భూతాలకాన

Reading Time: < 1 minute

26

షూబర్ట్ సంగీత కచేరీలో గాయకబృందం ఆలపించిన గీతాల్లో గొథే రాసిన The Elf King (1781) కూడా ఒకటి. ఒక ప్రాచీన డేనిష్ జానపదగీతాన్ని అనుసరించి గొథే ఈ గీతం రాసాడు. ఇందులో పిల్లవాడికి కనబడుతున్న భూతం, వినబడుతున్న గుసగుస, ఊరిస్తున్న మాటలు, పిల్లవాడి భయాలు, తండ్రి వాటిని కొట్టిపారేయడం, చివరికి కథ ముగిసిన తీరు, ఎంతో ధ్వనిస్ఫోరకంగా ఉన్నాయి. మాటల్లో పెట్టలేని ఆ అనిర్వచనీయ విషాదస్ఫురణని తెలుగులో మీ కందించాలనిపించింది.

భూతాలకాన

గాఢనిశీథినడవిదారిన
దౌడు తీసే రౌతులెవ్వరు?
తండ్రి ఒక్కడు, తనదు సందిట
తనయునిడుకొని వనము సాగెనుగా.

చెలగిరేగిన గాలివానకు
ఎదురుసాగుచు, బెదురులేకను
చిన్నబిడ్డను వెన్నునిమురుచు
వెచ్చనౌఓదార్పునిచ్చెనుగా.

‘చిట్టితండ్రీ, ముట్టిచూడగ
వణకుచున్నావేమికతమున?’

‘నాయనా! ఓ నాన్న! చీకటి
కానలోపల భూతమున్నదిగా!
చూడలేదా వాడివేషము
తలకు మకుటము, ఎలుగుగొంతుక !’

‘చిట్టితండ్రీ, చిమ్మ చీకటి
మంచురాత్రుల మసకదారులెగా!’

“పిల్లవాడా, ఉల్లమలరగ
ఆడుకొందము,పాడుకొందము.
కోనలోపల పూలపందిరి
రంగుబంగరు హంగులున్నవిగా!”

‘నాయనా, ఓ నాన్న! నాతో
భూతమాడెను వింతగుసగుస.’

‘కాదురా, అది, కన్నతండ్రీ
ఎండుటాకుల పండుచప్పుడురా!’

“చంటివాడా, వెంటరావా
నాకొమరితలునాట్యమాడే
తావులందున తనివితీరగ
ఊసులాడుచు ఊయలూగుమురా”

‘నాయనా, ఓ నాన్న! చూడటు
సైగలాడుతు సొగసుకత్తెలు.’

‘ఓసి నాయన,చూసినానవి,
బండబారిన మొండిమాకులురా!’

“బుజ్జిగాడా, మెచ్చినానుర
నిన్నుచేజిక్కించుకుందును.”

‘నాయనా! ఓ నాన్న! భూతము
ఒడిసిపట్టెను, వదిలిపెట్టకుమా!’

ఝల్లుమనియెను వళ్ళు తండ్రికి,
పరుగు పెంచెను, పంచ చేరెను,
చేతులందున చూతుమందున
చిన్నబిడ్డడు కన్నుమూసెనుగా!

11-9-2016

Leave a Reply

%d bloggers like this: