విచిత్రమధుర స్వప్నం

46

కుల్దీప్ సలిల్ Great Urdu Rubais, Qatas and Couplets ( హింద్ పాకెట్ బుక్స్, 2013) ఒక్క పూటలోనే పూర్తిచేసేసాను. అతడే ఇంతకు ముందు తీసుకువచ్చిన Great Urdu Ghazals (2011), Great Urdu Nazms ( 2013) ఈ సంకలనం అందమైన, అర్థవంతమైన కొనసాగింపు. ఇప్పటికే కె.సి.కందా ఉర్దూకవిత్వం మీదా, కవులమీదా తీసుకువచ్చిన మణిపూసల్లాంటి సంకలనాలతో పాటు ఈ మూడు సంకలనాలు కూడా కవిత్వప్రేమికులందరూ చదవదగినవి,పదే పదే చదువుకోవడం కోసంకొనుక్కుని భద్రపరచుకోదగ్గవి.

రుబాయత్ పారసీక కవితాప్రక్రియ. నాలుగుచరణాల పద్యం లాంటిది. 1,2, 4 పంక్తులకు అంత్యప్రాస ఉంటుంది. 3వ పంక్తి భిన్నంగా ఉంటుంది. ఓమర్ ఖయ్యాం రుబాయీలు జగత్ప్రసిద్ధాలు, అయినప్పటికీ తక్కిన పారశీకకవులు రూమీ వంటివారి రుబాయీలు కూడా సౌందర్యంలో తీసిపోయేవి కావు.

ఈ సంకలనంలో ముఫ్ఫైమంది కవుల రుబాయీలూ, ఖతాలూ, యాభై అయిదుమంది కవుల ద్విపదలు పొందుఇపరచడంతో పాటు ఉర్దూలోనూ, దేవనాగరిలోనూ, రోమన్ లిపిలోనూ కవిత్వపాఠంతో పాటు ఇంగ్లీషు అనువాదం కూడా ఉంది. సంకలనకర్త కుల్దీప్ సలిల్ స్వయంగా కవికావడం వల్ల అనువాదాలు చాలా చక్కగా ఉన్నాయి. వీటిని మొదట ప్రకాశ్ పండిట్ అనే ఆయన సంకలనం చేసాడనీ తాను ఆ కోశాగారమ్నుంచి కొన్ని ఏరి కూర్చాననీ కుల్ దీప్ చెప్పుకున్నాడు.

సంకలనంలోని ప్రతి పద్యం, ద్విపద మనోహరమైనదే. అయినా మీ కోసం మచ్చుకు కొన్ని:

మీర్

హర్ రోజ్ ఏక్ తమాషా దేఖా
హర్ కూచే సే సౌ జవానే ర అనాదేఖా
దిల్లీ ఠీ తిలిస్మాత్ కి హర్ జగహ్ మీర్
ఇన్ ఆంఖోంఁ సే హమ్నే వాహ్ క్యా-క్యా దేఖా

ప్రతి రోజూ ఒక తమాషా చూసాను,
వీథి వీథినా వేలాది యువతను చూసాను,
డిల్లీ ఎటుచూసినా ఒక అద్భుత దృశ్యం
ప్రతి నేత్రంలోనూ ఒక విచిత్రమధుర స్వప్నం చూసాను.

ఫైజ్

రాత్ యూఁ దిల్ మేఁ ఖోయీ హుయీ యాద్ ఆయీ
జైసే వీరానే మేఁ చుప్కే సే బహార్ ఆ జాయే
జైసే సహరావోంఁ మేఁ చలనే లగే బాదే నసీమ్
జైసె బీమార్ కో బేవజహ్ కరార ఆ జాయే

ఒక నిర్జనదేశంలో వసంతం అడుగిడినట్టు
సహారా ఎడారిలో ప్రత్యూషపవనం వీచినట్టు
నిన్నరాత్రి నా మనసున కదలాడింది నీ తలపు
దీర్ఘకాలరోగికి హటాత్తుగా స్వస్థత చిక్కినట్టు.

జగత్ మోహన్ లాల్ రవాన్

హర్ కల్బ్ మే బిజలియాఁ గిరాతీ హై
ఏక్ అగ్ సీ హర్ తరఫ్ లగాతీ హై
ఖులతే జాతే హైఁ జఖ్మ్-హాయె-కుహనా
ఫిర్ సుబహే బహార్ ముస్కరాతీ హై

వసంతం ప్రతి హృదిలో మెరుస్తున్నది
చుట్టూ మంటలు పుట్టిస్తున్నది,
ఈ వాసంతప్రభాతం చిరునవ్వుతూనే
పాతగాయం మళ్ళా సలుపుతున్నది.

సాహిర్

చంద్ కులియాఁ నిశాత్ కీ చున్కర్
ముద్దతోఁ మహవే-యాస్ రహతా హూఁ
తేరా మిలనా ఖుశీకీబాత్ సహీ
తుఝ్ సే మిలకర్ ఉదాస్ రహతా హూఁ

కొన్ని సంతోషపు మొగ్గలేరుకుని
నిరాశతో చాలాసేపు నిలబడిపోయాను,
నిన్ను కలుసుకోవడం సంతోషమేకాని
నిన్ను కలిసేక మిగిలేది దుఃఖమే.

సాదిక్

ముఝే జన్నత్ మిలీ ఉస్ కో జహన్నుమ్
పరిస్తోఁ నే తో ఠా ముజ్ దా సునాయా
జో సోచా తేరే బిన్ కైసే కటేగీ
తో మైఁ జన్నత్ సే వాపస్ లౌట్ ఆయా.

నీకి నరకమనీ,నాకు స్వర్గమనీ దేవదూతలు
చెప్పినప్పుడు మొదటసంతోషం వేసింది,
అంతలోనే గుర్తొచ్చింది, నువ్వులేని చోట
నేనుండాలని, వెంటనే వెనక్కి వచ్చేసాను.

అమీర్ మినాయీ

ఉన్ కో ఆతా హై ప్యార్ పర్ గుస్సా
హం కో గుస్సే పే ప్యార్ ఆతా హై

నేను ప్రేమిస్తుంటే ఆమెకి కోపం,
ఆమెకు కోపమొస్తే నాకు మరింత ప్రేమ.

మోమిన్

మంగా కరేంగే అబ్ సే దుఁఆ హిజే-యార్ కీ
ఆఖిర్ తో దుశ్మనీ హై అసరో కో దూఅ కే సాథ్

ఇప్పణ్ణుంచీ నేనామె దూరంకావాలని ప్రార్థిస్తాను,
ఎందుకంటే నేనేది ప్రార్థిస్తానో అది నెరవేరదు కదా.

బహదూర్ షా జఫర్

ఉమ్రే దరాజ్ మాంగకర్ లాయే థే చార్ దిన్
దో ఆరజూ మేఁ కట్ గయే దో ఇంతజార్ మేఁ

పరలోకంనుంచి నాలుగుదినాలు అప్పుతెచ్చుకున్నాను,
రెండు దినాలు కోరికలో గడిస్తే, రెండు ఎదురుచూపులో.

మీర్ దర్ద్

కభూ రోనా కభూ హఁసనా కభీ హైరాన్ హో జానా
ముహబ్బత్ క్యా భలే-చంగే కో దీవానా బనాతీ హై

ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, ఒకసారి నివ్వెరపాటు
ప్రేమ ఎట్లాంటిది, మామూలు మనిషిని పిచ్చివాణ్ణి చేసేస్తుంది.

జిగర్ మొరాదాబాదీ

ఇష్క్ జబ్ తక్ న కర్ చుకే రూసవా
ఆద్మీ కామ్ కా నహీఁ హోతా

ప్రేమ మనిషికి అపయశం తేనంతవరకు
అతడు ప్రయోజకుడు కాలేడు.

దాగ్

రూఖే రోషన్ కో ఆగే శమ్మా రఖకే వో యే కహతే హైఁ
ఉధర్ జాతా హ దేఖేఁ యా ఇధర్ పరవానా జాతా హై

తనముఖప్రకాశం చెంత దీపం చేర్చి అంటున్నదామె,
చూద్దాం, ఇప్పుడు శలభం ఇటువెడుతుందో, అటో.

సౌదా

ఫిక్ర్-మ ఆరా, ఇష్కే-బుతాఁ, యాదే-రఫ్తగాఁ
ఇస్ జిందగీ మేఁ అబ్ కోయీ క్యా-క్యా కియా కరే

ఒకవైపు బతుకుతెరువు, ఒకవైపు ప్రేమ, తలపోతలు
ఒక్కమనిషి ఒక్క జీవితంలో ఎన్నని చెయ్యగలడు?

7-5-2014

Leave a Reply

%d bloggers like this: