మండూకసూక్తం

41

జ్వరం తగ్గింది గానీ, నీరసం. బయట అకాశమంతా ఆవరించిన శ్రావణమేఘాలు. కనుచూపుమేరంతా నేలనీ, నింగినీ కలిపి ఏకవస్త్రంగా కుట్టిపెట్టిన ముసురు. రాత్రవగానే నా కిటికీపక్క వానచినుకులసవ్వడి. ఇప్పుడేదో వినవలసిన చప్పుడొకటి మిగిలిపోయింది. ఏమిటది?

నా చిన్నప్పటి మా ఊరు. ఆ చిన్ని కొండపల్లెలో వానాకాలపు రాత్రులదంతా ఒక మాంత్రికలోకం. అడవినీ, కొండల్నీ, అవనినీ, ఆకాశాన్నీ ఒకే దుప్పట్లో చుట్టేసేది ముసురు. దిక్కులన్నీ దగ్గరైపోయి ఊరు బుల్లిపిచుకలా ముడుచుకుపోయేది. తాటాకు ఇంటికప్పు మీద కురిసిన వాన చూరమ్మట ధారాపాతంగా కంచె కట్టినట్టు కారుతూనే వుండేది. ఏడుగంటలకే ఊరు మాటు మణిగిపోయేది. పిల్లలమంతా ఒకరినొకరం చుట్టుకుని హత్తుకుపోయేవాళ్ళం. మట్టిమంగలంలో ఎర్రని నిప్పుకణికలమీద అమ్మ మొక్కజొన్నలు కాల్చి ఇచ్చేది. నాన్నగారేవో చెప్తుండేవారు. కొంతసేపయ్యాక అమ్మ ఆ వానలోనే ఇంటివెనక పశువుల పాక లో అవులెట్లా ఉన్నాయో పేరుపేరునా ఒక్కొక్కదాన్నీ పలకరించి వచ్చేది. ఇక కొంతసేపటికి అమ్మ కూడా నిద్రలోకి జారుకునేది. అప్పుడు-

అప్పుడు వినవచ్చేది ఊరి చెరువుల్లో, పొలాల్లో, కుంటల్లో ఎక్కడ పడితే అక్కడ కప్పల బెక బెక.
కప్పలబెకబెక వినబడకపోతే అది వానాకాలమే కాదు, అట్లాంటి వానాకాలం లేకపోతే అదసలు కాలమే కాదు.

ఆ కప్పల బెకబెక ఒక్కటే వినబడే ఆ అర్థరాత్రి మేమంతా ఒక చిన్నతెప్పలో పడుకుని ఏదో నదిలో ఎక్కడికో తేలిపోతున్నట్టే ఉండేది.

ఆ కప్పలబెకబెక దగ్గరే నేనట్లా ఒక జీవితకాలం ఆగిపోయిఉండేవాణ్ణి. కాని ఒక రాత్రి, మా అక్క, అప్పుడామె రాజమండ్రిలో సదనంలో చదువుకుంటోది, మధ్యలో ఎందుకో ఇంటికొచ్చింది, ఒక వానాకాలపు రాత్రి, కప్పలబెకబెక వింటూ-

‘తెలుసా, శ్రీనాథుడుకి ఈ కప్పల భాష తెలుసు’ అంది.’కప్పలు కరవరట్, కురరవరరగట్’అంటున్నాయన్నాడు’ అంది.

కంచిలో పడ్డ కుంభవృష్టిని వర్ణిస్తూ హరవిలాసంలో చెప్పిన పద్యమది.

ఉరుమురిమి మూలగాడ్పులు
పరచి విసరజొచ్చె మదన సంహరు దెస గ్రొ
మ్మెరుగుద్భవించె, గప్పలు
‘గరవరట్కురరవరరగ ‘ ట్టని యరచెన్.

అదొక మలుపు. చదువు చేసే అద్భుతమదే. ఎక్కడి శరభవరం, ఎక్కడి హరవిలాసం! అత్యంత స్థానిక, కౌటుంబిక పరిమిత జీవితానుభవాన్ని ఆమె ఆ ఒక్క మాటతో history కీ, beyond history కీ తీసుకుపోయింది. ఆ అర్థరాత్రి కంచిలో కప్పలన్నీ మా పల్లె చెరువుకి చేరుకున్నాయనిపించింది. మామూలుగా కథలన్నీ కంచికి వెళ్తాయి కాని, ఆ రాత్రి మా అక్క మాటల మహిమతో కంచిలో కథ మా ఊరికి చేరింది.

ఇక ఆ రాత్రి తర్వాత, ఆ కప్పల బెకబెక మళ్ళా ఎప్పటికీ పూర్వపు బెక బెక కాలేకపోయింది. ఇప్పుడా కప్పలకి చరిత్రగంధం అంటుకుంది.

నేను రాజమండ్రిలో ఉంటున్న రోజుల్లో వేదాల పట్లా, ఉపనిషత్తులపట్లా ఆసక్తి కలిగినప్పుడు, వాటి ఇంగ్లీషు అనువాదాల్ని కూడబలుక్కుని చదువుకుంటున్నప్పుడు, వేదంలో కూడా కప్పలబెకబెక ఉందని తెలిసింది. ఋగ్వేదంలో మండూకసూక్తం:

సంవత్సరమంతా వ్రతచారిణులైన బ్రాహ్మణులు
గొంతెత్తినట్టు పర్జన్యుణ్ణి పలకరిస్తున్నాయి కప్పలు.

చెరువులో తోలుసంచిలాగా పడుకున్న కప్పని వాన
తడిపినప్పుడు తల్లికోసం లేగదూడలాగా చప్పుడుచేస్తుంది.

వర్షందప్పికపడ్డ కప్పల్ని నీళ్ళతో ముంచేస్తుంది,కప్ప
మరొక కప్పని బుడిబుడిమాటల బిడ్డలాగా చేరుతుంది.

ఒకటి మరొకదాన్ని పలకరిస్తుంది, వానలో గంతులేస్తుంది,
బూడిదరంగు కప్ప పచ్చరంగుదానితో గొంతుకలుపుతుంది.

గురువుని శిష్యుడు అనుకరించినట్టు గొంతు కలుపుతాయి
కప్పలారా, మీరు గొంతెత్తినపుడు మీ కీళ్ళు బిగుస్తాయి.

ఒకటి ఆవులాగా,మరొకటి మేకలాగా అరుస్తాయి, ఒకటి
పొగరంగు, మరొకటి పసుపు, పేరు ఒకటే, రూపాలెన్నో.

మండూకాల్లారా, అతిరాత్ర సోమయజ్ఞ బ్రాహ్మణంలాగా
నీళ్ళు నిండిన చెరువులో నలువైపులా బెకబెకలాడండి.

వార్షిక సోమయాగం చేస్తున్న బ్రాహ్మణుల్లాగా గానంచేస్తూ
చెమట పట్టిన ఋత్వికుల్లాగా వానకు తడుస్తున్నవి కప్పలు.

కాలాన్ని కాపాడుకుంటాయి, ఋతువుల్ని వృథాపోనివ్వవు
ఏడాది గడిచి వర్షం రాగానే తాపమంతా ఎగిరిపోతుంది.

ఆవులాగా, మేకలాగా అరిచే కప్పలు మాకు ధనం తేవాలి
గోవులు, అంతులేని సోమయాగాల ఆయుర్దాయం కావాలి.

ఋగ్వేదం ఏడవ మండలంలో ఈ సూక్తం గురించి యాస్కుడు నిరుక్తంలో ఓ కథ చెప్పాడు. ఒకప్పుడు వశిష్టుడు పర్జన్యుణ్ణి స్తుతిస్తూ ఒక సూక్తం చెప్పాడట. వెంటనే పక్కన నీళ్ళల్లో ఉన్న మండూకం కూడా వంతగా ఈ సూక్తం చెప్పిందట.

మండూక శబ్దానికి యాస్కుడు కొన్ని అందమైన అర్థాలు చెప్పాడు. ఒకటి, నీళ్ళల్లో మునిగి ఉంటుంది కాబట్టి మండూకం (మజ్జనాత్ అత: మజ్జూకం ). మదీ అంటే హర్షం తో కూడుకుని ఉంటుంది కాబట్టి మండూకం, తాను నైరుక్తికార్థంలో ఇలా చెప్తున్నప్పటికీ, వైయ్యాకరణులు ‘మడి’ అంటే, ‘భూషాయం హర్షే చ’ ధాతువువల్ల మండూకశబ్దాన్ని సాధిస్తారని, అంటే, వర్ష ఋతువుని అలంకరిస్తాయి కాబట్టి మండూకాలని అన్నాడు. మరొక అర్థంలో ‘మండ’ అంటే ఉదక వాచకం కాబట్టి, నీళ్ళతో ఆనందం పొందుతాయి కాబట్టి, మండూకాలని కూడా అన్నాడు. అన్నింటిలోకీ నాకు చివరి అర్థమే ఎక్కువ నచ్చింది. నీళ్ళను చూసి ఆనందపడే ప్రాణులన్నీ మండూకాలే. అలా చూస్తే నేను కూడా ఒక మండూకాన్నే.

మరి కొన్నాళ్ళకి మాండూక్యోపనిషద్ చదివాను. బహుశా, భారతీయ అద్వైత వేదాతం మొత్తం ఆ ఉపనిషద్ నుంచే పుట్టిందన్నా ఆశ్చర్యం లేదు. ఆ ఉపనిషత్తుకి కారిక రాసిన గౌడపాదులు వశిష్టుణ్ణి తన గురువుగా తలుచుకున్నాడంటే ఆశ్చర్యం లేదు.

ఒకరోజు మా మాష్టారు శరభయ్యగారు నన్నొక చిత్రమైన ప్రశ్న అడిగారు: ‘మాండూక్యోపనిషద్ కి ఆ పేరు ఎందుకొచ్చిందో తెలుసా?’ అని. నాకేమీ స్ఫురించలేదు. పుస్తకాల్లో చదువుకున్నది ఆయన దగ్గర చిలకపలుకులు వల్లించి లాభం లేదని తెలుసు.

‘కప్ప చూసావా. అలానే కదలకుండా ఉన్నట్టుంటుంది. అలానే ఉన్నట్టుండి ఒక్క గెంతు గెంతి మళ్ళా చాలాసేపు నిశ్చలంగా ఉండిపోతుంది. మళ్ళా మరికొంతసేపటికి మనకి తెలీకుండానే మరొక గెంతు గెంతుతుంది. ఉపనిషత్తులో చెప్పిన జాగ్రత్, స్వప్న, సుషుప్త, తురీయావస్థల్లో మనిషి ప్రస్థానం కూడా అలానే ఉంటుంది. అందుకే ఆ పేరు పెట్టారనుకుంటున్నాను’ అన్నారు.

కప్ప ఒక గెంతు గెంతడం!

ఆ దృశ్యం చూసిన ఒక హైకూ కవికి అది సాక్షాత్తూ జెన్ అనుభవంగా సాక్షాత్కరించింది. జపనీయ హైకూ కవుల్లో అగ్రగణ్యుడు బషొ సుప్రసిద్ధ హైకూ:

పాత నీటి కొలను
కప్ప గెంతింది-
నీళ్ళల్లో గలగల.

కప్ప గెంతగానే కలకలమేగాని. అది కవిని కలకలం నుంచి నిశ్శబ్దంలోకి తీసుకుపోయింది. కాని కప్పని చూసి మరొక హైకూ కవి ఇస్సా ధ్యానంలోకి జారుకోలేదు. ధైర్యం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకొమ్మన్నాడు:

చిరుకప్పా
భయపడకు-
ఇస్సా ఉన్నాడిక్కడ.

దు:ఖం, పేదరికం, కళ్లముందే భార్యాపిల్లల అకాలమరణం చూసిన కవిగా ఇస్సా అట్లా చెప్పడం ఎంతో మానవాతీత మైన విషయంగా కనిపిస్తుంది.

జీవితం బహుకాలం గతించాక, వానలూ, కప్పలూ తప్ప తక్కిన వ్యాపకాలన్నిటితో రోజులన్నీ నిండిపోయిన తరుణంలో ఒకరోజు హఠాత్తుగా ఇస్మాయిల్ గారు ‘కప్పల నిశ్శబ్దం’ అంటో రాసిన ఒక హైకూ కనిపించింది:

అర్థరాత్రివేళ
కప్పల నిశ్శబ్దానికి
హటాత్తుగా మెలకువొచ్చింది.

ఈ నగరంలో, మబ్బులకీ, వానలకీ, చెరువులకీ, నీళ్ళకీ, కప్పలకీ దూరంగా బతుకుతున్న నాకూ ఇట్లానే అర్థరాత్రి హటాత్తుగా మెలకువొచ్చేసింది.

ఇప్పుడు నాకు నా చిన్నప్పుడు మా ఊళ్ళో విన్న ఆ కప్పల బెకబెక మళ్ళా వినాలని ఉంది.

30-7-2014

One Reply to “”

  1. చాలా హృద్యంగా ఉన్నది.

    వ్రతచారిణః ను వ్రతచారులు అని అనువదించాలేమో!

    మల్లంపల్లి శరభయ్యగారి గురించి మీరు ఎప్పుడు ప్రస్తావించినా అబ్బురపాటు కలుగుతుంది. ఎప్పూడైనా వారి గురించి ప్రత్యేకంగా పోస్టు వ్రాయండి.

    – ఉరుపుటూరి శ్రీనివాస్

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading