నేను కవినెట్లా అయ్యాను

Reading Time: 4 minutes

8

జరొస్లావ్ సీఫర్ట్ చెక్ కవి. 1984 లో కవిత్వానికి గాను నోబెల్ పురస్కారం పొందాడు. ఆయన కవిత్వానికి The Poetry of Jaroslav Seifert (1998) పేరిట ఎవాల్డ్ ఓసెర్స్ చేసిన అనువాదంలో కొన్నాళ్ళుగా మునిగితేలుతున్నాను. ప్రతి రాత్రీ నిద్రలోకి జారుకునేముందు ఒకటిరెండు కవితలేనా చదవడం కొత్తసుగంధాల్నీ, పాతప్రణయాల్నీ మరొకసారి చేరదీసుకోవడం లాగా ఉంది. ఆ కవితాసంకలనంలో కొన్ని వచనరచనలు కూడా ఉన్నాయి. కవిత్వం గురించీ, తన జీవితం గురించీ సీఫర్ట్ రాసుకున్న మాటలు. అతడి కవితలెంత సుందరంగా ఉన్నాయో, ఆ వచనం కూడా అంత అందంగానూ ఉంది. ముఖ్యంగా ‘నేను కవినెట్లా అయ్యాను? ‘ అనే ఈ ఖండికని మీతో పంచుకుంటే తప్ప ఆగలేనననిపించింది.

నేను కవినెట్లా అయ్యాను

ఎస్.కె.న్యూమాన్ జూన్ పత్రికలో ఇవాన్ సుక్ కవితల్ని తొలిసారిగా ప్రచురించడంతో నేనొక్కసారిగా నా కలల్లోంచి బయటపడ్డాను. నేనో కవిని కావాలన్న నా సంకల్పం, కోరిక అంతదాకా నిద్రపోతున్నాయి. నన్నొక్కసారిగా అసూయముంచెత్తింది. నేను రాయగల చిన్నిచిన్ని కవితల్ని ‘జూన్’ ప్రచురించగలదని నాకప్పటిదాకా తట్టనేలేదు.

ఆ పత్రిక పట్టుకొచ్చి సుక్ మాకు చూపించినప్పుడు, తనకి ముట్టినపారితోషికంగురించి కూడా చెప్పినప్పుడు నేను నా మత్సరాన్ని, నా చాతకాని అసూయని అణచుకోలేకపోయాను. ఆ తర్వాత చాలారోజులపాటు నేనొంటరిగా నాలోనేను మాట్లాడుకుంటూ, నాకు నేనేదో చెప్పుకుంటూ గుడ్లనీళ్ళు కుక్కుకుంటూ తిరుగుతూ ఉండిపోయేను. వందసార్లేనా కాగితం, పెన్సిలూ చేతుల్లోకి తీసుకున్నాను. మళ్ళా వందసార్లేనా ఏమీ చాతకాక వాటిని కిందపెట్టేసాను.

‘ప్రావో లిడు’ పత్రిక తెచ్చే ఆదివారం అనుబంధంలో సుక్ మరిన్ని కవితలు రాస్తున్నాడని తెలిసినప్పుడు నా దు:ఖం,అశక్తత మరింత పెరిగిపోయాయి. కొన్నాళ్ళకి నెమెక్ రాసే హాస్యకవితలు కూడా జూన్ పత్రికలో కనిపించడం మొదలయ్యేసరికి, ఏమైనా కానీ, నేను కూడా ఏదో కవిత్వం రాసి తీరక తప్పదనుకున్నాను.

ఆ రాత్రికి అంతం లేదు. నేను చించి పోగులుపెట్టిన కాగితం గుట్టలాగా పోగుపడింది. నేను రాసిన చెత్త మరెవరి కంటా పడకూడదనుకుని రాసింది రాసినట్టే స్టవులో పడేసాను. అప్పుడు నేను రాయని విషయం లేదు. ప్రేమ, ప్రేగ్ నగరం, జీవితం, స్మశాన వాటికలు-కొన్ని సంతోషభరితమైన కవితలు, కొన్ని విషాదపూరితాలు, కొంత దుఃఖాంతం, కొంత సుఖాంతం- కాని ఆ కవిత్వమంతా క్షణాల్లోనే అగ్నికి ఆహుతైపోయింది.ఇక మరే వస్తువు గురించీ ఆలోచించడానికి ఓపిక లేకపోయాక నా కళ్ళముందు కనిపించేవాటిగురించి రాయడం మొదలుపెట్టాను. కిటికీలు, స్టవ్వు, మంచం. మంచం గురించి రాసిన కవిత చాలా బాగా వచ్చిందనిపించి దాన్ని హోరాకి పంపించాను. ఆ కవితలో నేను నా శయ్యని నెవాడా కొండలమధ్యనుంచి నక్షత్రవీథుల్లోకి పయనించాలనుకుంటున్న కంచరగాడిదతో పోల్చాను.

కాని హోరా నా కవితని మర్నాడే తిప్పిపంపేస్తూ నేను వట్టి చవటనని నిందిస్తూ కవితలు రాయడం మానేస్తేమంచిదని సలహా ఇచ్చాడు. నేను కుప్పకూలిపోయాను. చీకటికంతలోకి తలదూర్చడం తప్ప గత్యంతరం లేదన్నట్టింక నా పుస్తకాల్లో తలదాచుకున్నాను. అప్పటిదాకా నేనో కవిననుకుంటూ వాటిని బొత్తిగా నిర్లక్ష్యం చేసాను.

అప్పుడింక నేను పండితుణ్ణి కావడం మీద దృష్టిపెట్టాలనుకున్నాను. ఒక గణితశాస్త్రజ్ఞుణ్ణో, లేదా చరిత్రపరిశోధకుణ్ణో, లేదా జీవశాస్త్రపండితుణ్ణో కాగలననుకున్నాను. ఒక రాకుమారితో కలల్లో ప్రేమలో పడ్డ గూనివాడిలాగా నాలోనేను విలపిస్తూ గడిపేను. ఈ లోపు సుక్, నెమెక్ విజయసోపానం మెట్టు పై మెట్టు ఎక్కుతూ పోతున్నారు. సుక్ కవితలసంపుటిని మినాంక్ ప్రచురణ సంస్థ ప్రచురించడానికి అంగీకరించడంతో వాడు తన కవితలన్నీ సంకలనం చేసేపనిలో పడ్డాడు. దుమ్ముపడి మాసిపోయినవాడిటోపీ మీద నవయౌవనసౌందర్యంతో కవితాకన్య అభినందనమందారమాల అలంకరిస్తూంది.

కవిత్వంనుంచి నేను పొందిన వైరాగ్యం నా గాయాలకు కొంతమందుపూసి ఉపశమనం కలిగించిన తరువాత నేను నా ఆల్జీబ్రా, జామెట్రీ తరగతుల్లో కొంత ఊరటపొందాను. ఆ విషయాలు నాకు బాగా అర్థమయ్యాయని కాదు, ఆ మాటకొస్తే అర్థం కాలేదు కూడా, కాని వాటిదగ్గర నా కవితావైఫల్యాన్ని నేను మర్చిపోగలిగేను. అదే గనక నేను గ్రీకునో, లాటిన్ నో ఎంచుకుని ఉంటే? కేటల్లస్ సుమధుర కవిత్వాన్ని చదివినప్పుడల్లా ఆ రాత్రి నేను తగలబెట్టిన గుట్టలకొద్దీ కాగితం గుర్తురాకుండా ఉండదు కదా. చివరకి జంతుశాస్త్రపుస్తకంలో కనిపించే పక్షులబొమ్మలూ, ఆకు అడ్డకోతని, నిలువుకోతని వివరించడానికి చిత్రించే పూలబొమ్మలూ కూడా నాకెంత కవితాత్మకంగా కనిపించేవంటే, వాటిని చూస్తూనే అప్పుడే నగరమంతా ఆవరిస్తున్న వసంతకాలపు వెలుతురుతో, తీపిగాలుల్తో నిండిపోయే రాగాత్మక సాయంసంధ్యల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయేవాణ్ణి.

అప్పట్లో నేనో పెద్ద చేతికర్ర ఊతంగా నడిచేవాణ్ణి, చుట్టలు కాల్చేవాణ్ణి. ఆ రెండూ కూడా మా లెక్కలమాష్టారిలాగా ఉండాలని చేసిన ప్రయత్నాలే. కొద్దిగా నిర్లక్ష్యంగా దుస్తులు తొడుక్కుని ఒకవైపు తూగి నడిచేవాణ్ణి. అవి కూడా ఆ ఉపాధ్యాయుడి లాగా కనిపించాలని చేసేవే.

మీరెప్పుడైనా పెట్రిన్ కొండల మీద వసంతాగమనం చూసారా? అద్భుతం. పర్వతసానువులమీంచి తొందరతొందరగా దొర్లుకుంటూ మంచు ఇట్లా అదృశ్యమయ్యేదో లేదో, స్ట్రహోవ్ తోటల్లో చెర్రీ వృక్షాల్లో వసంతం విరుచుకుపడుతుంది. అట్లాంటి వసంతదినాన ఆ ఉద్యానవనంలో చెట్లమధ్య నడుస్తూ అల్జీబ్రా సూత్రాలు బట్టీపడుతుంటే, కవిత్వం మీద ప్రతీకారం తీర్చుకున్నట్టుండేది. అక్కడ పార్కుబెంచీలమీద యువతులు కూర్చుండి సాహిత్యం చదువుకుంటుంటే వారి వెనక పూలరేకల వాన కురుస్తుండేది. కాని అట్లాంటి దృశ్యాలముందు కూడా, కవిత్వంలానే ప్రేమని కూడా దూరం పెట్టాలన్న నా దృఢ సంకల్పం మాత్రం చెక్కుచెదిరేది కాదు.

కాని ఆ రోజు మాత్రం ప్రేగ్ పట్టణం ఆటమొదలుపెట్టడానికి ముందు పరిచిన చదరగం బల్లలాగా కనిపించింది. రాజూ, రాణీ అక్కడ. బంగారు ఏనుగు ఇక్కడ. అపార్ట్ మెంట్లూ, విల్లాలూ పావుల్లాగా ఉన్నాయి. చుట్టలు కాల్చికాల్చి నా కళ్ళు మసకకమ్మేయి. ఏమయిందో తెలియదుగాని, కళ్ళు తెరిచి చూసేటప్పటికి నేను హంగర్ వాల్ ముందు తిన్నెమీద నిల్చుని ఉన్నాను.చదరంగం బల్లమీద పావులు నా కళ్ళముందే నెమ్మదిగా కదలడం మొదలుపెట్టాయి. దిగంతరేఖకి అడ్డంగా జికోవ్ చర్చ్ స్తంభం కనిపించింది. దానిలో గడియారం మెరుస్తున్నది.

అంతదాకా నేను వల్లె వేస్తున్న ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, త్రికోణమితి, వృత్తవైశాల్య సూత్రాలూ పక్కకు తప్పుకున్నాయి.అక్కడ టపటపా రెక్కలాడిస్తూ ఎగురుతున్న పావురాలు నా చేతుల్లోని బీజగణితాక్షరాల్ని పొడిచి తినేసాయనిపించింది. అక్కడొక రాతిఫలకం ముందు కూర్చుండిపోయాను. ఆ ఫలకం మీద దిక్సూచి చెక్కిఉంది. దాని చుట్టూ బంగారురంగులో యూరోప్ నగరాల పేర్లు రాసిఉన్నాయి. పడమటివైపు పారిస్,తర్వాత లండన్, బ్రెమెన్, హాంబర్గ్, లీప్ జిగ్, బెర్లిన్, బుకారెస్ట్, బుడాపెస్ట్, మిలన్, జెనోవా, మోంట్ కార్లో, నైస్.

అది యూరోప్ గులాబి.

అ క్షణాన నేను యూరోప్ ని నా చేతుల్తో పట్టుకున్నాననిపించింది.దాన్ని పైకెత్తి నా పెదాలదగ్గరకు, ఘ్రాణరంధ్రాలదగ్గరకు చేర్చుకున్నట్టూ, ప్రపంచసుగంధాన్ని, సుదూర దేశాల సౌరభాన్ని ఆఘ్రాణిస్తున్నట్టూ అనిపించింది..అందమైన మేఘాలు ప్రేగ్ ఆకాశమ్మీద తేలియాడుతున్నాయి. వసంతమధురసుగంధం నా భావనాకేంద్రాన్ని ఉద్రేకించింది.నగరవైభవమంతా నా పాదాలదగ్గర కనిపించింది. ఆక్కడ నేలమీద చిత్రించిననగరపటం ఏదో ఒక రంగస్థలాలంకరణలా, ఎవరో ముడివేసినట్టుగా గోచరించి నేనేదో నాటకమధ్యంలో నిలబడ్డట్టనిపించింది. బంగారం. ముద్దులు, నిలువెత్తు అద్దాలముందు స్త్రీలు. ద్రోహం, ప్రేమ, వీరోచితకృత్యాలు, గులాబులు. గాఢప్రణయోద్వేగం, మృత్యువు.

అర్హ్తమయింది నాకు. నేను గణితశాస్త్రజ్ఞుణ్ణి కావడం అసాధ్యం.

మంచిది, పిల్లవాడా, మరొక్కసారి నీ కలాన్ని నిర్మలాకాశ నీలిమలో ముంచి తియ్యి, రాయి. ఏది తోస్తే అదే రాయి. కవివి కాగలవేమో. మరొక్కసారి ప్రయత్నించి చూడు. ఇక్కడ ఈ శిలాఫలకం మీద నీ శిరసు ఆనించిన క్షణాన ఇంతదాకా అజ్ఞాతంగా ఉన్న ప్రపంచసౌందర్యం ఇప్పుడు నీకు గోచరమవుతున్నది గోచరిస్తున్నట్టు నీ కళ్ళముందు కదిలిపోతున్న అందాల్ని చూసినవి చూసినట్టు చిత్రించు. నీ రచనలంతటా నక్షత్రధూళి విరజిమ్ము. అది ఆరేదాకా వేచి చూడు, ఏమవుతుందో.

ఆ సాయంకాలమే నేనో కవిత రాసి కొట్టుకుంటున్న గుండెతో దాన్నట్లానే హోరాకి పంపించాను.

దాన్నతడు మర్నాడే ప్రచురించాడు.

ప్రచురించబడ్డ ఆ కవిత నా ముందు బల్లమీద ఉండగా, నేను సునాయాసంగా మరో కవితరాసి న్యూమాన్ కి పంపించాను. అది ‘జూన్’ పత్రిక మరుసటి సంచికలో అచ్చయ్యింది.

నన్నభినందిస్తూ న్యూమాన్ చేయి చాపినప్పుడు నేనా చేతినందుకోవడానికి తొట్రుపడ్డాను. అంత ఆనందం నేను తట్టుకోలేననిపించింది. ఆ మధ్యాహ్నం ఆయన నన్ను భోజనానికి పిలిచినప్పుడు నాకు కాళ్ళు రాలేదు. బల్లదగ్గర ముద్ద నోటిలో దిగడం కష్టమనిపించింది.

న్యూమాన్ చూపించిన ఆదరణ నాకు ధైర్యాన్నిచ్చింది. అందమైన చేతిరాతలో మరొక చక్కటి కవిత రాసుకు పోయి హోరాని కూడా కలవాలనుకున్నాను. నల్ల కళ్ళద్దాలతో, భావరహితంగా ఉన్న ఆ పెద్దమనిషి నన్ను చూసినప్పుడేమంత ఉత్సాహం కనపరచలేదు. ఒక చిన్నకవిత రాయడమేమంత పెద్దవిషయం కాదన్నట్టు, అది కూడా ఇరవయ్యేళ్ళ పిల్లవాడు రాయడమేమంత ఘనకార్యం కాదన్నట్టు ప్రవర్తించేడు.

కాని ఈ విజయాలతో నేను నెమెక్ నీ, సుక్ నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలిగాను.వాళ్ళతో కలిసి ప్రేగ్ పట్టణవీథుల్లో నెమ్మదిగా నడుచుకుంటూ కవిత్వం గురించి మాట్లాడగలిగాను.

ఇక ఆ సంవత్సరాంతానికి నేనా ఏడాది లెక్కలపరీక్షలో ఘోరంగా తప్పానని వేరే చెప్పాలా?

23-2-2014

Leave a Reply

%d bloggers like this: