దుఃఖమూ, సంతోషమూ

28

హమ్మయ్య. మొత్తానికి మార్టిన్ సన్ పద్యాల్ని కొన్నైనా తెలుగు చెయ్యగలిగాను.

నా చిన్నప్పుడు మా ఊళ్ళో కంసాలి సోమలింగం బంగారపు పని చేస్తుంటే చూసేవాణ్ణి. ప్రతి చిన్న బంగారపు తునకనీ, గాలి వీయకుండానే ఎగిరిపోయేటంత పలచని బంగారు రేకుల్ని వేళ్ళతొ దారాలు అల్లినట్టుగా, శ్రద్ధగా, పసిపాపల్ని లాలించినంత జాగ్రత్తగా అతికేవాడు, పొదిగేవాడు. అట్లాంటి కవితా శిల్పం మార్టిన్ సన్ ది.

పూర్తిగా మొద్దుబారిపోయిన జీవితంలో, సౌకుమార్యం సన్నగిల్లిపోయిన కాలంలో ఆ కవితల్ని ముందు చదవడానికే ఎంతో మెలకువ కావాలి. దేవాలయంలో తీర్థం తీసుకునేటప్పుడు మన సమస్తాంగాలూ ఒక్క దోసిట్లోకి ఒదిగిపోయినట్టుగా, మన ప్రాణమంతా మన కళ్ళల్లోకి నింపుకుని మరీ ఆ కవితలు ఒక్కొక్కటీ చదవాలి. చదివినతరువాత, చెట్టునీడనకూచుని ఆవు నెమరువేసుకున్నట్టుగా ఆ పదచిత్రాల్ని స్వానుభవంలోకి ఒంపుకుని మరోమారు చర్వితచర్వణం చెయ్యాలి.

ఇక వాటిని అనువదించాలంటే ఆ కష్టమెట్లాంటిదో ఎట్లా చెప్పేది!

హారీ మార్టిన్ సన్ (1904-78) కవిత్వం Chickweed Wintergreen (2010), The Procession of Memories (2009) చదివిన తరువాత, ఆయన Wild Bouquet (1985) కోసం ఉవ్విళ్ళూరాను.కానీ అవుటాఫ్ ప్రింట్. అట్లాంటిది ఆ పుస్తకాన్ని సోమయ్యగారి అబ్బాయి రావెల మనోహర్ నా కోసం అమెరికా అంతా గాలించి ఒక యూజ్డ్ కాపీ సంపాదించి పంపించేరు. ఎవరో ఎవరికో 87 లో with love and best wishes కానుకచేసిన పుస్తకం. సముద్రాలు దాటి మరీ నన్ను చేరింది.

ఆ పుస్తకం అందినప్పటినుంచీ ఆ 61 చిన్న చిన్న కవితల్నీ ఎన్నిసార్లు చదివానో. ఆ కవితలు చదివినప్పుడల్లా నాలుకమీద పడగానే కరిగిపోయే నేరేడుపళ్ళలానే ఉంటాయిగాని, అనువదించాలంటే, ఊదారంగు చార తప్ప మరేదీ పట్టు చిక్కదు. ఎన్నోసార్లు విఫల ప్రయత్నం చేసి వదిలేసాను.

దుర్భరమైన అతడి బాల్యం, భయానకమైన సముద్రప్రయాణాలూ, జీవితమంతా వదలని ఒంటరితనం-వీటి గురించి నేనింతకుముందు రాసాను. అతడు స్వీడిష్ అకాడెమీలో సభ్యుడైనందుకే నోబెల్ ప్రైజు వచ్చిందన్న విమర్శ తట్టుకోలేకనే అతడు మరణించాడు, లేదా తనని తాను చంపుకున్నాడు. కాని ఒక విమర్శకుడు రాసినట్టుగా, నోబెల్ ప్రైజు వచ్చినందువల్ల మార్టిన్ సన్ కవిత్వానికి విలువ పెరగలేదు, విమర్శించినందువల్ల విలువ తగ్గలేదు. ఆ మాట నిజం. నా దృష్టిలో నోబెల్ ప్రైజుకి టాగోర్ ఎంత అర్హుడో మార్టిన్ సన్ కూడా అంతే అర్హుడు. కానీ అతడికి నోబెల్ ప్రైజు రాకపోయిఉంటే ఆ అద్భుతమైన కవిత్వం మనదాకా చేరిఉండేది కాదేమో.

చూడండి, సాలీడుదారపు పోగుల్లాంటి ఆ కవితావాక్యాల్ని నా బండ వేళ్ళతో ఎంతో కొంత తెలుగు చేసాను.

సుళ్ళు తిరిగే మంచు

మెరిసే హిమఫలకాల మీద
సుళ్ళు తిరుగుతూ మంచు నాట్యం.
దాని పాదాలు కనబడవు,
కప్పుకున్న వస్త్రం తప్ప.
మంచు అల్లిన లేసులాగా
చలించే ఉత్తరధ్రువకాంతులు,
చల్లగాలి సూదులతో దగ్గరగా
లాగి కుట్టిన కుచ్చిళ్ళు.

బాల్యకాననం

ఆవుల్ని వెతుక్కుంటూ బోసిపాదాలతో
అడవినుంచి అడవికి పరుగెడుతున్నప్పుడు
కొండమీద కొలనులో చూసాను
అంతరిక్ష మేఘరథచక్రాన్ని.

వేసవి కాననాల్లో ఆడుకున్న జీవితం
పిట్టలపాటలతో లోతెక్కిన సాయంసంధ్య
పక్షిగానంతో మరింత పైకి జరిగిన ద్యులోకం
నా కలలు, కాపట్యాలన్నిటినుంచీ నేను పొందిందేమీ లేదుగాని,
జ్ఞాపకం నా జీవితానికి ప్రాణం పోస్తున్నది.
జ్ఞాపకాలు సంపూర్ణ స్వప్నాలు.

అప్పుడప్పుడు వేసవి దివ్యప్రాంగణంలో
చైత్రమాసపు కొంగలాగా
నా కల ఒకటి గాల్లోకి తేలుతుంది
పచ్చికబయళ్ళమీదుగా.

వేసవి

అట్లా అని వేసవిలో పెద్ద బాధా ఉండదు.
అడవుల్లో తియ్యటి చిట్టీతపళ్ళు ఏరుకోవచ్చు.
ఎర్రటిపళ్ళు నాలుకమీద పెట్టుకోగానే రక్తం చిమ్ముతాయి,
కాని నెత్తుటివాసన ఉండదు.
అప్పుడే జీవితం పూర్తిగా జీవించినట్టుంటుంది.
అంటే ఎలా ఉందో అలా.
స్వర్గం వైపు ఒక అడుగువెయ్యడమన్నమాట

పాము

వాక్కాయ పొదలమధ్య ఒక పాము
తన చర్మం వదిలించుకుంది.
ఇరుగ్గా ఉన్న చొక్కాలోంచి
అటూ ఇటూ మెలికెలు తిరుగుతూ
లోపలనుంచి బయటకొచ్చేసింది,
ఇక వెనుతిరిగి చూడలేదు.
అక్కడ అడవిలో తెల్లగా పొడుగ్గా మెరుస్తున్న
చొక్కా అంచు.

మైదానగీతం

పూర్తిగా వికసించిన ఒక పచ్చికబయలుని
దాని సీతాకోకచిలుకలతో మాత్రమే వివరించగలం,
దాని తేనెటీగల్తో మాత్రమే గానం చెయ్యగలం.
వేలరెక్కల మిరుమిట్లు అందుకోవాలన్నా
తేనెటీగల పాట అర్థం కావాలన్నా
అప్సరసలకే సాధ్యమవుతుంది.
ఆ పాటలు వినడమెట్లానో
అవి మటుకే నేర్చుకుంటున్నాయి
అనంతకాలంగా .

సీతాకోకచిలుకలు

సీతాకోక చిలుకలకి రెక్కలుండవు,
తూర్పుదేశాల శాలువాలు కప్పుకుని ఎగురుతాయవి.
ప్రకృతి కూడా ఈ విధంగా వాటికి సాయపడింది
వాటినెవరూ ఒక్క గుక్కలో మింగేయకుండా
వాటికంత పెద్ద శాలువాలు తగిలించింది.

బాతు

అల్లిబిల్లిగా అల్లుకుపోయిన నాచులోకి
కొడవలిలాంటి తన తెల్లటి మెడ
ఏటవాలుగా చాపింది బాతు.
ముఖమల్లాంటి బురదలో
ఈటెలాగా ముక్కు చాపి కెలుకుతోంది,
కలల ఒడ్డు మీద తలెత్తి చూస్తున్నది
చల్లగా పాములాగా.

నీటిలోపలి చిత్రం

నీటి చిత్తడి మధ్య రెల్లుపొదలు
పతాకల్లాగా రెపరెపలాడుతున్నాయి.
కానుగచెట్టు గుబుర్లలో పులకింత,
దాని ఆకుల గుసగుసలప్పటికే
అదృశ్యంగా లంకల్లోకి చేరుకున్నాయి.
ఒకామె స్నానం చేస్తున్నది.
ఈదుకుంటూ పోతున్నదొక బాతు,
అది వెనక్కి చూసినప్పుడు
గాలిమర పూర్తిగా తిరిగినట్టుంది.

చిమ్మెటలు

కనుపాపలోని అందమైన తెలుపులాగా
వేసవి సాంధ్యగగనం.
కూనిరాగం తీస్తున్న చిమ్మెటలు
వాటి సుదీర్ఘగానం.

అవి నేలమీద వాలినప్పుడు
పాతకాలపు విచిత్ర శోభ చూస్తావు,
వాటి ఆకుపచ్చ-బంగారపు రెక్కలమీద
కిలుంపట్టిన భారతీయ ఇత్తడి వన్నె.

దు:ఖమూ, సంతోషమూ

కోల్పోయిన ఏదో సంతోషం కోసమే
తీవ్రమైన ప్రతి దుఃఖమూ వెతుక్కుంటుంది
దాన్ని ఆ దారి తప్పిపోనివ్వకు
బాధ తన వెతుకులాట మాననివ్వకు.
దు:ఖమే సంతోషం పొందగల అతిగొప్ప సత్కారం.

27-5-2016

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s