సీమస్ హీనీ

Reading Time: 3 minutes

2

మొన్న 30 వ తేదీనాడు ప్రపంచప్రసిద్ధ కవి, 1995 సంవత్సరానికిగాను నోబెల్ సన్మానితుడూ సీమస్ హీనీ డబ్లిన్ లో ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. యేట్సు తరువాత అంతటి స్థాయినందుకున్న ఐరిష్ కవిగా రాబర్ట్ లోవెల్ అతణ్ణి ప్రస్తుతించినప్పటినుంచీ, హీనీ కేవలం ఐరిష్ కవిగా మాత్రమే కాక తక్కిన ప్రపంచానికి చెందిన కవిగా కూడా మారిపోయాడు.

సీమస్ హీనీ (1939-2013) ఉత్తర ఐర్లాడులో లండండెర్రీ ప్రాంతానికి చెందిన ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. కుటుంబ మత విశ్వాసాల ప్రకారం కేథలిక్ క్రైస్తవుడు. అతడి తాతతండ్రులు కాయకష్టం మీద జీవించినవాళ్ళు. ఉత్తర ఇర్లాందు చిత్తడినేలల్లో నేలదున్నుతూ, మట్టిపనిచేస్తూ, పంటలు పడించుకునే ఆ రైతుజీవితనేపథ్యాన్ని హీనీ జీవితమంతా మర్చిపోలేదు. తక్కిన ప్రపంచమంతా యుద్ధంలో కూరుకుపోయివున్నప్పుడు తాము ఒక మూడుగదుల గడ్డికప్పు ఇంట్లో ahistorical గా , presexual బతికామని చెప్పుకున్నాడు. మరొకచోట ఆ తన జీవితం చరిత్ర పూర్వకాలానికీ, అక్షరపూర్వకాలానికీ చెందిందని కూడా రాస్తాడు. ఆ మట్టిలోంచే అతడి సాహిత్య జీవితం మొదలయింది.

నేనొక ఉల్కమీంచి ఈ లోకం లో అడుగుపెట్టవలసింది
అందుకు బదులు చిత్తడినేలమీంచి, రాలిన ఆకులమీంచి ధాన్యంపొట్టుమీంచి నడిచివచ్చాను.

అని రాసాడొక కవితలో.

అతడి తొలికవితాసంపుటి Death of A Naturalist (1966) ప్రధానంగా అతడి బాల్య, యవ్వనాల మట్టివాసన మోసుకొచ్చింది. తన గ్రామీణ జీవితం మర్చిపోవలసింది కాదనీ, ఆ ప్రాంతీయతలో ఏదో మానవీయమైందీ, అద్వితీయమైందీ ఉందనీ, దాన్ని కవిత్వంతో పట్టుకోవలసిఉంటుందనీ అతడు టెడ్ హ్యూస్, పాట్రిక్ కవనగ్, రాబర్ట్ ఫ్రాస్ట్ ల నుంచి తెలుసుకున్నాడు. నోబెల్ బహుమతి స్వీకరించే సందర్భంలో చేసిన ప్రసంగంలో తన తొలినాళ్ళ ఈ ప్రయాణమంతటినీ అతడెంతో ఆసక్తిగా వివరించాడు.

70 లకు వచ్చేటప్పటికి అతడి కవిత్వంలో పెద్ద మార్పు సంభవించింది. తెలుగులోలానే ఉత్తర ఇర్లాండుకు కూడా అది కల్లోల దందహ్యమాన కాలం. కేథలిక్ రిపబ్లికన్లకీ, ప్రొటెస్టంట్ లాయలిస్టులకీ మధ్య హింసాత్మక సంఘర్షణ ప్రజ్వరిల్లిన కాలం. హీనీ కేథలిక్ రిపబ్లికన్ల పక్షం వహించినప్పటికీ, ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ హింసాత్మక పంథాని స్వాగంతించలేకపోయాడు. ఇంకా అక్కడక్కడ చిత్తడినేలగురించీ, రొట్టెలవాసన గురించీ రాస్తున్నప్పటికీ, Wintering Out (1972), North (1975) సంపుటాల్లో ఆ నాటి తన లోపలా బయటా జరుగుతున్న సంఘర్షణనే ప్రధానంగా చిత్రించాడురోజూ ఎవరో ఒకరు హత్యకు గురురవుతున్న ఉత్తర ఐర్లాండులో ఉండలేక దక్షిణ ఐర్లాండులో డబ్లిన్ దగ్గరకు వచ్చేసాడు. 80ల్లో, 90ల్లో హీనీ నెమ్మదిగా ప్రపంచప్రసిద్దికి నోచుకోవడం మొదలుపెట్టాడు.

80 ల తరువువాత హీనీ రాసైన కవిత్వంలో అపారమైన పరిణతి కనిపిస్తుంది. కవిత సత్యమే చెప్తుంది కానీ, సూటిగా కాదనే మెలకువలోంచి వచ్చిన కవిత్వమది. ఈ విషయాన్నే ఆయన తన నోబెల్ బహుమతి ప్రసంగంలో కూడా ప్రస్తావిస్తూ ఆర్చిబాల్డ్ మెక్లీషు కవితాపంక్తులు

A poem should be equal to
Not true

అనే మాటలు ఉదాహరించాడు.

అయితే కవిత్వం ఒక్కొక్కప్పుడు బల్లగుద్దిమరీ చెప్పినట్టుగా, కరంటు పోయినప్పుడు ఆగిపోయిన టివిలో మళ్ళా పెద్దచప్పుడుతో బొమ్మ ప్రత్యక్షమైనట్టుగా కవిత్వం పలకవలసిఉంటుందని కూడా అతడన్నాడు.

1995 వ సంవత్సరానికి గాను అతడి కవిత్వానికి నోబెల్ బహుమతి ప్రకటిస్తూ స్వీడిష్ అకాడెమీ అది ‘అతడి కవిత్వ నాదాత్మక సౌందర్యానికీ, నైతిక దారుఢ్యానికీ’ ఇస్తున్న బహుమతిగా పేర్కొంది. అంతేకాక ఆ కవిత్వంలో ‘గతమింకా సజీవంగా ఉందనీ, దైనందిన జీవితమనే అద్భుతాన్ని ఆ కవిత్వం పైకెత్తుతున్నదనీ’ (which exalt everyday miracles and living past ) కూడా అన్నది.

న్యాయం కోసం పోరాడేవాళ్ళు హింసని ఆశ్రయించినప్పుడు, నువ్వు మనఃపూర్వకంగా వాళ్ళ పక్షం వహిస్తున్నప్పటికీ, వాళ్ళ హింసాత్మక ధోరణి అంతిమంగా వాళ్ళ పోరాటప్రయోజనాలకే భంఘం కలిగిస్తుందని తెలుస్తున్నప్పుడు నువ్వనుభవించే సంఘర్షణే హీనీ కవిత్వం. ఆటు పోరాటం చేస్తున్నవాళ్ళూ అతడి శాంతికాముకతని అర్థం చేసుకోలేరు. ఇటు అతడు ఎవరి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాడో వాళ్ళూ అతణ్ణి స్వాగతించలేరు. కాని ఇంగ్లాండుకి, ఐర్లాండుకీ ఆవల ప్రపంచవ్యాప్త్యంగా ఇటువంటి సందర్భాన్నే తమ తమ ప్రాంతాల్లో చూస్తున్నవాళ్ళందరికీ హీనీ కవిత్వం చాలా చేరువగా, తమ మనఃస్థితికే దర్పణం పడుతున్నట్టుగా గోచరించడంలో ఆశ్చర్యమేముంది?

ఇటువంటి సమయాల్లోనే మనిషికి కవిత్వంగా అండగా నిలుస్తుందని నమ్మడమే హీనీ విశిష్టత. నోబెల్ బహుమతి సందర్భంగా చేసిన ప్రసంగంలో ఇదే చెప్పాడాయన. అందుకని తన ప్రసంగానికి Crediting poetry అని పేరుపెట్టాడు. ఆ ప్రసంగంలో ఆయన ఉత్తర ఐర్లాండు కు చెందిన సెయింట్ కెవిన్ అనే సాధువు గురించి చెప్పాడు. 7 వ శతాబ్దానికి చెందిన కెవిన్ అనే సాధువు ఒకరోజు నేలమీద శిలువ ఆకారంలో సాష్టాంగ ప్రణామం చేస్తూండగా ఒక పక్షి ఆయన చేతులమీద వాలి గుడ్లు పెట్టిందిట. ఆ సాధువుకు ఆ సంగతి అర్థమై ఆ గుడ్లు పొదిగి పిల్లలయి రెక్కలొచ్చి ఎగిరేదాకా అట్లానే కదలకుండా ఉండిపోయాడట. నువ్వు నిజంగా కవి వే అయితే నువ్వు కూడా అట్లానే జీవించాలంటాడు హీనీ.

కళలూ, కవిత్వమూ సాధించే ప్రయోజనమంటూ ఉంటే అది మన అంతరంగాన్ని బలపర్చడమే నంటాడాయన. బహుశా మన కాలానికి చెందిన శక్తిమంతుడైన ఆధ్యాత్మిక కవిగా రేపటి ప్రపంచం ఆయన్ని గుర్తుపెట్టుకుంటుందనుకుంటాను.

సెయింట్ కెవిన్ మీద ఆయన రాసిన కవిత మీ కోసం:

కెవిన్ సాధువూ, కాటుకపిట్టా

ఇక కెవిన్ సాధువూ, ఒక కాటుకపిట్ట సంగతి:
ఆ సాధువు తన చేతులు చాచి తన గదిలో
సాష్టాంగప్రణామం చేస్తున్నాడు. గది ఇరుకు.

ఒక చెయ్యి కిటికీలోంచి బయటకు చాచక
తప్పలేదు, దూలంలాగా, స్థిరంగా చాచిన
చేతిమీద ఒక కాటుకపిట్ట వాలి ఆ అరచేతిలో
గుడ్లు పెట్టిగూడు కట్టుకుంది.

ఆ పిట్టగుండె, ఆ చిన్నితల, గోళ్ళు, వెచ్చని
గుడ్లస్పర్శ ఆ సాధువుచేతులకి తాకింది.
అనంతజీవితస్పందన అతణ్ణి పెనవేసుకుంది.

హృదయంలో కరుణ ఉప్పొంగింది. అతడిక తన
చేతినట్లానే ఒక చెట్టుకొమ్మలాగా ఎండలో వానలో
చాచిఉంచకతప్పదు.గుడ్లు పొదిగి పిల్లలై రెక్కలు
చాపుకుని ఎగిరిపొయ్యేదాకా.

*

ఎలాగూ ఇదంతా కల్పనే అనుకున్నా, నిన్ను
నువ్వు కెవిన్ గా ఊహించుకో. ఎవరతడు?
తననితాను మర్చిపోయినవాడా లేక
ఆ పాదమస్తకం ఆందోళన నుంచి
తప్పించుకోలేని వాడా?

అతడి వేళ్ళు నిద్రిస్తున్నాయా? తనకి
ముణుకులున్నాయని అతడికింకా గుర్తుందా
అతడి కాళ్ళకింది నేల అతడిలోకి
ప్రవహించిందా? అతడి మస్తిష్కంలో
దూరమింకా తెలుస్తోందా?

ఒంటరిగా, లోతైన ప్రేమప్రవాహంలో
నిర్మలదర్పణంగా అతడు ప్రార్థిస్తున్నాడు,
‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ‘
అది యావత్ శరీరంతో చేస్తున్న ప్రార్థన,
అతడికిప్పుడు తను గుర్తులేడు, ఆ పక్షి
గుర్తులేదు, నది ఒడ్డున ఉన్నాడేకాని
ఆ నదిపేరేమిటో కూడా గుర్తులేదు.

31-8-2013

Leave a Reply

%d bloggers like this: