కొత్త రక్తం ఎక్కించిన కవి

Reading Time: 3 minutes

44

రెండు రోజుల కిందట రష్యన్ కవి, రచయిత, చలనచిత్రకారుడు యెవెగ్నీ యెవెతుషెంకొ (1933-2017) అమెరికాలో ఓక్లహోమాలో కన్నుమూయడంతో ఇరవయ్యవశతాబ్ది రష్యన్ మహాకవుల్లో చివరి తరం దాదాపుగా అదృశ్యమైపోయింది.

కొందరి కవుల జీవితం చాలా చిత్రంగా ఉంటుంది. వారి ప్రశస్తికి వారి కవిత్వం ఎంత కారణమో, వారు జీవించిన కాలం కూడా అంతే కారణమనిపిస్తుంది. చాలాసార్లు వాళ్ళు జీవించిన సమయాల, సంక్షోభాల ప్రకంపనలనుంచి విడదీసి ఆ కవిత్వాన్ని అంచనా వెయ్యడం దుస్సాధ్యమనిపిస్తుంది.

యెవెతుషెంకొ అట్లాంటి కవి. స్టాలిన్ ఉక్కుపాలన ముగిసిన తర్వాత, కృశ్చెవ్ శకం మొదలవగానే, అంతదాకా గడ్డకట్టిన మంచుకరగడం మొదలయ్యింది (Khrushchev Thaw). రాజకీయంగా, సామాజికంగా సోవియెట్ సమాజం కొంత తెరిపినపడ్డ ఆ ఊరటలో ఒక తారలాగా వినువీథిలో ప్రత్యక్షమయిన కవి యెవెతుషెంకొ. అతడి తొలికవితల ఇంగ్లీషు అనువాదం Selected Poems 1962 లో పెంగ్విన్ సంస్థ ప్రచురించినప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంతదాకా పెంగ్విన్ సంస్థ ప్రచురించిన కవిత్వంలో ఒడెస్సీ తర్వాత అత్యధికంగా అమ్ముడైన కవితాసంపుటి యెవుత్సుషెంకో కవిత్వమే. అంతదాకా స్టాలిన్ శకంలో తలుపులు మూసుకుపోయి ఉన్న సోవియెట్ సమాజంలో ఏమి జరుగుతోందో చూడాలన్న ప్రపంచప్రజల (ముఖ్యంగా అమెరికన్ల) కుతూహలం అందుకు కారణమని చెప్పవచ్చు.

ఆ Selected Poems లో మనకొక రాజకీయ కవికన్నా, ప్రభుత్వ కవికన్నా, కమ్యూనిస్టు ప్రచారకుడికన్నా ఒక సామాన్యమైన మనిషి కనిపిస్తాడు. అది కూడా మాస్కో కవి కాదు, సైబీరియా కవి, పొలాలు, గ్రామాలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, మామూలు సరదాలు, మామూలు కష్టాలతో కూడుకున్న ఒక మామూలు జీవితం. అతడి తొలిరోజుల దీర్ఘకవిత Zima Junction (1953-6) మరొకప్పుడు వచ్చి ఉంటే చాలా సాధారణమైన కవితగా మిగిలిపోయి ఉండేది. కాని స్టాలిన్ అనంతర రష్యానుంచి ఆ కవిత రావడం బాగా ఉక్కపోసిన రాత్రి గడిచిపోగానే ఒక పిల్లతెమ్మెర వీచినట్టుగా అనిపించింది ప్రపంచానికి.

యెవెతుషెంకొ విచిత్రమైన కవి. అతడు ఏకకాలంలో ‘ఆస్థానకవీ’, విప్లవకారుడూ కూడా. అతణ్ణి విమర్శించినవాళ్ళు అతడు కారాగారానికీ, ప్రవాసానికీ, సెన్సారుకీ దూరంగా బతికాడని విమర్శిస్తారు. కాని అతణ్ణి సమర్థించేవాళ్ళు survive కావడమే అతడు చేసిన పాపమా అని ప్రశ్నిస్తారు. అతడు ఆగ్రహాన్ని, నిరసననీ ప్రకటించకపోలేదుగానీ, అది ‘సురక్షితంగా’ చేస్తూ వచ్చిన నిరసనేనని అతడి విమర్శకుల ఆరోపణ. కాని సోల్జెనిత్సిన్ కి మద్దతు ప్రకటించాడనీ, చెకొస్లొవేకియా మీద రష్యా దురాక్రమణని అతడు ఖండించాడనీ అతడి సమర్థకులు గుర్తుచేస్తూ ఉంటారు.

సాధ్యమయినంతవరకూ మనం ఈ న్యాయవిచారణలో పాలుపంచుకోకపోవడం మంచిది. అన్నిటికన్నా ముందు అతడు కవి. తను మరణించాక తనని మాస్కో శివార్లలో రష్యన్ రచయితల సమాధుల దగ్గర, ముఖ్యంగా పాస్టర్ నాక్ సమాధిపక్కనే తననీ ఖననం చెయ్యమని అతడు కోరుకున్నాడట!

యెవెతుషెంకొ గురించి రాస్తూ కవిత్వం మనిషినుంచి మనిషికి సంభవించే spiritual blood transfer అన్నాడు అయిత్ మాతొవ్.

తన సమాజం తీవ్రంగా జబ్బుపడ్డ ఒక కాలంలో కొత్త రక్తం ఎక్కించిన కవిగా యెవెతుషెంకొ రష్యన్ సాహిత్యంలో నిలబడిపోతాడు.

అతడి కవితలు రెండు:


స్టాలిన్ వారసులు

 

పాలరాతి గచ్చు నిశ్శబ్దం. నిశ్శబ్దంగా తళుకులీనుతున్న అద్దాలు.
గాలికి కమిలిపోయినిశ్శబ్దంగా నిల్చున్న పహారా.
శవపేటికపైన సుళ్ళు తిరుగుతున్న పొగ
వాళ్ళతణ్ణి శవమందిరంనుంచి బయటకు తెస్తున్నప్పుడు
ఆ నెర్రెల్లోంచి బయటకు జాలువారుతున్న శ్వాస.
బాయొనెట్లను మేస్తూ గాల్లో పైకిలేచిన శవపేటిక.
అతడు కూడా నిశ్శబ్దంగా ఉన్నాడు-పరిమళతైలాల్లో ముంచిన పిడికిళ్ళతో.
మరణించినట్టు నటిస్తూ, అతడు లోపలనుంచి గమనిస్తూనే ఉన్నాడు.
తన శవపేటికమోస్తున్న ప్రతిఒక్కణ్ణీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
రేపొద్దున్న మళ్ళా దాడిచెయ్యడానికి సన్నద్ధమవుతున్నాడు,
అమాయికులు, దక్షిణరష్యానుంచి ఈ మధ్యే ఉద్యోగంలో చేరిన
ఈ శవవాహకుల మీద
తన సమాధిలోంచి లేచి మరీ విరుచుకుపడనున్నాడు.
అతడేదో పన్నాగం పన్నుతూనే ఉన్నాడు,
ప్రస్తుతానికి కునికిపాట్లు పడుతున్నాడంతే.
ప్రభుత్వానికిదే నా విజ్ఞప్తి, దయచేసి ఈ శవపేటిక చుట్టూ పహారా రెండింతలు చెయ్యండి, మూడింతలు చెయ్యండి
ఈ పెట్టెలోంచి స్టాలిన్ మళ్ళా పైకి లేవకుండా చూడండి
స్టాలిన్ తో పాటే మన గతం కూడా.
మన గతమంటే వీరోచితమైన, వైభవోపేతమైన
మన మహిమాన్విత గతం గురించి కాదు నేను మాట్లాడుతున్నది-
ఇక్కడ గతమంటే నా ఉద్దేశ్యం,
ప్రజల శ్రేయస్సుని విస్మరించడం, తప్పుడు అభియోగాలు,
నిర్దోషుల్ని జైలుకి పంపడం.
మనం ఎంతో నిజాయితీగా పొలం దున్నాం,
ఎంతో నిజాయితీగా కొలిమి రగిలించాం
అంతే నిజాయితిగా సైన్యంలో చేరాం, కవాతు చేసాం.
కాని అతడు మనల్ని చూసి భయపడ్డాడు.
తన బృహత్ లక్ష్యం సాధించడం కోసం
ప్రతి ఒక్క సాధనం వాడుకున్నాడు.
అతడిది చాల ముందుచూపు.
రాజకీయ యుద్ధవిశారదుడు కదా,
ఈ భూమ్మీద తన వారసుల్ని చాలామందినే వదిలివెళ్ళాడు.
అతడి శవపేటికలో ఒక టెలిఫోన్ కూడా ఉందనిపిస్తోంది
అతడిప్పుడు ఆల్బేనియా అధ్యక్షుడికి పోన్ చేస్తూ ఉండొచ్చుకూడా,
ఆ కేబుల్ ఎక్కడిదాకా వెళ్తే అక్కడికంతా
ఫోన్ చేస్తూనే ఉండొచ్చు.
లేదు, స్టాలిన్ విరమించలేదు. అతడు మృత్యువుని కూడా మోసపుచ్చగలనుకుంటున్నాడు.
మనమతణ్ణి శవమందిరం నుంచైతే బయటికి తీసుకురాగలిగాం.
కాని స్టాలిన్ వారసులనించి స్టాలిన్ నెట్లా బయటకీడ్చెయ్యడం!
అతడి వారసులు కొంతమంది ప్రస్తుతానికి
మొక్కలకి నీళ్ళుపోసుకుంటూ ఉండవచ్చు
కాని ఈ తీరిక ఎక్కువరోజులు ఉండదని
రహస్యంగా లోపల్లోపల తలపోస్తూండవచ్చు.
మరికొంతమంది బయట ప్రజావేదికలమీద బహిరంగంగా
స్టాలిన్ మీద దుమ్మెత్తిపోస్తూండవచ్చు
కాని, రాత్రవగానే, వాళ్ళా పాత రోజులకోసం పరితపిస్తూనే ఉంటారు.
ఈ మధ్య స్టాలిన్ వారసులకి గుండెనొప్పి వచ్చినా ఆశ్చర్యం లేదు,
వాళ్ళు, ఆ పూర్వపు రోజుల తొత్తులు
ఇప్పుడు జైళ్ళు ఖాళీ అవుతున్నాయని ఈ రోజుల్ని ద్వేషిస్తూనే ఉంటారు
ఇప్పుడు కవుల కవిత్వం వినడానికి
సమావేశమందిరాలు కిక్కిరిసిపోతున్నాయని కుళ్ళుకుంటూ ఉంటారు
నేనొకింత స్వాతిశయం చూపించడం పార్టీకి ఇష్టముండదు
‘ఏమైంది నీకు’ అంటారు వాళ్ళు.
కాని నేనూరికే చేతులు ముడుచుకు కూర్చోలేను.
స్టాలిన్ వారసులు ఈ నేలమీద నడయాడుతున్నంతసేపు
స్టాలిన్ తన శవపేటికలో నక్కిఉన్నాడనే అనుకుంటాన్నేను. (1962)

 

ఒక సంభాషణ

‘నీకు చాలా ధైర్యం’ అంటారు వాళ్ళు.
కాని అది నిజం కాదు.
నేను ధైర్యవంతుణ్ణి కానే కాను,
కాకపోతే నా తోటి మనుషుల్లాగా
మరీ మోకరిల్లి బతకలేకపోయానంతే.
నేనే పునాదుల్నీ కూల్చలేదు,
కానైతే, నంగిరితనాన్నీ, డాంబికాన్నీ
సహించలేకపోయానంతే.
ఏదో కొంత రాయడమైతే రాసానుగానీ,
గొప్ప ప్రకటనలేవీ చెయ్యలేదు.
నా మనసులో ఏముందో సూటిగా చెప్పాలని చూసాను,
నిజంగా ఎవరికోసం నిలబడాలో వాళ్ళకోసం నిలబడ్డాను,
సత్తాలేని రచయితలకి సత్తాలేదని చెప్పేసాను.
కాని ఇదంతా మనమెలాగూ చెయ్యాల్సిందే కద!
ఈ మాత్రానికే వాళ్ళు నన్ను ధైర్యవంతుడంటున్నారు.
కేవలం నిజాయితీగా ఉండటాన్నే
వాళ్ళు ధైర్యమంటూ గొప్పలు చెప్పుకున్నారని
రేపు మన పిల్లలు మనల్ని ఎద్దేవా చేస్తారని
నాకు మహసిగ్గుగా ఉంది. (1960)

4-4-2017

Leave a Reply

%d bloggers like this: