సోవియెట్ రష్యా సజీవంగా ఉన్న రోజుల్లో, సోవియెట్ సాహిత్యం విస్తారంగానూ, చౌకగానూ లభ్యమయ్యే రోజుల్లో, నా చేతుల్లోకి వచ్చిన ఇద్దరు కకేషియన్ కవుల అద్భుతమైన కవిత్వం నేను మరవలేను. ఒకరు కైసెన్ కులియెవ్ అనే బల్కార్ కవి, మరొకరు రసూల్ గంజాతొవ్ అనే అవార్ కవి. కాని, జీవితం తిరిగిన ఏ మలుపుల్లో ఆ పుస్తకాల్ని ఎక్కడ పోగొట్టుకున్నానోగాని, మళ్ళా చూడలేకపోయాను.
నిన్నంతా ఆ ఇద్దరు కవులూ నా మనసులో పదే పదే మెదుల్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా రష్యన్ సామ్రాజ్యపు అంచుల్లో టర్కిక్ సంస్కృతికి చెందిన గిరిజనభాషలకి ప్రతినిధులు. గంజాతొవ్ ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ కి చెందిన దాగెస్తాన్ కవి. కాస్పియన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఈశాన్య కాకసస్ పర్వతశ్రేణిలో సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తున ఉన్న గిరిజనప్రాంతమది. ముప్పై లక్షల జనాభా (హైదరాబాదులో మూడో వంతు) ఉన్న దాగెస్తాన్ లో కనీసం పదకొండు భాషలున్నాయి. అంత చిన్న ప్రాంతంలో అంత భాషావైవిధ్యం ఉన్న ప్రాంతం భూమ్మీద మరొకటి లేదు. దానికో కథ కూడా చెప్తారు. ఒకప్పుడు ఒక ఆశ్వికుడు, గుర్రం మీద ప్రయాణిస్తో,మనుషులకి భాషలు పంచిపెట్టుకుంటో పోయేడట. కాని దాగెస్తాన్ దగ్గరకి వచ్చేటప్పటికి, ఆ కొండలన్నీ ఎక్కిదిగలేక, ఒక పెద్ద మూట ఆ కొండల్లోకి విసిరేసి, అందులో ఉన్న భాషలేవో వాళ్ళనే పంచుకొమ్మన్నాడట. అట్లా ఆ ప్రజలకి దొరికిన భాషల్లో అవార్ భాష చాలా పెద్దది.ఇప్పుడు సుమారు పదిహేను లక్షల మంది మాట్లాడే భాష. (అంటే విశాఖపట్టణం కన్నా తక్కువ జనాభా అన్నమాట.) కాని, రసూల్ గంజతోవ్ లాంటి పుత్రుణ్ణి కన్నందుకు , ఆ భాష అంతర్జాతీయ పటం మీద చోటు సంపాదించుకుంది.
ఒకప్పుడు, ఇంకా నాకు జ్ఞానం వికసించీ వికసించని వయసులో చదివిన ఆ కవుల కవిత్వమెట్లా ఉంటుందో చూద్దామని వాళ్ళ కవిత్వం కోసం వెతికాను. సుప్రసిద్ధమైన ఈ కవిత నా కంటపడింది.
‘కొంగలు’ పేరిట గంజాతోవ్ రాసిన ఈ గేయం రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియెట్ సైనికుల బలిదానానికి గుర్తుగా నిలబడిపోయింది. కాని, ఈ కవితకొక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. రెండవ ప్రపంచ యుద్దం అయినతరువాత, గంజాతోవ్ ఒకసారి జపాన్ వెళ్ళినప్పుడు, హిరోషిమా కూడా సందర్శించాడు. అక్కడ హిరొషిమా శాంతి స్మారక ఉద్యానవనం అతణ్ణి ఆకర్షించింది. ముఖ్యంగా, ఆటంబాంబు అనంతరపరిణామాల్లో పదేళ్ళ తరువాత మరణించిన ఒక జపనీయ బాలిక సడకొ ససకి జ్ఞాపకార్థం నిర్మించిన స్మారకచిహ్నం అతణ్ణి ఆకట్టుకుంది. ఆటంబాంబు పడినప్పుడు శిశువులుగా ఉండి బతికి బట్టకట్టినపిల్లలు పదేళ్ళతరువాత లుకేమియా వ్యాథిగ్రస్తులయ్యారు. అణుధార్మిక ప్రభావం అప్పటికి వాళ్ళని కబళించడం మొదలుపెట్టింది. నిర్దోషులైన ఆ పిల్లలు, తాము పుట్టేటప్పటికే, తమ ముందు తరం చేసిన యుద్ధానికి తాము బలికావడం మానవచరిత్రలో ఊహించలేని విషాదం. అటువంటి పిల్లల్లో ససకి కూడా ఉంది.
ఎవరేనా రోగగ్రస్తులు కాగితాలతో వెయ్యి కొంగల బొమ్మలు తయారు చేస్తే స్వస్థత చేకూరుతుందని జపాన్ లో ఒక నమ్మకం. ఆ బాలిక కూడా కొంగలబొమ్మలు చుట్టడం మొదలుపెట్టిందిగాని, మృత్యువు ఆమెని కబళించేసింది. ఆ బాలిక స్మృతి గంజాతోవ్ ని వెంటాడింది. అతడు రష్యాకి తిరిగి వచ్చాడేగాని, ఆ కొంగలు అతడి మనసులో గిరికీలు కొడుతూనే ఉన్నాయి. చివరికి ఈ గీతంగా రూపుదిద్దుకున్నాయి. ఆ నిర్భాగ్య బాలిక చుట్టడం మొదలుపెట్టిన ఆ కొంగలు, ఈ గీతం ద్వారా, రష్యన్ గగనమంతా ఆక్రమించాయి. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ విషాదానికి చిహ్నంగా మారిపోయేయి. ఆ కొంగలు రష్యా మనసులో ఎంతగా నాటుకుపోయాయంటే, ఇప్పుడు ప్రతి ఏటా అక్టోబరులో, దాగెస్తాన్ లో తెల్లకొంగల పండగ జరుపుకునేటంతగా.
ఇది కకేషియన్ పర్వత ప్రాంతాల బాణీలో కట్టిన గీతం. రష్యన్ కవిత్వం ప్రధానంగా మాత్రాఛందస్సుల్లోనే నడుస్తుంది కాబట్టి, దీన్ని గేయంగా రష్యన్ లోకి అనువదించుకున్నారు. నేను కూడా దీన్నొక చతురశ్రగతి గేయంగా మార్చడానికి ప్రయత్నించాను. కాని మీరెవరైనా దీన్ని పాటగా మారిస్తే నేను మరింత సంతోషిస్తాను.
కొంగలు
గడచిన రోజుల నడిచిన పోరున
వీరులెందరో, ఏమైనారో?
లేవు సమాధులు, నిత్యయవ్వనులు,
ఓహో, వారే! నింగిన కొంగలు!
యుద్ధము వదిలిన రుద్ధబాష్పముల
క్రేంకారమ్ముల ఖగగీతమ్ములు.
నిలుతుము మనమిట నిశ్చేష్టులమై
విషాదమానసవిలోకనముతో.
దినాంత సంధ్యా దిగంతరేఖన
తుహినమార్గమున తరలుట చూచితి,
బారులు బారులు బలాకగణములు
కదనరంగమున కవాతు మాదిరి.
గగనవీథులను క్రమము తప్పకను
ఎగిరే పక్షుల బిగ్గర గొంతుక
మాతృభాషలో మనవారెవరో
పిలిచిన రీతిన వినబడలేదా?
విహాయసమ్మున మహాయశస్కులు
ప్రాణ హితైషులు, పూర్వబాంధవులు
వియత్తలమ్మున వదిలిన జాగా
రేపటిరోజున నాకే కాదా!
భవిష్యదినమున, తుషారపథమున,
రెక్కలు చాపిన కొక్కెరగుంపుల
నేనొక్కడనై, ఇలాతలమ్మున
మిగిలిన మిత్రుల తలవకపోనా !
The Cranes
It seems to me at times that many soldiers,
Did not return home from bloody, burning plains,
Were not entombed, nor getting older,
But did convert themselves into white cranes.
And now they from that time very distant,
Still fly and send us their bitter cry.
Therefore of sadness and sorrow persistent,
We all stand rigid looking up at the sky..
In early evening of twilight this day,
I can see how in dense fog cranes fly.
In fixed formation always they will stay,
Like marching, men before on earth did try.
They fly as always in designated lanes,
And some familiar names they screech.
Would not the loud voices of the cranes
For me seem similar to Avars’ speech?
To the high heavens they fly in place,
My former friends and relations observed.
In their formation is only a small space—
This place is possibly for me reserved…
The day will come and with a flock of cranes,
Together I will fly in the same bluish mist,
Under high heaven like a bird calling the names
Of all whom on the earth that I have missed.
31-5-2018