మూడు ఉదాహరణలు

29

ఈ ఏప్రిల్ 23 షేక్స్పియర్ 400 వ వర్థంతి సందర్భంగా ప్రపంచమంతా ఆయన్ను ఘనంగా తలచుకుంది. ఆ రోజే బండి శ్రీహర్షగారు నాకో మేసేజి పెట్టారు, ‘షేక్స్పియర్ రసజ్ఞతని మరోమారు గుర్తు చేయరూ ఇవాళ’ అంటో. అప్పుడు పూర్తిగా కబీరులో మునిగితేలుతూ ఆయనకేమీ జవాబివ్వలేకపోయాను.

కానీ ఈ నెల్లాళ్ళగానూ ఎక్కడో మనసులో షేక్స్పియర్ మెదుల్తూనే ఉన్నాడు. నేనేమీ షేక్స్పియర్ పండితుణ్ణి కాను, ఆయన నాటకాల్లో సగం మటుకే చదివి ఉంటాను, సానెట్లు చదివానుగాని, అధ్యయనం చేసానని చెప్పలేను. ఆయన రాసిన దీర్ఘకవితలయితే చదవనేలేదు.

కాని నేను షేక్స్పియర్ ను అర్థం చేసుకున్నానని చెప్పగలను.

ఆయన నాటకకళ మీద, కావ్యకళమీద బెన్ జాన్సన్, శామ్యూల్ జాన్సన్, వర్డ్స్ వర్త్, కిర్క్ గార్డ్, బ్రాడ్లీ, హెరాల్డ్ బ్లూమ్ వంటి వాళ్ళ ప్రశంసనీ, ఇలియట్ వంటి వారి విమర్శనీ, వోల్టేర్, బైరన్, టాల్ స్టాయి వంటి వారి ద్వేషాన్నీ, అర్థం చేసుకోగలను. షేక్పియర్ నీ, వ్యాసవాల్మీకుల్నీ పోల్చి అరవిందులు చెప్తూంటే శ్రద్ధగా వినగలను, టెంపెస్టును శాకుంతలంతో పోల్చి షేక్స్పియర్ అవగాహనకున్న పరిమితులేమిటో టాగోర్ చెప్తుంటే అర్థం చేసుకోగలను.

ఇంత చదివాక, విన్నాక, షేక్స్పియర్ విశిష్ఠత ఏమిటో చెప్పమంటే సూటిగా చెప్పగలనా?

అరిస్టాటిల్ సాహిత్యాన్ని lyric, epic, dramaలుగా విభజించాడు. కవి గొంతు మాత్రమే వినిపించేది లిరిక్ అనీ, పాత్రలు మాత్రమే మాట్లాడుకునేది డ్రామా అనీ, కవీ, పాత్రలూ కూడా మాట్లాడేది ఎపిక్ అనీ ఆయన నిర్వచించాడు. ఈ వర్గీకరణ ఎంతో అర్థవంతం మాత్రమే కాక అర్థరహితమని కూడా పోర్చుగీసు కవి పెసావో విమర్శించాడు. ఎందుకంటే, గొప్ప కవిత్వంలో ఏకకాలంలో, కవి గొంతు, పాత్రల గొంతూ, కవీ పాత్రలూ కలగలిసి కూడా వినిపిస్తారని ఎడ్వర్డ్ హిర్ష్ How to Read Poetry లో రాసాడు.

బహుశా షేక్స్పియర్ విశిష్ఠత ఇదే అనుకుంటాను. ఆయన ఒక పాత్ర చెప్పుకున్న స్వగతంలో కూడా ఒక యుగం సంక్షోభమంతా చూపించగలడు. ఆయన కవిత్వశైలి లో లిరిక్, ఎపిక్, డ్రామా మూడూ విడదీయలేనంతగా పెనవైచుకుపోయిఉంటాయి.

ఇందుకు మూడు ఉదాహరణలు. మొదటిది, ఆయన కవిత్వకళ పూర్తి పరిణతి సాధించిన తర్వాత రాసిన Twelfth Night (1601) లో మొదటి సంభాషణ. ఇది లిరికల్. రెండవది, దాదాపుగా అదే సమయంలో రాసిన Hamlet (1600-01)లో ఎపిక్ స్థాయినందుకున్న స్వగతం. మూడవది, ఆయన నాట్యకళ సంపూర్ణవికాసం చెందినప్పుడు రాసిన Macbeth (1606) రెండవ అంకంలో రెండవ దృశ్యం. పొడిపొడిమాటల్లో భయోత్పాతాన్ని, ఆత్మవిహ్వలత్వాన్ని చూపించగల అనితరసాధ్యమైన శైలి.

1

సంగీతం ప్రేమకి జీవజలాలు సమకూరుస్తుందంటే, వినిపించు,
మరీ ఎక్కువైతే, మొహం మొత్తుతుంది, తృష్ణ నశిస్తుంది,
ఏదీ ఆ రాగం మరొక్కసారి,ఆ అవరోహణ దుఃఖభరితం.
ఆహా, నీలిగోరింటపొదల్లోంచి సుగంధాన్ని కూడగట్టుకుని
వీచిన మధురమందపవనంలాగా నా చెవులను తాకుతున్నది.
అక్కడితో చాలు, ఇంక వినిపించకు, ముందటిలాగా మధుర
మనోహరంగా వినిపించడం లేదది, ఆహా ప్రేమా! నీ స్ఫూర్తి
ఎంత నవోన్మేషం, శీఘ్రం! సముద్రమంత సామర్థ్యం నీది,
అయినా అక్కడ ఆగవు, ఎంత ఎత్తుకు ఎగిసిపడతావో
అంతలోనే, ఇంతాచేసి, క్షణంలోనే నేలబారుగా జారిపోతావు
విచిత్ర విస్మయకారకానివి, మరిదేంతోనూ పోలికలేదు నీకు.

2

ఓ, ఎంత పనికిమాలినవాణ్ణి, పల్లెటూరి బైతుని!
ఈ నటుడిక్కడ ఉండటం విపరీతం కాదూ, అది కూడా
మోహమయస్వప్నంలాంటి కల్పిత కథలో, నటనలో
తన స్వాతిశయానికి తగ్గట్టు తనని తాను మైమరచిపోతూ
పాలిపోయిన మొహంతో, కళ్ళనిండా నీళ్ళతో, గద్గద స్వరంతో
దిశతప్పిన చూపులతో, ఇందంతా చేస్తున్నదెందుకు?

హెకూబా కోసం!

హెకూబా వాడికేమవుతుంది? వాడు హెకూబాకి ఏమవుతాడని
ఆమెకోసమంతలా ఏడుస్తాడు? వాడికే కనుక నా  బాధ,
నన్ను ఛిద్రం చేస్తున్న వేదన ఉంటే ఏం చేసిఉండేవాడు?
రంగస్థలాన్నంతా కన్నీళ్ళతో ముంచెత్తేసేవాడు, తన
ఘోరవాక్కులతో ప్రేక్షకుల చెవులు హోరెత్తించేవాడు,
తప్పుచేసినవాళ్ళని పిచ్చెక్కించి ఉండేవాడు, అమాయకుల్ని
భయపెట్టేసేవాడు, ఏమీ తెలియనివాళ్ళని వెర్రెత్తించేవుండేవాడు,
ప్రతి ఒక్కళ్ళ కళ్ళనీ, చెవుల్నీ సంభ్రమంలో ముంచెత్తేసేవాడు.

కాని నేను,

శుద్ధ మొద్దు బుద్ధావతారాన్ని, తుంటరిని, కలల్లో పొద్దు
పుచ్చుతున్న పోకిరీని, కర్తవ్యం మర్చిపోయినవాణ్ణి,
నేనేం చేస్తున్నాను? కనీసం నోరేనా ఎత్తడం లేదు, తన
జీవితం సర్వం కోల్పోయిన రాజు తరఫున, కనీసం,
ఒక్కటంటే ఒక్క మాటన్నా మాటాడటం లేదు, నేను
పిరికివాణ్ణా? నన్నెవరన్నా దుర్మార్గుడంటారా? నా తల
పట్టుకు గుంజేస్తారా, నా గడ్డం పట్టుకు లాగి లెంపకాయ
కొడతారా? నా ముక్కు పిండేస్తారా? ఎవరు వాళ్ళు? నా
కోసం నన్ను నిందించేవాళ్ళు? నన్నో అబద్ధాలకోరనేవాళ్ళు?

హా!

నిజంగా ఎవరన్నా నన్నట్లా చేస్తే నాకెంత సంతోషం,
దుర్బలమనస్కుణ్ణైపోయాను, ఈ పాటికి ఈ రాజుని
పొట్ట చీల్చి పేగుల్తో రాబందులకి మేపివుండొద్దా?ఈ
నీచుణ్ణి, దుర్మార్గుణ్ణి, ద్రోహిని, పాతకుణ్ణి, కాముకుణ్ణి.

ఓ ప్రతీకారమా!

ఎంత పనికిమాలిన దద్దమ్మను ! హత్యకు గురైన ఒక
తండ్రి ప్రియాతిప్రియమైన బిడ్డను, భూనభోంతరాళాలు
మొరపెట్టి ప్రతీకారం తీర్చుకొమ్మని చెప్తున్నా, నేను
చేస్తున్నదేమిటి? బజారుదానిలాగా గొంతుచించుకుని
పనికిమాలిన శాపనార్థాలు పెడుతున్నాను, నేనొక తొత్తుని,
అంట్లవెధవని!

ఓ, అయ్యో, నా బుద్ధి…

3

మేక్బెత్: ఆ పని పూర్తిచేసేసాను, నువ్వేమన్నా చప్పుడు విన్నావా?
ఆమె: విన్నాను, గుడ్లగూబ అరవడం, చిమ్మెటలు గీపెట్టడం. నువ్వు కూడా మాట్లాడేవు కద.
మేక్బెత్: ఎప్పుడు?
ఆమె: ఇప్పుడే.
మేక్బెత్: కిందకు దిగుతున్నప్పుడా?
ఆమె: అవును.
మేక్బెత్: విను, ఆ పక్కగదిలో ఎవరు పడుకున్నారు?
ఆమె: డొనాల్బెన్
మేక్బెత్: (తన చేతులు చూసుకుంటూ) ఇది చూడటం బాధగా ఉంది.
ఆమె: చూడటం బాధగా ఉందనేది తెలివితక్కువమాట.
మేక్బెత్: ఒకడు నిద్రలో నవ్వుకుంటున్నాడు. మరొకడు ‘హత్య’ అని అరిచాడు. వాళ్ళొకళ్ళనొకళ్ళు లేపుకున్నారు, నేనక్కడే నిలబడిపోయి వింటున్నాను. వాళ్ళు లేచి దణ్ణం పెట్టుకుని మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు.
ఆమె: వాళ్ళిద్దరూ ఒక గదిలోనే ఉన్నారు.
మేక్బెత్: ఒకడు ‘దేవుడా, మమ్మల్ని కాపాడు’ అన్నాడు. మరొకడు ‘దేవుడికి జయం’ అన్నాడు. నేనీ తలారి చేతుల్తో అక్కడే భయంతో నిలబడి ఉండటం చూసారు, అందుకని వాళ్ళు ‘దేవుడా కాపాడు’ అన్నప్పుడు నేను ‘దేవుడికి జయం’ అనలేకపోయాను.
ఆమె: అదేం పట్టించుకోకు.
మేక్బెత్:కాని ఇప్పటిదాకా నేనెప్పుడూ దేవుడి పేరు తలవగానే జయమనకుండా ఉండలేదే. నాకు నిజంగా దేవుడి ఆశీర్వాదం అవసరమైనవేళ, ఆ శుభవాచకం నా గొంతులో ఇరుక్కుపోయింది.
ఆమె: ఇట్లాంటి పనులుచేసేసాక ఎక్కువ ఆలోచించగూడదు, మరీ ఆలోచిస్తే మనకు పిచ్చిపడుతుంది.
మేక్బెత్: ఎవరో అంటున్నారు ‘ఇంకెంతమాత్రం నిద్రపోకు, మేక్బెత్ నిద్రనే హత్య చేసేసాడు’ అని. అమాయికమైన నిద్ర, వదులైన ప్రేమవస్త్రాన్ని దగ్గరగాలాగి అల్లుకునే నిద్ర, దినాంతానికల్లా దొరికే విస్మృతి, అలసిన దేహానికి ఊరట, గాయపడ్డ మనసుకి స్వస్థత, జీవితపు విందులో మలివడ్డన, ప్రాణపోషకం.
ఆమె: ఏమంటున్నావు?
మేక్బెత్: ఆ కంఠమట్లా అరుస్తూనే వుంది. ఆ మందిరమంతా ప్రతిధ్వనించేలా ‘ఇంక నిద్రపోకండి’ అంటోంది, ‘మేక్బెత్ నిద్రని చంపేసాడు, ఇంక మేక్బెత్ కి నిద్ర ఉండదు’ అంటో అరుస్తోంది.

25-5-2016

Leave a Reply

%d bloggers like this: