‘మీరు కవిత రాసేముందే మెటఫర్లు పట్టుకుంటారా లేకపోతే కవితరాస్తూండగానే అవి కూడా దొర్లుకొస్తాయా’ అనడిగిందొక మిత్రురాలు.
ఒకప్పుడు కవిత అంటే శబ్దం, సంగీతం. ఆదికవికూడా అక్షరరమ్యత గురించిమాట్లాడేడు. కాని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కవిత అంటే ఒక మెటఫర్ చుట్టూ అల్లే అల్లిక. మెటఫర్ అంటే మామూలుగా రూపకాలంకారమని అర్థం. కాని ఇక్కడ మెటఫర్ కేవలం అలంకారానికీ, ప్రతీక (సింబల్) కీ, పదచిత్రానికీ (ఇమేజి) మాత్రమే పరిమితమైన పదం కాదు. అది నువ్వు చూస్తున్న రెండు దృశ్యాల మధ్య నువ్వు తేగలిగే ఒక సాదృశ్యం. ఆ రెండు దృశ్యాలూ బయటిప్రపంచంలోవి కావచ్చు, ఒకటి జాగ్రత్ ప్రపంచానికీ, మరొకటి స్వాప్నిక ప్రపంచానికీ చెందినవి కావచ్చు, లేదా రెండూ కూడా అభౌతికప్రపంచానికి చెందినవే కావచ్చు.
మామూలుగా భాషలోని రామణీయకత, నాదాత్మకతలమీద ఆధారపడ్డ కవిత ఆ భాషనిదాటి ప్రయాణించడం కష్టం.
పొలాలనన్నీ, హలాలదున్నీ
ఇలాతలంలో హేమం పిండగ
జగానికంతా సౌఖ్యం నిండగ
ఈ మాటల్ని ఇంగ్లీషులోకి అనువదిస్తే వీటిలోని ఓజస్సు పూర్తిగా లుప్తమైపోతుంది. అందుకనే రాబర్ట్ ఫ్రాస్ట్ poetry is what gets lost in translation అన్నాడు.
కాని నిజమేనా? గాథాసప్తశతిలో (2:10) ఒక ప్రాకృతకవిత చూడండి:
అత్తా, చూడు,మన ఊరిచెరువులో
ఎవరో ఆకాశాన్ని ఎత్తిపడేసారు
అయినా ఒక్క తామరపువ్వు
నలగలేదు, ఒక్క కొంగ ఎగరలేదు
ఈ కవితని ఎన్ని భాషల్లోకైనా అనువదించండి, పైనుంచి కిందకు రాసే భాషలు, కుడినుంచి ఎడమకు రాసే భాషలు, ఏ భాషలో కూడా ఈ కవిత నష్టపోదు. అందుకనే ఆక్టేవియో పాజ్ poetry is what gets translated అన్నాడు.
అనువదించినప్పుడు కవితలో పోయేది సంగీతం, మిగిలేది మెటఫర్. కనుకనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కవులు ముత్యాలు వెతుక్కున్నట్టు మెటఫర్లు వెతుక్కుంటున్నారు. ఇందుకు నేను కూడా మినహాయింపు కాదు.
మనం దర్శించే మెటఫర్ ఎలా ఉండాలన్నదానికి స్వీడిష్ కవి, నోబెల్ పురస్కారం పొందిన తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ ఒక కొండగుర్తు.
ఆయన మెటఫర్ల గురించి రాస్తూ రాబర్ట్ బ్లై ఇలా అన్నాడు:
‘పదచిత్రానికి సంబంధించి ట్రాన్స్ ట్రోమెర్ ది విచిత్రమైన ప్రజ్ఞ. ఆయనకు పదచిత్రాలు అలవోకగా స్ఫురిస్తుంటాయి. అయితే ఆయన కవితలో వాడే నాలుగైదు పదచిత్రాలూ ఆయన అంతరంగంలోని విరుద్ధదిశలనుంచి ముసురుకొస్తాయి కాబట్టి అయన కవితల్లో మనమొక విశాలప్రపంచాన్ని చూడగలుగుతాం. అపారమైన దూరాలనుండి ప్రయాణించి వస్తూ కొద్దిసేపు ఒక రైల్వే స్టేషన్లో ఆగిన రైళ్ళలాగా ఉంటాయి ఆ పదచిత్రాలు. ఒక రైలుకింద రష్యన్ భూభాగపు మంచు అంటుకుని కనిపిస్తే, మరొక రైల్లో మధ్యధరా సముద్రతీర పుష్పాల తాజాపరిమళం, మరొక రైలుమీద జర్మన్ బొగ్గు గనుల మసి కనిపిస్తాయి. ‘
ట్రాన్స్ ట్రోమర్ రూపకప్రజ్ఞ కు రెండు ఉదాహరణలు:
ఏప్రిలూ, వసంతమూ
పరిత్యక్త వసంతం.
ముదురు ఊదారంగు
అగాధమొకటి నా చుట్టూ-
నా దృశ్యాల్ని తిరిగివ్వకుండా.
ఇప్పుడు మెరిసేదంతా
కొన్ని పసుపు పూలు.
నల్లటిపెట్టెలో
సర్దిపెట్టిన వయొలిన్ లాగా
నా నీడలో
నేను.
నేను చెప్పాలనుకున్న
నాలుగు మాటలూ
తాకట్టుపెట్టిన వెండిగిన్నెల్లాగా
నాకు చేతికందడం లేదు.
చెట్టూ, ఆకాశమూ
వానలో మనచుట్టూ చెట్టు
తొందరతొందరగా తిరుగుతోంది
దానికి కూడా చెయ్యాల్సిన ఓ పని ఉంది
చెర్రీ చెట్టుమీద నల్లపిట్టలా
వాననుంచి జీవితాన్ని కొరుక్కుంటోందది.
వాన ఆగిపోగానే
చెట్టు కూడా ఆగిపోతుంది
నిర్మలమైన రాత్రుల్లో నిశ్చలంగా
ఒట్టినే నిలిచిపోతుంది.
బయట మంచుతునకలు కురుస్తున్నప్పుడు
మనం కొద్ది సేపు ఆగిపోతామే, అట్లా.
20-7-2013