ముళ్ళదారి

39

మహాత్మాగాంధీ పెద్దకొడుకు హరిలాల్ గాంధీ జీవితం మీద చందూభాయి భాగూభాయి దలాల్ గుజారాతీలో ఒక పుస్తకం రాసారు. దాన్ని త్రిదీప్ సుహృద్ ఇంగ్లీషులోకి Harilal Gandhi: A Life (ఓరియెంట్ లాంగ్మన్,2007) అనువదించారు. దాదాపు రెండేళ్ళనుంచీ ప్రొ. రఘురామరాజు ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించమని నన్ను పట్టుపడుతూ ఉన్నారు. ఏమైతేనేం, కన్నీళ్ళ మధ్య ఆ పుస్తకాన్ని అనువదించడం పూర్తయ్యింది. అందులో తండ్రికీ, కొడుకీ మధ్య సంభవించిన విలువల సంఘర్షణమీద ఒక వ్యాసం రాయడంలో ఉన్నాను. ఆ సంఘర్షణ సంభవించిన కాలంలో (1906-1915) గాంధీజీ మన:స్థితిని అర్థం చేసుకోవడానికి మరొక్కసారి ఆయన అత్మకథ ఆసాంతం చదివాను.

ముఫ్ఫై అయిదేళ్ళ కిందట నేను మా కుటుంబపరిస్థితులు అనుకూలించక పెద్దాపురంలో బి.ఏ లో చేరినరోజుల్లో గాంధీజీ రచనలపట్ల గొప్ప ఆసక్తి పుట్టింది. అప్పట్లో గాంధీజీ ఆత్మకథకు వేలూరి శివరామశాస్త్రిగారి అనువాదం చదివాను. మళ్ళా మూడున్నరదశాబ్దాల తరవాత మరొకసారి చదవడం. పుస్తకం పూర్తి చెయ్యగానే నాకు గొప్ప దు:ఖమూ, గొప్ప ఆశా కూడా ఒక్కసారే కలిగాయి. దు:ఖమెందుకంటే, పద్ధెనిమిదేళ్ళ వయసులో ఈ పుస్తకం నా చేతుల్లోకి వచ్చికూడా ఈ రచన ఏంచెప్తోందో అర్థం చేసుకోలేకపోయానే అని. గొప్ప వ్యాకులత కలిగింది నాకు. ఆ రోజుల్లో ఎవరేనా ఈ పుస్తకం గురించి నాకు అర్థమయ్యేలా చెప్తే ఒక జీవితకాలాన్ని నేనింతగా వృథా చేసుకుని ఉండేవాణ్ణి కాదుకదా, ఇంత చీకట్లో ఇన్నేళ్ళుగా తచ్చాడుతూండేవాణ్ణి కాదు కదా అనిపించింది. అయితే వెంటనే గొప్ప ఆశ కూడా కలిగింది. ఇంకా నా ఒంట్లో జవసత్త్వాలు ఉడిగిపోకముందే, జీవితం సార్థకంగా జీవించాలన్న ఉత్సాహం అడుగంటకముందే ఈ పుస్తకం మరొకసారి చదవగలిగాను కదా, దీన్నుంచి పొందిన స్ఫూర్తితో ఇప్పుడేనా కనీసం నేనొక దారి వెతుక్కోగలను కదా అనిపించింది.

నా ప్రస్తుత జీవితం పట్ల, నా ఉద్యోగం పట్ల, నా సామాజిక పరిసరాలపట్ల, జీవితంలో అధికభాగం నిరర్థకంగా గడపవలసిరావడం పట్లా నాకు చాలా ఏళ్ళుగానే తీవ్ర అసహనం కలుగుతున్నప్పటికీ, అది పూర్తిగా precipitate అయ్యింది నాలుగేళ్ళకిందట. 2010లో నేను మొదటిసారి సబర్మతీ ఆశ్రమానికి వెళ్ళాను. గాంధీజీ రచనల సంకలనాలు నవజీవన్ వారు వేసినవి కొన్ని తెచ్చుకున్నాను. అందులో ‘గ్రామ స్వరాజ్’ అనే సంకలనం నన్ను నిలవనివ్వలేదు. విద్యావంతుడూ, ఆరోగ్యవంతుడూ అయిన యువకుడు ఉండవలసింది గ్రామాల్లో తప్ప నగరంలో కాదనిపించింది. తక్షణమే ఉద్యోగం వదిలిపెట్టి ఏదేనా గిరిజనప్రాంతానికి పోయి గిరిజనుల విద్యకోసమో, ఆరోగ్యంకోసమో కష్టపడదామనిపించింది. రెండుమూడునెలలు సెలవుపెట్టాను. అదిలాబాదునుంచి నెల్లూరుదాకా తిరిగాను. కాని మరికొన్ని కారణాలవల్ల నా నిర్ణయం మరొక అయిదేళ్ళు వాయిదా వెయ్యాలనుకున్నాను.

కాని గాంధీజీ ఆత్మకథ చదివినతరువాత నాకు 2015 దాకా కూడా ఆగడం కష్టమనిపిస్తోంది. కాని ఇప్పుడు నా ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఇప్పుడు నాకు నా కార్యక్షేత్రం బయట ఎక్కడో ఉందనిపించడం లేదు. నేనున్నచోటనే నా శక్తిసామర్థ్యాలను నేననుకున్న రీతిలో వినియోగించాలని ఉంది. నాకొక పూర్తికాలపు రచయితను కావాలనిఉంది. విస్తృతంగా చదువుకోవాలని ఉంది. నాలో చాలాకాలంగా రూపుదిద్దుకుంటున్న ఎన్నో నవలలు, నాటకాలు, తాత్త్వికగ్రంథాలు వీలయినంత త్వరగా రాయాలనిఉంది. అయితే ఇటువంటి కార్యసాధనకు పూనుకునే వ్యక్తి ముందు సత్యసాధన చెయ్యాలన్నదే గాంధీజీ ఆత్మకథ సారాంశం.

ఇప్పుడు మీడియా వల్ల, ముఖ్యంగా సినిమాలవల్ల గాంధీగిరిగా వాడుకలోకి వచ్చిన ఒక విచిత్రమైన భావజాలం గాంధీని ఒక చెంపమీద కొడితే రెండవచెంప చూపేవాడిగానూ, తనని అవమానించినవాళ్ళనీ, బాధిస్తున్నవాళ్ళనీ, ప్రజలకు అన్యాయం చేస్తున్నవాళ్ళనీ గులాబీపూలతో వేడుకునేవాడిగానూ చూపిస్తున్నది. ఈ నాటి యువతీయువకులకి గాంధీజీ సత్యశోధన చదివే తీరిక ఉండదు కాబట్టి, ఆ పుస్తకం చదవాలని కూడా వాళ్ళకెవరూ చెప్పరు కాబట్టి, (ఒక వేళ వాళ్ళు చదివినా, ఆ వయసులో నాకు లాగే వాళ్ళకి కూడా దాని సందేశమేమిటో పూర్తిగా బోధపడదు కాబట్టి) గాంధీమార్గమంటే గులాబీలమార్గమనుకుంటారు.

కాని గాంధీ ఆత్మకథ చదివినవాళ్ళకి అది ముళ్ళదారి అనీ, గాంధీజీ చేసిన పోరాటం ప్రధానంగా తనతోనేననీ, తన శరీరం తోనూ తన మనసుతోనూ అని తెలుస్తుంది. My Experiments With Truth ఒక రాజకీయ ఉద్యమకారుడి రచనకాదు, ఒక ఆధ్యాత్మిక సాధకుడి ఆత్మకథ అని ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. కాని ఇప్పుడు నాకు కొత్తగా స్ఫురించిందేమిటంటే ఆ ఆధ్యాత్మిక సాధకుడు ఒక సాధారణ మానవుడనీ, కాని ఆ మానవుడు అనుక్షణం తన మానవదౌర్బల్యాలతో పోరాడినందువల్లనే అటువంటి ఆత్మౌన్నత్యాన్ని సాధించుకోగలిగాడనీ. కాబట్టే అది నీకు నాకూ కూడా సాధ్యమనిపిస్తున్నది.

26-8-2014

Leave a Reply

%d bloggers like this: