మహాభారతం చదువుతున్నాను. ద్రోణపర్వం. అటువంటి యుద్ధవర్ణన, యుద్ధగమన చిత్రణ,అట్లా రోమాంచితంగా కథచెప్పగలిగే నేర్పు మరే రచయితలోనూ నేనింతదాకా చూడలేదు. హోమర్ ఇలియడ్ లో చేసిన యుద్ధవర్ణన, టాల్ స్టాయి ఏడేళ్ళ పాటు శ్రమించి చిత్రించిన నెపోలియన్ దండయాత్ర కూడా ఈ వర్ణనముందు పసిపిల్లల రాతల్లా కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా జయద్రథవథ చిత్రణ ఒక్కటి చాలు. దానికదే ఒక ఇతిహాసం. ఆ ఒక్కరోజు యుద్ధం ఎంతో సుదీర్ఘంగా, భరించలేనంత ఉత్కంఠభరితంగా సాగింది. ఆ ఒక్కరోజు యుద్ధాన్నే ఎవరైనా సినిమాగా తీయదలచుకుంటే, ఆ మొత్తం స్క్రీన్ ప్లే వ్యాసుడే స్వయంగా సమకూర్చిపెట్టాడు.
సాధారణంగా భారతశైలి నాటకీయం,కథాకథనధోరణి అంటారంతా. Dramatic narrative. అలంకారాలకి చోటు తక్కువని అనుకుంటారు. వ్యాసుడి చాలా ఉపమానాలు Homeric similes లాగా పదేపదే పునరావృత మవుతుంటాయి, నిజమే., కానిఎన్నో ఉపమాలంకారాలూ, రూపకాలంకారాలూ ఎన్నో తావుల్లో చాలా కొత్తగా, అత్యాధునికంగా నన్ను సంభ్రమపరుస్తున్నాయి.
కొన్ని ఉదాహరణలు:
‘భీష్ముడు మరణించిన తరువాత కౌరవసేన తనలోని శరభాన్ని సింహం చంపివేస్తే భీకరంగా ఉన్న కొండగుహలాగా ఉంది..’
‘నదిని దాటాలనుకునేవాడు నావని తలచుకున్నట్టు భీష్ముడు పడిపోగానే నీ కొడుకులు కర్ణున్ని తలుచుకున్నారు..’
‘భీముడి బాణాల దెబ్బతిన్న ఏనుగులు ఒకదానితో ఒకటి కలిపికుట్టినట్టు ఆకాశంలో సూర్యకిరణాలతో కుట్టిన మేఘాల్లాగా శోభించాయి..’
‘అనేకాలంకారాలుగల పర్వతం లాంటి ఏనుగుమీంచి సువర్ణహారంతో భగదత్తుడు నేలమీద కూలినప్పుడు చక్కటిపూలతో శోభిస్తున్న గన్నేరుచెట్టు కొండమీంచి విరిగికిందపడ్డట్టుంది..’
‘రథికులు, ఏనుగులు, గుర్రాలు, సైనికులు అభిమన్యుడనే సముద్రంలో మునిగిపోతుండగా చూసి దుర్యోధనుడు త్వరగా అతడిమీద కలయబడ్డాడు..’
‘అశ్వాలనీ, చక్రరక్షకుల్నీ చంపిన తరువాత బాణాలు గుచ్చుకున్న అభిమన్యుడు ముళ్ళపందిలాగా కనబడ్డాడు..’
‘యుద్ధంలో నేలగూలుతున్న శిరసుల ధ్వని అదనులో పండి నేలరాలుతున్న తాటిపండ్ల చప్పుళ్ళా ఉంది..’
‘చికిత్స వ్యాధిని నివారించినట్లు వాళ్ళంతా అర్జునుణ్ణి నిరోధించారు..’
‘పులులతో, సింహాలతో, ఏనుగులతో నిండిన పర్వతాలను దాటి ఇద్దరు వ్యాపారులు కుదుటపడినట్టు కృష్ణార్జునులు సేనని అతిక్రమించి ప్రసన్నులయ్యారు..’
అయితే అన్నిటికన్నా గొప్పగా అనిపించింది యుద్దాన్ని వర్ణించడానికి వాడిన రూపకాలంకారాలు. ఈ వర్ణన చాలాచోట్ల ఉన్నప్పటికీ రెండు వర్ణనలు, ద్రోణపర్వం: 14:7-19, 1:37-45 మరీ అద్భుతంగా ఉన్నాయి.
అందులో ఒక వర్ణన (14:7-19):
ప్రాజ్ఞుడు,సత్యవంతుడు ద్రోణుడొక రక్తనదిని ప్రవహింపచేసాడు
అది ఘోరం, రౌద్రం, యుగాంతకాలాన్ని తలపించింది.
అది కోపంనుంచి పుట్టిన నది, క్రూరమృగగణసంకులం
సేనాసమూహాల్తో పొంగుతోంది, ధ్వజాలనేచెట్లని కోసేస్తోంది.
దాని నీళ్ళు నెత్తురు, రథాలు సుడిగుండాలు, ఏనుగులు
గుర్రాలు ఒడ్లు, కవచాలు తెప్పలు, మాంసం బురద.
కొవ్వు,మూలుగ, ఎముకలు ఇసుక, తలపాగలు నురగ
నెత్తురు నింపుతున్న యుద్ధమేఘం, విరిగిన కత్తులు చేపలు.
మనుషులు, గుర్రాలు,ఏనుగులు తెప్పలు, బాణాలు ఉద్ధృతి
ఖండితదేహాలు తేలుతున్న కొయ్యదుంగలు, రథాలు తాబేళ్ళు.
తెగిపడ్డ తలలు గులకరాళ్ళు, తెగినకత్తులు చేపలగుంపులు
రథాలు, ఏనుగులు మడుగులు, హారాలు అలంకారాలు.
మహారథికులు సుడిగుండాలు, ధూళిరేణువులు ఆభరణాలు
పరాక్రమవంతులుమాత్రమే దాటగలరు, పిరికివాళ్ళు దాటలేరు.
శవాలగుట్టలు వేగనిరోధకాలు, గద్దలు, రాబందులు వెంటరాగా
మహావీరుల్ని యమసదనానికి మోసుకుపోతున్నది ఆ నది.
విరిగిన శూలాలు సర్పాలు, పోరాడుతున్నవీరులు నీటిపక్షులు
భగ్నఛత్రాలు పెద్దహంసలు, కూలిన కిరీటాలు లకుముకిపిట్టలు.
తెగిపడ్డచక్రాలు తాబేళ్ళు, గదలు మొసళ్ళు, శరాలు చేపలు
అక్కడంతా గుమికూడిన కాకులు, నక్కలు, రాబందులు.
ఆ నదినిండా శవాల గుట్టలు, వాటి జుట్టు నాచు, నీటిగడ్డి
పిరికివాళ్ళకి ఒళ్ళుగగుర్పొడిచే రక్తనదిని పారించాడు ద్రోణుడు.
7-6-2014