టాల్ స్టాయి చివరి కథలు

46

టాల్ స్టాయి చివరి కథలు చదివాను. తెలుగులో ‘విషాదసంగీతం’ పేరిట రాదుగ వారు ప్రచురించిన తెలుగు అనువాదాల్లో చాలా గొప్ప కథలు- The Family Happiness (1859), The Kruetzer Sonata (1889), Father Sergius (1890-98) వంటివి వున్నాయి. ఆ సంకలనం 1975 లో ప్రొగ్రెస్ పబ్లిషర్స్ వారు ప్రచురించిన Short stories కి అనువాదం. అ కథలు ముప్పై ఏళ్ళ కిందట నా చేతుల్లోకి మొదటిసారి వచ్చినప్పుడు నేను విభ్రాంతికి లోనయ్యాను. అంత గంభీరమైన, శక్తిమంతమైన కథలు నేనప్పటిదాకా చదవలేదు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకు The Death of Ivan Ilych (1886) చదివాను. ఆ కథ నా మీద చూపించిన గాఢాతిగాఢమైన ప్రభావంలోంచే నేను ‘ప్రశ్నభూమి ‘కథ రాసాను.

కాని టాల్ స్టాయి తన జీవిత ఉత్తరార్థంలో రాసినకథల్లో నీతికథలు, లెజెండ్లు తెలుగులోకి అనువాదమయ్యాయికాని, Master and Man (1895) Hadji Murad (1904) లాంటి కథలు అనువాదం కాలేదు. ఆయన తన చివరి రోజుల్లో రాసిన కథల్లో After the ball (1903) ఒక్కటే, ‘విందు తర్వాత’, ‘విందు నాట్యం తర్వాత’ లాంటి పేర్లతో తెలుగులోకి నాలుగైదు సార్లు అనువాదమయ్యింది. నేను కూడా ఆ కథని అనువదించకుండా ఉండలేకపోయాను.

టాల్ స్టాయి తన జీవితం మలిసంధ్యలో రాసిన కథలు రెండు మూడు సంపుటాలు నా దగ్గర చాలాకాలంగా ఉన్నప్పటికీ, వాటినిప్పటిదాకా చదవలేకపోయాను. కాని, ఈ రెండువారాలుగా, ఆ కథలు చదువుతూంటే, గొప్ప సాహిత్యం చదువుతున్నప్పుడు ఒక పాఠకుడు లోనుకాగల ఉద్విగ్నతకూ, గొప్ప ఋషితుల్యుడి సన్నిధిలో మనం లోనుకాగల ప్రశాంతతకూ కూడా లోనవుతూ వచ్చాను.

1856 లో మరొక ప్రసిద్ధ రష్యన్ రచయిత తుర్జెనీవ్ టాల్ స్టాయికి ఒక ఉత్తరం రాసాడు. ‘నేను మీ సమకాలికుణ్ణయినందుకు ఎంత సంతోషిస్తున్నానో మీకు ప్రత్యేకంగా చెప్పడానికే ఈ ఉత్తరం రాస్తున్నాను. మీకు నా విజ్ఞప్తి, మిత్రమా, దయచేసి సాహిత్యసృజన మళ్ళీ మొదలుపెట్టండి. మీలో ఉన్న ఆ గొప్ప ప్రతిభనుంచే మీరు తక్కిందేదైనా సమాజానికి ఇవ్వగలరు. రష్యన్ నేలకు చెందిన మహారచయితా, నా మొరాలకించండి’ అంటో .

కాని అందుకు టాల్ స్టాయి తుర్జెనీవ్ ని క్షమించలేకపోయాడు. తన జీవితకాలమంతా, ఒకవైపు తుర్జెనీవ్ మరొక వైపు తన భార్య సోఫియా ఈ విషయంలో ఆయనకు ప్రత్యర్థులుగానే ఉంటూ వచ్చారు. అందుకు కారణం War and Peace , Annakarenina రాసిన తర్వాత టాల్ స్టాయిలో వచ్చిన మార్పు. 1869 లో అర్జమాస్ అనే ఒక పట్టణంలో ఒక హోటల్లో మృత్యుభయానికి లోనైనప్పణ్ణుంచీ టాల్ స్టాయి సాహిత్యాన్ని వదిలిపెట్టి మత, తాత్త్విక గ్రంథాలవైపు మరలిపోయాడు. అంతదాకా తాను సృష్టించిన సాహిత్యానికి విలువలేదనీ, ఒక చిన్న నీతి కథ, రైతులకీ, గృహిణులకీ, పిల్లలకీ అర్థమయ్యేటట్టు ఒక్కనీతి చెప్పగలిగితే చాలనీ అనుకున్నాడు. అట్లాగే పిల్లలకోసం కథలు చెప్పడం మొదలుపెట్టాడు కూడా.

కళలో నైతికత లేదనీ,అది మనుషుల్ని విశృంఖలత్వం వైపూ, చెడునడతవైపూ ప్రోత్సహిస్తుందనీ, కళ పరమార్థం అంతిమంగా ఉపదేశం మాత్రమేనని వాదిస్తూ What is Art (1897) అనే ప్రసిద్ధ గ్రంథం వెలువరించాడు.

కాని ఇదే ఆయన జీవిత ఉత్తరార్థంలో అత్యంత ఆసక్తికరమైన విషయం. ఒకవైపు తుర్జనీవ్ మాట పెడచెవిన పెట్టి ఆయన నైతిక, ధార్మిక, తాత్విక, రాజకీయ రచనలు చేస్తున్నప్పటికీ, కళ పరమార్థం సరళమైన నీతికథల రూపంలో ప్రజలకి ఉపదేశం చేపట్టడమే అని భావిస్తున్నప్పటికీ, మరొకవైపు తాను జీవితకాలం పాటు సాధనచేస్తూ వచ్చిన సాహిత్యకౌశలాన్నంతటినీ ఉపయోగించి అత్యద్భుతమైన చిన్నకథలూ, పెద్ద కథలూ రాస్తూనే వచ్చాడు.

వాటిల్లో ఎంచవలసిన రెండు గొప్ప కథల్లో మొదటిది Master and Man (1895) . ఒకవైపు ‘కళ అంటే ఏమిటి’ అని కళని తూర్పారపడుతూ పుస్తకం రాస్తూనే మరొకచేత్తో ఇంత కళాత్మకమైన కథ ఆయనెట్లా రాసేడా అనిపిస్తుంది. ఆ కథలో నీతి స్పష్టమే. మనిషి నిజమైన ఆనందం ఎదుటిమనిషి సంతోషాన్ని కోరుకోవడంలోనే ఉందనేదే ఆ నీతి. ఆయన తొలి దశలో రాసిన The Family Happiness కథలో ఈ వాక్యమే మూడు సార్లు ఎదురవుతుంది. కాని అందులో ఎంతోకొంత రొమాంటిసిజం ఉంది. కాని, ఈ రచన అన్నిరకాల ఉద్విగ్నతలనుండీ బయటపడి మృత్యువును ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నం. ఇతివృత్తం సరళం. నిజానికి ఆయన తొలిరోజుల్లో రాసిన The Snow Storm (1856) అనే కథనే ఈ కథకీ మాతృక. ఒక మతాధికారీ, సంపన్నుడూ ఐన ఒక భూస్వామీ,అతడి పనివాడూ ఒక దూరగ్రామానికి బయల్దేరతారు. ఆ ప్రయాణంలో ఒక మంచుతుపానులో చిక్కుకుంటారు. ప్రయాణం ఆగిపోయి, ముందుకు కదల్లేని సమయంలో ముందు ఆ భూస్వామి తన పనివాడు చచ్చిపోయినా నష్టం లేదనుకుని, అతణ్ణట్లానే ఆ తుపానులో వదిలిపెట్టి ముందుకు పోతాడు. కాని ఆ చీకట్లో దారి తప్పి మళ్ళా వెనక్కి వస్తాడు. అప్పటికి ఆ పనివాడు దాదాపుగా చచ్చిపోతుంటాడు. ఆ క్షణంలో ఆ భూస్వామిలో ఊహించని మార్పు వస్తుంది. అతడు తన ప్రాణం త్యాగం చేసి మరీ ఆ పనివాణ్ణి బతికిస్తాడు. ఈ సరళ క్రైస్తవ నైతికసూత్రాన్ని ఆయన కథగా మలిచిన తీరు మనల్ని విభ్రాంత పరుస్తుంది.

ఇక రెండవ కథ Hadji Murad (1896-1904) బహుశా టాల్ స్టాయి సాహిత్యమంతటిలోనూ సర్వోన్నతమైన రచన అని చెప్పవచ్చు. ‘నానృషి: కురుతే కావ్యం’ అనే మాటకి ఆ కథ నిరూపణ. రచయితగా, కళాకారుడిగా మాత్రమే కాదు, ఒక మనిషిగా కూడా తనతో తాను ఎంతో పెనగులాడుకుని, తన మీద తాను విజయం సాధించి మరీ టాల్ స్టాయి ఆ కథ రాసాడని చెప్పవచ్చు. 1225 పేజీల War and Peace రాయడానికి ఆయన ఆరేళ్ళు కష్టపడితే, 270 పేజీల ఈ రచనకు ఎనిమిదేళ్ళు శ్రమించాడు. 68 వ ఏట రాయడం మొదలుపెట్టి 76 వ ఏట పూర్తి చేయగలిగాడు. చివరి ప్రతికి ముందు పది వెర్షన్లు రాసాడు. కథ ఎత్తుగడకే 23 రకాల వెర్షన్లు రాసుకున్నాడు. కథలో జార్ చక్రవర్తి ఒకటవ నికొలస్ ఉన్న అధ్యాయాన్ని 25 సార్లు తిరిగి రాసాడు. మొత్తం 2515 పేజీలు రాసి, దాన్ని 250 పేజీల చేతిరాతకి కుదించాడు. ఆ కథరాయడం కోసం ఆ వృద్ధాప్యంలో 172 పుస్తకాలు చదివినట్టుగా జాబితా రాసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కథలు రాసేవాళ్ళందరూ తెలుసుకోవలసిన విషయాలివి.

అంత కఠోరమైన పరిశ్రమ కించిత్తు కూడా వృథాపోలేదనే ఆ కథ చదివితే మనకు తెలుస్తుంది. రష్యాకి, చెచెన్యాకి మధ్య సరిహద్దుల్లో ఒక మహ్మదీయ గిరిజన తెగకీ, రష్యన్లకీ మధ్య జరిగే పోరాటం ఆ కథానేపథ్యం. అందులో హాజీ మురాద్ అనే మహ్మదీయ వీరుడు తన వ్యక్తిగత ప్రయోజనాలకోసం రష్యన్లతో చేతులు కలపడం, తిరిగి వాళ్ళనుంచి తప్పించుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు, అతడికీ, రష్యన్ సైనికులకీ మధ్యజరిగిన యుద్ధంలో అతడు వీరోచితంగా పోరాడి మరణించడం ఇతివృత్తం. కాని, ఆ కథచెప్పిన టాల్ స్టాయి సాహిత్యప్రయోజనమేమిటో పూర్తిగా తెలిసిన టాల్ స్టాయి. అతడు కథలో ఎవరిపట్లా తీర్పుప్రకటించడు. ఏ పాత్రనీ ద్వేషించడు, ఎవరినీ ఉన్నతీకరించడు. నీతికథాశిల్పాల్లోని సారళ్యంతో పాటు గొప్ప కళారూపాల గాంభీర్యమంతా మేళవించి మరీ ఆ కథ రాసాడు. నిజానికి ఆ కథ చదివితే అందరికన్నా ముందు ఆనందవర్ధనుడూ, అభినవగుప్తుడూ ఎక్కువ సంతోషిస్తారనుకుంటాను.

ఇక చివరిరోజుల్లో రాసిన నాలుగు కథలు After the Ball (1903), The Forged Coupon (1904), Alyosha (1905), చిట్టచివరి కథ What For (1906) లకు వచ్చేటప్పటికి టాల్ స్టాయి హోమర్, బొకాషియో, షేక్ స్పియర్ ల స్థాయికి చేరుకున్నాడు. After the Ball పరిపూర్ణమైన కథ, నిర్మాణపరంగానూ, దృక్పథ పరంగానూ కూడా. The Forged Coupon ఒక బౌద్ధజాతకకథలాంటిది, మృచ్ఛకటికనాటకంలాంటి కథ. అందులో దొంగలనుంచి జార్ దాకా ప్రతి ఒక్కరూ కనిపిస్తారు. మంచిలోనూ చెడులోనూ కూడా మనుషులు ఒకరినొకరు విడదీయలేనంతగా ఒక సమాజంగా ఎట్లా అల్లుకుపోయారో ఆ కథలో కనిపిస్తుంది.. ఆ కథ ఉపదేశాత్మకమే. కాని అత్యంత వాస్తవిక రచన కూడా. ఒక విమర్శకుడు ఆ కథ చదవగానే హోమర్ గుర్తొస్తాడని రాసాడు. కాని నాకు ‘కన్యాశుల్కం ‘ గుర్తొచ్చింది. టాల్ స్టాయికి సమకాలికుడిగా గురజాడ అట్లాంటి ఇతివృత్తాన్నే అప్పటికే తెలుగునేల మీద రూపకంగా మలిచి ఉన్నాడు.

‘వచనం విషయంలోనూ, కథల విషయంలోనూ ఒక పాఠకుడిగా మీరు ఆశిస్తున్న ప్రమాణాలు మరీ ఉన్నతంగా ఉంటున్నాయి, అందుకే తెలుగు కథకులెవరూ మీకు నచ్చడం లేదు’ అన్నాడు ఆదిత్య. ఇంతకు ముందు సంగతి నాకు తెలియదుగాని, ఇప్పుడు ఈ కథలు చదివిన తర్వాత, పాఠకుడిగా నా అంచనాల్ని తక్కిన కథకులు ఎందరు అందుకోగలరన్నది సందేహమే.

తాజాకలం

ఈ పోస్టు పెట్టిన తరువాత, ప్రసిద్ధ కథావిమర్శకులు రమణమూర్తిగారు నన్ను సరిచేసారు. యజమానీ, భూస్వామీ కథని బెల్లంకొండ రామదాసుగారూ, హాజీ మురాద్ కథని ముక్తవరం పార్థసారథిగారూ తెలుగులోకి ఇప్పటికే అనువదించారని చెప్పడమే కాకుండా, ఆ పుస్తకాల ప్రతులు నాకు పంపించారు కూడా.

25-3-2017

Leave a Reply

%d bloggers like this: