సూర్యసూక్తం

27

నేను వేసుకున్న అనేక ప్రణాళికల్లో ఒకటి, నన్ను తీవ్రంగా ముగ్ధుణ్ణి చేసిన కొందరు ఆధునిక ప్రపంచ కవుల మీద విపులంగా పరిచయ వ్యాసాలు రాయాలనేది. అట్లా అనుకున్న వెంటనే అధునిక స్పానిష్ మహాకవి ఆంటోనియో మచాడో మీద ఒక వ్యాసం రాసాను. కానీ, ఆ తర్వాత ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. సాగి ఉంటే, నేను రాయాలనుకున్న రెండవ కవి, ఆధునిక ఇటాలియన్ మహాకవి యూజీనియో మొంటాలె.

యూజీనియో మొంటాలె (1896-1981) ఆధునిక ఇటాలియన్ కవిత్వానికి కొత్త రూపురేఖలిచ్చినవాడు. డాంటే, పెట్రార్క్, లియోపార్డీ ల తరువాత వారితో ఇటాలియనులు ప్రేమాదరాలతో స్మరించుకునే కవి. 1975 లో ఆయనకు నోబెల్ పురస్కారం లభించడానికన్నా ముందే ఆయన తక్కినప్రపంచానికి శక్తిమంతుడైనకవిగా పరిచయమయ్యాడు.

అదృష్టవశాత్తూ, విలియం ఏరోస్మిత్ అనే ఆయన జీవితకాల కృషివల్ల, మొంటాలె కవిత్వం దాదాపుగా పూర్తిగా ఇంగ్లీషులో లభ్యమవుతున్నది. ఆ అనువాదాలకి ఏరోస్మిత్ రాసుకున్న సవివరమైన నోట్సుని కూడా కలిపి రొసన్నా వారెన్ అనే ఆమె చేసిన సంకలనం ఇప్పుడు మనకి The Collected Poems of Eugenio Montale 1925-1977 (డబ్ల్యు.డబ్ల్యు.నార్టన్ అండ్ కో, 2012) గా లభ్యమవుతున్నది.

మొంటాలె కవిత్వం మనకిచ్చే అనందం చదవగానే కలిగే అనుభూతిలో మాత్రమే లేదు. మహాకవులందరి కవిత్వంలానే, మొంటాలె కవిత్వం కూడా అధ్యయనం చేసే కొద్దీ ఆనందపు సాంద్రతని పెంచే కవిత్వం.

మహాకవుల కవితా వాక్కు, పోస్ట్ మోడర్న్ పరిభాషలో చెప్పాలంటే, సింక్రానిక్ మాత్రమే కాదు, డయాక్రానిక్ కూడా. అంటే, ఆ వాక్కు ఏదో ఒక నిర్దిష్ట క్షణంలో ఆ భాషలో వ్యక్తమయిన భావం మాత్రమే కాదు, ఆ భాష పుట్టినప్పటినుంచీ, ఆ కవిదాకా ఏఏ మహాకవులు, మహాకావ్యాలు ఆ భాషలో ప్రభవించాయో, వారందరినీ మనకు స్ఫురింపచేసే అభివ్యక్తి కూడా.

దాన్నే మనం tradition (సంప్రదాయం) అంటాం. మామూలుగా మనం ఆధునిక కవులు సంప్రదాయాన్ని పక్కనపెట్టేస్తారనుకుంటూ ఉంటాం. కాని ఏ కవీ తన కావ్యసంప్రదాయాన్ని పక్కన పెట్టలేడు. అతడు చెయ్యగలిగేదల్లా, ఆ సంప్రదాయాన్ని మరొక కొత్త పద్ధతిలో కొనసాగిస్తాడంతే.

మొంటాలె మీద రాద్దామనుకున్న వ్యాసం వెంటనే రాయలేకపోవడానికి కారణం ఇదే. ఆయన్ను చదవగానే నాకు గియకొమొ లియోపార్డి (1798-1837) రాసిన Canti (1835) చదవాలనిపించింది. అక్కడితో ఆ అధ్యయనానికి తాత్కాలిక విరామం పడిపోయింది.

అసలు మనం ఏ కవినైనా చదవవలసిన పద్ధతి ఇది. ఇది ఒక మనిషి జీవితంలో ఆశించగల అతి పెద్ద లగ్జరీ. ఎంతో సుసంపన్నులకిగాని సాధ్యం గాని లగ్జరీ ఇది. ఇట్లాంటి విలాసవంతుల్ని కొందర్ని నేను జీవితంలో చూడకపోలేదు. మా మాష్టారు శరభయ్యగారు అట్లాంటి సుసంపన్నుడు,సామల సదాశివ గారు అట్లాంటి సుసంపన్నుడు. మనం మహా అయితే గాలిబ్ గజళ్ళు కొన్ని చదవగలం. కాని సదాశివ గారికి గాలిబ్ మీద తబత్తబాయి వ్యాఖ్యానం కూడా కంఠోపాఠమే. ఈ విషయంలో నేను నిరుపేదని. నా బతుకు తెరువు చూసుకుంటూ, మహాకవుల్ని కూడా చదవాలని ఆశపడేవాణ్ణి. అందుకని, చాలా సార్లు నా అధ్యయనం అరకొరగా, అసంపూర్తిగా, అసంతృప్తిగా మిగిలిపోతూ ఉంది.

ఉదాహరణకి, మొంటాలె కవితల్లో సుప్రసిద్ధమైన ఈ కవిత చూడండి. ఇది ఆయన పొద్దుతిరుగుడు పువ్వు మీద రాసిన కవిత అని మనకు వెంటనే అర్థమవుతుంది. కాని ఈ పొద్దుతిరుగుడు పువ్వు,ఒట్టి పువ్వు మాత్రమే కాదనీ, దీనివెనక ఓవిడ్ (క్రీ.పూ. 43-17) Metamorphoses లో వివరించిన ఒక పురాణ గాథ ఉందని తెలిస్తే, ఈ కవిత ఇవ్వగల ఆనందం మరింత సాంద్రంగా ఉంటుంది. ఆ పురాణగాథలో ఓవిడ్ క్లైషియో అనే ఒక అప్సరస గురించి చెప్తాడు. ఆమె సూర్యుణ్ణి ప్రేమిస్తుంది. అతణ్ణి పొందలేక భూమిలో తనను తాను సజీవసమాధి చేసుకుంటుంది. ఆమె ఆత్మార్పణ పట్ల ప్రేమతో సూర్యుడు ఆమె పైన వర్షించిన కాంతిధారలకు ఆమె మొక్కగా తలెత్తి, పువ్వు పూస్తుంది. ఆ పువ్వు సూర్యుడు ఎటుతిరిగితే అటు తిరుగుతూ ఉంటుంది. ఇంతేనా? కాదు. మొంటాలె రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో తన జీవితార్తిని పంచుకోవడం కోసం ఒక స్త్రీమూర్తిని ఆరాధిస్తూ వచ్చాడనీ, ఆమెనుద్దేశించి ఈ కవిత చెప్పాడనీ తెలిసినప్పుడు, ఈ కవితకు రక్తమాంసాలు కూడా సమకూరినట్టు అనిపిస్తుంది.

ఈ కవిత గురించి వివరిస్తూ అల్మాంసి, మెర్రీ అనే ఇద్దరు విమర్శకులు దీన్ని మొంటాలె సౌరపురాణ గాథ గా పేర్కొన్నారు. ఈ మాట వినగానే, మనకు భారతీయ సాహిత్యంలోని సూర్యసూక్తాలన్నీ గుర్తొస్తాయి. సంస్కృత సాహిత్యంలోని సూర్యసూక్తాల గురించి అద్భుతమైన ఒక వ్యాసం రాస్తూ, శేషేంద్ర, అసలు రామాయణమంతా ఒక సూర్యసూక్తమంటాడు. మొంటాలె కవితను మన సూర్యసూక్తాలతో పోల్చి చదువుకోవడం జీవితం ఇవ్వదగ్గ అతిగొప్ప వ్యాపకాల్లో ఒకటి కాదా!

ఇట్లా కనీసం కొన్ని కవితలనేనా వివరించాలి. కాని, ఆ లగ్జరీ లేకనే, మొంటాలె మీద ఇంతదాకా వ్యాసం రాయలేకపోయాను.

నా కోసం ఆ పొద్దుతిరుగుడు పువ్వు తెచ్చివ్వు

నా కోసం ఆ పొద్దుతిరుగుడు పువ్వు తెచ్చివ్వు,
ఉప్పునీటి నురగ మాడ్చేసిన నా చిన్ని నేలలో
దాన్ని నాటుకుంటాను, రోజంతా అది తన బంగారు
వదనం ప్రతిఫలించే నీలిరంగువైపే తిరుగుతుంటుంది.

చీకటిలో ఉన్నవన్నీ వెలుతురువైపు జరుగుతాయి
దేహాలు రంగుల ప్రవాహంలో అలసిసొలసిపోతాయి
రంగులేమో సంగీతంలో. నిశ్శేషమైపోవటం,
అదొక్కటే, సాహసాల్లోకెల్లా సాహసం.

నా కోసం ఆ పువ్వుని తెచ్చివ్వు, ఆ పొద్దుతిరుగుడు
పువ్వుని, కాంతి ఉన్మత్తురాలిని. మనకి దారి
చూపింస్తుందది, పైకెగసే పసుపుపచ్చని పారదర్శక
కాంతిలో జీవితమొక సారాంశంగా ఆవిరైపోయే చోటుకి.

16-7-2016

Leave a Reply

%d bloggers like this: