పాట్రిక్ మోడియానో

Reading Time: 4 minutes

31

ఈసారి అనల్ప ప్రచురణల బలరాం చేతిలో కవిత్వంతో పాటు నవలలు కూడా కనిపించాయి. ఏమిటని చూస్తే, పాట్రిక్ మోడియానో నవల So You Don’t Get Lost in The Neighborhood. 2013 లో రాసిన నవల. 2014 లో ఆయనకు సాహిత్యానికి నోబెల్ బహుమతి లభించింది.

నవల ముందు ఆయన పూర్వ ఫ్రెంచి మహారచయిత స్టెంధాల్ రాసిన రెండు వాక్యాలు ఉదాహరించాడు:

‘I can not provide the reality of events,
I can only convey their shadows’

ఆదివారం నాడే ఆ నవల చదవడం పూర్తిచేసేసాను. యాదృచ్ఛికంగా ఆ రోజే హిందూలో కేశవ గుహ అనే ఆయన మోడియానో తొలిరోజుల్లో రాసిన మూడునవలలు The Occupation Triology ని సమీక్షించాడు.

అందులో ఒక నవలని మోడియానో రింబో రాసిన ఈ వాక్యంతో మొదలుపెట్టాడని రాసాడు:

If only I had a past at some other point in French history! But, no, nothing.

తన సమీక్షలో కేశవగుహ మోడియానో ని థాకరే, టాల్ స్టాయి వంటి రచయితలతో పోల్చాడు. తాము పుట్టినప్పుడో లేదా అంతకు కొద్దిగా ముందో జరిగిన చారిత్రిక కాలం జ్ఞాపకాలనుంచి బయటపడలేని ఐతిహాసిక రచయితలు వాళ్ళు.

మోడియానో 1945 లో పుట్టాడు. తండ్రి యూదు తల్లి ఫ్లెమిష్. 1940-44 మధ్యకాలంలో ఫ్రాన్సు జర్మనీ ఆక్రమణలో ఉంది. ఆ కాలంలో నాజీ దురాగతాలు, యూదుల హననం, రెండవప్రపంచ యుద్ధం వ్యక్తుల జీవితాల్లోనూ, జాతుల గమనంలోనూ కలిగించిన సంక్షోభం-మోడియానో వాటినుంచి ఇప్పటికీ బయటపడలేకపోయాడు.

‘విసపు విత్తొకసారి వేస్తే తరతరాలా పంటవిడువదు’ అంటాడు బైరాగి. ఒక్క ద్వేషబీజం కాదు, విద్వేషాల పంటలు పండించినకాలం, ఆ కాలం ఎట్లాంటిదో తెలియకుండానే పెరిగాడు, కానీ ఆ కాలం తన మనసు మీద వదిలిన దారుణమైన ముద్రలు ఎన్నటికీ చెరగని మరకలుగా తనని వేధిస్తుంటే ఆ కాలమెట్లాంటిదో, ఆ రోజుల్లో ఏం జరిగిందో పునరన్వేషిస్తూ మోడియానో రచనలు చేసాడు.

అందుకనే అతడి నవల ‘So You..’ మొదలుపెడుతూ తాను జరిగిన సంఘటనల్ని తిరిగిచెప్పలేననీ, తాను చెయ్యగలిగిందల్లా వాటి నీడల్ని మనకు ద్యోతకం చెయ్య్డమేననీ ముందే చెప్పేస్తాడు. ఆ నవల ఆత్మకథనాత్మక నవల కూడా. అందులో ఉన్న ప్రతి ఒక్క వివరం, గాలి, చీకటి, మంచు ప్రతి ఒక్కటీ తనని వెన్నాడుతున్నవే.

ఆ నవల (లేదా పెద్ద కథ) చదివితే మనకేమీ కథ కనిపించదు. ఆదిమధ్యాంతాలుండే సాంప్రదాయిక కథ కాదది. జీవితం ఎక్కడ మొదలవుతుందో, ఎవరిని ఒరుసుకుంటూ ప్రవహిస్తుందో, ఎక్కడ ఆగిపోతుందో లేదా అంతరించిపోతుందో, లేదా మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం కాబట్టి ఆ జీవితాన్ని చిత్రించే చిత్రణ కూడా అంతే. అది ఒక slice of memory.

విమర్శకులు దాన్ని మర్సెల్ ప్రూ రాసిన Remembrance of Things Past తో పోల్చారు. వినష్టకాలం గురించిన వెతుకులాటగా పేర్కొన్నారు.

కాని మోడియానో తన బాల్యం గురించీ, కౌమార జీవిత జ్ఞాపకాల గురించీ రాసుకున్న Pedigree చదివాక, ఆ నవల నాకు మరింత బాగా అర్థమయింది.

అతడి బాల్యం, కౌమారం, తొలియవ్వనాలు అత్యంత దుర్భరమైన కాలాలు. తల్లి నటి, గాయని, అతడి మాటల్లో చెప్పాలంటే ‘పాషాణ హృదయ.’ తండ్రి ఏదో రహస్య వ్యాపారం చేస్తూండేవాడు, అతడి యూదు అస్తిత్వం వల్ల ఆ కుటుంబం ఎప్పుడూ ఒక్కచోట నిలకడగా బతకలేదు. తండ్రి ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్త్రీలతో జీవించేవాడు. ఆ క్రమంలో మోడియానోనీ, అతడి తల్లినీ పూర్తిగా వదిలిపెట్టేసాడు. మోడియానో బాల్యమంతా బోర్డింగ్ స్కూళ్ళలో గడిచింది. కొన్నాళ్ళకు తల్లి పూర్తిగా నిరుపేదరాలయ్యింది. తనని వదిలిపెట్టేసిన భర్తనే నాలుగు ఫ్రాంకులు అడుక్కుని బతికే స్థితికి చేరుకుంది. అది కూడా తాను అడిగేది కాదు, తన కొడుకుని పంపి అడిగించేది. ఒకరాత్రి అట్లా తన తండ్రి ఇంటి తలుపు తట్టి నాలుగు ఫ్రాంకులు అడుక్కున్నందుకు ఆ తండ్రి పోలీసుల్ని పిలిపించి తన భార్యనీ కోడుకునీ పోలీసు వాను ఎక్కించాడు.

కాని వీటన్నిటికన్నా అతణ్ణి తీవ్రంగా గాయపరిచిందీ, జీవితమంతా వెన్నాడుతున్నదీ అతడి తమ్ముడి అకాల మృత్యువు. అతడిట్లా రాసాడు:

‘నా తమ్ముడు రూడీ, అతడి మృత్యువూ ఇవి తప్ప ఇక్కడ నేను రాస్తున్నదేదీ నిజంగా నాకు సంబంధించింది కాదు. ఎవరైనా ఒక నివేదిక రాస్తున్నప్పుడో లేదా ఏ ఉద్యోగం కోసమో తమ జీవితవివరాలు నింపుతున్నప్పుడో ఎట్లా రాస్తారో నేను కూడా అట్లానే ఈ పేజీలన్నీ నింపుతున్నాను. నాది కాని ఒక జీవితం తాలూకు వివరాలు నమోదు చేసుకుంటూ పోతున్నాను. ఇది కేవలం కొన్ని వివరాల సంఘటనల డాక్యుమెంటరీ మాత్రమే. నాకు ఒప్పుకోవలసిందీ, విప్పి చెప్పుకోవలసిందీ అంటూఏదీ లేదు. నాకు అంతరాత్మను తరచిచూడటంలోనూ, అంతరంగ కథనాల్లోనూ నమ్మకం లేదు. అంతకన్నా కూడా, నాకేదైనా ఎంత అగమ్యంగానూ, అయోమయంగానూ ఉంటే అంతగా ఆసక్తికరంగా ఉంటుంది. నాకు ఇరవయ్యొక్క ఏళ్ళొచ్చేవరకూ నేను లోనైన జీవితానుభవాలన్నీ సినిమాలో తెరమీద వెనక్కి జారిపోయే నేపథ్యదృశ్యాల్లాగా అనిపిస్తాయి . నా ముందు కూడా చాలామంది ఇటువంటి అనుభవానికే లోనైనారు. ఆ అనుభవాన్ని మాటల్లో పెట్టాలనే నా ప్రయత్నం. ప్రతి ఒక్కటీ వెనక్కి జరిగిపోతూ ఉంటుంది, కానీ జీవితాన్ని పూర్తిగా జీవించినట్టే అనిపించదు.’

తన అనుభవ కథనాన్ని మొదలుపెడుతూ ముందు పేజీల్లోనే ఇట్లా రాస్తాడు:

‘ నేను ప్రస్తావిస్తున్న ఈ పేర్లూ, ముందు ముందు ప్రస్తావించబోయే పేర్లూ అన్నిట్నీ ఓపికతో భరించండి. నా కంటూ ఒక జాతిలేదని నన్ను నేను నమ్మించుకోవాలనుకుంటున్న కుక్కపిల్లని నేను. నా తల్లి, తండ్రీ కూడా ఏ విశిష్ట సంస్కృతికీ, విలువలకీ చెందినవాళ్ళు కారు. జీవితమంతా గమ్యంలేకుండా, అస్థిరంగానే గడిపేసారు వాళ్ళు. అందుకని నేను నా తొలిజీవితాన్ని సూచించగల గుర్తులకోసం వెతుక్కుంటున్నాను. జారిపోతున్న ఈ ఇసుకలో కొన్ని కొండగుర్తులు నిలపాలని చూస్తున్నాను. ఏదో గణాంక పత్రమో లేదా ప్రభుత్వ కార్యాలయంలో మన వ్యక్తిగత వివరాలు నింపే ఫారాన్నో మనమెట్లా నింపడానికి ప్రయత్నిస్తామో, ఆ క్రమంలో ఆ అక్షరాల చుట్టూ ఇంకుమరకలెలా అంటుకుంటాయో, అట్లా..’

అన్ని అనుభవాలూ తనకి సంప్రాప్తించినవే. కాని ఏదీ తనది కాదు. అకాలంగా చనిపోయిన తన తమ్ముడు తప్ప మరెవ్వరూ తనవారు కారు, తల్లితోసహా, తండ్రితో సహా.

ఈ వాక్యాలు చూడండి:

‘నేను 1960 ల్లో కలిసి మళ్ళా జీవితంలో మరెన్నడూ చూడని ఈ మనుషులంతా బహుశా ఇప్పటికీ కాలానికి చిక్కకుండా, ఒక సమాంతర ప్రపంచంలోనే జీవిస్తూంటారనుకుంటాను.గడిచిపోయిన ఆ రోజులవైపే ముఖం పెట్టి చూస్తూ ఉంటారనుకుంటాను. నిర్మానుష్యమైన ఒక వీథిలో ఎండలో నిలబడి నేను కొంతసేపటి కిందట ఈ విషయమే ఆలోచిస్తూన్నాను. ‘నువ్వు పారిస్ లో నిన్ను విచారిస్తున్న మాజిస్ట్రేట్ ముందు నిల్చున్నావు ‘ అని రాసాడు అపోలినార్ తన ఒక కవితలో. ఆ మాజిస్ట్రేటు నాకు ఎన్నో ఫొటోలు చూపిస్తున్నాడు, పత్రాలు, సాక్ష్యాలు. కాని నా జీవితం- సరిగ్గా అలా లేనే లేదు.’

వంద పేజీల ఈ చిన్ని రచనని పూర్తిచెయ్యగానే మనకి యుద్ధాన్నీ, యుద్ధానంతర శూన్యాన్నీ కూడా చూసిన అనుభూతి వెన్నాడుతుంది. కాని ఒక సమీక్షకుడు రాసినట్టుగా ‘(ఈ రచనలో) మోడియానో ప్రతిభ దీనికి సాహిత్యం రంగు పులమకపోవడంలోనే ఉంది. తన తండ్రిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడంలో, లేదా అతడి ప్రవర్తనని చారిత్రిక కారణాల్తో వివరించకపోవడంలో, అలాగే తన తల్లిని సమర్థించాలని చూడకపోవడంలో. అంతేకాదు, తన ప్రతిస్పందనల్ని మనకు ఏకరువు పెట్టకపోవడంలో. వీటివల్ల ఈ పుస్తకం మనని కలవర పరిచేదిగానూ, ఎంతో విలువైందిగానూ అనిపిస్తున్నది.’

కాని మోడియానో తన తండ్రినీ, తల్లినీ కూడా ప్రేమించాడు. అది మమకారంతో కూడిన ప్రేమ కాదు, రక్తబానిసత్వం కాదు. ఒక మనిషి, ఒక సాహిత్యకారుడిగా ఎదిగిన మనిషి మాత్రమే చేరుకోగల మనఃస్థితిలోంచి చూపగల ప్రేమ.

తన తండ్రితో తన బంధాన్ని పూర్తిగా తెంచుకుంటూ రాసిన లేఖని పూర్తిగా మనకు వినిపిస్తూ ఇట్లా రాస్తాడు:

‘కాని ఆ రోజు అట్లా రాసినందుకు నేనీ నాడు పశ్చాత్తాప పడుతున్నాను. కాని నేనేమి చెయ్యగలను? నాకతడి పట్ల ఎటువంటి ఆగ్రహమూ లేదు, నిజానికి నేనతడి పట్ల ఎప్పుడు ఏదీ మనసులో పెట్టుకోలేదు… బహుశా పదేళ్ళ తరువాత అతడు నన్ను కలిసి ఉంటే మా ఇద్దరి మధ్యా ఎట్లాంటి సమస్యా ఉండేది కాదనుకుంటాను. అతడు నాతో సాహిత్యం గురించి మాట్లాడేవాడనుకుంటాను, నేనతడి రహస్యజీవితం గురించి తెలుసుకునేవాణ్ణేమో. కానివ్వండి, బహుశా, మరొక లోకంలో మేమిద్దరమూ చెట్టపట్టాలు పట్టుకుని నడుస్తాము, బహుశా అప్పుడైనా మేము ఎవరికీ భయపడకుండా నిర్భయంగా కలుసుకోగలమనుకుంటాను.’

మోడియానో పుస్తకాలు రెండూ చదివిన తరువాత, రాసుకోవలసిన నీతివాక్యమేమిటి?

ద్వేషించుకోకండి, వ్యక్తులుగా , సమూహాలుగా, జాతులుగా.

మీరు ద్వేషించుకుంటే, ఆ ద్వేషకాలంలో పుట్టిన పిల్లలకి అనుభవాలుంటాయికాని, జీవితముండదు.

26-1-2016

2 Replies to “పాట్రిక్ మోడియానో”

Leave a Reply

%d bloggers like this: