తుమ్మపూడి వెళ్ళిన రోజునే సాయంకాలం తెనాలిలో కూడా ఒక సాహిత్య ప్రసంగం చెయ్యమని జుగాష్ విలి అడిగాడు. నేను ఆంధ్రదేశం నలుమూలలా ప్రసంగాలు చేసాను గానీ, ఆంధ్రుల బౌద్ధిక రాజధాని తెనాలిలోమాట్లాడే అవకాశం ఇంతకు ముందు కలగలేదు. నేను తెనాలికి ఎంత ఋణపడిఉన్నానని! చలం, కుటుంబరావు, జి.వి.కృష్ణరావు, త్రిపురనేని రామస్వామి, గోపీచాంద్, శారద, బైరాగిలతో పాటు, సంజీవదేవ్, సోమయ్యగారలదాకా తెనాలి కవిరచయితల స్ఫూర్తికి ఋణపడని తెలుగువాళ్ళు ఎవరుంటారు?
అటువంటిది తెనాలిలో మాట్లాడే అవకాశం నిజంగానే అదృష్టమనిపించింది. కవిరాజు త్రిపురనేని రామస్వామి మునిసిపల్ పార్కు లో ‘భిన్నస్వరాలు’ అనే సంస్థ ఏర్పాటు చేసిన సాహిత్య సభ. నా చిన్ననాడు నాకు యూరప్ చరిత్ర, ఆధునిక ప్రపంచ చరిత్ర బోధించిన నాగళ్ళ వెంకటరత్నం మాష్టారూ, రావెల అరుణగారూ కూడా ఆ సభకు హాజరు కావడం నాకెంతో సంతోషమిచ్చింది.
ఆ రోజు నన్ను జుగాష్ సూఫీ కవిత్వం గురించి మాట్లాడమన్నాడు. ఎప్పుడో ఒక సాయంకాలం హైదరాబాదులో అతడు, ఎమ్మెస్ సూర్యనారాయణా మా ఇంటికి వచ్చినప్పుడు నేను సూఫీ కవిత్వం గురించి వాళ్ళతో మాట్లాడేనట, అది తనకు చాలా నచ్చిందనీ, అందుకని, భిన్నస్వరాలు వేదిక మీద సాహిత్య ప్రసంగాలు ఏర్పాటు చెయ్యడం అరుదైనప్పటికీ నాతో సూఫీ కవిత్వం గురించి మాట్లాడించాలనే తాను అనుకున్నట్టు చెప్పాడు.
కాని నాకు భిన్నస్వరాలు వేదిక మీద సూఫీ కవిత్వం గురించి మాట్లాడటం సముచితమైన విషయమే అనిపించింది. నేడు ప్రపంచమంతటా సమాచార ప్రసారసాధనాలు ఇస్లాం ను ఒక టెర్రరిస్టు మతంగానూ, మధ్య ఆసియాదేశాల్ని, ప్రపంచశాంతికి భంగం కలిగించే ప్రాంతాలుగానూ చూపిస్తున్న రోజుల్లో సూఫీ తత్త్వం వంటి శాంతిశీలభావజాలం గురించి మాట్లాడుకోవడం చాలా అత్యవసరమైన విషయమనే నేను నమ్ముతాను. అదీకాక గత ఏడెమినిదేళ్ళుగా ప్రతి రంజాన్ మాసంలోనూ ఎదో ఒక విధంగా సూఫీ కవిత్వం గురించి మాట్లాడే అవకాశం నాకు దొరుకుతూ ఉంది. నా చిన్నతనంలో మా పాఠశాలలో కొన్నేళ్ళ పాటు ప్రతి సాయంకాలం సురా అల్ ఫతిహా ప్రార్థన చేసిన దాని ఫలితం కావచ్చును. అందుకని ఆ సాయంకాలం నేను సూఫీ కవిత్వం కన్నా కూడా ఎక్కువగా సూఫీతత్త్వం గురించే మాట్లాడేను.
సూఫీ తత్త్వం గురించి రబియా, రూమీ, సాది, హాఫిజ్ వంటి కవుల కవిత్వం కన్నా వేరే పరిచయ గ్రంథాలేవీ అవసరం లేదు. మనిషిని అర్థం చేసుకోవడంకన్నా ముందు అతణ్ణి ప్రేమించడం ముఖ్యమనేదే సూఫీ సూత్రమనుకుంటే, ఆ ప్రేమతత్త్వానికి మూలాలు ఖురానులోనూ, ప్రవక్తమహమ్మద్ మాటల్లోనూ, జీవిత ఉదాహరణలోనూ ఉన్నాయని నా మటుకు నాకు అల్-ఖుషాయరీ రాసిన The Principles of Sufism (ఇస్లామిక్ బుక్ ట్రస్ట్, 2004) చదివినదాకా బోధపడలేదు. వాయవ్య ఇరాన్ ప్రాంతంలో జన్మించిన ఖుషాయరీ (986-107) ఆరబిక్ లో రాసిన రిసాలా అనే గ్రంథం నుంచి కొన్ని భాగాల్ని బి.ఆర్. వాన్ ష్లీగెల్ ఇంగ్లీషులోకి మొదటిసారి అనువదించి నాలాంటి సూఫీ విద్యార్థులకి మహోపకారం చేసింది. ఆ పుస్తకమే చదవకపోతే ఇప్పటికీ చాలామందిలాగా నేను కూడా సూఫీ తత్త్వం మూలాలు గ్రీకు సోఫిష్టుల్లోనో, భారతీయ యోగశాస్త్రంలోనో ఉన్నాయనే భ్రమిస్తూ ఉండేవాణ్ణి.
సూఫీ తత్త్వం గురించి ఖుషాయరీ వ్యక్తం చేసిన భావాలు వెయ్యేళ్ళ కిందటి భావాల్లాగా లేవు. ఇటీవలి కాలంలో సూఫీ తత్త్వం గురించి ప్రపంచానికి పరిచయం చెయ్యడానికి పూనుకున్న సమకాలిక భావుకుడు రాసిన మాటల్లాగా ఉన్నాయి. సూఫీల గురించి ఇద్రిష్ షా రాసిన పుస్తకం వల్ల తనకు సూఫీ మార్గం గురించి బాగా బోధపడిందని ఓషో ఒకచోట రాసాడు. నేను ఇద్రిష్ షాని కూడా చదివానుగాని, ఖుషాయరీ వల్లనే నాకు సూఫీధోరణి గురించి స్పష్టత ఏర్పడింది.
ముఖ్యంగా సూఫీ అనే పదం, అరబిక్ లో తసవ్వుఫ్, దేన్నుంచి వచ్చిందంటే, చాలామంది సుఫ్ అంటే ఊలు అనే పదం నుంచి వచ్చిందనీ, సూఫీ సాధువులు ముతక ఉన్ని గుడ్డలో, కంబళ్ళో కప్పుకునేవారనీ, అందువల్ల ఆ పేరు స్థిరపడిందనీ చెప్తారు. కాని, ఆ వ్యుత్పత్తి సరైనది కాదనీ, అసలు వస్త్రధారణ బట్టి గుర్తుపట్టే పరిస్థితిలో సూఫీ ఎన్నడూ ఉండడానికి ఇష్టపడడనీ ఖుషాయరీ అంటాడు. అలాగే తక్కిన రకరకాల వ్యుత్పత్తులు- ప్రవక్త మహమ్మద్ ఇంటిముందు బెంచి మీద కూచుండేవారనే అర్థంలో, సుఫా అనే ధాతురూపం, అలాగే, నిర్మలమానవులు అనే అర్థంలో సఫా అనే ధాతువు, శ్రేష్ట మానవులనే అర్థంలో సఫ్ప్ అనే మూలపదం- ఇవేవీ కూడా సూఫీ అనే పదానికి ఆధారం కాదంటాడు.
అందుకు బదులు, సూఫీ అంటే ఎవరో విజ్ఞులూ, పెద్దలూ ఏమని అభిప్రాయపడ్డారో ఆ మాటలద్వారా సూఫీ ని అర్థం చేసుకోవాలని ప్రతిపాదిస్తాడు. ముహమ్మద్ అల్ జురాయ్రీ అనే ఆయన ‘సూఫీ అంటే ప్రతిఒక్క సద్గుణాన్నీ స్వీకరించేవాడూ, ప్రతి ఒక్క దుర్గుణాన్నీ పక్కన పెట్టేసేవాడూ’ అని నిర్వచించాడట. అల్ జునాయిద్ దృష్టిలో ‘సూఫీతత్త్వం అంటే దేవుడు నీకోసం నిన్ను నిర్మూలించి తనలో నిన్ను తిరిగి బతికించడం’. అల్ హుసేన్ దృష్టిలో ‘ సూఫీ ఏకాంతికుడు, అతణ్నెవరూ అంగీకరించరు, అతడెవరినీ అంగీకరించడు’. అబూ హంజా అల్ బాగ్దదీ చెప్పిన దాని ప్రకారం ‘ తాను సంపన్నుడైనతరువాత ఎవరు పేదరికాన్ని వరిస్తారో అతడు సూఫీ. కీర్తి రుచి చూసాక అపకీర్తిని పొందగలిగినవాడు. ప్రఖ్యాతి చెందిన తరువాత కూడా అనామకుడిగా జీవించగలిగినవాడు-అటువంటివాడే సూఫీ.’ అమర్ ఉత్మాన్ అల్ మక్కి చెప్పినదాని ప్రకారం ‘ఏ క్షణానికి తగ్గట్టుగా ఆ క్షణానికి నడుచుకోగలిగే సేవకుడు సూఫీ.’ సమ్నూన్ అనే ఆయన చెప్పింది నాకు చాలా గొప్పగా అనిపించింది: ‘సూఫీ దేన్నీ వశపరుచుకోవాలనుకోడు, దేనికీ వశపడడు.’
అల్ జునాయద్ మరో మాట అన్నాడట: సూఫీ తత్త్వమంటే శాంతిలేని సమరమని. దీన్నే రువయుం అనే ఆయన ఇంకోలా అన్నాడు: సూఫీలు ఎంతకాలమైతే ఇతరులతో రాజీపడరో అంతకాలమే స్వచ్ఛంగా ఉంటారు. తోటి మనుషులతో విభేదాలు అంతరించాయంటే వాళ్ళ నిర్మలత్వం కూడా అంతరించినట్టే అని.
అబూ అలి అర్ రుద్బారీ సూఫీ తత్త్వాన్ని రెండు మాటల్లో క్లుప్తంగా చెప్పేసాడు: ‘రిక్తహస్తాలూ, స్వచ్ఛ హృదయమూ’ అని. అష్ షిబ్లి మాటల్లో ‘ సూఫీ తత్త్వమంటే మరి దేనిమీదా ధ్యాస లేకుండా భగవంతుడి పక్కన కూచోడమే.’ ధున్నూన్ అల్ మిశ్రీ అనే ఆయన సూఫీలంటే తక్కినవన్నీ వదిలి భగవంతుణ్ణి మాత్రమే కోరుకునేవారు, భగవంతుడు కూడా తక్కినవారందరినీ వదిలి ఎవరిని కోరుకుంటాడో వారే సూఫీలు అని.
అన్నిటికన్నా గొప్ప మాట అబూ నసర్ సర్రాజ్ చెప్ప్పాడు. ‘నీ దృష్టిలో సూఫీ అంటే ఎవరనుకుంటున్నావు ‘అని అడిగితే, ‘ఎవరిని భూమి మొయ్యదో, ఎవరికి ఆకాశం నీడ నివ్వదో అతడే’ అన్నాడట. నక్ష్ బందీ ఒక మాటన్నాడు: ‘ సూఫీ ఎవర్నీ మలినపరిచడు, పైగా తనను చేరవచ్చినవాళ్ళని పరిశుద్ధ పరుస్తాడు’ అని. సూఫీతత్త్వం ఒక ప్రక్షాళనోద్యమం. దానికి పుస్తకపాండిత్యంతో పనిలేదు. సూఫీ వక్తకాడు, ప్రచారకుడు కాడు, బోధకుడు కాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అతడు అనుష్టానవేదాంతి. భూతభవిష్యత్తులో నిమిత్తం లేనివాడు. ఇక్కడే, ఈ క్షణమే- వాటిమీదనే అతడి దృష్టి.నీ ద్వారా నువ్వు భగవంతుణ్ణి చేరుకో అనడం సూఫీ మొదట్లో చెప్పేమాట. తరువతా ఇంకొంచెం ముందుకు పోయాక, భగవంతుడిద్వారా భగవంతుణ్ణి చేరుకో అంటాడు.
భగవంతుడికీ, సూఫీ మధ్య ఉండే అనుబంధానికి మూడు దశలున్నాయంటారు. మొదటి దశలో వాళ్ళిద్దరి మధ్యా అనుబంధం ఒక క్లయింటుకీ, అతడి లాయరుకీ మధ్య ఉండే సంబంధం. క్లయింటు తన లాయరుతో తన బాధలన్నీ ఏకరువు పెడతాడు. అన్నీ విప్పి చెప్పుకుంటాడు. తన మంచీ,చెడూ ఏదీ దాచకుండా చెప్పి తననెట్లాగైన సమస్యనుంచి బయటపడెయ్యమని అడుగుతాడు. రెండవదశలో, వాళ్ళిద్దరి మధ్యా సంబంధం, ఒక తల్లికీ, ఇంకా మాటలురాని చిన్ని శిశువుకీ ఉండే అనుబంధం లాంటిది. ఆ చిన్నిపాప తల్లికేమీ చెప్పుకోలేదు. సైగలు కూడా చెయ్యలేదు. ఆ శిశువుకి తెలిసిందల్లా ఏడవడమే. ఆ ఏడుపుని బట్టే ఆ తల్లి అంతా గ్రహించుకుంటుంది. పాలిస్తుంది, పడుకోబెడుతుంది, ఊరడిస్తుంది, జోలపాడుతుంది. కాని ఇది కూడా మధ్యస్థ దశనే. భగవంతుడికి, సూఫీకీ మధ్య నిజంగా నెలకొనవలసిన అంతిమ సంబంధం ఒక రజకస్త్రీకి, ఆమె చేతుల్లో ఉన్న మలినవస్త్రానికీ ఉండే సంబంధంలాగా ఉండాలి. ఆ మలినవస్త్రం మాట్లాడదు. కనీసం ఏడవను కూడా ఏడవదు. దానికి తెలిసిందల్లా ఆ రజకస్త్రీ హస్తాలకు తనను తాను మౌనంగా అప్పగించుకోవడమే. ఆ రజకహస్తాలు ఆ వస్త్రాన్ని బండకేసి బాదుతాయి, చుట్టచుట్టి పిండుతాయి, సాగదీసి ఎండవేస్తాయి. ఏం చేసినా సరే మౌనంగా తనను తాను ఆ చేతులకు అప్పగించుకోవడమే సూఫీ చేసేదంతా.
ఇటువంటి మన:స్థితిలో, తమలోంచి తమను పూర్తిగా తొలగించుకుని భగవంతుణ్ణి మాత్రమే ప్రతిష్టించుకున్న దివ్య ఉన్మత్తతలోంచి చెప్పిన కవిత్వం కాబట్టే సూఫీ కవిత్వానికి ఆ శక్తి. ఒక రూమీ ఒక కబీర్ నీ, ఒక హాఫిజ్ ఒక మెహెర్ బాబా నీ రూపొందించాడంటే ఆ ‘భగవద్దివ్య గుణానువర్తన సదా ప్రాప్తైక చిత్తులు’ గా ఉండటమే కారణం.
20-8-2014