ఆదోని డిగ్రీ కాలేజి వార్షికోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడి లైబ్రరీలో ఉన్న ఎన్నో మంచిపుస్తకాల్లో Fifty Soviet Poets (ప్రొగ్రెస్ పబ్లిషర్స్, 1974) చూడగానే నాకెందుకో బెంగగా అనిపించింది.
డెభ్భైల్లోనూ, ఎనభైల్లో కొంతకాలందాకా సోవియెట్ పుస్తకాలు, కవిత్వం, కథలు ఎంతో చౌకగా విరివిగా దొరికేవి. నా చిన్నప్పుడు సత్తెనపల్లిలో జరిగిన జిల్లాసైన్సు ఫెయిర్ లో నాకు బహుమతిగా దొరికిన మూడు పుస్తకాలూ సోవియెట్ పుస్తకాలే. యాకోవ్ పెరొల్మాన్ రాసిన నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం నా హైస్కూలు రోజుల్లో ఎన్నిసార్లు చదివానో. మార్క్స్, ఎంగెల్సు రచనలు, లెనిన్ రచనలు పూర్తిసంపుటాలతో పాటు గోర్కీ అమ్మ, టాల్ స్టాయి కోసక్కులు, అన్నాకెరెనినా, డాస్టవస్కీ పేదజనం-శ్వేతరాత్రులు, తుర్జినివ్ తండ్రులూ-కొడుకులూ, కుప్రిన్ రాళ్ళవంకి కథలు, చింగిజ్ అయిత్ మాతొవ్ నవలలు, ఆర్మీనియన్ కథలు కొండగాలీ-కొత్తజీవితం, పిల్లలబొమ్మలపుస్తకాలూ ఆ రోజుల్లో దాదాపుగా ప్రతి సాహిత్యమిత్రుడి భాండాగారంలోనూ కనిపించేవి.రష్యన్ కవిత్వం కన్నా సోవియెట్ కవిత్వం, ముఖ్యంగా, రసూల్ గాంజటవ్, కైసన్ కులియెవ్ వంటివారి పుస్తకాలు ఎంతో అందమైన ముద్రణల్తో కనిపించేవి. చెకోవ్ మొత్తం కథలు నాలుగు సంపుటాల్లో వచ్చిన అందమైన ప్రచురణలో మూడుసంపుటాలు ఇప్పటికీ భద్రంగా నదగ్గరున్నాయి. చెకోవ్ కథలకి వచ్చిన అనేక ఇంగ్లీషు అనువాదాల్లో ఇప్పటికీ నా దృష్టిలో అవే గొప్పవి.
ఫిఫ్టీ సోవియెట్ పొయెట్స్ పుస్తకం చూడగానే ఈ జ్ఞాపకాలు మనసులో మెదలడంతో కలిగిన బెంగ కొంతమాత్రమే. కాని అసలు సోవియేట్ ప్రయోగమే నా హృదయాన్ని కలచివేసింది. ఇరవయ్యవశతాబ్దం చూసిన మహత్తర మానవసామాజిక ప్రయోగాల్లో సోవియెట్ రష్యా ఆవిర్భావం కూడా ఒకటి. శతాబ్దం ముగియకుండానే ఆ ప్రయోగం కుప్పకూలిపోవడం మరొకటి. సోవియెట్ రష్యా ఏర్పడినప్పుడు, అది శ్రీశ్రీ స్తుతించినట్టుగా ‘వ్యక్తిస్వతఃసిద్ధ స్వాతంత్ర్యదాతగా, పతిత నిర్గతిక ప్రపంచ త్రాతగా, భావికాల స్వర్ణభవన నిర్మాతగా మారుతుందనే’ ప్రపంచమంతా ఎదురుచూసింది. ‘అనంతప్రపంచం అంతటా నీవై, నీ గొడుగు నీడల్ని సాగించు రష్యా’ అనీ, ‘ప్రపంచం నీ కోసం పరిపక్వమై ఉంది, కోటి గొంతులు నిన్ను కోరిరమ్మంటున్నాయి, కోటి చేతులు నిన్ను కౌగిలిస్తున్నాయి, గర్జించు రష్యా’ అనీ కవి గానం చేసాడు. రెండవప్రపంచ యుద్ధంలో స్టాలిన్ గ్రాడ్ దగ్గర నాజీ సైన్యాల్ని సోవియెట్లు నిలవరించి ఉండకపోతే ప్రపంచ చరిత్ర మరోలా ఉండేదని మా సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు వెంకటరత్నంగారు ఎంతో ఉద్వేగంగా చెప్పేవారు. కాని, ఇప్పుడదంతా ఒక గతంగా, జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోవడం నా బెంగకి కారణం.
అంతేనా? స్టాలిన్ గ్రాడ్ యుద్ధాన్ని విమోచన సమరంగా భావించి మరణించిన సోవియెట్ యువకుల గురించి తలుచుకుంటే కలిగే దుఃఖంతో పాటు సోవియెట్ సైన్యాలు పోలెండులోనూ, తక్కిన తూర్పు యూరోప్ దేశాల్లోనూ సాగించిన మారణకాండ గురించి ఇప్పుడు చదువుతుంటే కలిగే బెంగ కూడా తక్కువ కాదు. మనిషి తోటిమనిషిని హింసించేటప్పుడు దానవుడిగా మారతాడు, ఆ ముఖాన్ని మనం పోల్చుకోగలం. కాని తోటిమనిషిని విముక్తుణ్ణి చేస్తున్నానని చెప్పి అతణ్ణి హింసించేటప్పుడు మరింత వికృతంగా మారతాడు. ఆ ముఖాన్ని పోల్చుకోవడం అంత సులభం కాదు. ఆ రోజుల్లోనే అంత విరివిగా, అంత చౌకగా రోడ్లమీద గుట్టలకొద్దీ అమ్మిన సోవియెట్ రచనల్లో అన్నా అఖ్మతోవా, బోరిస్ పాస్టర్నాక్, మేరియా త్సెతేవా, ఓసిప్ మెండల్ స్టాం వంటి వారి కవిత్వం ఒక్క ముక్క కూడా ఎందుకు దొరికేది కాదో తరువాత తరువాత బోధపడింది. ఎనభైల్లో గోర్బచేవ్ పెరిస్త్రోయికా గురించి మాట్లాడినప్పుడు నేను రాజమండ్రిలో ఉన్నాను. ఆ రోజుల్లో మాకు ఆ విషయాల గురించి అర్థమయ్యేలా చెప్పగల్గింది ఆర్.ఎస్.సుదర్శనంగారొక్కరే. ఆయన దగ్గరకు వెళ్ళి గ్లాస్ నోస్త్, పెరిస్త్రోయికా అంటే ఏమిటని అడిగితే ఆ పదాలు సోవియెట్ గోడలు పగుళ్ళుబారుతున్నాయనడానికి సంకేతమనీ, ఆ వ్యవస్థ తొందర్లోనే కూలిపోనున్నదనీ వివరించేరాయన.
సోవియెట్ ప్రయోగంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ జయాపజయాల సంగతెలా ఉన్నా, ఆ ప్రయోగాలకి తమ జీవితాల్ని అర్పించిన లక్షలాది యువతీయువకుల్ని, వాళ్ళ కుటుంబాల్నీ, ఆ పిల్లల తల్లుల్నీ తలుచుకుంటేనే నాకెంతో బెంగ కలుగుతుంది. వాళ్ళెందుకు మరణించారో ఆ కారణాలు సమంజసమైనవేనా? వాళ్ళు తమ ప్రాణాలు ఒడ్డి కూడా ఒక ప్రయోగాన్ని నాలుగుకాలాలపాటు నిలపలేకపోయారే. లేదా, వాళ్ళు తమ ప్రాణత్యాగం చేసినందువల్లనే సోవియెట్ రష్యా కొన్ని దశాబ్ద్దాలైనా ప్రపంచంలో కోట్లాదిమందికొక ఆశగా కలగా, ధైర్యంగా నిలబడగలిగిందా?
యాభై మంది సోవియెట్ కవుల కవితాసంకలనం తేరవగానే రష్యన్ స్టెప్పీల పచ్చగడ్డివాసనతో పాటు అంతులేని యుద్ధాల పొగా, పోప్లార్లనీడల చల్లదనంతో పాటు సైబీరియన్ ఖైదీల అశ్రువుల వెచ్చదనం కూడా నా చుట్టూ ముసురుకున్నాయి. పుస్తకానికి ముందుమాట రాసిన సంకలనకర్త వ్లమిదీర్ ఒగ్నెవ్ ఈ మాటలు రాస్తున్నప్పుడు అతడి నేత్రాలు ఒకింత గర్వంతో, ఆశావహ హృదయంతో మిలమిల్లాడిఉంటాయి. అతడిట్లా రాసాడు:
‘కాని కవిత్వమంటే ఆశ. అటువంటి ఆశకొక దృఢమైన, విశ్వసనీయమైన ప్రాతిపదిక దొరికనప్పుడు, ప్రజలు తమలో తాము పేంపొందించుకోగల ఆత్మవిశ్వాసాన్ని కవిత్వం మరింత బలోపేతం చేస్తున్నప్పుడు కవికీ, పాఠకుడికీ మధ్య అవగాహన అనే అమూల్యమైన నిప్పుకణిక రగుల్తుంది. అప్పుడు మానవుణ్ణి గౌరవించడం, దృఢంగా నిలబడటం, సామాజిక ఆదర్శాలపట్ల విధేయుడిగా ఉండటమనే విలువల్ని కాపాడుకోవడానికి కావలసిన దైర్యం కోసం పాఠకుడు కవిత్వం వైపు చూస్తాడు.
జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చుకోవచ్చన్న విశ్వాసం,అందుకుగాను ప్రజల తరఫున నిలబడగల సాహసం మొత్తం సోవియెట్ కళపొడుగునా అంతర్లీనంగా ప్రవహిస్తున్నాయి…ఈ పుస్తకంలో కనవచ్చే కవిత్వానికి ఎక్కడి ప్రజలనుంచైనా ప్రతిస్పందన లభిస్తుంది. ఇందులో సౌభ్రాతృత్వ సందేశం ఉంది. హింసకీ,శత్రుత్వానికీ వ్యతిరేకంగా ఇది గళం విప్పింది. ప్రపంచంలో సర్వత్రా, శాశ్వతంగా కనవచ్చే సరళవిలువలు- కాయకష్టం, మాతృత్వం, సృజనాత్మకత, ప్రకృతితో తాదాత్మ్యంలో మనిషి పొందే సంతోషం, ప్రజలమధ్య సంభవించే స్నేహం వంటివాటికోసమే ఈ కవిత్వం నిలబడుతున్నది.’
తన చివరివాక్యాలకు వచ్చేటప్పటికి సంకలనకర్త ఎంతో వివేకవంతుడిగా కనిపించాడు. సోవియెట్ రష్యా ‘ పతిత నిర్గతిక ప్రపంచ త్రాత’ గా ఈ కవిత్వంలో కనిపిస్తున్నదని అతడు రాసిఉంటే అతడు ప్రభుత్వప్రోపగాండిస్టుగా మాత్రమే మిగిలిపోయిఉండేవాడు. కాని అతడికి తెలుసు, ఈ కవిత్వం, కాలాన్ని దాటి నిలవగల శక్తిని సాధించుకున్నదనీ,ఆ శక్తి కొన్ని రాజకీయసిద్ధాంతాల్ని అనుసరించినందువల్ల కాక, సార్వత్రిక, శాశ్వత సరళ సత్యాల్ని మనుషులు మళ్ళా తమకై తాము అనుభవించి అనుభూతించి చెప్పుకోవడం వల్ల వచ్చిందనీ.
అటువంటి సరళ సత్యాల్లో సంకలనకర్త మాతృత్వాన్ని కూడా ఒకటిగా చెప్పాడు. లక్షలాది మంది బిడ్డల్ని యుద్ధంకోసం, దేశపునర్నిర్మాణంకోసం త్యాగం చేసిన సోవియెట్ తల్లులకన్నా మాతృత్వం గురించి మరింత బాగా ఎవరికి తెలుస్తుంది?
పుస్తకం తెరుస్తూనే ఆతృతగా రసూల్ గాంజటోవ్ కవిత్వం వెతుక్కున నాకు ఈ కవిత కనిపించడంలో ఆశ్చర్యమేముంది?
మానవహృదయాన్ని మరిపించే పాటలు మూడు.
మానవసంతోషవిషాదాలతో బరువెక్కిన పాటలు మూడే-
మొదటిపాట తక్కిన రెండింటికన్నా సంతోషభరితం,
చిన్నారిశిశువుని ఊయెలూపుతూ తల్లిపాడే లాలిపాట.
రెండో పాట కూడా ఒక తల్లిపాడేదే, వణుకుతున్న
వేళ్ళతో చల్లబారిన తన పుత్రుడి కపోలాలు స్పృశిస్తూ
సమాధిచెంత పాడుకునే పాట. ఇక మూడవది
ప్రపంచంలో తక్కిన గాయకులంతా పాడే పాట.
రసూల్ గాంజటోవ్ ని చదవగానే మరింత ఆసక్తితో కైసన్ కుల్యెవ్ కవితలకోసం వెతికాను, అందమైన అతడి కవితాసంకలనం, ఒకవైపు చిత్రలేఖనాలతో, మరొకవైపు కవితల్తో ముద్రించిన ఆ సంకలనాన్ని నేనెక్కడో పోగొట్టుకున్నాను. చిన్నప్పుడు ఎంతో కాలం పుస్తకంలో పదిలంగా దాచుకుని ఎప్పుడో ఏ విస్మృత క్షణంలోనో పోగొట్టుకున్న నెమలీక లాంటి ఆ పుస్తకం మళ్ళా ఎప్పటికీ దొరకదు కదా. ఈ పుస్తకంలో ఆ కవితల ఆనవాళ్ళ కోసం వెతికితే ఈ కవిత కనిపించింది.
ఎక్కడో దూరంగా పల్లెలో ఒక తల్లి
పాడుతున్న జోలపాట వినబడుతున్నది.
ప్రపంచ భయాలన్నీ, దుఃఖాలన్నీ
ఆ పాటలో అల్లుకుపోతున్నవి.
యుద్ధంలో పేల్చిన ప్రతి ఒక్కతూటా
నేరుగా తాకేది ఒక తల్లి గుండెకే,
ఎవరు ఎక్కడ విజయం సాధించనివ్వు
అక్కడంతా భగ్నమాతృ హృదయాలే.
బహుశా యాభైయ్యేళ్ళ కిందట ఈ పుస్తకంలో ఈ కవితలు మన దృష్టిని ఆకర్షించి ఉండేవికావేమో. కాని సంకలనకర్తకి తెలుసు, బహుశా కాలం చల్లబడ్డాక మిగిలే కవితలిలానే ఉంటాయని.
తక్కిన సమకాలిక సోవియెట్ సంకలనాల్లాగా కాకుండా ఈ సంకలనంలో అన్నా అఖ్మతోవా, పాస్టర్నాక్ వంటి కవులకి కూడా చోటు దొరికింది. తల్లి హృదయం అనుభవించే క్షోభ ఏమిటో అన్నా అఖ్మతోవా, మేరియా త్సెతేవా వంటి వారికన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? తన పిల్లల ఆకలి తీర్చడం కోసం సోవియేట్ రష్యాలో మేరియా త్సెతేవా దోంగతనానికి కూడా వెనకాడలేదని మనకు తెలుసు. ఇక స్టాలిన్ ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించిన తన కొడుకుని చూసుకోవడం కోసం, విడిపించుకోవడం కోసం అన్నా అఖ్మతోవా ఏళ్ళ తరబడి వీథుల్లో, ప్రభుత్వకార్యాలయాల్లో, జైళ్ళముందట పడిగాపులు పడింది. మనిషి దుఃఖానికీ, కవిత్వానికీ ఉన్న రక్తసంబంధం ఆమెకి తెలిసినట్టు మరెవరికి తెలుస్తుంది? అందుకే ఇలా అంటున్నది:
చిమ్మచీకటిలో కూడా ధగధగలాడే
ఈ కవిత్వ పవిత్ర కళ
వేల ఏళ్ళుగా వర్ధిల్లుతూనే ఉంది,
అయినా అనలేదిప్పటికీ ఏ ఒక్క కవీ
ఏడుస్తూగానీ, నవ్వుతూగానీ
వివేకమనేది లేదనిగాని, వృద్ధాప్యం లేదనిగాని
మరణం లేదనిగాని.
చాలా ఆశ్చర్యంగానూ, ఎంతో బెంగగానూ అనిపిస్తున్నది, ఈ మాతృదినోత్సవంరోజున ఒక మహత్తరదేశం నుంచి వచ్చిన కవిత్వం చదువుతుంటే, సాహసం, శౌర్యం, సామాజికవిజయాలకన్నా, యుద్ధం, దుఃఖం, భగ్నమాతృ హృదయాల దగ్గరే మనసాగిపోతున్నది.
11-5-2014