నా పారాయణ గ్రంథాల్లోకి చెస్లావ్ మిలోష్ ‘ఎ బుక్ ఆఫ్ లూమినస్ థింగ్స్’ (1996) చేరి చాలాకాలమే అయింది. మిలోష్ (1911-2004) పోలిష్ కవి, ఇరవయ్యవ శతాబ్దపు ప్రపంచమహాకవుల్లో మొదటి వరసకు చెందినవాడు. రెండు ప్రపంచయుద్ధాలతో పాటు, నాజీ దురాగతాల్నీ, స్టాలిన్ అకృత్యాల్నీ కూడా సమానంగా చూసినవాడు. ఒక మహాశతాబ్దాన్ని దగ్గరగా చూసినవాడుగా ఆయన రాసిన కవిత్వానికి నోబెల్ బహుమతి రావడం ఆశ్చర్యం లేదు.
‘ఎ బుక్ ఆఫ్ లూమినస్ థింగ్స్’ ఆయన కవిత్వం కాదు. ప్రపంచ కవిత్వం నుంచి ఆయన ఏరి కూర్చిన సంకలనం. అయితే ఆ సంకలనం వట్టి సంకలనం కాదు. దాని వెనక ఒక జీవితకాలంపాటు చేసిన అన్వేషణ ఉంది.
ఇంతకీ ఆయన వెతుక్కున్నదేమిటి?పుస్తకానికి పెట్టిన శీర్షికనే చూడండి. అందులో మూడు పదాలున్నాయి. బుక్ అనే పదాన్ని పక్కనపెడితే ‘లూమినస్’ అనీ, ‘థింగ్స్’ అనీ రెండు పదాలున్నాయి. లూమినస్ అంటే కాంతివంతమని మటుకే కాదు, స్వయంప్రకాశకమని కూడా చెప్పుకోవాలి. చీకట్లో స్థిరంగా దేదీప్యమానంగా ప్రకాశించేదని. థింగ్స్ అంటే వస్తువులు లెదా సంగతులు, ఏదైనాగానీ వట్టి భావాలూ, భావనలూ అనే అర్థం కాకుండా స్వతంత్రంగా కొంత అస్తిత్వం కలిగినవని అర్థం చెప్పుకోవచ్చు. లూమినస్ థింగ్స్ అంటే స్వయంప్రకాశకాలైన వస్తువులనో, సంగతులనో, సంఘటనలనో, సన్నివేశాలనో అర్థమన్నమాట.
ఈ మాటల వెనక మిలోష్ తత్త్వశాస్త్రం స్పష్టంగానే ఉంది. పెంగ్విన్ సంస్థ ప్రచురించిన తన ‘న్యూ అండ్ కలెక్టెడ్ పొయెమ్స్’ (2005) కు రాసుకున్న ముందుమాటలో ‘తన అంతరంగాన్ని ఆశ్రయించుకున్న కళకీ, బయట వాస్తవప్రపంచాన్ని ఆశ్రయించుకున్న కళకీ మధ్య ఎంచుకోమంటే’ తాను ‘ఆబ్జెక్టివ్ ఆర్ట్ ‘ నే ఎంచుకుంటానన్నాడు. అయితే ఈ ఆబ్జెక్టివిటీ మామూలుగా మన కవులు మాట్లాడే వస్త్వాశ్రయత కాదు. ఇది ఇస్మాయిల్ గారు మాట్లాడిన ఆనుభవిక ప్రపంచం లేదా ఇంద్రియగ్రాహ్యప్రపంచమన్నమాట.
ఈ సందర్భంగా, మిలోష్ ని తీవ్రంగా ప్రభావితం చేసిన వాల్ట్ విట్మన్ వాక్యాలు కూడా మనకు గుర్తురాకుండా ఉండవు:
..I will make the poems of materials, for I think they are to be the most of spiritual poems..’
ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో మిలోష్ ఈ అంశాల్ని వివరించడానికి చిత్రకారుల్లో షెజానె నీ, రచయితల్లో గొథేనీ, తత్త్వవేత్తల్లో షోపెన్ హోవర్ నీ ఉదాహరించాడు.
ఇంప్రెషనిస్టు చిత్రకారులు వెలుగుని చిత్రించడానికే తపించినప్పటికీ ఆ వెలుతురు నిజానికి వస్తువుల్లో ఉందని షెజానె భావించాడు. ఆయన ఇలా అన్నాడట: ‘ ప్రకృతి పైపైన కనిపించేది కాదు. అది లోపల ఉండేది. పైన కనిపించే రంగులు చూపించేది ఆ లోపలి సత్యాన్నే. అవి ప్రపంచపు మూలాల్ని చూపిస్తాయి’ అని.
గొథే అకర్మాన్ తో మాట్లాడుతూ ఇలా అన్నాడుట: యుగాలు క్షీణదశకు చేరుకుంటున్నప్పుడు అన్ని ధోరణులూ ఆత్మాశ్రయమవుతాయి, అలా కాక ప్రపంచమొక కొత్త శకంలోకి మేల్కొంటున్నప్పుడు అన్ని ధోరణులూ వాస్తవప్రపంచం వైపు మళ్ళుతాయి’ అని.
అత్యంత నిరాశావాద తత్త్వవేత్తగా ప్రసిద్ధి పొందిన షోపెన్ హోవర్ కళ గురించి మాట్లాడినప్పుడు చాలా ఆశావహంగా మాట్లాడేడంటాడు మిలోష్. అన్ని చిత్రకళారీతుల్లోనూ డచ్ స్టిల్ లైఫ్ చిత్రలేఖనాన్ని ఎక్కువ ఇష్టపడ్డ షోపెన్ హోవర్ ఇలా అన్నాడట:’…కోరుకోవడంకన్నా తెలుసుకోవడం మీద ఎక్కువ దృష్టిపెట్టినప్పుడు మాత్రమే ఇటువంటి మన: స్థితి సాధ్యమవుతుంది’ అని.
కళాసృష్టికి పూనుకున్నప్పుడు మనిషి తన గుడ్డి కోరికలనుంచీ, అంధచిత్తవృత్తినుంచీ ఒక్క క్షణం పక్కకు తప్పుకుని తననీ, ప్రపంచాన్నీ కూడా నిర్మమత్వంతో, నిర్లిప్తంగా పరికిస్తాడు. అందుకని మిలోష్ the secret of all art, also of poetry, is, thus, distance అంటాడు. ఆ కించిద్దూరంలో నిలబడి చూసినప్పుడు వస్తువులన్నీ ప్రకాశభరితంగా కనిపిస్తాయి.
ఇస్మాయిల్ గారి మాటల్లో చెప్పాలంటే ‘ నిజమైన కవిత్వంలో ఆత్మ పరభేదాలు లయిస్తాయి. అనుభవించే మనస్సూ, అనుభవింపబడే వస్తువూ వేరువేరు కాదు. రెండూ కలిసి ఒకటే అనుభవం.. ఈ అనుభవం ఆత్మాశ్రయం కాదు, వస్త్వాశ్రయం కాదు. ఏకకాలమందు రెండూనూ.’
అందుకనే కవిత్వానికి ఇంద్రియాలూ కావాలి, ఇంద్రియగ్రాహ్యప్రపంచాన్నీ అంతర్లీనం చేసుకోగల అంతర్ముఖీనతా కావాలి.
కాని, ముఖ్యం ఇంద్రియాలు గ్రహించగల ఒక ప్రపంచం కావాలి. దీన్ని మిలోష్ ఒక్క వాక్యంలో ఇలా అన్నాడు: By necessity poetry is therefore on the side of being and against nothingness.
అలా మానవాస్తిత్వాన్ని ప్రకటించిన కవిత్వాలు ఎక్కడెక్కడ ఉన్నా వాటన్నిటినీ రెండుచేతుల్తో దగ్గరగా తీసుకుని మనకోసం సంకలనం చేసిన పుస్తకం ఇది. చీనా జపాన్ మొదలుకుని అమెరికా దాకా ప్రాచీన, ఆధునిక, సమకాలీన కవుల మనోహరమైన, మానవీయమైన కవితలెన్నో ఇందులో ఉన్నాయి. వాటిల్లోంచి మీ కోసం ఒక కవిత. ప్రసిద్ధ అమెరికన్ కథకుడూ, కవీ రేమాండ్ కార్వర్ రాసిన కవిత :
కిటికీ
రాత్రి పెద్ద గాలిదుమారం రేగి కరెంటు
పోయింది. కిటికీలోంచి
బయటకు చూస్తే ప్రకాశభరితంగా చెట్లు
ముందుకువాలివున్నాయి, పైన మంచు,
గ్రామసీమపొడుగుతా విస్తారమైన ప్రశాంతి
నాకేదో బాగా అర్థమయింది, ఆ క్షణాన
నా జీవితంలో నేనెప్పుడూ తప్పుడు వాగ్దానాలు
చెయ్యలేదని, ఒక్క తప్పుడు పని కూడా
చెయ్యలేదనిపించింది. నా ఆలోచనల్లో
ఎంతో ఉదాత్తత. మర్నాడు బాగా పొద్దెక్కాక
సరే, కరెంటెలానూ రానే వచ్చింది,
మబ్బుచాటునుంచి సూర్యుడు ముందుకుజరిగాడు,
మంచు కరగడం మొదలయ్యింది,
మళ్ళా ప్రతి ఒక్కటీ యథాప్రకారం సర్దుకుంది.
25-6-2013