుడు, ఎపిక్టెటస్ వంటి వారున్నారు.

• మొత్తం పుస్తకాల్లో ఆయన్ని కౌమారావస్థలో ప్రభావితం చేసిన పుస్తకాలూ, రచయితలే ఎక్కువమంది ఉన్నారు. మొత్తం 16 మంది. ఇది ఏ సాహిత్యవిద్యార్థికైనా అనుభవంలోకి వచ్చే విషయమే.

• ఆ తర్వాత స్థానంలో, వృద్ధాప్యావస్థలో ఆయన్ను ప్రభావితం చేసిన రచయితలు ఎక్కువమంది, అంటే 11 మంది ఉన్నారు. ఇది చాలా చాలా అరుదైన విషయం.మనం మన యవ్వనావస్థ దాటిపోయేక మరే పుస్తకమూ, రచయితా మనల్ని ప్రభావితం చేయలేనంతగా కరడుగట్టిపోతాం. కాని, టాల్ స్టాయి ఈ విషయంలో నిజంగానే ఆశ్చర్యావహంగా ఉన్నాడు. మొత్తం పుస్తకాల్లో తనన్ని అపారంగా ప్రభావితం చేసిన 14 పుస్తకాల్లోనూ, 6 పుస్తకాలు వృద్ధాప్యదశలోవే కావడం చూడండి.

• తనని అపారంగా ప్రభావితం చేసిన రచయితల్లో తన కన్నా ఒక శతాబ్దం ముందు రచయిత అయిన రూసో ని స్మరించడంలో ఆశ్చర్యం లేదుగానీ తన సమకాలికులైన విక్టర్ హ్యూగో, చార్లెస్ డికెన్స్ లతో పాటు ముఖ్యంగా గొగోల్ ను పేర్కొనడం నిజంగా గొప్ప విషయం.

• ఒక రష్యన్ రచయితగా ఆయన పుష్కిన్ ని కూడా అపారంగా ప్రభావం చూపిన జాబితాలో పెట్టి ఉండాలి. కాని, ఆశ్చర్యంగా,యెవెగ్నీ ఒనెగిన్ ని ‘చాలా గొప్ప’ తరగతిలో మాత్రమే పెట్టాడు. మరొక చోట, పుష్కిన్ కవిత్వం తన బాల్యదశలో చదివినదాన్ని ‘గొప్ప’ గా మాత్రమే పేర్కొన్నాడు.

• హోమర్ ని రష్యన్ లో చదివినప్పుడు, ఇలియడ్, ఒడెస్సీలు తనని గొప్పగా మాత్రమే ప్రభావితం చేసాయని చెప్తూ, కొద్దిగా పెద్దవాడయ్యాక, గ్రీకు లో చదివినప్పుడు చాలా గొప్పగా ప్రభావితం చేసాయని రాసుకున్నాడు.

• ఈ జాబితాలో కనబడనివాళ్ళు కూడా వాళ్ళ absence వల్ల చాలా ఆసక్తికరంగా ఉన్నారు. అందరికన్నా, మొదటి పేరు షేక్ స్పియర్. టాల్ స్టాయికి షేక్ స్పియర్ తో బెర్నార్డ్ షాకి మల్లే స్పర్థ అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ సంగతి పక్కన పెట్టవచ్చు. కానీ, తుర్జనీవ్ కీ, లెర్మొంటోవ్ కి దొరికిన చోటు చెకోవ్ కీ, డాస్టవిస్కీ కి దొరకలేదు ఎంచాత? చెకోవ్ పరిణతి చెందిన కథలు 1891 తర్వాతనే వచ్చాయని సరిపెట్టుకోవచ్చు. కానీ డాస్టవిస్కీ సాహిత్యమంతా 1881 కు ముందుదే కదా. గొథే, షిల్లర్ లు ఉన్నారు, కాని ఆయన సంభాషణల్లో తరచు ప్రస్తావించే బాల్జా ఏమైపోయాడు?స్టెంధాల్, గొంకరోవ్ సోదరులు ఏమైపోయారు? ప్లేటో కి చోటు దొరికింది, అది కూడా ‘ఫేడో’, ‘సింపోజియం’ లు, బాగుంది, కాని అరిస్టాటిల్? థామస్ ఆక్వినాస్? ఫ్యూయర్ బా ని ప్రస్తావించినవాడు, కాంట్, హెగెల్ లను ఎందుకు వదిలిపెట్టేసాడు?

• ఒక బౌద్ధగ్రంథాన్ని పేర్కొన్నాడు గానీ పేరు గుర్తులేదన్నాడు, అది ‘లలిత విస్తార’ అని తేల్చారు తరువాత. కాని ఆయన షోపెన్ హోవర్ ని చదివే ఉంటాడు, ఉపనిషత్తుల గురించి విని ఉండడా?

• ఇందులో ఒక పుస్తకమే రెండు సార్లు నమోదయ్యింది, అది రష్యన్ జానపద కథల పుస్తకం. బహుశా అది తనని తన చిన్నతనంలో అపారంగా ప్రభావితం చేసినందుకు ఒకసారీ, పెద్దయ్యాక, అంతగా కాకపోయినా చాలా గొప్పగా ప్రభావితం చేసినందుకు రెండవసారీ నమోదు చేసి ఉండవచ్చు.

• రెండు సార్లు ప్రస్తావనకి నోచుకున్న రచయితల్లో హోమర్, పుష్కిన్, రూసో, గొగోల్ ఉన్నారు. అది ఆ రచయితలకి అందవలసిన గౌరవమే.

• తనని అపారంగా ప్రభావితంగా చేసిన రచనలుగా పేర్కొన్నవాటిలో ఒక అంతస్సూత్రం వెతకవచ్చు. సరళంగానూ, నిజాయితీతోనూ, పరలోకం గురించి కాకుండా ఈ లోకంలో మానవుడు సక్రమంగా జీవించడమెలా అన్నదాని గురించి రాసినవీనూ ఆయన్ని అపారంగా ప్రభావితం చేసాయని చెప్పుకోవచ్చు.

ఏమైనప్పటికీ, ఈ exercise అద్భుతంగా ఉంది. మనం కూడా ఒకటి రాసుకుని చూద్దామా?

20-9-2016

Leave a Reply

%d bloggers like this: