లేఖమాల

Reading Time: 2 minutes

37

హరిహరప్రియ’ గా ప్రసిద్ధుడైన సాతపల్లి వేంకట విశ్వనాథ భట్ట కన్నడ రచయిత, సుమారు 40 పుస్తకాలదాకా రాసాడు. కన్నడ రచయితలు కువెంపు, లంకేశ్ లకు సన్నిహితుడు. తెలుగు నుంచి విశ్వనాథ, నార్ల,సంజీవదేవ్ వంటి వారి రచనలను కన్నడంలోకి తీసుకువెళ్ళిన అనువాదకుడు.

గత 45 సంవత్సరాలుగా తెలుగు, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో సుమారు మూడు లక్షల పుస్తకాలు సేకరించి తన సొంత ఇంటికి ‘పుస్తకమనె’ (పుస్తకాల ఇల్లు) అని పేరుపెట్టుకున్నాడు. దాదాపు అయిదేళ్ళ పాటు ఆ పేరుతో ఒక సాహిత్య పత్రిక కూడా నడిపాడు. తాను సేకరించిన పుస్తకాలతో అయిదేళ్ళ పాటు తన ఇంట్లో రోజూ ఒక పుస్తక ప్రదర్శన నడిపాడు. ప్రపంచంలోనే అట్లాంటి ప్రయోగం ఎవరూ చేసినట్టు నేనింతదాకా వినలేదు.

ఆయన్ను నేను ఒకేఒక్కసారి కలిసాను. అది కూడా ముప్పై ఏళ్ళ కిందట. నేను రాజమండ్రిలో ఉన్న రోజుల్లో ఆయన ఎందుకనో రాజమండ్రి వచ్చాడు. అప్పుడు నేనూ, నా మిత్రుడు మహేశ్ ఆయన్ని సమాచారం పత్రికకోసం పెద్ద ఇంటర్వ్యూ చేసాం. మళ్ళా ఆయన్ను కలుసుకోలేకపోయాను గాని, కొన్నేళ్ళ కిందట నా ‘సత్యాన్వేషణ’ చదివి, ఎట్లానో నంబరు సంపాదించి ఆయన నాకు ఫోన్ చేసాడు.

ఇప్పుడు, మళ్ళా చాలాకాలం తర్వాత, ఆయన్నుంచి ఊహించని కానుక. ఆయనకి సంజీవదేవ్ రాసిన ఉత్తరాల సంకలనం. ‘లేఖమాల: హరిహరప్రియకి డాక్టర్ సంజీవదేవ్’ (2017) పేరిట వెలువరించిన పుస్తకాన్ని నేరుగా ఇంకా ప్రింటింగ్ ఇంకు తడి ఆరకుండానే పంపించాడు.

ఆ పుస్తకం చూడగానే నాకెంతో సంతోషమనిపించింది. సంజీవదేవ్ ని కూడా నేనొక్కసారే కలుసుకున్నాను. కాని ఎన్నిసార్లు చెప్పినా తనివితీరని మాట, సంజీవదేవ్ నా బాల్యకాల మిత్రుడనేది.

నేను తాడికొండలో చదువుకుంటున్నప్పుడు, మూడు నాలుగేళ్ళ పాటు ఆయనకీ, నాకూ మధ్య లేఖాస్రవంతి నడిచింది. నేను పెద్దయ్యాక, ఆ ఉత్తరాలు ఆగిపోయేక, ఆయన రాసిన ప్రతి ఒక్క వాక్యమూ అచ్చులో వచ్చిందంతా చదివేక, నా బాల్యకాలమిత్రుడు కేవలం కవీ, చిత్రకారుడూ మాత్రమే కాదనీ, ఒక ఋషి అనీ తెలుసుకోగలిగాను.

ఈ మధ్య కొన్నేళ్ళుగా సంజీవదేవ్ గురించిన పుస్తకాలో లేదా ఆయన మిత్రులకు రాసిన ఉత్తరాలో కొత్త పుస్తకాలు నా చేతుల్లోకి వస్తూనే ఉన్నాయి. రావెల సాంబశివరావుగారు రాసిన ‘సంజీవదేవ్ జీవనరాగం’, వేదవతిగారికి రాసిన ‘పోస్టు చేసిన ఉత్తరాలు’, దర్భశయనం శ్రీనివాసాచార్యకు రాసిన ‘మెత్తని ఉత్తరాలు’, ముంగర జాషువా వెలువరించిన ‘లేఖాలాస్య’ వంటి మరీ ఇటీవలి పుస్తకాలతో పాటు, సంజీవదేవ్ మిత్రుడు, తెనాలికి చెందిన యడ్లపల్లి వెంకటేశ్వరరావు రాసిన ‘తెగని జ్ఞాపకాలు’ నా మనసులో ఇంకా నవనవలాడుతుండగానే, ఈ పుస్తకం.

ఇందులో 95 ఉత్తరాలు, 23 బొమ్మలు, మూడు కవితలు, నార్ల ఉత్తరాలకు సంజీవదేవ్ రాసిన ముందుమాటా కూడా ఉన్నాయి. పుస్తకానికి చాలా విపులమైన ముందుమాట రాసిన తంగిరాల సుబ్బారావుగారు సంజీవదేవ్ లేఖాసంపుటాల్లో ఇదే విస్తృతమైందని రాసారు. (కాదేమో, ఎస్.ఎస్.లక్ష్మిగారికి రాసిన లేఖలు సంఖ్యరీత్యా ఎక్కువేమో, గుర్తులేదు).

కాని, ఈ ఉత్తరాలకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి 1974 నుంచి 89 మధ్యకాలంలో రాసిన ఉత్తరాలు. ఇందులో సంజీవదేవ్ వ్యక్తిగత, కుటుంబజీవిత ప్రస్తావనలు చాలానే ఉన్నాయి. ఒకటి రెండు ఉత్తరాల్లో ఆర్థికపరంగా ఆయన అనుభవించిన నిస్సహాయత గురించి కనిపిస్తుంది. కాని, వాటన్నిటికన్నా, ఆ ప్రేమైక మానవుడు ఎంతో సరళంగా, సాధు క్షమాస్వభావంతో ఎంతో ఆత్మీయంగా, హరిహరప్రియనే కాదు, ఇప్పుడు ఈ ఉత్తరాలు చదువుతున్న మనని కూడా చేరదీసుకుంటాడు.

ఈ ఉత్తరాల్లోని వాక్యాల్ని ఉల్లేఖించి ఈ పుస్తకం తాజాదనం మీద నా అంగుళుల మరకలు వదలడం నాకు ఇష్టం లేదు.

కాని, హరిహరప్రియ రాసుకున్న ఈ వాక్యాల్ని మాత్రం ఇక్కడ రాయకుండా ఉండలేకపోతున్నాను. ఆయనిట్లా రాస్తున్నాడు:

‘అనగనగా అన్నట్టు, ఆ కాలంలో దినమూ సంజీవదేవ్ పుస్తకాలు చదవడం, ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం, టపాల ఎదురు చూడటం దశనుంచి; చూస్తూ చూస్తూ టపాల కచేరీకే పోయి కాచి ఉండటం, ఆశనిరాశలతో కుమిలిపోవటం మామూలు ప్రక్రియ. ఎవరన్నా ‘ఏమయ్యా, నువు చేసిన ఘనకార్యం’ అని అప్పుడు-ఇపుడు అడిగినా, ఇది-ఇంతే అని చెప్పాలి. దీనిలో దాపరికం ఏమి వచ్చినట్టు! నా ఆయుస్సు దీనికే వినియోగం అయ్యింది.’

ఈ వాట్సప్ ల కాలంలో ఇట్లాంటి వాక్యాలు చదువుతుంటే, మళ్ళీ కనిపించనివాళ్ళ పాతఫోటోలు చూసినప్పటిలాగా, ఎక్కడో మనసు మెలిపడ్డట్టే ఉంటుంది.

18-5-2017

Leave a Reply

%d bloggers like this: