విక్టర్ ఫ్రాంక్ రాసిన Man’s search for Meaning (1946) ని అల్లు భాస్కరరెడ్డిగారు ‘అర్థం కోసం అన్వేషణ’ పేరిట తెలుగులోకి అనువాదం చేసారు. ప్రొ.అడ్లూరి రఘురామరాజుగారు గారి సంపాదకత్వంలో ఎమెస్కో సంస్థ ‘పొరుగునుంచి తెలుగులోకి’ పేరిట వెలువరిస్తున్న పుస్తకమాలికలో 30 వ ప్రచురణగా ఇటీవలనే వెలువడింది. నవ్యాంధ్ర పుస్తక సంబరాల్లో భాగంగా, మంగళవారం నెల్లూరులో ఆ పుస్తకావిష్కరణ జరిగింది. సుప్రసిద్ధ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించిన సభలో సుప్రసిద్ధ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తిగారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించేరు. ఆ సందర్భంగా ఆ పుస్తకాన్ని పరిచయం చేసే అవకాశం నాకు లభించింది. ఆ ప్రసంగాన్ని భాస్కరరెడ్డిగారి శిష్యులు రికార్డు చేసి ఎంతో శ్రద్ధతో ఎడిట్ చేసారు.
భాస్కరరెడ్డిగారు ఆ పుస్తకాన్ని చాలా చక్కగా అనువదించారు. నేను తెలుగులో చదివిన గొప్ప్ప అనువాదాల్లో ఈ పుస్తకం కూడా ఒకటని చెప్పగలను. అనువాదకుడు మనకి ఎక్కడా అడ్డుపడకుండా, తాను తెరవెనక్కి తప్పుకుని, మూలరచయితనే మనతో నేరుగా మాట్లాడిస్తాడు.
భాస్కరరెడ్డిగారు ఇంతకు ముందు ‘తావో తే చింగ్’ ను ‘తావో సూక్తి ప్రస్థానం’ పేరిట తెలుగు చేసారు. ప్రస్తుతం మిలరెపా జీవితకావ్యాన్ని తెలుగు చేస్తున్నారు. ఇట్లాంటివి ఒక వంద పుస్తకాలేనా ఆయన అనువదించాలని కోరుకుంటున్నాను.
2
అర్థం కోసం అన్వేషణ పుస్తకాన్ని పరిచయం చేస్తూ నేను చేసిన ప్రసంగం మళ్ళా విన్నాక, రెండు మూడు ముఖ్యమైన అంశాలు ఇంకా చెప్పవలసి ఉందనిపించింది.
మొదటిది, విక్టర్ ఫ్రాంక్, జీవితానికొక అర్థం కోసం అన్వేషించమంటున్నప్పుడు, ఆ అర్థాన్ని ఎలా కనుగొనాలో కూడా చెప్పాడు. ఏదో ఒక అర్థం కోసం మనుషులు వెతుకుతున్నప్పుడు, చాలా సార్లు తమని ఉద్రేకించేవాటిలోనో, లేదా ఎదుటివాళ్ళను ఉద్రేకించేవాటిల్లోనో జీవితానికి అర్థం వెతుక్కోవాలని చూస్తారు. తీవ్రమైన హింసకి పాల్పడే ఉగ్రవాదులూ, తీవ్రవాదులూ కూడా తామొక అర్థం కోసమే ఆ పని చేస్తున్నామని తమని తాము నమ్మించుకుంటారు. ఆత్మాహుతి కి సిద్ధపడే మానవబాంబర్లూ కూడా తామేదో ఒక పరమార్థం కోసమే ఆ పనిచేస్తున్నామని చెప్పుకోవచ్చు. అటువంటప్పుడు అర్థం కోసం అన్వేషించడాన్ని సవ్యంగా సాగించడమెట్లా? ఇందుకు ఫ్రాంక్ చెప్పేదేమిటంటే, ఎవరు బాధ్యత పడడానికి సిద్ధపడతారో, వాళ్ళకే జీవితానికొక అర్థం గోచరిస్తుందని. జీవించడానికి ఏదో ఒక కారణం దొరికినవాడే బాధ్యతపడటానికి సిద్ధపడతాడనీ. బాధ్యత కేవలం తనకి తాను నిర్దేశించుకున్న ప్రయోజనం కోసమే కాదు, మొత్తం మానవాళిపట్లనే బాధ్యతపడటమన్నమాట. ఇది స్పష్టంగా existentialist ఆలోచనా ధోరణి. సార్త్ర్ చెప్పిందిదే. బాధ్యత కలిగిన మానవుడు తనకోసం ఎంచుకునే ఎంపికలో తన హితాన్ని ముందు పెట్టుకుంటున్నప్పుడు తక్కిన ప్రపంచానికి కూడా అనివార్యంగా హితం కోరుకుంటాడని. బాధ్యత కలిగిన మనిషి తనకి కోరుకునే మంచిలో ప్రపంచానికి పనికొచ్చేది కూడా తప్పనిసరిగా ఉండితీరుతుందని.
ఎగ్జిస్టెన్షియలిస్టుల దృష్టిలో స్వేచ్ఛ ఏమంత గొప్ప పదం కాదు. వాళ్ళకి స్వేచ్ఛకన్నా బాధ్యత ముఖ్యమైన పదం. ఆ మాటకొస్తే, బాధ్యత లేని స్వేచ్ఛ వాళ్ళ దృష్టిలో ఒక negative పదమే. అందుకనే, అమెరికా తూర్పు తీరంలో statue of liberty ఉంటే సరిపోదనీ, పడమటి తీరంలో statue of responsibility కూడా ప్రతిష్టించాలనీ ఫ్రాంక్ అన్నాడట!
రెండవది, ఫ్రాంక్ వెలిబుచ్చిన భావాలకీ, రెండువేల ఏళ్ళ కిందట ఎపిక్టెటస్ ప్రకటించిన భావాలకీ మధ్యకనిపించే సామ్యం. ఎపిక్టెటస్ ఒక రోమన్ బానిస. ఆయన తన జీవితకాల బాధానుభవం నుంచి గొప్ప పాఠాలు మానవాళికి వదిలివెళ్ళాడు. ఆయన రచన గురించి నేనింతకుముందు రాసిన పరిచయాన్ని మరో సారి గుర్తుచేస్తున్నాను.
మనం అకాడెమీల్లో, యూనివెర్సిటీల్లో, సెమినార్లలో, కవిసమ్మేళనాల్లో మాట్లాడుకుంటున్న మాటలు మనకాలపు తత్త్వశాస్త్రాన్ని రూపొందిస్తున్నాయనుకుంటాం. కాని ఎవరికి తెలుసు? మన మధ్యనే క్లేశపూరితమైన నిర్విరామకార్మికజీవితం గడుపుతున్న హోటల్ వెయిటర్లు, నగరవీథుల్ని ఊడ్చే స్వీపర్లు, ఆటోడ్రైవర్లు, సేల్సు మెన్లతో పాటు జైళ్ళల్లో మగ్గుతున్న చిల్లరనేరస్థులు, జైళ్ళకన్నా దుర్భర జీవితం గడిపే సెక్స్ వర్కర్లు- బహుశా వాళ్ళు మనం చూస్తున్న ప్రపంచాన్నే మనకన్నా భిన్నంగా చూస్తూ, మనకి మనం చెప్పుకుంటున్న తత్త్వశాస్త్రాన్ని సమూలంగా ప్రశ్నించే వేరొక ప్రాపంచిక దృక్పథాన్ని నిర్మించుకుంటూ ఉండవచ్చు. బహుశా, వాళ్ళల్లో ఒక ఎపిక్టెటస్, ఒక విక్టర్ ఫ్రాంక్ కూడా ఉండి ఉండవచ్చు.
మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైంది, మనిషి తనకన్నా భిన్నంగా ఉన్నవాళ్ళని (అదర్) చూసినప్పుడు తీవ్ర అభద్రతకి లోనవుతాడనీ, ఆ అభద్రత వల్లనే అదర్ ని నిర్మూలించడానికి వెనుకాడడనీ మనకి తెలుసు. అదర్ ని అట్లా నిర్మూలించాలనే కోరిక బలపడేకొద్దీ, అదొక రాజకీయ స్వభావాన్ని సంతరించుకుని, నెమ్మదిగా ఒక totalitarian state గా రూపొందుతుందని కూడా చరిత్ర మనకి చెప్తున్నది. హిట్లర్ జర్మనీని అటువంటి totalitarian state గా మార్చడానికి ఎంతో ముందే, కాఫ్కా అనే ఒక చెక్ యూదు రచయిత ఒక ప్రవక్తలాగా ‘దర్శించి ‘ హెచ్చరించాడని కూడా మనకి తెలుసు. కానీ, మనం మర్చిపోతున్నదేమిటంటే, అదర్ పట్ల ఈ అభద్రత ఒక యూదు పట్ల జర్మన్ అభద్రతకి మాత్రమే పరిమితం కాదని. ఎదటి మనిషిని మనిషిగాకాక, కులం, మతం, వర్ణం, లింగం, ప్రాంతం పేరు పెట్టి చూసే ప్రతిమనిషిలోనూ, ఎదటిమనిషిని ద్వేషించే ప్రతి మనిషిలోనూ బీజప్రాయంగానైనా ఒక హిట్లర్ ఉన్నాడని మనం మర్చిపోతున్నాం.మరి ఆ అభద్రతనుంచీ, ద్వేషం నుంచీ బయటపడటమెలాగు?
బాధ్యత పడటం వల్ల మాత్రమే, బాధ్యతతో మెలగడం వల్ల మాత్రమే, ఆ బాధ్యతని ఇష్టపడటం వల్ల మాత్రమే అంటున్నాడు ఫ్రాంక్. మరే దారీ ప్రత్యామ్నాయం కాదు, యుద్ధమసలు కానేకాదంటున్నాడు.
ఉసురులకు విసికితివొ
యుద్ధము కలదు,
యుద్ధమా? ఇక ఏమి లోకము
చాలు చాలును
లంగరెత్తుము.
10-11-2016 & 11-11-2016