సౌందర్యోపాసకుడు

Reading Time: 2 minutes

35

ఆదివారం తెనాలిలో సంజీవదేవ్ శతజయంతి సభ. సాహిత్య అకాదెమీ నిర్వహించిన సభలో రోజంగా సంజీవదేవ్ కృషిమీద పెద్దలెందరో పత్రాలు సమర్పించారు. సాయంకాలం జరిగిన సమాపనోత్సవంలో సమాపనోపన్యాసం చేసే అరుదైన గౌరవం నాకు లభించింది. ‘సంజీవదేవ్ జీవనయానం’ పేరిట ఆయన జీవితచరిత్రను వెలువరించిన రావెల సాంబశివరావు అధ్యక్షులు. డా.వెలగావెంకటప్పయ్యగారు, ఆచార్య ఎన్.గోపిగారు, సులోచనా సంజీవదేవ్ గారు కూడా వేదిక మీద ఉన్నారు.

పొద్దుణ్ణుంచీ సంజీవదేవ్ బహుముఖీన ప్రతిభ మీద ఎందరో పెద్దల ప్రసంగాలు వింటూన్నకొద్దీ సంజీవదేవ్ గురించి నిజంగా నాకేమీ తెలియదనిపించింది. అక్కడ మాట్లాడినవాళ్ళు కూడా సంజీవదేవ్ గురించి ఇన్నాళ్ళుగా తమకి తెలిసింది కేవలం పాక్షికజ్ఞానం మాత్రమేనని, ఆయన గురించీ, ఆయన దృష్టి గురించీ తాము కొత్తగా ఎంతో తెలుసుకుంటున్నామనీ భావిస్తున్నట్టే కనబడ్డారు.

ఇరవయ్యవ శతాబ్ది తెలుగు సాహిత్యానికి, తెలుగు భావధారకీ తెనాలి ఎంతో ఇచ్చింది. ఎన్నో కొత్త ఆలోచనలు. ప్రపంచంలో ఎక్కడ ఏ విప్లవం తలెత్తినా ఆ ప్రతిధ్వని తెనాలివీథుల్లో వినబడుతూనే వచ్చింది. అయినా కూడా చలం, కుటుంబరావు, జి.వి.కృష్ణారావు, కవిరాజు త్రిపురనేని, వారు నేర్పిన ‘ఎందుకు’ అన్న ప్రశ్నకి ఒక నమస్కారం పెట్టి మరింత ముందుకు నడిచిన గోపీచంద్, ‘శారద’, చక్రపాణి, అందరికన్నా ముఖ్యంగా, బైరాగి-వీరంతా నాకు చెప్పనిది, చెప్పకుండా వదిలిపెట్టిందీ, ఏదో విలువయిందే సంజీవదేవ్ దగ్గర తెలుసుకున్నాను. ఏమిటది?

నా ప్రసంగంలో ఆ విషయం మీదనే దృష్టి పెట్టాను. ఇరవయ్యవ శతాబ్ది తెలుగు సాహిత్యంలో సైన్సు, హేతువాదం, స్వాతంత్ర్యం,సైన్సు, సామాజిక స్పృహ ప్రధానస్రవంతి ధోరణులుగా వర్ధిల్లాయి. ప్రపంచమంతా ఆ వైపు ఒరిగిపోతుంటే దానికి సమతూకంగా సంజీవదేవ్ సౌందర్యంగురించీ, శిల్పం గురించీ, చిత్రకళగురించీ మాట్లాడేరనిపిస్తుంది.

భారతదేశ సాంస్కృతిక చరిత్రను పరిశీలించినా కూడా ఈ విషయం బోధపడుతుంది. ఈ దేశంలో ప్రాచీన కాలంలో ఋషులు సత్యం మీద దృష్టి పెట్టారు. ఈ అశాశ్వతమైన జగత్తులో ఏది సత్యమని అన్వేషించారు. మధ్యయుగాల్లో ఏది సౌందర్యమనే మీమాంస కనిపిస్తుంది. తాజ్ మహల్, కృష్ణభక్తిగీతాలు, తెలుగు ప్రబంధాలూ మధ్యయుగాల్లో మాత్రమే రాగలిగిన కళాకృతులు. ఆధునిక యుగం, ఏది శివం, ఏది హితం, ఏది బహుజన హితమన్నదాన్ని ఎక్కువ పట్టించుకుంది. ఇప్పటి కాలానికి, ఏది సత్యం, ఏది సుందరమన్నదానికన్నా, ఏది పదిమందికి ఎక్కువ మేలు చేస్తుందన్నదే ముఖ్యం. ఇరవయ్యవశతాబ్ది యుగధోరణి ‘ఉపయోగిత’ (యుటిలిటీ)ని ఎక్కువగా ఆరాధించింది. ఆ యుగధర్మంలో సత్యం, సౌందర్యం పొందవలసిన గుర్తింపు పొందడం లేదనీ, సౌందర్యం శివం కన్నా భిన్నంకాదనీ సంజీవదేవ్ భావించారు. తన సమకాలిక సాహితీవేత్తలు, సత్యాన్వేషకులు తమ తమ అన్వేషణల్లో పడి సౌందర్యం గురించి చెప్పకపోతే తనకాలం నాటి భావధారలో రసం లోపిస్తుందని సంజీవ దేవ్ సరిగానే నిదానించారు. ఈ విషయంలో ఆయన కన్నా ముందుగానూ,ఆయనకన్నా ఒకింత బలంగానూ మాట్లాడింది చలంగారు. కాని చలం సాహిత్యంలో స్వాతంత్ర్యేచ్ఛ, జీవనకాంక్ష ల కెరటాల ఉధృతిని తట్టుకుంటేగాని సౌందర్యమౌక్తికం చేతికందదు. అటువంటి తీవ్రవాక్కుతో కాకుండా సౌమ్యవాక్కుతో సౌందర్యదిశానిర్దేశం చేసినవాడు సంజీవదేవ్.

ఆయన ఆలోచనాక్రమంలో మూడు మెట్లుంటాయి. ‘నువ్వు ప్రకృతిలో ఏది చిత్రించాలనుకున్నా శంకువు, స్థూపాకృతి, గోళాకృతుల్ని (cone,cylinder and sphere) గుర్తుపెట్టుకో’ అని పాల్ షెజానె తన మిత్రుడు ఎమిలె బెర్నార్డ్ కి రాసిన వాక్యాలు ప్రపంచ ప్రసిద్ధమయ్యాయి. అయితే ఆయన చెప్పిన మూడింటిలోనూ క్యూబ్ లేకపోయినప్పటికీ, ఆ మాటల ప్రభావంతో ఫ్రాన్సులో క్యూబిజం తలెత్తి అంతర్జాతీయ చిత్రకళను మనం ఊహించలేనంతగా మార్చేసింది. ఆ మూడు పదాల్నీ వాడుతున్నప్పుడు బహుశా షెజానె ఉద్దేశ్యం దృగ్విషయంలోని అంతర్గత నిర్మాణాన్ని చూడమని చెప్పడమే. కాని సంజీవదేవ్ ఆ మూడు పదాల్నీ మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆయన చెప్పినదాన్ని బట్టి శంకువు లేదా క్యూబ్ పూర్తిగా స్థితిశీలకం. జడం. దానికి గతి లేదు. స్థూపాకృతి కొంత స్థితిశీలం, కొంత గతిశీలం. గోళాకృతి పూర్తిగా గతిశీలం. కాబట్టి షెజానె చెప్పిన మాటల అంతరార్థం, నీ దృశ్య ప్రపంచాన్ని నువ్వు పూర్తి స్థితిశీలకంగానూ, సగం స్థితి, సగం గతి శీలకంగానూ , పూర్తి గతిశీలకంగానూచూడవలసి ఉంటుందని.

ఈ త్రిపుటిని సంజీవదేవ్ చాలా విధాలుగా అన్వయించడానికి ప్రయత్నిస్తాడు. జడం-జీవం-మనస్సు, వైజ్ఞానికుడు-సాధుశీలుడు-కళాకారుడు, ఉపయోగిత-రసం-యోగం, ఫిజిక్సు-బయాలజీ-సైకాలజీ వంటి త్రిపుటిని వివరించేటప్పుడు ఆయన వెనక ఉన్నది సత్యం-శివం-సుందరాలే. వీటినే సాహిత్య లాక్షణికులు అభిద-లక్షణ-వ్యంజన అన్నారనీ, చిత్రకళలో ఇది Representation-Distortion-Abstraction గా వ్యక్తమయ్యిందనీ, కళా ఉద్యమాల్లో Realism-Idealism-Expressionism గా రూపుదిద్దుకుందనీ చెప్తాడు. గద్యం-పద్యం-సంగీతం అనే మూడంచెల గమనాన్ని కూడా ఈ పద్ధతిలోనే విశ్లేషిస్తాడు. మరొకచోట అయిదు మజిలీలు పేరిట తైత్తిరీయ ఉపనిషత్తు మాట్లాడిన పంచకోశాలుగా ఈ మూడింటినీ వివరిస్తాడు.

నేను సంజీవదేవ్ ని చదవకపోయింటే ఏమైఉండేది? నాకై నాకు స్పష్టత దొరికిఉండేది కాదు. మనసుని సంక్షోభంలోకి నెట్టగల అనేక వాదవివాదాల సుడిగుండంలో పడి ఇప్పటికీ తీరం దొరక్క అల్లాడుతూవుండేవాణ్ణి.

అన్నిటికన్నా ముఖ్యం మనిషిని మనిషి ప్రేమించడం కూడా ఉపయోగితని దృష్టిలో పెట్టుకుని కాక జీవితసౌందర్యాన్ని అనందంగా అనుభూతి చెందటంకోసమే నని సంజీవదేవ్ చెప్పడం మాత్రమే కాక జీవితమంతా ఆచరించి చూపించారు. ఆయన మాటలనుంచి, ఆ సౌందర్యోపాసన నుంచి ఆయన జీవితాన్ని విడదీసి చూడలేం.

28-9-2014

Leave a Reply

%d bloggers like this: