దేవీసప్తశతి

36

మా కాలనీలో ప్రసన్నాంజనేయస్వామి గుళ్ళో చండీయాగం చేస్తున్నాం, ఏదన్నా మాట్లాడండి అనడిగితే దేవీసప్తశతి మీద కొంతసేపుమాట్లాడేను. ఎప్పుడో ఇరవయ్యేళ్ళకిందట కర్నూల్లో ఉండగా మా మాష్టారు హీరాలాల్ గారు ఆ పుస్తకం మీద వ్యాఖ్యానమొకటినాతో చదివించారు. అప్పణ్ణుంచీ దుర్గాసప్తశతినాకొక psychological treatise లాగా తోస్తూంటూంది. మన అంతశ్చేతనలో మనని బాధించే రకరకాల ఋణాత్మకభావనల్ని అర్థం చేసుకోవడానికీ, వాటిని అతిక్రమించడానికీ ఆ పుస్తకం ఒక దారిచూపిస్తుంది.

700 శ్లొకాలతో దుర్గాసప్తశతిశ్లోకీ, దేవీసప్తశతి, చండీసప్తశతి అని పిలవబడే ఈ ఉపాఖ్యానం మార్కండేయపురాణం లోది. ఆ కథమొదలవుతూనే అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలవుతుంది. సూర్యసావర్ణిగా ప్రసిద్ధిచెందిన ఎనిమిదవ మనువు పూర్వజన్మలో సురథుడనే రాజు. అతడు రాజ్యభ్రష్టుడై అడవుల పాలయినప్పటికీ తనకి రాజ్యం మీదా, తన బంధుమిత్రపరివారమ్మీదా మమకారం పోలేదని గుర్తిస్తాడు. ఆ అడవిలో అతడికొక వర్తకుడు తారసపడతాడు. అతణ్ణి అతడి భార్యాపిల్లలు మోసగించి నిర్ధనుణ్ణి చేసి అడవులకు తరిమేస్తారు. అట్లా ధనహీనుడై అడవుల పాలైనా తన భార్యాబిడ్డలమీద మమకారం పోలేదని ఆ వర్తకుడు బాధపడుతుంటాడు. ఆ రాజునీ, ఆ వర్తకుణ్ణీ బాధించిన ప్రశ్న ఒకటే:

లోపాల్తోనూ, కొరతతోనూ, దుఃఖంతోనూ కూడుకుని ఉన్నప్పటికీ తామెందుకని తమ మానసికబంధాలనుంచి బయటపడలేకపోతున్నారు? తామొకప్పుడు ఎవరిని ప్రేమించారో వారు కృతఘ్నులూ, ప్రేమించడానికి అర్హులు కారని తెలిసినా కూడా తామెందుకని వారి ఆలోచనలనుంచి తప్పించుకోలేకపోతున్నారు?

తమ ప్రశ్నకి సమాధానం చెప్పమని వారిద్దరూ ఒక ఋషిని పోయి అడుగుతారు. ఆ ప్రశ్నకి సమాధానంగా ఆ ఋషి ఇచ్చిన సమాధానమే దుర్గాసప్తశతి.

ఒక ప్రశ్నగా ఇది చాలా సున్నితమైన, జటిలమైన కీలకమైనప్రశ్న. దాదాపుగా పాతనిబంధనలో యెహోవాని యోబు అడిగిన ప్రశ్నతో సమానమైన ప్రశ్న. యెహోవా-యోబు సంవాదం గురించీ ఆలోచించని ఆధునిక రచయితల్లేరని చెప్పవచ్చు. ప్రసిద్ధ మనస్తత్వవేత్త యూంగ్ దానిమీద అద్భుతమైన వ్యాసం కూడా రాసాడు. కాని మన పురాణకర్త వేసిన ఈ ప్రశ్న మాత్రం ఎందుకనో మన ఆధునికరచయితల, మనస్తత్వవేత్తల దృష్టిలో పడలేదు.

మనని ఆకర్షిస్తున్న విషయాలు లోపభూయిష్టాయిలని తెలుస్తున్నా మనమెందుకు వాటి ఆకర్షణనుంచి బయటపడలేకపోతున్నామన్నది సామాజికంగానూ, వైయక్తికంగానూ కూడా ఎంతో ముఖ్యమైన ప్రశ్న. ఈ తప్పించుకోలేకపోవడంలోంచే మన వ్యక్తిగతజీవితాల్లో, సామాజికసంబంధాల్లో ఎంతో అశాంతి పుట్టుకొస్తోంది. దీనికేదైనా పరిష్కారం ఉందా?

ఈ ప్రశ్న వేసినందుకే మార్కండేయపురాణకర్తని ఎంతో అభినందించాలి. ఇందుకు ఆయనిచ్చిన సమాధానం పైకి పురాణకథలా కనిపించినప్పటికీ, దానిలోని ప్రతీకల్ని decipher చెయ్యడమేమంత కష్టం కాదు. దాదాపుగా అదే ప్రతీకల్ని లలితాసహస్రనామం, దేవీభాగవతం కూడా ఉపయోగించాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోవడమేమంత కష్టం కాదనుకుంటాను. నాతో మా మాష్టారు చదివించిన వ్యాఖ్యానంలో వ్యాఖ్యాత చేసిందదే.

3-4-2014

Leave a Reply

%d bloggers like this: