చెట్టును దాటుకుంటూ

52

జూకంటి జగన్నాథం ముఫ్ఫై ఏళ్ళకు పైగా నా మిత్రుడు. నా మొదటి కవితాసంపుటి నిర్వికల్ప సంగీతానికి వచ్చిన మొదటి మనియార్డరు అతణ్ణుంచే. ఇప్పటిదాకా అచ్చయిన తన ప్రతి కవితా సంపుటీ నాకు పంపిస్తూ ఉన్నాడు, మూడు సమగ్ర సంపుటాలతో సహా. సిరిసిల్ల అంటే నా వరకూ జగన్నాథమే. కొన్నేళ్ళ కిందట ఆయన్నీ, సిరిసిల్లని చూడటానికే వాళ్ళింటికి వెళ్ళాను.

ఇప్పుడు మళ్ళా తన కొత్త సంపుటి ‘చెట్టును దాటుకుంటూ’ (2015) పంపించాడు. ఇన్నాళ్ళుగా అతడి కవిత్వం గురించి నేనెక్కడా మాట్లాడలేదు, రాయలేదు. కానీ ఈ పుస్తకం చదివాక ఎంతో కొంత రాయకుండా ఉండలేననిపించింది.

1996 లో అతడి మొదటి కవితాసంపుటి ‘పాతాళ గరిగె’ వెలువడింది. కవిగా అతడు చేసిన ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో ఉక్తిలోనూ, వ్యక్తిత్వంలోనూ కూడా వచ్చిన పరిణతి ఇప్పటి కవిత్వంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

సమాజంలో మార్పు రావాలని కోరుకునే చాలామంది కవుల కవిత్వంలో ఆవేదనా, ఆగ్రహం కనిపిస్తాయి కాని వాళ్ళు కనిపించరు. తాము ఈ సమాజానికి చెందనివారుగానో, ఇక్కడిరాగద్వేషాలకీ, ప్రలోభాలకీ అతీతులుగానో తమని తాము భావించుకుని రాస్తున్నట్టే ఉంటుంది. అందుకని ఆ కవులూ, వారి భాష నాకు చెందనివిగానూ, నన్ను తమలో కలుపుకోలేనివిగానూ తోస్తాయి.

ఏ కవినైనా చదివేటప్పుడు నేను వెతుక్కునేది, ఇతడికి కూడా కన్నీళ్ళు వస్తాయా, చెమట పడుతుందా, ఆదర్శమానవుణ్ణి స్వప్నించడం సరే, ఇతడు కూడా ఆ ఆదర్శానికి ఎంతో కొంత నిలబడగలడా, ఆ ప్రయత్నంలో కిందకు జారిపోతుంటాడా, జారిపోతున్నానని ఒప్పుకుంటున్నాడా.. ఇట్లాంటి అంశాలు.

ఒక మనిషిగా తన ముఖచిత్రాన్ని ఆ కవి ఎంత నిజాయితీగా చూపించగలిగితే, ఆ కవిత్వాన్ని నేనంతగా నా హృదయానికి హత్తుకుంటాను.

ఇదిగో, ఈ పుస్తకంలో జగన్నాథం అట్లాంటి నిజాయితీని చూపించగలిగాడు. ఇందులో కవి ఒక స్నేహితుడు, తాత, తండ్రి, భర్త, పొరుగువాడు, అవ్యవస్థ పట్ల ఆగ్రహం చెందేవాడు, అన్నీను. ఈ పార్శ్వాలన్నీ ఎంతో ప్రస్ఫుటంగా ఈ సంపుటిలోని 50 కవితల్లోనూ మనకు కనవస్తాయి.

కవిత్వమంటే ఏమిటి? తేట మాటల్లో లోతైన భావాన్ని ధ్వనింపచేయగలిగే విద్యనే కదా. ఈ కవిత చూడండి:

చేపిన పొదుగునుండి
లేగను దూరం చేసినట్టు
పుట్టిన ఊరును విడిచి వచ్చినట్టు
క్షమించండి!
పచ్చని చెట్టును దాటుకుంటూ వచ్చాను.

పారిన ఏరునుండి
దూపకు ఒగ్గిన దోసిలిని విడగొట్టినట్టు
తింటున్న అన్నం గిన్నెను గుంజుకున్నట్టు
క్షమించండి!
పారుతున్న నీటిని తప్పుకుంటూ వచ్చాను.

కరిగిపోయి కన్నీరు కార్చే
మనిషిని దాటుకుంటూ
కదిలిపోయి ప్రాణమిచ్చే
అడవిని దాటుకుంటూ
దయ ఉంచండి!
నన్ను నేను కాలదన్నుకుంటూ వచ్చాను.

చలికి వణికిపోయిన
వానకు తడిసిపోయిన
ఎండకు ఎండిపోయిన
నా జాడను, నా నీడను
కాలంలో కఠినాత్మకంగా విడిచిపెట్టి వచ్చాను.

పొందినవి కొన్ని
పోగొట్టుకున్నవే అన్నీ
కాటగలిపినవి కొన్ని
మాట తప్పినవే అన్నీ-

భౌతిక ప్రపంచంలో విజయాన్ని సాధించే ఒక సాధనంగా కవిత్వాన్ని భావించడం ఒకప్పటి మాట. కవిత్వం ప్రధానంగా అశక్తతా ప్రకటన. అయితే ఆ అశక్తతను నిజాయితీగా ఒప్పుకోవడం ద్వారా కవి తన తోటిమనుషులకొక సాధికారికతను సమకూరుస్తాడు. అలాకాక, ఆడంబరంగా, నేనిది చేస్తాను, నేనది చేస్తాననే కవి తన కాలాన్నీ, సమాజాన్నీ మరింత డాంబికం చెయ్యడం మినహా మరేమీ చెయ్యలేడు.

దేవా, క్షమించు మమ్మల్ని.
చేసినవి చేసినందుకు,
చేయనవి చేయనందుకు.

అన్న బైరాగి అన్న మాటలు నాకెంత బలాన్నిచ్చాయని! ఇప్పుడు జగన్నాథం రాసిన ఈ కవిత కూడా చెప్తున్నది ఆ మాటలే కదా.

ఇందులో రసరమ్యమైన కవితలు ఆయన తన మనవల గురించి రాసినవి (రాసుకున్నవి). ‘మాట్లాడే బొమ్మ’ అన్న కవిత పత్రికలో వచ్చినప్పుడే నేనాయనకు పోన్ చెయ్యకుండా ఉండలేకపోయాను.

అందులో ఒకచోట అంటాడు:

‘మేము మాటలు నేర్పుతున్నామో
మనుమరాలు మాకు మాటలు గరపుతుందో
తెలియని మైమరిచే డోలాయమాన స్థితి.’

మనమలు సెలవుల్లో ఇంటికొచ్చి వెళ్ళిపోయాక-

‘మేమూ ఇల్లూ
గ్రైండర్లేసి తిప్పినట్టు
ఎవరికీ తెలియని వేదనై
చెప్పినా అర్థం కాని
ధూం ధూం చక్కర్ల పడ్డం. ‘

అంటాడు.

కవిత అంటే భాష మనోవేగాన్ని అందుకోవడం, మనసులోపలి పొరలన్నిటినీ తెల్లకాగితం మీద ఒక్కసారిగా చూపగలగడం. ఈ వాక్యాలు చూడండి:

‘.. ఇక నడువలేను, నటించలేను
ఉన్నపలంగా అంతూదరీ లేకుండా
హోరాహోరీ దారితప్పిపోవాలని
నిర్భయంగా నిశ్చలంగా వుంది.’

ఇటువంటి గాఢతను అందుకున్న వాక్యాలెన్నో.

”సెగలు కక్కుతూ
వగలు పోతూ
పగలు రాత్రి సొట్టబుగ్గమీది
కాంతి చుక్క ముద్దుపెడుతూ
‘ఇంతకు సంగమించనిదెప్పుడు
మనం కలిస్తేనే కదా రోజు జనించింది’ అంది.”

లాంటి మాటలు పేనడం మామూలు పనికాదు.

‘నా నుంచి నా వరకు ‘, ‘తీయని కలలు-మంచి రాత్రులు’, ‘కలాప విలాపం’,’ఒక ముచ్చట’, ‘దళారి’ వంటి కవితలు పూర్తిగా మళ్ళా ఇక్కడ పైకెత్తి రాయాలని ఉంది.

రాబోయే రోజుల్లో కూడా జగన్నాథమిట్లానే మరింత కవిత్వాన్ని పంచాలనీ, నాకు పంపాలనీ కోరుకుంటున్నాను.

17-10-2015

Leave a Reply

%d bloggers like this: