ఐతిహాసిక బృందగానం

Reading Time: 3 minutes

Svetlana Alexievich

నిన్న సాయంకాలం రాజిరెడ్డి ఫోన్ చేసి ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ ఒక రష్యన్ రచయితకి ఇచారని చెప్తూ ఆమె గురించి మీరేమైనా రాయగలరా అనడిగాడు. ఆమె పేరు కూడా చెప్పాడు గాని, ఫోన్లో వినబడలేదు. నేనామె పేరెప్పుడూ వినలేదనీ, ఆమె రచనలగురించేమీ తెలియదనీ సదాశివరావుగారిని గానీ, ముకుందరామారావుగారిని గానీ అడగమని చెప్పాను.

సరిగ్గా ఈ అజ్ఞానం మీదనే స్వెత్లానా అలెక్జీవిచ్ గత పాతికేళ్ళకు పైగా పోరాటం చేస్తూ ఉందని ఇప్పుడర్థమయింది నాకు.

ఆమె గురించి తెలుసుకుంటున్న కొద్దీ, ఇప్పటి కాలంలో రచయితలు తమ మానవత్వాన్ని ప్రకటించడానికి, తోటి మనిషికి బాసటగా నిలబడటానికీ ఎటువంటి కొత్త దారులు అన్వేషిస్తున్నారో, ఎటువంటి నిర్విరామ ప్రయత్నాలు చేస్తున్నారో స్వెత్లానా ఒక గొప్ప ఉదాహరణ అనీ,  ఆమె రచనలకు నోబెల్ బహుమతి ప్రకటించడం, సాహిత్యప్రక్రియలంటూ ప్రత్యేకంగా ఉంటాయనుకునే ఒక మనస్తత్వానికీ, అలవాటుకీ పెద్ద కుదుపు అని అర్థమయింది నాకు.

‘గొప్ప చారిత్రిక సమాచారాన్ని ఆమె మనకొక కొత్త ప్రక్రియగా అందించింది ‘అని ప్రస్తుతించింది స్వీడిష్ అకాడెమీ 2015 సంవత్సరానికిగాను సాహిత్య పురస్కారాన్ని ఆమెకు ప్రకటిస్తూ.

మిన్స్క్ లో తన ఇంట్లో గుడ్డలు ఇస్త్రీ చేసుకుంటూండగా స్వీడిష్ అకాడెమీ నుండి ఆమెకి ఫోన్ వచ్చింది. గత 115 ఏళ్ళల్లో ఇటువంటి అరుదైన ఫోన్ కాల్ కి నోచుకున్న 14 వ మహిళ ఆమె.

ఆ క్షణం ఆమె మనసులో విరుద్ధ భావాలు చెలరేగాయి. మహనీయ సాహిత్యవేత్తలూ, నోబెల్ పురస్కారం పొందిన పూర్వరచయితలు ఇవాన్ బునిన్, బోరిస్ పాస్టర్నాక్ గుర్తొచ్చారు. మరొకవైపు తాను జీవితకాలం పాటు ఏ వ్యథార్త జీవిత యథార్థ దృశ్యాల్ని చిత్రిస్తూ వచ్చిందో అవన్నీ గుర్తొచ్చాయి. ఒకవైపు ‘అద్భుతంగా’ మరొకవైపు ‘అలజడి’ గా అనిపించిందామెకి.

కాని తనను తాను సంబాళించుకుని తన దేశప్రజలతో చెప్పిందామె : ‘ఈ అవార్డు నాకు మాత్రమే కాదు, మన సంస్కృతికీ,మన చిన్నదేశానికీ కూడా.’

స్వెత్లానా అలెజీవిచ్ 1948 లో పశ్చిమ యుక్రెయిన్లోని ఇవనో-ఫ్రాంకివిస్క్ పట్టణంలో పుట్టింది. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. జర్నలిజం చదువుకుంది, ఉపాధ్యాయినిగా, జర్నలిస్టుగా పనిచేసింది. ఆ క్రమంలో ‘మానవ హృదయావేదనకి సంబంధించిన గళాల్ని, వాజ్మూలాల్ని, సాక్ష్యాల్ని’ చేజిక్కించుకోగలిగింది. సివికృష్ణారావుగారి మాటల్లో చెప్పాలంటే ‘ఒక లక్ష బొటమనవేళ్ళు చదివింది.’

ఆమె రచనల్లో ఇప్పటిదాకా ఇంగ్లీషులోకి అనువాదమైన మూడు ముఖ్యమైన రచనల్లోనూ కనవచ్చేది సోవియెట్ కాలానికీ, సోవియెట్ అనంతర కాలానికీ చెందిన చరిత్ర, మనకు తెలియని చరిత్ర. రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపు పదిలక్షలమంది సోవియెట్ మహిళలు పాల్గొన్నారనీ, వారి సాహసం, త్యాగం చరిత్రలో నమోదు కాకుండా పోయాయనీ వివరిస్తూ ఆమె రాసిన War’s Unwomanly Face (ప్రొగ్రెస్ పబ్లిషర్స్, 1984) తో ఆమె ప్రయాణం మొదలయిందని చెప్పవచ్చు.

ఆఫ్గనిస్థాన్ లో సోవియెట్ యుద్ధం మిగిల్చిన చేదు అనుభవాల్ని Zinky Boys: Soviet Voices from the Afghanistan War (1992) పేరిట వెలువరించింది. ముఖ్యంగా 1986 లో చెర్నోబిల్ లో సంభవించిన అణుశక్తి రియాక్టర్ల వైఫల్యం వల్ల సంభవించిన అణుశక్తి సంబంధిత విపత్తువల్ల దెబ్బదిన్న వేలాది కుటుంబాల్ని స్వయంగా కలిసి ఆ బాధితుల్ని ఇంటర్వ్యూ చేసి వారి గాథల్ని Voices from the Chernobyl: The Oral History of a Nuclear Disaster (1997) పేరిట వెలువరించింది.

ఈ రచనా ప్రక్రియని కేవలం జర్నలిజంగా భావించలేం. ఒక నవలకన్నా, కవిత కన్నా భిన్నమైన ఈ ప్రక్రియ కి తాను మరొక బేలోరష్యన్ రచయిత అలెస్ ఆడమోవిచ్ కి ఋణపడిఉంటానని స్వెత్లానా పేర్కొంది. ఈ ప్రక్రియను ఆమె ‘సమష్టి నవల’ గా, ‘వక్తృత్వ నవల ( novel-oratorio)’గా, ‘సాక్ష్యరచన’ ( novel-evidence) గా, ఐతిహాసిక బృందగానం’ గా (epic chorus) పేర్కొంది. మనుషులు తమ గురించి తాము మాట్లాడుకునే ఒక అవకాశంగా తన రచనా ప్రక్రియను వివరించింది. ఒకప్పుడు రావూరి భరద్వాజ ‘జీవనసమరం’ పేరిట ఇటువంటి ప్రయత్నమే చేసారని గుర్తు చేసుకోవలసిఉంటుంది.

అయితే సమకాలిక రష్యన్, బేలో రష్యన్ సాహిత్యవేత్తలు వీటిని కేవలం వార్తాకథనాలుగా భావించడంలేదు. ‘ఈ రకమైన డాక్యుమెంటరీ తరహా సాహిత్యం, సామాన్యమానవుడిపట్ల చూపించే ఈ శ్రద్ధ పూర్తిగా బేలోరష్యాకే స్వంతమైన సాహిత్య ప్రక్రియగా చెప్పవచ్చు. సోవియెట్ రచయితల దృష్టి ఎంతసేపూ బ్రహాండమైన పురాణాలు నిర్మించడం మీదనే. బేలోరష్యన్ రచయితలు అలాకాదు, ఈ రచయితలూ, సినిమాదర్శకులూ చిన్న చిన్నమనుషుల్నీ,వాళ్ళ అనుభవాల్నీ చిత్రించడం కోసమే ఎక్కువ తహతహలాడుతారు ‘ అంది గాలినా షుర్ అనే ఒక కళావిమర్శకురాలు.

బేలోరష్యన్ ప్రతిపక్షనాయకుడు ఆంద్రే సన్నికోవ్ మాటల్లో ‘ఆమె సోవియెట్ మానవుడి ( రెడ్ మాన్) చరిత్ర రాస్తున్నది. ఆ మానవుడు ఇంకా అంతరించలేదనే ఆమె చెప్తున్నది.అతడు మనలో, ప్రతి ఒక్క సోవియెట్ మానవుడిలోనూ ఉన్నాడనే ఆమె వివరిస్తున్నది. ఆమె ఇటీవలి పుస్తకం Second Hand Time ఈ అంశానికే కేటాయించింది’. అతడింకా ఇలా అన్నాడు: ‘మనుషుల్తో మాట్లాడించడంలో ఆమె నేర్పు అద్భుతం. కఠినమైన ప్రశ్నల్నీ, సమస్యల్నీ ఆమె ఎక్కడా వదిలిపెట్టదు. మానవవిషాదమే ఆమె ప్రధాన ఇతివృత్తం. తాను వింటున్న విషాధ గాథల్ని తనలోపలకంటా తీసుకుని, మానవుడి అంతరంగంలో ఏం జరుగుతోందో అదంతా ఒక శస్త్రచికిత్సలాగా ఎంతో నిశింతంగానూ,నేర్పుగానూ బయటపెడుతుంది.’

‘నేను మనుషుల్ని సోషలిజం గురించి అడగను, ప్రేమ గురించి, వాళ్ళ అసూయలగురించి, పసితనం గురించి, వృద్ధ్యాప్యం గురించి అడుగుతాను ‘ అని రాసిందట ఆమె తన Second-Hand Time లో. ‘సంగీతం, నాట్యం, హెయిర్ స్టయిళ్ళు గురించి అడుగుతాను. అదృశ్యమైపోయిన ఒక జీవితం గురించిన అసంఖ్యాకమైన ఎన్నో చిన్ని చిన్ని విశేషాల గురించి. అట్లా అడిగితే తప్ప, ఒక విపత్తు మన దైనందిన జీవితంలోకి ఎట్లా జొరబడిందో అర్థం కాదు, అప్పుడు గాని ఆ అనుభవం కథగా మారదు’ అని కూడా .

ఆమె రచనల ఫ్రెంచి అనువాదాల సంపాదకుడు జాకె టెస్టార్డ్ ఇలా అన్నాడు: ‘ అదంతా ఒక మౌఖిక చరిత్ర. ఆమె పుస్తకాలన్నీ కూడా ఒకప్పటి సోవియెట్ యూనియన్ పట్ల బెంగతో రాసినవే.’ అతడింకా ఇలా అన్నాడు: ‘సోవియెట్ యూనియన్ కుప్పకూలిపోయాక ఆమె మనుషుల్ని కలుసుకుంటూ, ప్రశ్నిస్తూ రష్యా అంతా తిరిగింది. ఒకప్పటి సోవియెట్ యూనియన్ సామూహిక అంతరంగమెట్లా ఉండేదో తనకై తాను తెలుసుకోవాలని చేసిన ప్రయత్నమది. ఆమె పుస్తకాలన్నిటిలోనూ కనవచ్చేదొకటే, తమదైన ఒక గుర్తింపును, తమ జాతిముద్రను పోగొట్టుకున్న బాధ, నువ్వింకెంతమాత్రం గుర్తుపట్టలేని ఒక దేశంలో నిన్ను నువ్వు పోల్చుకోవడానికి చేసే ప్రయత్నం. ఇరవయ్యవశతాబ్దపు ఉత్తరార్థంలో, పుటిన్ కాలందాకా, రష్యా తాలూకు సూక్ష్మ చారిత్రిక విశ్లేషణ ఆమె సాహిత్యం.’

ఆమె రచనల్ని ఇంగ్లీషులోకి అనువదిస్తున్న బెలా షాయేవిచ్ మాటల్లో ‘ సోవియెట్ రష్యాలోనూ, సోవియెట్ అనంతర రష్యాలోనూ జీవితసత్యం ఊహకందనిది, ఆ నిజాలు అంత తేలిగ్గా మింగుడు పడేవి కావు. ఆమె రచనలకు బహుమతి రావడం నాకు సంతోషాన్నెందుకిస్తున్నదంటే,కనీసం ఈ విధంగానైనా మరింత మరింతమంది పాఠకులు సోవియెట్ రష్యన్ విషాదానికి చేరువకాగలుగుతారు కనుక.’

రష్యన్ వ్యవస్థను ప్రశ్నించింది కాబట్టి రాజకీయ కారణాలవల్ల ఆమెకి నోబెల్ బహుమతి లభించిందన్న విమర్శను స్వీడిష్ కమిటీ కొట్టిపారేసింది. అయినా కూడా స్వెత్లానాకు బహుమతి ఇవ్వడం ద్వారా నోబెల్ సాహిత్య బహుమతికీ సాహిత్యానికీ సంబంధం లేదని మరోసారి రుజువైందని ఒక రష్యన్ సాహిత్యవారపత్రిక సంపాదకుడు ఇప్పటికే విమర్శనాస్త్రం ఎక్కుపెట్టాడు. ఆ విమర్శలకు స్వెత్లానా ప్రతిస్పందన గమనించదగ్గది.

‘నేటి కాలంలో మనుషులు నిజాయితీగా జీవించడం చాలా కష్టం’ అందామె.

స్వెత్లానా కు నోబెల్ బహుమతి రావడం నుంచి రచయితలు, ముఖ్యంగా తెలుగు సాహిత్యం తెలుసుకోవలసిందేమైనా ఉందా?

ఉందనే అనుకుంటున్నాను. రెండు విషయాలు, ఒకటి, నేటికాలంలో రచయిత ఇంకెంతమాత్రం ఒంటరిగా కూచుని రచనలు చేస్తూ ఉండటంలో అర్థం లేదు. నేటి సాహిత్య ప్రక్రియలు సామూహిక ప్రక్రియలు. సమష్టి ప్రక్రియలు.

రెండవది, మన చుట్టూ సంభవిస్తున్న విషాదాలు చెర్నోబిల్ దుర్ఘటనల్లాంటివే.గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకన్నా పెనువిషాదమేముంటుంది? కాని మనకి తెలీనిదల్లా ఆ రైతుల, వాళ్ళ భార్యల, బిడ్డల, బంధువుల కథనాలు, సాక్ష్యాలు, సమష్టిరోదనలు. మననుంచి ఒక స్వెత్లానా రావడానికి ఇంతకన్నా మించిన చారిత్రిక సందర్భం మరొకటి ఉండబోదు.

9-10-2015

Leave a Reply

%d bloggers like this: