14 సాయంకాలం బుచ్చిబాబు గారి శతజయంతి వేడుక చాల ఘనంగా జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం సమావేశమందిరంలో జరిగిన సభకు కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు ఊహించినంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దాదాపు పదిమందికి పైగా వక్తలు. బుచ్చిబాబుగారి ముఖ్యమైన రచనలన్నిటిపైనా ఒక గోష్ఠిలాగా ప్రసంగాలు సాగాయి. ఆ గోష్టిలో పాల్గొనే అవకాశం నాక్కూడా కలిగింది గానీ, చివరి వక్తను కావడంతో రెండుమూడు నిమిషాల కన్నా మాట్లాడటానికి సమయం దొరకలేదు.
కాని ఆ వేడుకలో పాల్గోడమే గొప్ప అదృష్టమనిపించింది. అందుకు శివరాజు సుబ్బలక్ష్మిగారికి ఋణపడి ఉంటాను. ఆ తల్లికి నా పట్ల ఎందుకు వాత్సల్యం కలిగిందో గాని, ఇంతకు ముందు ఒకసారి బుచ్చిబాబు రాసిన ‘షేక్స్పియర్ సాహితీ పరామర్శ’ మీద నాతో మాట్లాడించేరు. బుచ్చిబాబుగారి నీటిరంగుల చిత్రాల ఆల్బమ్ నాతో ఆవిష్కరింపచేసారు. ఈ సమావేశంలో కూడా నేను కూడా పాల్గోవాలనీ, ఏదైనా ఒక పుస్తకం మీద మాట్లాడాలనీ అన్నారు. అందుకని బుచ్చిబాబు ‘నా అంతరంగ కథనం’ మీద మాట్లాడాను.
ఇరవయ్యవ శతాబ్ది తెలుగు సాహిత్యంలో బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు, 1916-1967)సుమారు ఇరవయ్యేళ్ళ రచనావ్యాసంగంతో కలకాలం నిలిచిపోయే ప్రభావాన్ని వదిలిపెట్టివెళ్ళాడు. ముఖ్యంగా 80 ల్లో తలెత్తిన మా తరాన్ని ఆయన రచనలు చాలా గాఢంగా ప్రభావితం చేసాయి. ఒక్క ‘చివరికి మిగిలేది’ మాత్రమే కాదు, ఆయన కథలు, నాటకాలు, వ్యాసాలు, ఆయన రాసింది ప్రతి ఒక్కటీ కూడా.
ఆ ప్రభావం చాలా లోతైనదీ, అట్లాంటిది మనమీద ఉందని మనం ఊహించలేనిదీ కూడా. ఉదాహరణకి, నేను తొలిరోజుల్లో (1983) రాసిన ఒక కవితలో –
ఎవడన్నాడోగాని
అవును, మనిషి దారితప్పిన మృగమే
లక్ష్యానికి మార్గమే ఆటంకమా?
రహస్యం చెప్తున్నాను
ఆటంకాన్వేషణే మన అసలైన లక్ష్యం
అని రాసిన వాక్యాల్ని ఎత్తి చూపుతూ సుదర్శనంగారు ‘చివరకు మిగిలేది’ ని ఉదాహరించారు. అందులో దయానిధి పెళ్ళికాగానే ఆ పెళ్ళి పట్ల ఇష్టంలేదు కాబట్టి,భార్యను ఎట్లా సమీపించాలో తెలియక, ఆ సాయంకాలమే సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్ళిపోయిన సంఘటనను ప్రస్తావిస్తూ ఆటంకాన్వేషణే ఆధునిక యుగ లక్షణంగా వివరించినప్పుడు మేమంతా ఆశ్చర్యపోయాం.
తెలుగు సాహిత్యంలో బుచ్చిబాబు విశిష్టత ఇక్కడే ఉంది. ఆయనకు ముందు రచయితలు, కవులు జీవితాన్ని నలుపు-తెలుపు రంగుల్లో మాత్రమే చిత్రిస్తూ వచ్చారు. భావకవులూ, అభ్యుదయ కవులూ కూడా జీవితాన్ని రెండు విస్పష్ట శిబిరాలుగా చూడటానికీ, చూపడానికీ ప్రయత్నించేరు. కాని ప్రపంచం మనమనుకున్నంత సరళంగా లేదనీ, జీవితవాస్తవాన్ని చిత్రించడమేమంత సులభంకాదనీ తెలుగులో మనకు చెప్తూ వచ్చిన వాళ్ళు గురజాడ, శ్రీశ్రీ, బైరాగి మాత్రమే. ఆ కర్తవ్యాన్ని వచనరచయితల్లో సమర్థవంతంగా చేపట్టింది పాలగుమ్మి పద్మరాజూ, బుచ్చిబాబూను. అందులో బుచ్చిబాబు మరింత ఉత్సాహంతోనూ, మనకు మరింత దగ్గరగానూ మనతో చాలా విషయాలు పంచుకోవడానికి ఉత్సాహపడ్డాడు.
మనం పాశ్చాత్య సాహిత్యం, తత్త్వచింతన ప్రభావంతో పెరిగాం. కాని యూరోప్ లో దాదాపు మూడువందల ఏళ్ళకు పైగా పట్టిన పరిణామం తెలుగులో 1850-1950 మధ్యలో వందేళ్ళ కాలంలోనే truncate కావలసి వచ్చినందువల్ల, మనం చాలా సంక్షోభంలోనే మనల్నీ,మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ కూడా అర్థం చేసుకోవలసి వచ్చింది. ప్రొ. రఘురామరాజు తరచూ అనేట్టుగా,ఆ అవగాహనా క్రమంలో చాలా గాప్స్ వున్నాయి. ఆ ఖాళీలు మనం పూరించుకోవడానికి బుచ్చిబాబు చాలా సహకరించాడు. ఎందుకంటే, ఆయన కూడా అట్లాంటి నలుగులాటనే అనుభవించాడు కాబట్టి.
ఉదాహరణకి, ఆధునిక(modern) ఆధునికత (modernism) అనే రెండు పదాలు తీసుకోండి. మనం చాలాకాలం పాటు ఈ రెండు పదాలూ సమానార్థకాలే అనుకున్నాం. కాని రెండింటి మధ్యా చాలా తేడా ఉంది. ఆధునిక అంటే యూరోప్ లో రినైజాన్స్ తో మొదలై, age of enlightenment లో ఉచ్చ స్థితికి చేరుకున్న ఒక జీవితదృక్పథం. అది మానవుడే అన్నిటికీ కొలబద్ద అని నమ్ముతూ, ఆలోచనమీదా, హేతుబద్ధతమీదా ఆధారపడ్డ లౌకిక జీవితాదర్శాలని సాధించుకునే ఒక జీవితాభిలాష. దాన్నుంచే సైన్సూ,ఆధునిక విద్య, పారిశ్రామికీకరణ, అధికవస్తూత్పత్తీ, ప్రజాస్వామ్యమూ వికసించేయి.
కాని ఆధునికతావాదం వేరే. అది పందొమ్మిదో శతాబ్దిలో కిర్క్ గార్డ్, డాస్టవిస్కీ వంటి రచయితల్లో తలెత్తి, ఇరవయ్యవశతాబ్ది ప్రారంభంలో నీషే, హిడెగ్గర్ వంటి తత్త్వవేత్తల రచనల్లోనూ, ఇలియట్, పౌండ్ వంటి కవుల్లోనూ, జాయిస్, కాఫ్కా వంటి రచయితల్లోనూ, పికాసో, మాటిస్సే వంటి చిత్రకారుల్లోనూ ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ధోరణి. అది ప్రధానంగా critique of the modern. ఆధునిక జీవితాదర్శాలు కూడా సాంప్రదాయిక జీవితాదర్శాల కన్నా ఏమంత ఘనమైనవీ, విశ్వసించదగ్గవీ కావనే ఒక మెలకువ.
ఈ మెలకువ వెనక బ్రిటిష్ అనలిటికల్ తత్త్వవేత్తలూ, ఫ్రాయిడ్, యూంగ్,ఆడ్లర్ వంటి మనస్తత్వ శాస్త్రవేత్తలతో పాటు ఐన్ స్టీన్ కూడా ఉన్నాడు. ఇంగ్లీషు రొమాంటిక్ కవుల్నీ, మార్క్స్, ఎంగెల్స్ లను మాత్రమే చదువుకున్న తెలుగుసాహిత్యానికి ఈ ప్రభావాల గురించి శ్రీశ్రీ, బైరాగి, పద్మరాజు, బుచ్చిబాబులు చెప్పకపోయిఉంటే, ఆ ఖాళీలట్లానే ఉండిపోయిఉండేవి, మనం స్పష్టతకోసం మరొక అర్థశతాబ్దం పాటు వేచి ఉండవలసి వచ్చేది.
తన మీద పడ్డ ఈ ప్రభావాల్నీ, తను తానుగా ఎట్లా రూపొందేడో ఆ వైనాన్నీ అర్థం చేసుకోవడానికి బుచ్చిబాబు రాసుకున్న రచన ‘నా అంతరంగ కథనం’. చలంగారి గురించి రాసిన ఒక వ్యాసంలో (సాహిత్యవ్యాసాలు, 2016, పే.69) ఆయన ప్రతి రచయితకీ మూడు బాధ్యతలుంటాయని చెప్తాడు. ఒకటి, తన సమకాలికుల పట్ల. అందుకోసమే,ఉపన్యాసాలివ్వడం, వ్యాసాలు రాయడమంటాడు. రెండవది, భవిష్యత్తు పట్ల బాధ్యత. సృజనాత్మక సాహిత్యం, కథలూ, కవిత్వం రాసేది భవిష్యతరాలకోసమంటాడు. ఇక మూడవది, తన పట్ల తనకుండే బాధ్యత. దానికోసమే ఆత్మకథలూ, అంతరంగకథనాలూ రాసుకోవడమంటాడు. చలంగారి మూజింగ్స్ ని ఆయన అట్లాంటి అంతరంగకథనంగా భావించేడు. తాను కూడా అట్లాంటి బాధ్యతతోనే తనని తాను నిశితంగా శోధించుకుంటూ ‘నా అంతరంగ కథనం’ రాసుకున్నాడు. తెలుగులో అట్లాంటి రచన మరొకటి లేదు. ఒక రకంగా దాన్ని ఒక కేస్ స్టడీగా, ఒక మనోవైజ్ఞానిక రచనగా కూడా చెప్పవచ్చు.
ఇంతా చెప్పుకున్నాక, మరొక ప్రశ్న కూడా ఉండిపోతుంది. ముఫ్ఫై ఏళ్ళ కిందట వినబడ్డ ప్రశ్న. పాపులర్ రచయితలకీ, బుచ్చిబాబుకీ ఉన్న తేడా ఏమిటని? పాపులర్ రచయితల రచనలు చదివిస్తాయి, బుచ్చిబాబు కథలు అస్పష్టంగా ఉంటాయనేది. కాని ఇది అపోహ. పాపులర్ రచయితల రచనలు నాకెప్పటికీ రీడబుల్ గా అనిపించలేదు. ఆ రచయితల్లో నాలాంటివాడికి దొరకనిదీ, బుచ్చిబాబులాంటి రచయితలదగ్గర మాత్రమే దొరికేదీ, ఒక దృక్పథం. పాపులర్ రచయితలు జీవితసందర్భాన్ని simplify చెయ్యాలని ప్రయత్నిస్తారు. వాళ్ళు సమస్యల్ని చూసేతీరూ, వాటికి పరిష్కారాలు వెతికే తీరూ formulaic గా ఉంటుంది. కాని, బుచ్చిబాబు లాంటి రచయితలు తాము చూస్తున్న వైరుధ్యాల్ని ముందు తమకై తాము సమన్వయించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వారి నిజాయితీ వల్ల వారి అన్వేషణ మనకి కూడా ఎంతో కోంత దారిచూపించేదిగా ఉంటుంది.
అందుకనే బాపిరాజు గారి గురించి రాసిన వ్యాసంలో (సాహిత్యవ్యాసాలు, పే.76) ‘శిక్షణకు గురైన ఉద్రేకం ఒక దర్శనానికి (vision) ఆహుతి అయితే తప్ప గొప్ప చిత్రం రాదు’ అని రాస్తాడు. ఈ మాట సాహిత్య సృజనకీ, బుచ్చిబాబు సాహిత్యానికీ కూడా వర్తించే మాటనే.
17-6-2016