షేక్ స్పియర్ ‘పెరిక్లిజ్, ప్రిన్స్ ఆఫ్ టైర్’ చదవడం పూర్తి చేసాను. చదవడం కన్నా అధ్యయనం అనడం బాగుంటుందేమో. ‘న్యూ కేంబ్రిడ్జి షేక్ స్పియర్ సిరీస్’ లో డొరెన్ డెల్వెషియో, అంటొని హామండ్ అనే సంకలనకర్తలు పరిష్కరించిన ప్రతి. పండితులు పరిష్కరించే ప్రతులన్నిటికీ ఉన్నట్టే ఇందులో కూడా పాఠాంతరాలు, సవివరమైన నోట్సు, వివరణలు, బిబ్లియోగ్రఫీలతో పాటు ఎంతో ప్రశంసనీయమైన ముందుమాట కూడా ఉంది.
నాటకం చదివాక, పెరిక్లీజ్ కి బి బి సి ఫిల్మీకరణ కూడా చూసాను. ఫిల్మ్ చూస్తూ నాటకం వాక్యం వాక్యం మరోమారు క్షుణ్ణంగా చదువుకున్నాను.
ఎందుకంత శ్రమ అని అడిగితే రెండు జవాబులు:
ఒకటి, ఒక మనిషి నిజమైన విద్యావంతుడు కావాలనుకోవడం లోని సంతోషం ఇట్లాంటి క్లాసిక్స్ చదవడంలో అనుభవానికొస్తుంది. ఉపనిషత్తులు, ప్లేటో, కాళిదాసు, గాథాసప్తశతి, రూమీ, గొథే, బషొ, కిర్క్ గార్డ్, టాల్ స్టాయి, ఎమిలి డికిన్సన్, కాఫ్కా, చినువా అచెబె, బోర్హెస్ ల్ని కూడబలుక్కుని చదువుకోవడంలో ఉన్న ఆనందం వెలకట్టలేనిది. ఒక చోట ఎరిక్ ఫ్రామ్ రాసినట్టుగా ఇట్లాంటి పుస్తకాలతో జీవించిన క్షణాల ముందు జీవితకాలపు వేదన, వైఫల్యాలు, అవమానాలు, నిరాదరణ ఏవీ నిలబడజాలవు.
రెండవది, షేక్ స్పియర్ కి సంబంధించింది. ఆయన రాసిన నాటకాల్ని కామెడీలు, హిస్టరీలు, ట్రాజెడీలు, రొమాన్సులు గా విభజించడం పరిపాటి. ఆయన చరమదశలో రాసిన నాలుగు నాటకాలు ‘పెరిక్లీజ్’, ‘సింబలైన్’, ‘ద వింటర్స్ టేల్’, ‘ద టెంపెస్ట్’ లను రొమాన్సులుగా పేర్కొంటున్నారు. రొమాన్సు అనే మాట ఆ నాటకాల స్వభావాన్ని, సారాంశాన్ని పూర్తిగా పట్టిచ్చే మాట కాదు. కాని మరో మాట ఏదీ దొరక్క ఆ మాట వాడుతూ ఉన్నారు. ఆ నాటకాల్ని హృదయానికి హత్తుకుని చదువుకోవడం ద్వారా వాటి యథార్థ స్వరూపాన్ని బోధపర్చుకోగలనేమో అన్న ఆశ మరొక కారణం.
నా శ్రమ వృథా కాలేదనిపించింది. నాటకం చదివి, ఫిల్మ్ కృతితో పోల్చి మరోమారు చదువుకున్నాక, రొమాన్సుల్లో షేక్ స్పియర్ లోనయిన అనుభవమేమిటో కొంతైనా పసిగట్టగలిగాననుకుంటున్నాను.
కేంబ్రిడ్జి సంపాదకులు చాలా సవివరంగానే ముందుమాట రాసారు. షేక్ స్పియర్ ని చదవడంలో ఉన్న ఆనందమేమిటంటే, ఆయన్ని ఏ కాలానికి తగ్గట్టుగా ఆ కాలానికి సంబంధించిన భావజాలంలో ఇమిడ్చిపెట్టగలం. ఆయన్ని పూర్తిగా వివరించేసాం అని ఒక యుగం అనుకున్నాక, మరో యుగంలో అంతదాకా చూడని కొత్త సత్యాలతో ఆయన మరో మారు దర్శనమిస్తాడు.
పెరిక్లీజ్ లో సముద్రం, తుపాను, మృత్యువు, పునర్జన్మ ప్రధాన ఇతివృత్తాలని ప్రతి ఒక్కరూ అంగీకరించిందే. అయితే కేంబ్రిడ్జి సంపాదకులు మరికొన్ని కొత్త అంశాలు చర్చించారు. మంచి రాజు ఎలా ఉండాలి,సుపరిపాలనకు చిహ్నాలేమిటి, కుటుంబ విషాదం జాతి విషాదంగా ఎందుకు మారుతుంది, ఎలా మారుతుంది లాంటి ప్రశ్నలు కొత్తగా లేవనెత్తారు. క్రైస్తవ, పాగాన్ క్రతువుల్లో ప్రధాన పాత్ర వహించిన పునరుత్థాన భావన పెరిక్లీజ్ నాటకంలో ఎట్లా చిత్రితమయ్యిందీ వివరంగానే చర్చించారు. అన్నిటికన్నా ముఖ్యం, ఈ నాటకంలో షేక్ స్పియర్ సంగీతానికిచ్చిన ప్రాధాన్యత గురించి మరింత విశదీకరించారు. ఈ రూపకాన్ని ఒక ఒపేరా గా పిలిచినా కూడా తప్పులేదన్నారు.
పెరిక్లీజ్ నాటకం చాలా కాలంగా పరిష్కర్తలకొక సవాలుగా ఉంటూ వచ్చింది. మనకు లభ్యమవుతున్న నాటకం షేక్ స్పియర్ ఒక్కడే రాసింది కాదనీ, మొదటి రెండు అంకాలు ఎవరో చిన్నపాటి రచయిత రాసి ఉంటాడని అనుమానించడమే కాకుండా, మొదటి రాతప్రతుల్లో ఉండే దోషాల వల్ల, సంభాషణల క్రమం, సన్నివేశ క్రమం, స్టేజి డైరక్షన్లను పోల్చుకోవడం కూడా కష్టంగా ఉంటూ వచ్చింది. ఆ సవాళ్ళను పరిష్కర్తలు చాలావరకు అధిగమించగలిగారు. మొత్తం నాటకం ఒక్కరే రాసారని నిరూపించడమే కాకుండా, పాఠాంతరాల్ని చక్కదిద్దడంలో కూడా గొప్ప సాహసం చూపించారు.
షేక్ స్పియర్ రొమాన్సుల్లోచిత్రించిందేమిటి, సాధించిందేమిటి అనేది తక్కిన నాటకాలు కూడా పూర్తిగా చదివాక తేల్చుకోవలసిన విషయమే అయినప్పటికీ, ఇప్పటికిప్పుడు కూడా కొన్ని అలోచనలు నాకై నేను స్పష్టపరుచుకోగలిగాను.
కామెడీలు జీవితాన్నీ, ట్రాజెడీలు మృత్యువునీ చిత్రిస్తే, రొమాన్సులు పునర్జన్మగురించీ, పునరుత్థానం గురించీ మాట్లాడుతున్నాయన్న మాటలో సత్యముంది. కామెడీల్లో జీవితసంతోషం చాలా మామూలు విషయంలాగా కనబడగా, రొమాన్సుల్లో అదొక పవిత్రక్రతువులాగా కనిపిస్తుందని పెలికాన్ షేక్ స్పియర్ (1977) సంపాదకుడు ఆల్ఫ్రెడ్ హార్బేజి అన్న మాటలు చాలా విలువైనవి. అయితే ఈ క్రతుస్వభావాన్ని షేక్ స్పియర్ క్రైస్తవ లేదా ఐరోపీయ క్రైస్తవేతర క్రతువుల్లో పట్టుకున్నాడనుకున్నా, అట్లా పట్టుకోవడానికి కారణమేమిటి? అంతవరకూ రాసిన నాటకాల్లో మర్త్యప్రపంచ సంతోషాల్నీ, ఉన్మాదాన్నీ, వ్యగ్రతనీ, వ్యాకులతనీ మాత్రమే చిత్రిస్తూ వచ్చిన నాటక కర్త ఒక కాలాతీత, సనాతన సంతోషాన్ని చిత్రించడానికెందుకు ఉత్సాహపడ్డాడు?
1609-1611 మధ్యకాలంలో రచించినట్టుగా భావించబడే నాలుగు రొమాన్సుల మీదా ప్రాచ్య ప్రపంచ ప్రభావం చాలా విస్పష్టంగా ఉందని నాకనిపిస్తోంది. అప్పటికి బ్రిటిష్ నావికులూ, వర్తకులూ ప్రాచ్యప్రపంచాన్ని చాలావరకూ అన్వేషించగలిగారు. సుదూర దేశాలనుంచీ, తీరాలనుంచీ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలతో పాటు వాళ్ళొక నూతన జీవిత దృక్పథాన్ని కూడా ఇంగ్లాండు కి చేరవేసారు. ఆ నవ్య దృక్కోణంలో షేక్ స్పియర్ తన కాలాన్నీ, తన సామాజిక క్రతువుల్నీ పునర్వివేచించాడనుకోవాలి. ప్రకృతి (బయటి ప్రకృతీ, మానవప్రకృతీ కూడా) అతడికి కొత్తగా కనబడటం మొదలుపెట్టింది.
నిజానికి కింగ్ లియర్ (1605) లో తండ్రీ కూతుళ్ళ విషాదాన్ని చిత్రిస్తున్నప్పటికే షేక్ స్పియర్ మరొక తండ్రి గురించీ, కూతురు గురించీ ఆలోచిస్తూఉన్నాడు. పెరిక్లీజ్ కూడా కింగ్ లియర్ లానే తండ్రీ కూతుళ్ళ కథ. కాని లియర్ కథ విషాదంలో పరిసమాప్తిచెందగా పెరిక్లీజ్ కథ మంగళాంతమైంది. తేడా ఎక్కడుంది?
ఎక్కడంటే, వాళ్ళిద్దరూ ప్రకృతిని చూసిన దృక్పథంలో. కింగ్ లియర్ దృష్టిలో ప్రకృతి మనిషి స్వభావానికి విరుద్ధమైంది. శత్రువులాంటిది. ప్రకృతి మనిషి మీద విరుచుకుపడ్డప్పుడల్లా మనిషి తిరిగి దాని మీద విరుచుకుపడాలనే అతడు భావించేడు.
కాని పెరిక్లీజ్ అలా కాదు. అతడు ప్రకృతి ముందు శిరసు వంచి నిలబడ్డాడు. ప్రకృతి (బయటి ప్రకృతీ, లోపలి ప్రకృతీ కూడా) ఒకటి తీసేసుకుంటే ఒకటి అందిస్తుందని అతడు గుర్తించాడు. ఏ సముద్రం తన భార్యనీ, కూతుర్నీ తననుంచి దూరం చేసిందో, తిరిగి ఆ సముద్రమే వాళ్ళని తన దగ్గరకు చేర్చడం అతడు చూసాడు. నీకొక మనిషి నిష్కారణంగా ద్రోహం చేస్తే మరొక మనిషి నిష్కారణంగా మేలు చేస్తాడు.కాబట్టి కావలసింది, సహనం, ఓర్పు. పెరిక్లీజ్ నాటకమంతా వినవచ్చే ఒకే ఒక్క కీలక పదం patience. ఓపిక పట్టడం. భారతీయ పురాణగాథల్లోని నాయకుల్లాగా, రాముడు, యుధిష్ఠిరుడు, నలుడు, పురూరవుడు లాగా, జీవితంలో సమస్తం కోల్పోయినప్పుడు కూడా, ఓపిక పట్టడం, మరింత ఓపిక పట్టడం.
ఒక ప్రాచీన సంస్కృత అలంకారవేత్తకి ఈ నాటకాన్నిచ్చి అభిప్రాయం చెప్పమంటే అతడు దీన్ని శాంతరస ప్రధాన కావ్యంగా పేర్కొంటాడు. కష్టాలు, వేదన మనిషిని మారుస్తాయి. కామ్యకవనానికి ముందు యుధిష్టిరుడికీ, అరణ్యవాసం తరువాత యుధిష్టిరుడికీ మధ్య వచ్చిన మార్పు వంటిదే పెరిక్లీజ్ లో కూడా మనం చూస్తాం. దుష్యంతుడు శకుంతలని మొదటిసారి ఒక ఆశ్రమంలో చూసినప్పుడు అతడిలో ప్రేమికుడు మేల్కొన్నాడు. అదే రాజనగరిలో అతడిలోని పురుషుడు బయటికొచ్చాడు. తిరిగి అతడామెను మరొక ఆశ్రమంలో, మరీచాశ్రమంలో, చూసినప్పుడు కాని అతడిలోని మానవుడు బయటికి రాలేదు.
ఈ పరివర్తననే పెరిక్లీజ్ లో కూడా మనకి కనిపిస్తుంది.చనిపోయిందనుకున్న తన కుమార్తె మెరీనా ని గుర్తుపట్టినప్పుడు పెరిక్లీజ్ కి ఒక దివ్యసంగీతం వినిపిస్తుంది. భరించలేని కష్టాల్లో సహనం పట్టి కడదాకా నిలిచిన మనిషికి జీవితం వినిపించగల దివ్యసంగీతం అది. తూర్పు దేశాల సాహిత్య కృతుల్లో మాత్రమే వినబడగల సంగీతం. అందుకనే పెరిక్లీజ్ పూర్తిగా చదవగానే ఒక సంస్కృతకావ్యమో, ప్రాకృత నాటకమో ఇంగ్లీషులో చదివాననిపించింది.
22-10-2015