ఒలావ్ ఎచ్. హాజ్

Reading Time: 4 minutes

40

రాబర్ట్ బ్లై అమెరికన్ కవి, అనువాదకుడు. గత శతాబ్దంలో యాభైల్లో మన కవులు అమెరికావైపు చూస్తూ ఉన్నప్పుడు, అతడు తూర్పుదేశాలవైపు చూస్తూ ఉన్నాడు. ప్రపంచపు నలుమూలలనుంచీ గొప్ప కవుల్నీ, కవిత్వాన్నీ ఇంగ్లీషులోకి అనువదించి అమెరికాకీ, ప్రపంచానికీ పరిచయం చేసాడు. అట్లా తాను అనువదించిన 24 మంది కవుల కవితల్ని కొన్నింటిని The Winged Energy of Delight (హార్పర్ కాలిన్స్, 2005) పేరిట ఒక సంకలనంగా వెలువరించాడు. ఆ సంకలనం చదివినప్పణ్ణుంచీ, నేను చదవాలని మనసుపడ్డ కవుల్లో ఒలావ్ ఎచ్.హాజ్, రోల్ఫ్ జేకబ్ సన్ కూడా ఉన్నారు. అమెరికానుంచి వస్తూ నాగరాజు రామస్వామిగారు మా ఇంటికొచ్చి మరీ ఆ కవిత్వం నా చేతుల్లో పెట్టడం నేను ఊహించలేని కానుక.

ఒలావ్ ఎచ్. హాజ్ (1908-1994) నార్వేజియన్ కవి. పశ్చిమ నార్వే లోని అత్యంత సుందర ప్రాంతమైన హార్డేంజర్ ఫోర్డ్ లో ఉల్విక్ అనే గ్రామంలో ఒక రైతుగా జీవించాడు. తన మూడెకరాల క్షేత్రంలో ఆపిల్ తోట పెంచుకుంటూ గడిపాడు. కాని, ఆ రైతు జీవితకాలంపాటు అద్భుతమైన సాహిత్య కృషీవలుడిగా కూడా జీవించాడు. టెన్నిసన్, యేట్స్, మల్లార్మే, బ్రెహ్ట్, హోల్డర్లిన్ వంటి ప్రసిద్ధ ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మన్ కవుల్ని నార్వేజియన్ లోకి అనువదించాడు. 1951 నుంచి 1998 దాకా తన కవిత్వం ఏడు సంపుటాలుగా వెలువరించాడు. వాటిల్లోంచి ఎంపిక చేసిన 75 కవితల్ని రాబర్ట్ బ్లై, రాబర్ట్ హెడిన్ అనువదించి The Dream We Carry (కాపర్ కేన్యాన్, 2008) పేరిట తీసుకొచ్చారు.

ఈ వారంరోజులుగా ఆ కవిత్వం చదువుతూ ఉంటే, నా అంతరంగం కిటికీలు బార్లా తెరిచినట్టుగా ఉంది. ప్రతి ఏటా మార్గశిరమాసం తెరిచిపెట్టే బంగారు వాకిలి కొంత ముందస్తుగానే తెరిచినట్టూ, ఏ సుదూరలోకం నుంచో ఆరోగ్యప్రదమైన ఉదయసూర్యరశ్మి ఆ కిటికీలోంచి నా గదిలో పడుతున్నట్టూ ఉంది.

హాజ్ కవితలు చాలా చిన్న చిన్న కవితలు. రెండు పంక్తులనుంచి ఎనిమిది పంక్తులకంటే మించని కవితలు. మనకి ఇవ్వడానికి అతడిదగ్గర చాలానే ఉందనీ, కానీ దాన్నతడు, నర్సులు మందులిచ్చినట్టుగా, చెంచాడు చెంచాడు ఇస్తాడంటాడు బ్లై. కాని, రోజుకి ఒక్క చెంచా చాలు, జీవితజ్వరం నుంచి మనం కోలుకోవడానికి.

ఇది ఒక రైతు రాసిన కవిత్వం. మనకి ఇట్లాంటి కవులు ఎవరున్నారు? పోతన గుర్తొస్తాడు. కాని, ఆ కవిత్వంలో పోతన జీవితం మనకి కనిపించదు. పొలం నుంచి ఇంటికొచ్చి, ఎడ్లకి ఇంత చొప్ప వేసి, ఇంటిముంగిట ధాన్యం కళ్ళంలో కుప్ప నూరుస్తుండగా, అరుగు మీద కూచుని పోతన ప్రహ్లాద చరిత్ర రాసి ఉంటాడని మనకి తట్టదు. బహుశా, దశమస్కంథంలో ఆ గొల్లపల్లెల్ని బట్టి కొంత ఆ పశువులకొట్టాల్నీ, కవ్వం చప్పుళ్ళనీ ఊహించగలమేమో. కాని, ‘హాలికుడైన సత్కవి’ ఎలా ఉంటాడో ఈ నార్వేజియన్ కవిత్వంలో నాకు స్పష్టంగా కనబడుతూ ఉంది.

తానట్లా నిరాడంబరంగా బతకడానికి స్ఫూర్తికోసం అతడు ప్రాచీన చీనా, జపాన్ కవుల వైపు చూస్తూ ఉన్నాడు. చీనా కవుల్లో మహర్షిగా చెప్పదగ్గ తావోచిన్ (365-427) అతడికి ఆదర్శం. తావోచిన్ కొన్నాళ్ళు ప్రభుత్వోద్యోగం చేసాడు. కాని ఒక రోజు స్థానిక గవర్నరు వచ్చినప్పుడు కోటు వేసుకోలేదని మాటపడటంతో అసలు ప్రభుత్వోద్యోగానికే స్వస్తి చెప్పేసాడు. ‘అయిదు పుట్ల ధాన్యం కోసం బానిసలాగా బతకలేన’ ని చెప్పి, తన స్వగ్రామానికి పోయి, రైతుగా బతికాడు. అటువంటి కవిని హాజ్ ఆదర్శంగా తీసుకోవడంలో ఆశ్చర్యమేముంది? తావోచిన్ తన పొలం చూడటానికి వస్తే ఎలా ఉంటుందో కూడా హాజ్ ఒక కవిత రాసాడు. అతడికి తన చెర్రీలు, ఆపిల్ చెట్లతో పాటు, తాను రాసిన ఒక కవిత కూడా చూపించాలని ఆశపడుతున్నట్టు రాసుకున్నాడందులో.

ఒలావ్ హాజ్ కవిత్వం చదివాక, ఆధునిక నార్వేజియన్ కవుల్లో అగ్రగణ్యుడైన ఒక కవిని, ఆధునిక యూరపియన్ కవిత్వ అనువాదకుల్లో ఒక సుప్రసిద్ధుణ్ణి చదివిన భావన కలగదు. ఆ పుస్తకం మొదటి పఠనం ముగించగానే నాకు ముగ్గురు గుర్తొచ్చారు. ఒకరు, నా మిత్రుడు గంగారెడ్డి సోదరి, ఒక రైతు. ఒక రోజు వాళ్ళింట్లో నేను అతిథిగా ఉన్నాను. మేము ఆమె పొలం చూడటానికి వెళ్తే అప్పుడే తవ్వితీసిన కారెట్ దుంపల్ని పంటకాలువ నీళ్ళల్లో కడిగి ఆమె నా చేతుల్లో పెట్టడం గుర్తొచ్చింది. మరొకరు, మా ఊరిదగ్గర బోయపాడు అనే గిరిజన గ్రామంలో నా తండ్రి చిన్నప్పుడు పరిచయం చేసిన కాకురు చిన్నబ్బాయి అనే గిరిజనుడు. వృద్ధుడు. ముగ్గుబుట్టలాంటి అతడి జుత్తూ, మీసమూ, గెడ్డమూ గుర్తొస్తుంటే, బహుశా తావోచిన్ అలానే ఉండి ఉంటాడని ఇప్పుడనిపిస్తోంది. ఇక మూడవ వ్యక్తి, మా బామ్మగారు. మధ్యాహ్నం పూట భాగవత పద్యాలు చదువుకుంటో ఆమె వత్తులు చేసుకుంటూండే దృశ్యమే పదే పదే కళ్ళముందు కనిపిస్తూ ఉంది.

సామాజిక అసమ్మతికారుడిగా, రాజకీయ విప్లవకారుడిగా ఎంత కనబడాలని ప్రయత్నిస్తున్నప్పటికీ తెలుగు కవి చాలా డొల్ల. తెలుగు కవి వెయ్యేళ్ళ ప్రయాణాన్ని మూడు ముక్కల్లో చెప్పవచ్చు. మొదట్లో కవిత్రయాదుల కాలంలో అతడు రాజగురువు. భువన విజయం నాటికి అతడు రాజమిత్రుడు. ఇప్పుడు రాజభృత్యుడు. ఈ భృత్యత్వానికీ, బానిసత్వానికీ దూరంగా ఉండే కవులు ఎలా ఉంటారో చూడాలని తపిస్తున్న నాకు ఒలావ్ హాజ్ ఒకడు కనిపిస్తున్నాడిప్పుడు.

ఇంత చెప్పాక, అతడి కవిత్వం ఎలా ఉంటుందో చూడాలని మీరెలాగూ కోరుకుంటారు కాబట్టి, ఈ కవితలు, మీ కోసం.

ఒక పేడపురుగుని కావాలని ఉంది 

విషాదం నా మీద బరువుగా కూచుంది
వెచ్చటిగడ్డిపరుపులో నన్ను అడుగంటా తొక్కుతోంది
నేను కనీసం అటూ ఇటూ కదలగలిగితే బాగుణ్ణు
నా బలమంతా కూడదీసుకుని, ఈ మట్టిపెళ్ళను పెకలించుకోగలిగితే-

వసంతకాలం రాగానే
పేడకళ్ళని తవ్వుకుంటూ పైకొస్తుందే
అట్లాంటి ఒక పేడపురుగుని కాగలిగితే.

కవిత

నువ్వొక కవిత రాస్తే
ఒక రైతుకి అది ఉపయోగపడితే
నువ్వు నిజంగా సంతోషించవచ్చు.
ఒక కమ్మరి దాన్నిష్టపడతాడో లేదో చెప్పలేం
కాని ఒక వడ్రంగిని మటుకు ఆ కవిత సంతోషపెట్టడం కష్టం.

నా దగ్గర మూడు కవితలున్నాయి

నా దగ్గర మూడు కవితలున్నాయి
అన్నాడతడు.
కవితల లెక్క ఎవరికి కావాలి?
ఎమిలీ తన పద్యాలన్నీ
ఎప్పుడో ట్రంకుపెట్టెలో పారేసింది,ఆమె
వాటిని ఎప్పుడేనా లెక్కపెట్టుకుని ఉంటుందా
అనుమానమే.
ఇప్పుడామె టీబాగు తెరిచి
కొత్త రచనకుపూనుకుంది.

నిజమే కదా. మంచి కవిత
తేనీటి పరిమళం వెదజల్లాలి,
లేదా అప్పుడే నరికిన పచ్చికట్టెదో
లేదా పచ్చిమట్టిదో వాసన విరజిమ్మాలి.

ముళ్ళ గులాబి

గులాబి గురించి చాలానే కవిత్వం వచ్చింది
నేను ముళ్ళ గురించి పాడాలనుకుంటున్నాను
దాని వేర్ల గురించి కూడా-

ఆ బండరాతిని ఎంత గట్టిగా పట్టుకుందో
ఆ వేరు,
సన్నటి బాలిక చేతిలాంటి ఆ వేరు గురించి కూడా.

ఎండిపోయిన చెట్టు

ఆ పిట్ట అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది
చచ్చిపోయిన చెట్టుమీద
గూడుకట్టుకోవాలని లేదు దానికి.

నడివేసవి, మంచు

నడివేసవి, మంచు.
పక్షులకి చిన్న రొట్టెముక్క తుంపిపెట్టాను

దానివల్ల నా నిద్రేమీ పాడవలేదు.

కొత్త టేబుల్ క్లాత్

కొత్త టేబుల్ క్లాత్, పసుపుపచ్చది!
దానిమీద కొత్త తెల్లకాగితం!
ఆ వస్త్రం సున్నితంగా ఉంది
ఆ కాగితం సుకుమారంగా ఉంది
ఇప్పుడింక ఇక్కడికి మాటలు చేరుకోవలసి ఉంది.

మనకి తెలిసిందే కద,
లోయలో మంచు గడ్డకట్టినప్పుడు
పక్షులు వచ్చి వాలుతుండటం.

నిజంగా ఒకసారి ఆలోచించి చూస్తే

ఏడాదికేడాదీ నువ్వు పుస్తకాల్లో కూరుకుపోతున్నావు
తొమ్మిది జన్మలకు సరిపడా
విజ్ఞానం పోగుచేసుకున్నావు.
నిజంగా ఒకసారి ఆలోచించి చూస్తే
మనకు కావలసింది చాలా తక్కువ,
ఆ కొద్దిపాటీ మన హృదయానికి ముందే తెలుసు.

అందుకేనేమో ఈజిప్టులో జ్ఞానదేవతకి
కోతిముఖం ఉంటుంది.

కారులో పోలేవు, విమానంలో కూడా

కారులో పోలేవు
విమానంలో కూడా-
గడ్డిబండిమీదా కాదు
గుర్రబ్బండి మీదా కాదు
-చివరికి ఎలీషా అగ్నిరథం మీద కూడా.

నువ్వెప్పటికీ బషో* కన్నా దూరం పోలేవు
అతడక్కడికి కాలినడకన చేరుకున్నాడు.

తివాసి

నా కోసం ఒక తివాసీ నేసిపెట్టు, ప్రియా**,
కలలతోటీ, కల్పనలతోటీ
గాలితోటీ నేసిపెట్టు దాన్ని.
అప్పుడు నేనొక అరబ్బు సంచారిలా
ప్రార్థించుకునేటప్పుడు దాన్ని పరుచుకుంటాను
నిద్రపోయేటప్పుడు చుట్టూ లాక్కుంటాను
ప్రతి రోజూ పొద్దున్నే
భోజనాల బల్లలాగా సిద్ధంకమ్మని ఆజ్ఞాపిస్తాను.

నేసిపెట్టుదాన్ని
చలికొరికే శీతాకాలం ఒక టోపీలాగా
నా పడవకు తెరచాపలాగా.

ఒకరోజు నేనా తివాసీ మీద కూచుని
మరో ప్రపంచానికి తేలిపోతాను.

______________
* బషో (1644-1694: జపనీయ హైకూ కవి, తన కవిత్వానికి స్ఫూర్తి వెతుక్కుంటూ 1500 మైళ్ళు కాలినడకన సంచారం చేసాడు.
** ఈ కవిత హాజ్ తన భార్య బోదిల్ ని ఉద్దేశించి రాసాడు.

14-12-2017

Leave a Reply

%d bloggers like this: