ప్రేమ గోష్ఠి

24

సైమన్ అండ్ షూస్టర్ పేపర్ బాక్స్ వాళ్ళ Dialogues of Plato (2010) చదివాను. ప్లేటో పేరు మీద లభ్యమవుతున్న సుమారు 41 సంభాషణల్లో, 24 దాకా ప్లేటో రచించినట్టు నిశ్చయంగా చెప్పవచ్చు. అందులో ఆయన మొదటిదశలో రాసిన 7 సంభాషణల్లో ‘యుథిప్రొ’,’అపాలజీ, ‘క్రీటో’ ఈ పుస్తకంలో ఉన్నాయి. మధ్య దశలో రాసిన 11 సంభాషణల్లో ‘ఫేడో’, ‘సింపోజియం’, ‘మెనో’ ఉన్నాయి. ఇవి కాక, చివరిదశలో మరొక ఆరు సంభాషణలు, ఉత్తరాలు కూడా రాసాడు.

ఈ పుస్తకంలో ఉన్న ఆరు సంభాషణలూ కూడా సుప్రసిద్ధ ప్లేటో అనువాదకుడు బెంజమిన్ జోవెట్ చేసిన అనువాదాలే. కానీ, ఈ పుస్తకానికున్న విశేషం, ప్లేటో జీవితం, సంభాషణల చారిత్రిక సందర్భం గురించిన పరిచయంతో పాటు, సవివరమైన నోట్సు, ప్లేటో మీద వచ్చిన ముఖ్యవ్యాఖ్యానాల పరిచయం కూడా ఉన్నాయి. ప్లేటో తత్త్వచింతన గురించీ, సోక్రటీస్ గురించీ మొదటిసారిగా చదవబోయేవాళ్ళకి ఈ చిన్న పుస్తకం చాలా చక్కని కరదీపిక.

ప్లేటోని ఇంతకు ముందు చదివినవాళ్ళకి ఈ పుస్తకం మళ్ళా మరొక గాఢానుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే, ఇందులో అయిదు సంభాషణలు సోక్రటీస్ విచారణ, మరణశిక్ష చుట్టూ నడిచేవే.

తనమీద ఏథెన్సు పౌరుడొకడు చేసిన ఆరోపణలకు తానెట్లా జవాబివ్వాలా అని సోక్రటీస్ ఆలోచిస్తూండగా, విచారణా కార్యాలయం ఎదట యుథిప్రొ అనే తన మిత్రుడు కనిపిస్తాడు. అతడు తన తండ్రి మీద నేరారోపణ చెయ్యడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. తన తండ్రి ఒక బానిస మరణానికి కారణమయ్యాడనీ, అటువంటి అన్యాయం ఎవరు చేసినా తాను సహించలేననీ, తండ్రి అయినా సరే హంతకుడైనప్పుడు ఎదిరించి తీరవలసిందేననీ యుథిప్రో చెప్పుకొస్తాడు. అప్పుడాతడికీ, సోక్రటీస్ కీ మధ్య నడిచిన సంభాషణ యుథిప్రొ. ఒక పని పవిత్రమైందని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? అది దేవతలకి ఇష్టమైంది కాబట్టి పవిత్రమయిందా లేక ఆ పని పవిత్రమైంది కాబట్టి దేవతలకి ఇష్టమయిందా? సోక్రటీస్ తరహా గతితార్కిక విచారణకి ఈ సంభాషణ చక్కని నమూనా. ఈ సంభాషణతో ఈ పుస్తకం మొదలుపెట్టడం వల్ల పాఠకుడికి సోక్రటీస్ ఆలోచనాక్రమం ఎలా ఉంటుందో ఒక పరిచయం లభిస్తుంది. కఠినమైన ఆ తర్కం ముందు నిలబడలేక యుథిప్రో మెల్లగా జారుకుంటాడు.

రెండవ సంభాషణ, ‘అపాలజి’ ఏథెన్సు పౌరసభ ముందు తనన్ని తాను సమర్థించుకుంటూ సోక్రటీస్ చేసిన ప్రసంగం. దీని గురించి గాంధీజీ రాసిన మాటలు ఇంతకు ముందే పరిచయం చేసాను. చాలా ఏళ్ళ కిందట, ఈ సంభాషణ తెలుగు అనువాదం ‘సమర్థన’ పేరిట చదివాను. దక్షిణభారత పుస్తకసభ వాళ్ళు వేసారు. అనువాదకుడు ఎవరో గుర్తులేదు. బహుశా బి.వి.సింగరాచార్య అయి ఉండవచ్చు.

మూడవ సంభాషణ క్రీటో. క్రీటో సోక్రటీస్ శిష్యుడు, సంపన్నుడూ, బాగా పలుకుబడి ఉన్నవాడూనూ. అతడు సోక్రటీస్ చెరసాలలో ఉండగా, మర్నాడే శిక్ష అమలుచెయ్యబోతున్నారనగా, సోక్రటీస్ తో జైలునుంచి తప్పించుకుని విదేశాలకు వెళ్ళిపొమ్మనీ, అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ తాను చూసుకుంటాననీ చెప్తాడు. సోక్రటీస్ ఆ ప్రతిపాదనని తిరస్కరిస్తూ, తనకి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం కన్నా, మరణించి తాను నమ్మిన సత్యాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో వివరిస్తాడు. ఈ రచన కూడా ‘సమర్థన’ తో పాటే తెలుగులోకి వచ్చినట్టు గుర్తు.

ఇవి మూడూ ప్లేటో తొలిరచనలు. ఇందులో కనిపించే సోక్రటీస్ చారిత్రిక సోక్రటీస్ కి చాలా దగ్గరగా కనిపిస్తాడనీ, అతడు తనకేమీ తెలియదనే సత్యం తెలుసుకున్నవాడు మాత్రమేననీ, తన సమకాలీన ఏథెన్సు పౌరులకీ,వాళ్ళ దగ్గర ముక్కుపిండి డబ్బు వసూలు చేసి వాళ్ళకి ‘జ్ఞానం’ బోధించే సోఫిస్టులకీ అది కూడా తెలియదనీ ఆ రచనల సారాంశం.

తర్వాతి మూడు సంభాషణలూ ప్లేటో రెండవ దశలో రాసినవి. ఇక్కడి వచ్చేటప్పటికి, ప్లేటో తన అభిప్రాయాలు చెప్పడానికి సోక్రటీస్ ను ఒక పాత్రగా వాడుకున్నాడనీ, అతడి పేరు మీద తన తాత్త్విక చింతననే ప్రకటించాడనీ అంటారు.

మెనో సోక్రటీస్ మరొక శిష్యుడు. శీలం లేదా నడవడిక లేదా ధర్మం అనేదాన్ని మనం బోధించగలమా లేదా అన్న దాని మీద సోక్రటీస్ కీ మెనో కీ మధ్య జరిగిన చర్చ మెనో లో ఇతివృత్తం. ఇక్కడ కూడా సోక్రటీస్ తనకి ‘శీలం’,’ధర్మం’ అంటే ఏమిటో తెలియవనీ,ఇక వాటిని బోధించగలమో లేదో తనకెట్లా తెలుస్తుందనీ అంటాడు. ఈ రచన బహుశా ప్లేటో రెండవదశలో మొదటి రచన అయి ఉండాలి. ఎందుకంటే, ఇదే దశలో రాసిన ‘ప్రొటాగరస్’ అనే సంభాషణలో సోక్రటీస్ శీలాన్నీ, ధర్మాన్నీ బోధించగలమనే అంటాడు. ఈ పుస్తకంలో ప్రొటాగరస్ లేదు గానీ, విద్య గురించి, సోక్రటీస్, ప్లేటో ల అభిప్రాయాలు తెలుసుకోదలచినవాళ్ళు తప్పకుండా చదివి తీరవలసిన సంభాషణలు ‘మెనో’, ‘ప్రొటాగరస్’ లు.

సోక్రటీస్ కి మరణశిక్ష అమలయ్యే రోజున ఆయన చూడటానికి వచ్చిన శిష్యులతో సూర్యాస్తమయం దాకా కూడా తత్త్వచర్చ చేసిన రచన ‘ఫేడో’. ఫేడో సోక్రటీస్ శిష్యుడు. అతడు సోక్రటీస్ చివరి రోజున చెరసాలలో ఎట్లా గడిపాడో తమతో ఏం మాట్లాడేడో ,ఎచ్చేక్రేట్స్ అనే మిత్రుడికి వివరించడంతో ఈ సంభాషణ మొదలవుతుంది. అది చాలా సంక్లిష్టమైన సంభాషణ అయినప్పటికీ, అనేక అంశాల దృష్ట్యా, ఎంతో విలువైన సంభాషణ. అందులో జరిగిన చర్చ ప్రధానంగా ఆత్మ గురించీ, ఆత్మ అమరత్వం గురించీను.

మనిషి పుట్టుకకి ముందు ఆత్మ ఉంటుందని సోక్రటీస్ చెప్పిన మాటని అతడి శిష్యులు వెంటనే అంగీకరిస్తారు.కాని మరణానంతరం కూడా ఆత్మ కొనసాగుతుందనే మాటని మాత్రం వాళ్ళంత తోందరగా ఒప్పుకోలేరు. మరణించేది శరీరం మాత్రమే తప్ప, ఆత్మ కాదనే తన నమ్మకాన్ని సోక్రటీస్ వాళ్ళకి హేతుబద్ధంగా వివరించడమే ‘ఫేడో ‘ సారాంశం. ‘ఆ సత్యమేమిటో పొద్దున తెలిస్తే, ఆ సాయంకాలానికల్లా తృప్తిగా మరణించవచ్చు’ అంటాడు కన్ ఫ్యూషియస్ తన శిష్యులతో ఒకసారి. సోక్రటీస్ ఆ మాటకి సజీవ ఉదాహరణగా ఫేడో లో కనిపిస్తాడు. ఆత్మ నిత్యత్వం మీద అంత నమ్మకం లేకపోతే, అతడంతా నిబ్బరంగా తన స్వహస్తాల్తో మృత్యుపానం చేసి ఉండడని ఆ సంభాషణ పూర్తయ్యేటప్పటికి మనం గ్రహిస్తాం.

ఇక ‘సింపోజియం’ ప్లేటో రచనలన్నిటిలోనూ అత్యుత్తమ రచన. కావ్యత్వాన్ని అందుకున్న రచన. విద్యావంతుడైన ప్రతి ఒక్కడూ చదివితీరవలసిన రచన. అగాధాన్ అనే ఒక శిష్యుడికి నాటక రచనలో బహుమతి వచ్చిన సందర్భంగా మిత్రులంతా అతణ్ణి అభినందించడానికి కలుసుకుంటారు. ఆ సమావేశానికి సోక్రటీస్ కూడా వస్తాడు. ఆ సందర్భంగా ఏదైనా విషయం మీద అందరూ మాట్లాడితే బాగుంటుందని ఎవరో ప్రతిపాదిస్తారు. అప్పుడంతా ప్రేమ గురించి ప్రసంగిస్తారు. ఒకరి వెనక ఒకరు అయిదుగురు వక్తలు ప్రేమ గురించి అద్భుతంగా ప్రసంగించాక సోక్రటీస్ వంతు వస్తుంది. ఆయన ఎప్పటిలానే తనకి ప్రేమ గురించి ఏమీ తెలియదని మొదలుపెడతాడుగానీ, తన భాగ్యవశత్తూ డయోటిమా అనే ఒక స్త్రీ ద్వారా ప్రేమజ్ఞానం లభించిందని చెప్తాడు. ఆమె చెప్పినమాటలు వాళ్ళకి చెప్తున్నట్టుగా సోక్రటీస్, సోక్రటీస్ ద్వారా ప్లేటో, ప్రేమ గురించి ఒక అజరామర ప్రసంగం చేస్తారు. ప్రేమ మొదట దేహాల్ని ఆలంబన చేసుకునే ప్రభవిస్తుందనీ, అయితే ఆ క్రమంలో చివరికి మనం దేహాతీతమైన, కాలాతీతమైన ఒక మహాసౌందర్యసాక్షాత్కారానికి చేరుకుంటామనీ, ఆ సౌందర్య దర్శనం లభించడమే మానవజన్మకి సార్థక్యమనీ ఆ స్త్రీ తనకి బోధించిందని సోక్రటీస్ వారికి చెప్తాడు. సోక్రటీస్ ప్రసంగం ముగించగానే ఆల్సిబియాడిస్ అనే ఒక సుందరయువకుడు, ప్రజాభిమానాన్ని చూరగొన్న ఏథెన్సు పౌరుడు, సోక్రటీస్ శిష్యుడు, తాను ప్రేమ గురించి కాక, సోక్రటీస్ గురించే మాట్లాడతానంటూ, సోక్రటీస్ గుణగానం చేస్తాడు. అతడు ఆవిష్కరించిన సోక్రటీస్ అంతకు ముందు సోక్రటీస్ ఎటువంటి ప్రేమదర్శనం గురించి మాట్లాడేడో,ఆ దర్శనానికి నిలువెత్తు నిరూపణగా కనిపిస్తాడు.

కొన్నేళ్ళ కిందట, ఆచార్య రఘురామరాజు నన్ను సింపోజియాన్ని తెలుగు చెయ్యమని అడిగారు. అక్కడితో ఆగకుండా , సింపోజియాన్నీ, ఛాందోగ్యోపనిషత్తునీ అనువదించి, రెండింటినీ కలిపి పుస్తకంగా వేస్తే బాగుంటుందనీ, రెండింటినీ పోలుస్తూ ఒక పరిచయం కూడా రాయాలనీ అడిగారు. ఆ ఉత్సాహంలో ‘పానగోష్ఠి’ పేరిట సింపోజియాన్ని తెలుగు చెయ్యాలనుకున్నానుగానీ, నేను చెయ్యలేకపోయిన ప్రాజెక్టుల్లో అది కూడా ఒకటిగా మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళా ఉత్సాహం కలుగుతోంది. కాని ఈ సారి ‘పానగోష్ఠి’ అని కాదు, ‘ప్రేమ గోష్ఠి’ అని చెయ్యాలనుంది. ఒక్క ఛాందోగ్యమే కాదు, చాలా అంశాల్లో, సింపోజియం మనకి బృహదారణ్యకాన్నీ, తైత్తిరీయాన్ని కూడా స్ఫురింపచేస్తూంటుంది. ఫేడో లో సోక్రటీస్ తత్త్వశాస్త్రమంటే మృత్యువుని అధ్యయనం చేసే శాస్త్రమంటాడు. కానీ సింపోజియానికి వచ్చేటప్పటికి తత్త్వశాస్త్రం అమరత్వ చర్చగా మారిపోయింది.

ఉపనిషత్తులు అభయం, అమృతం, ఆనందాల గురించి మాట్లాడేయి. ఈ ఆరు సంభాషణలు చదివినవాళ్ళకి కూడా అభయం, అమృతం, ఆనందాల గురించిన చర్చలో పాల్గొన్నట్టే అనిపిస్తుందని చెప్పవచ్చు.

17-10-2016

Leave a Reply

%d bloggers like this: